‘కోటా’ రాజకీయాలకు తెర? | Sakshi
Sakshi News home page

‘కోటా’ రాజకీయాలకు తెర?

Published Mon, Mar 23 2015 1:19 AM

‘కోటా’ రాజకీయాలకు తెర? - Sakshi

 విశ్లేషణ
 చారిత్రక అన్యాయాలను వెనుకబాటుతనానికి ప్రధాన కొలబద్ధగా తీసుకొని రిజర్వేషన్లను కల్పించడాన్ని సుప్రీం కోర్టు అంగీకరించలేదు. అర్హులైన ప్రజా సమూహాలను కొత్తగా గుర్తించి రిజర్వేషన్లను కల్పించాలని స్పష్టం చేసింది. అంటే ‘ట్రాన్స్‌జెండర్లు’, వికలాంగులు వంటి కొత్త వర్గాలకు రిజర్వేషన్లు వర్తింపజేసే అవకాశాలు తెరచుకున్నట్టే. ఇంతవరకు వివిధ ప్రజా సమూహాలు రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే, అందుకు భిన్నంగా సుప్రీం కోర్టు ప్రభుత్వమే రిజర్వేషన్లను కల్పించాల్సిన  వర్గాలను కొత్తగా గుర్తించాలని చెప్పింది.
 
 జాట్‌లకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు వర్తించవంటూ సుప్రీం కోర్టు ఈ నెల 17న వెలువరించిన తీర్పును రాజకీయవేత్తలూ, మీడియా పెద్దగా పట్టించుకోలేదు. ఉత్తరాది రాష్ట్రలంతటా విస్తరించిన ఈ పెద్ద రైతాంగ కులా న్ని ప్రసన్నం చేసుకోవాలని యూపీఏ ప్రభుత్వం జాట్లకు రిజర్వేషన్లను కల్పిం చింది. వాటిని రద్దు చేస్తూ సుప్రీం ఇచ్చిన తాజా తీర్పు జాట్లపైనే గాక మొత్తం గా రిజర్వేషన్ల అంశంపైనే ప్రభావం చూపుతుంది. కొన్ని కులాలను రిజర్వుడు కేటగిరీల్లో చేర్చాలని రాజకీయవేత్తలు, ఎన్‌జీఓలు ఎప్పటికప్పుడు కోరడం జరుగుతూనే ఉంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో చేర్చితే వారికి విద్యా, ఉద్యోగ అవకాశాలతోపాటూ రాజకీయ రిజర్వేషన్లు కూడా లభిస్తాయి. వెనుకబడిన తరగతుల్లో చేరిస్తే విద్య, ఉద్యోగ అవకాశాల్లోనూ, స్థానిక సంస్థల్లోనూ మా త్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయి. ప్రతి మతం, కులం రిజర్వుడు కేటగిరీలో చేరాలనే కోరుకుంటాయి. వెనుకబడిన కులాలు కొన్ని ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీలకు ప్రమోషన్‌ను కోరుకుంటాయి. బీసీలుగా ఉన్న మేదర కులస్తులు తమకు ఎలాంటి మేలు జరగడం లేదు కాబట్టి, తమకు ఎస్టీ గుర్తింపు కావా లని కోరుతుంటారు. డాక్టర్ అంబేద్కర్ వాస్తవంగా ప్రతిపాదించిన రిజర్వే షన్ల కాల పరిమితి పదేళ్లు మాత్రమే. 1952 నుంచి ప్రతి పదేళ్లకు వాటిని పొడిగిస్తూ వస్తున్నారు. 1989లో వీపీ సింగ్ ప్రధాని అయిన తర్వాతనే బీసీల కు రిజర్వేషన్లను కల్పించారు. అప్పట్లో వాటికి వ్యతిరేకంగా పెద్ద ఆందోళనలు కూడా సాగాయి. గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు రిజ ర్వేషన్లను కల్పించింది. జనాభాలో ముస్లింలు 14% ఉన్నా ప్రభుత్వం వారికి 5% రిజర్వేషన్లను మాత్రమే కల్పించింది. వ్యతిరేకులు కోర్టులను ఆశ్రయిం చారు. పలు హైకోర్టులు రిజర్వేషన్లకు మతప్రాతిపదిక చెల్లదని, ముస్లింల లోని కులాలకు రిజర్వేషన్లు కల్పించవచ్చే తప్ప, మొత్తం మతానికి కాదని ఆ రిజర్వేషన్లను రద్దు చేశాయి. మహారాష్ట్రలో సరిగ్గా శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మరాఠాలకు, ముస్లింలకు రిజర్వేషన్లను కల్పిం చింది. కానీ కోర్టులు వాటిని రద్దు చేశాయి.

 రిజర్వేషన్లపై సుప్రీం నూతన తాత్విక దృష్టి
 కొన్ని కులాలు తమ సంఖ్యాబలం ఆధారంగా రిజర్వేషన్లను కోరి సాధించు కుంటున్నాయని, అది ఆమోదయోగ్యం కాదని సుప్రీం భావించింది. అంటే నూతన మార్గదర్శకాలను ఆమోదించే వరకు కొత్తగా ఎవరికైనా రిజర్వేషన్లను కల్పించడంపై ఈ తీర్పు నిషేధం విధించినట్టేనని భావించవచ్చు. చారిత్రక అన్యాయాలను వెనుకబాటుతనానికి ప్రధాన కొలబద్ధగా తీసుకొని రిజర్వే షన్లను కల్పించడాన్ని కోర్టు అంగీకరించలేదు. అర్హులైన ప్రజా సమూహాలను కొత్తగా గుర్తించి, వారికి రిజర్వేషన్లను కల్పించాలే తప్ప ఎవరికి వారు డిమాం డు చేసి రిజర్వేషన్లు సాధించుకోడాన్ని అనుమతించరాదని స్పష్టం చేసింది. అంటే ప్రభుత్వం అర్హులను అన్వేషించాలే తప్ప రాజకీయ డిమాండ్లకు, ఆందోళనలకు తలొగ్గి రిజర్వేషన్లను కల్పించరాదు. పైగా, వివిధ జాతీయ కమిషన్లు కుల రిజర్వేషన్లపై వ్యక్తపరచిన అభిప్రాయాలతో ప్రభుత్వం ఎందువలన ఏకీభవించలేకపోయిందో కారణాలను తెలపాలని కూడా కోర్టు కోరింది. అలాగే కొన్ని కులాలకు రిజర్వేషన్ల వర్తింపునకు సమర్థనగా సమర్పించే అధ్య యనాలు యథాలాపమైనవిగా ఉండరాదని కోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లకు పాత అర్హతలు నేడు పొసగేవి కావని కూడా అది భావిం చింది. కుల, మతాలను అధిగమించిన ‘వెనుకబడినతనాన్ని పట్టుకోవ డానికి’ కొత్త భావనలను ఉపయోగించాలని చెబుతూ కోర్టు ‘‘ట్రాన్స్ జెండర్స్’’ను (హిజ్రాలు) ఉదాహరణగా చూపింది. అంటే కోర్టు కుల, మత ప్రమేయం లేకుండా ట్రాన్స్‌జెండర్లు, వికలాంగులు వంటి కొత్త వర్గాలను చేర్చాలని కోర్టు భావిస్తుందనేది స్పష్టమే. ఇంతవరకు వివిధ ప్రజా సమూ హాలు రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే, అందుకు భిన్నంగా సుప్రీం కోర్టు ప్రభుత్వమే రిజర్వేషన్లను కల్పించాల్సిన ప్రజా సమూహాలను కొత్తగా గుర్తించాలని చెప్పింది. ఇది కోర్టు నూతన తాత్విక దృష్టి.  

 సుప్రీం తీర్పు...‘‘క్రీమీ లేయర్’
 తాజా తీర్పు వల్ల ప్రభుత్వాలు లేదా రాజకీయ పార్టీలు ఇక తమ ఇష్టాను సారం ఒక కులానికో లేదా మతానికో రిజర్వేషన్లను వాగ్దానం చేయలేవు. ఈ తీర్పు ఆచరణలో ఆ అధికారాన్ని వాటి చేతుల్లోంచి తొలగించింది. ఈ తీర్పుతో సుప్రీం కోర్టే అన్ని సామాజిక సమస్యలపైనా అత్యున్నత అధికార సంస్థగా మారింది. రిజర్వేషన్లపైన కూడా దానిదే అధికారం. రిజర్వేషన్ విధానాలు, చట్టాలన్నిటిలో సమూలమైన మార్పులను తేవాలని ఈ తీర్పు ఆదేశించినట్టే అయింది. ఇక రాజకీయ పార్టీల రిజర్వేషన్ల క్రీడకు తెరపడినట్టే. 2014 మార్చి 3న, అంటే సరిగ్గా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడానికి ముందు వరకు వేచి చూచి మరీ... కాంగ్రెస్ ప్రభుత్వం జాట్లను వెనుకబడిన తరగతుల్లో చేర్చింది. ఇక ఇవి పునరావృతం కాజాలవు.

 సుప్రీం కోర్టు చాలా కాలంగా కొన్ని కులాల్లోని ‘‘క్రీమీ లేయర్’’ లేదా పై పొరకు చెందినవారు మాత్రమే రిజర్వేషన్ల వల్ల లబ్ధిని అనుభవిస్తున్నారని, వారిని రిజర్వేషన్ల నుంచి మినహాయించడం అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ వచ్చింది. తీర్పు నేపథ్యంలో ‘‘క్రీమీ లేయర్’’ను మినహాయిం చాలనే డిమాండు తలెత్తవచ్చు. ఉదాహరణకు రెండు లేదా మూడు తరాల పాటూ రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందిన కుటుంబం రిజర్వేషన్లకు అనర్హమైనదిగా నిర్దేశించాలని డిమాండు తలెత్తవచ్చు. రాజస్థాన్‌లో మీనా అనే ఎస్టీలున్నారు. ఐఏఎస్ వంటి అఖిల భారత సర్వీసులు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఎస్టీ కోటా లో అత్యధిక భాగం వారే దక్కించుకున్నారు. ఉత్తర భారతంలోని యాదవులు బీసీ ఉద్యోగాలను ఎక్కువగా దక్కించుకున్నారు. ఈ తీర్పు   అలాంటి కులాల పై ప్రభావం చూపే అవకాశం ఉంది.   

 ముస్లింల రిజర్వేషన్ల మాటేమిటి?  
 ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపైన కూడా ఈ తీర్పు గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కొన్ని కులాలకు, మైనారిటీలకు రిజర్వేషన్లను వాగ్దానం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించనూవచ్చు, వాటివి కేంద్రం ఆమోదించనూ వచ్చు. కానీ ఎవరైనా వాటిని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లవచ్చు. కోర్టు ఆ రిజర్వేషన్లు చెల్లవని చెప్పవచ్చు. పైగా ట్రాన్స్‌జెండర్లు, వికలాంగులు, కొన్ని మహిళా గ్రూపులు రిజర్వేషన్లకు అర్హులుగా మారవచ్చు. ఇక ఏపీలో కాపులను బీసీల్లో చేర్చాలనేది ప్రధాన డిమాండు. కాపులు నేటి ఏపీలో అతి పెద్ద కులంగా ఉన్నారు. తెలంగాణలో మున్నూరు కాపులకు, రాయలసీమలో బలి జలకు బీసీ హోదా లభించింది. కాగా కోస్తా కాపు లేదా తెలగ కులస్తులకు ఆ హోదా లభించలేదు. చాలా ఏళ్ల క్రితం కాంగ్రెస్ కాపులను బీసీల్లో చేరుస్తా మని వాగ్దానం చేసింది. కానీ నెరవేర్చలేదు. ఒకప్పుడు కాపులను బీసీల్లో చేర్చడాన్ని  తెలుగుదేశం మౌనంగా వ్యతిరేకించింది. ఇప్పుడు ఆ పార్టీయే ఈ వాగ్దానం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో సైతం కాపులకు బీసీ హోదా కల్పిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడది ఆయన చేతులు దాటిపోయినట్టే.

 నూతన వ్యూహంతోనే కాపు రిజర్వేషన్లు
 కానీ కాపుల ప్రధాన డిమాండే అది. నూతన రాజధాని నగరాలు, పెద్ద సాగు నీటి ప్రాజెక్టులు లేదా ఇతర ప్రాజెక్టులలో వారికి ఆసక్తి లేదు. ఎందుకంటే వారిలో పెద్ద కాంట్రాక్టర్లు లేదా రియల్ ఎస్టేట్ కుబేరులు లేరు. వారికి కావల సింది, విద్య, ఉద్యోగ అవకాశాలే. కాబట్టి టీడీపీ ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చమని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సిఫారసు చేయవచ్చు. అది ఆమో దించి బీసీలుగా ప్రకటించనూవచ్చు. కానీ కోర్టులు అడ్డు చెప్పే అవకాశం ఉండనే ఉంది. కాబట్టి సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా,  దాని డిమాండ్లకు లోబడి టీడీపీ నూతన వ్యూహ రచన చేయడం అవసరం. కాపులకు సుప్రీం కోర్టు తీర్పు ప్రభావాన్ని వివరించి, ఏ ముఖ్యమంత్రి, ప్రధాని ఆ పని చేయ లేరని వివరించాల్సి ఉంటుంది. లేదా ప్రభుత్వానికి కాపులకు బీసీ హోదా కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి అగ్రశ్రేణి వ్యూహం అవసరం. నూతన మార్గనిర్దేశకాలను అనుసరించి కాపులను విభిన్న వర్గాలుగా విభ జించి వారికి బీసీ హోదాను కోరవచ్చు. జాట్లు, ముస్లింలు, మరాఠాలను కాంగ్రెస్ మాయ చేసినట్టుగా అది చేయలేదు. వారికి తాము కల్పిస్తున్న రిజర్వే షన్లను సుప్రీం కోర్టు రద్దు చేస్తుందని తెలిసే కాంగ్రెస్ ఆ పని చేసి ఉండవచ్చు. ఆ పార్టీ ఇప్పుడు సుప్రీం కోర్టును తప్పుబడుతుంది.

 ఏపీలో టీడీపీ ఆ మోసకారి మార్గాన్ని అనుసరించలేదు. అలాంటి కుయుక్తులు కాపుల వద్ద సాగవు. అవి వారు బాగా ఎరిగినవే. అలాంటి ప్రయత్నాలు ఏవైనా వారికే బెడిసి కొడతాయి. సమూలమైన వ్యూహాత్మక  మార్పులను చేయనిదే రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదు.  రెండు తెలుగు ప్రభుత్వాలకు అంతటి మేధోపరమైన సామర్థ్యం ఉన్నదా? ప్రభుత్వ నేతలకు తమ వాగ్దానాల అమలుకు పరిష్కారాలను కనుగొనగలిగేటంతటి ప్రగాఢ నిబద్ధత ఉన్నదా? నాకైతే అనుమానమే.

 పెంటపాటి పుల్లారావు, రాజకీయ విశ్లేషకులు
 ఈమెయిల్: drpullarao1948@gmail.com

Advertisement

తప్పక చదవండి

Advertisement