సిటీ టూర్.. ‘భంగ్’తో తీన్‌మార్ | Sakshi
Sakshi News home page

సిటీ టూర్.. ‘భంగ్’తో తీన్‌మార్

Published Sat, May 16 2015 2:53 AM

సిటీ టూర్..  ‘భంగ్’తో తీన్‌మార్

- నగరంపై డాక్యుమెంటరీస్
- యూ ట్యూబ్‌లో పెరుగుతున్న వీక్షకులు
షార్ట్ ఫిల్మ్స్ ఎలాగైతే యువతకు ఫ్యాషన్‌గా మారుతున్నాయో.. నగరంలో కొంతమందికి డాక్యుమెంటరీస్ కూడా అలాగే హాబీగా మారిపోయాయి. వృత్తి వ్యాపకాలకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా.. తమ అభిరుచి మేరకు డాక్యుమెంటరీలు రూపొందించడంలో సిటీజనులు బిజీ అయిపోతున్నారు. సహజంగానే ఈ డాక్యుమెంటరీలు విభిన్న అంశాలపై, సామాజిక స్పృహ పెంచేలా రూపొందిస్తుండడం స్వాగతించదగిన పరిణామం.

భాగ్యనగరంలో కేవలం హైటెక్ సిటీని చూస్తే సరిపోదు.. చార్మినార్‌ను చుట్టొచ్చినంత మాత్రాన అయిపోదు.. నాలుగొందల ఏళ్ల చరిత్ర ఒకవైపు. కొత్తపుంతలు తొక్కే ఆధునికత మరోవైపు. ఒక్క మాటలో చెప్పాలంటే భిన్న పరిణామాల మేలు కలయిక హైదరాబాద్. ఎన్ని చూసినా చూడాల్సినవి మిగిలే ఉన్నాయి అనిపించే ఈ సిటీలో తప్పకుండా చూడాల్సిన వి, చేయాల్సినవి... చెప్తూ నగరవాసి రాజ్‌కిషోర్ రూపొందించిన ‘టెన్ థింగ్స్ టు డు ఇన్ హైదరాబాద్’ యూట్యూబ్‌లో ఇప్పటికే లక్షల సంఖ్యలో వీక్షకుల్ని సాధించింది. అదే ఊపులో నగరంలో హోలీ టైమ్‌లో వినియోగించే ‘భంగు’ మీద కూడా మరో డాక్యుమెంట్‌ను తీసి అప్‌లోడ్ చేశాడీ యువ ఈవెంట్ మేనేజర్. ఈ రెండు డాక్యుమెంటరీల విశేషాలు..
 
‘భంగ్’ భళా
నగరంలో శివరాత్రి, హోలీ వేడుకల్లో భాగంగా చాలామంది ‘భంగ్’ భళా అంటారనేది తెలిసిందే. ఆ సమయంలో బేగంబజార్ వంటి ప్రాంతాల్లో విస్తృతంగా లభించే ఈ భంగ్ అనే మత్తు పదార్థం.. విచిత్రమైన సంప్రదాయ సేవనంగా మారిపోయిందనే విషయాన్ని తెలియజేస్తూంది ఈ డాక్యమెంటరీ. అధికారికంగా షాపులు తెరచి మరీ ఈ భంగ్‌ను విక్రయించే విశేషాలను ఇది కళ్లకు కడుతుంది. హోలీ వేడుకల పరమార్థం తెలియకపోయినా, భంగ్ అనే మత్తు పదార్థం గురించి చెప్పమంటే ఉత్సాహం చూపే సిటీ యూత్‌ను మనం ఈ వీడియోలో కలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా భంగ్‌కు ఉన్న క్రేజ్, దక్షిణాదిలోనూ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న వైనాన్ని వివరిస్తూ, దీనివల్ల కలిగే ఆరోగ్యపరమైన సమస్యలను వైద్యుల ద్వారా చెప్పించారు.

సిటీని చుట్టేస్తూ..
నగరంలోని బేగంబజార్ దగ్గర ప్రారంభమై హలీమ్ రుచి చూస్తూ హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ విశేషాల్ని ఈ డాక్యుమెంటరీ కళ్లకు కడుతుంది. నెక్లెస్‌రోడ్ సౌందర్యాన్ని వివరిస్తూ టాలీవుడ్ పై ఓ లుక్కేయిస్తుంది. లాడ్‌బజార్ గాజుల గలగలలు వినిపిస్తూ.. హుస్సేన్‌సాగర్‌లో కొలువైన బుద్ధుని చుట్టూ ప్రదిక్షణలు చేయిస్తుంది. గోల్కొండ చరిత్రకు సలామ్ చేస్తూ.. చార్మినార్ విశిష్టతను కళ్లకు కడుతుంది. చివరగా చవులూరించే హైదరాబాద్ బిర్యానీకి అగ్రతాంబూలం ఇస్తుంది. మోడల్ సాత్విక ఈ డాక్యుమెంటరీలో సమర్పకురాలిగా వ్యవహరించారు. ‘సీదా జావ్, ఆగే ఛే’ వంటి సిటీలో తరచుగా వినిపించే పదాలను, సినిమా స్టార్ల పట్ల ఉండే వ్యామోహాన్ని సైతం సరదాగా స్పర్శిస్తూ డాక్యుమెంటరీ సాగిపోతుంది.
 
‘ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఇమేజ్‌ని పెంచడం కోసం ఒక డాక్యుమెంటరీని.. యువత జీవితాల్లో భంగ్ వంటి మత్తుపదార్థాలు సంప్రదాయం పేరుతో తిష్టవేసిన వైనాన్ని వివరించడానికి మరో డాక్యుమెంటరీని తీశా’నంటారు రాజ్‌కిషోర్. మాదాపూర్‌లో నివసించే ఈయన వృత్తిరీత్యా ఈవెంట్ మేనేజర్. అయితే సహజంగా ఉన్న ఆసక్తితో ఫిల్మ్ అండ్ మీడియాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చేశారు. రచయిత, దర్శకుడు, కెమెరా, ఎడిటర్ అన్నీ తనే అయి కేనన్ 5 డి కెమెరాతో ఈ డాక్యుమెంటరీలను రూపుకట్టానని చెప్పారు.

Advertisement
Advertisement