లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. కల నిజమాయెగా... | Sakshi
Sakshi News home page

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. కల నిజమాయెగా...

Published Fri, Aug 1 2014 11:58 PM

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. కల నిజమాయెగా...

జీవితం చాలా అందమైంది. ఈ మాట చెప్పేవారు చాలా మందే ఉంటారు. పొందలేని ఆనందాలు అందుకోవాలని మనసులో ఉన్నా.. మార్గం లేని వారు ఎందరో.  ఈ జన్మకింతే అనుకుంటూ కాలం వెళ్లదీస్తారు. వీరిని కలలో కూడా దరి చేరని తీరాలకు చేర్చాలనుకున్నారు  ఫ్యాషన్ డిజైనర్ ఇషా. అందమైన జీవితంలో ఆనందాన్ని కొన్ని రోజులైనా అందివ్వాలనుకున్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనిపించే క్షణాల్ని అట్టడుగున ఉన్న వారికి సైతం జ్ఞాపకంగా మిగల్చాలనుకున్నారు. దీని కోసం మరికొందర్ని కలుపుకున్నారు. వారి జీవితంలో ఓ తాత్కాలిక ఆనందానికి తెర తీశారు. ‘ఏమి జీవితంరా ఇది’ అనుకున్న నోటి నుంచే జీవితం అంటే ఇదేరా అనిపించారు.
- ఎస్.సత్యబాబు
 
 మణికొండలో నివసించే ఆటోడ్రైవర్ రామకృష్ణ, ఆయన భార్య జయలక్ష్మి.. తాము నగరంలోని అగ్రగామి డిజైనర్ డిజైన్ చేసిన దుస్తుల్ని ధరిస్తామని కలలో కూడా ఊహించలేదు. ఎల్లారెడ్డిగూడలో నివసించే జూనియర్ ఆర్టిస్ట్ బాబు ఆయన భార్య కవితలు సిటీలోని అత్యంత విలాసవంతమైన రిసార్ట్‌లో ఓ రోజు బస చేయాలని కూడా అనుకోలేదు. వారి కలలు నిజమయ్యాయి. ‘నిజంగా ఈ జీవితం అందమైనది’ అంటూ ఈ రెండు జంటలే కాదు.. నగరంలోని మరో రెండు జంటలూ చెబుతున్నాయి. ‘ప్రతి మనిషి ఆనందం పొందడానికి అర్హుడే. ఏ మనిషికీ ఈ సృష్టిలో ఏదీ అందకుండా ఉండకూడదు. ఈ సందేశం ఇవ్వడానికే మేం ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్‌ను డిజైన్ చేశాం’ అని చెప్పారు ఫ్యాషన్ డిజైనర్ ఇషా.
 
 కాన్సెప్ట్ వెనుక..
 సిటీలో కొంత కాలంగా 2 డిజైనర్ బోటిక్‌లను విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఇషా. సామాన్యుల మధ్యతరగతి కలలు ఇటీవలే విన్నారామె. ‘మా ఇంట్లో ఒకసారి ఓ పెళ్లి వేడుక ఆర్భాటంగా జరిగింది. ఎన్నో ఏళ్లుగా మా ఇంట్లో పనిచేస్తున్న యువతి మేమెప్పటికైనా అలాంటి దుస్తులేసుకుని.. అంత మంచిగా ఉండగలమా అమ్మా ? అని అడిగింది. ఆ మాటలే నన్ను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ రూపకల్పనకు పురిగొల్పాయి’ అన్నారు ఇషా. ఆమె ఆలోచనలకు అలంకృత  రిసార్ట్స్, మారియట్ హోటల్.. వంటి పెద్ద సంస్థల మద ్దతు లభించింది.
 
 మేకోవర్ మెరుపులు..
 మణికొండలో నివసించే ఆటోడ్రైవర్ రామకృష్ణ, ఎల్లారెడ్డి గూడలో నివసించే జూనియర్ ఆర్టిస్ట్ బాబు, జీడిమెట్ల బస్తీవాసి పెయింటర్ పనులు చేసుకునే మెహమూద్, సైనిక్‌పురిలో ఉంటున్న ఫొటోగ్రాఫర్ ఖాదర్‌లను వారి భార్యలతో సహా సరికొత్తగా ముస్తాబు చేశారు.
 
 ఇండోవెస్ట్రన్స్. షేర్వానీ దుస్తులను మగవాళ్ల కోసం  చోలీ లెహంగా, అనార్కలీ స్టైల్ డ్రెస్సుల్లో మహిళలను మెరిపించారు. ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్‌లతో ముఖాలకు రంగులద్దించారు. మెహందీ డిజైనర్స్, హెయిర్ స్టైలిస్ట్స్.. వీరంతా సరేసరి. మేకోవర్ ముగిశాక.. కారెవరూ ర్యాంప్‌వాక్‌కు అన ర్హులన్న రీతిలో ఈ జంటలతో ఈరోజు మారియట్ హోటల్‌లో చిన్నపాటి ఫ్యాషన్ షో కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సినీ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అతిథులతో కలసి ఐదు నక్షత్రాల హోటల్‌లో విందు,
అలంకృత రిసార్ట్స్‌లో ఒక రోజు బస.. కూడా ఈ జంటల్ని వరిస్తున్నాయి. ఓ రకంగా కొత్తగా పెళ్లయిన జంట ఆ వేడుకను ఘనంగా జరుపుకున్న రీతిలో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

 ఓ కొత్త అనుభూతి...
 నాకు సినిమా ఫీల్డ్ అంటే ఆసక్తి. ఊహ తెలిసిన దగ్గర్నుంచి సినిమాల్లో చేయాలనుకున్నా. ఆ ఆలోచనతోనే నల్గొండ జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చేశా. రెండేళ్ల నుంచీ జూనియర్ ఆర్టిస్ట్‌గా, వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నా. మా ఆవిడ ఇళ్లలో పనిచేస్తుంటుంది.  నెల రోజుల క్రితం మాకీ విషయం గురించి చెప్పి, మాకు ఖరీదైన దుస్తులు వేసి చక్కగా తయారు చేశారు. ఫొటోలు, వీడియో తీశారు. ఇదంతా మాకు కొత్త అనుభవం.        
- వీరబాబు, ఎల్లారెడ్డిగూడ
 
చారిటీని డిజైన్ చేశాం..
ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. అయితే  ఖరీదైన దుస్తులు, ఆనందం ఏ కొందరికో మాత్రమే పరిమితం కావని చెప్పడానికి ఇది ప్రత్యేకంగా రూపకల్పన చేశాం. ఈ ఆనందం వారికి తాత్కాలికమే కావచ్చు కాని ఈ కార్యక్రమం ఇచ్చే సందేశం మాత్రం చాలా మందికి స్ఫూర్తిని అందిస్తుందని మా అభిప్రాయం.
 - ఇషా హిందూచా, డివాల్వ్ బోటిక్

Advertisement

తప్పక చదవండి

Advertisement