మహిళా చిత్రం | Sakshi
Sakshi News home page

మహిళా చిత్రం

Published Wed, Mar 11 2015 12:42 AM

మహిళా  చిత్రం - Sakshi

 మహిళల భావాలు, సమస్యలు... కాన్వాస్‌పై చిత్రాలుగా మలిచి చైతన్యం రగిలిస్తున్నాడు ఆర్టిస్ట్ సమీర్. అంతే కాదు... జంతుజాలం సంరక్షణ అవసరాన్నీ పెయింటింగ్స్‌లో ప్రతిబింబిస్తూ సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. సిటీతో పాటు ఇతర నగరాల్లో కూడా తన పెయింటింగ్స్‌ను ప్రదర్శిస్తున్న సమీర్‌ను ‘సిటీ ప్లస్’ పలుకరించింది...
 కళాహృదయం ఉన్నవాడు తన అనుభవాలు, అనుభూతులనే చిత్రాలుగా మలుస్తాడు. అప్పుడే సహజత్వం ఉట్టిపడే అందమైన చిత్రాలు జీవం పోసుకుంటాయి. నేనూ అంతే. కళ్లతో చూసినదాన్ని కుంచెతో కాన్వాస్‌పై పరచడానికి ప్రయత్నిస్తా. కవికి కవితలా... ఛాయాచిత్రకారుడికి ఓ అద్భుత చిత్రంగా... ఒక్కో దృశ్యం ఒక్కోరికీ ఒక్కోలా కనిపిస్తుంది. అలాగే నేను బొమ్మలు గీస్తున్నా. చూడ్డానికి పిచ్చిగీతల్లా ఉన్నా... కళాత్మక దృష్టితో చూస్తే ప్రతి గీతలోనూ ఓ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. నా పెయింటింగ్స్‌లో రోజువారీ కార్యకలాపాలుంటాయి.
 అంతులేని అభురుచి...
 వ్యాపార రీత్యా మేం లక్నో నుంచి సిటీకి వచ్చి స్థిరపడ్డాం. నాన్న హఫీజ్ షేక్ ఎప్పుడూ వ్యాపార లావాదేవీలతో బిజీగా ఉండేవారు. అమ్మ హజ్రా సుల్తానా గృహిణి. ఆమే నాకున్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించింది. మెహదీపట్నం న్యూ మోడల్ హైస్కూల్‌లో చదువుతున్నప్పటి నుంచి మాసబ్‌ట్యాంక్ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ వరకు డ్రాయింగ్ పోటీల్లో ముందుండేవాడిని. ఆ అభిరుచి మరింత పెరిగి, క్రియేటివ్ కోర్సులో ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. దిల్లీలో జర్నలిజం చేశా. అదే ఏడాది లైన్ డ్రాయింగ్ ఆర్టిస్ట్‌గా ఓ యాడ్ ఏజన్సీలో చేరా. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోడీకి పీఆర్‌గా కూడా చేశాను. అలా అలా తిరిగి ప్రస్తుతం నగరంలో ‘త్రీమార్క్ సర్వీసెస్’ నడిపిస్తున్నాను. అదే సమయంలో పెయింటింగ్సూ వేస్తున్నా. మహిళలు, మూగజీవాలే నా సబ్జెక్ట్. వీటిపై ఎన్నో చిత్రాలు గీసి ప్రదర్శించాను. నా బొమ్మలు చూసిన వారంతా అభినందిస్తుంటే... శ్రమకు తగ్గ ఫలితం దక్కిందన్న ఆనందం కలుగుతుంది. నేను ఎంచుకున్న సబ్జెక్టును చిత్ర రూపంలో మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది లక్ష్యం. మహిళలను గౌరవించాలన్న థీమ్‌తో దిల్లీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం ఆ పనిలోనే బిజీ బిజీ!
  వీఎస్
 

Advertisement

తప్పక చదవండి

Advertisement