నృత్య నూతనం | Sakshi
Sakshi News home page

నృత్య నూతనం

Published Wed, Aug 13 2014 12:16 AM

నృత్య నూతనం

‘థాంక్యూ ఇందిరా! ఐ హావ్ సీన్ కంప్లీట్ ఇండియా ఇన్ రాధా అండ్ రాజారెడ్డీస్ డ్యాన్స్ ఇన్‌క్లూడింగ్ యూ’.. ఇది ఫిడెల్ క్యాస్ట్రో   కూచిపూడి కపుల్ రాధారెడ్డి, రాజారెడ్డిల కూచిపూడి ప్రదర్శన గురించి మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి చెప్పిన మాటలు. ఇంతకుమించిన కితాబు ఇటు కూచిపూడికి, అంతకన్నా గొప్ప పరిచయం అటు ఆ జంటకూ ఉండదేమో! తమ జీవననృత్యం గురించి సిటీప్లస్‌తో ముచ్చటించారు.
 
 ప్రణయమూర్తులనగానే పురాణాల్లోని రాధాకృష్ణులు, రతీమన్మథులు ఎలా గుర్తొస్తారో.. కూచిపూడి లాస్యంలో లయబద్ధంగా సాగిపోయే జంట అనగానే రాధా, రాజారెడ్డిలు కనిపిస్తారు. అందుకేనేమో ‘మేమిద్దరం కూచిపూడిని పెళ్లాడాం’ అంటారు రాజారెడ్డి.  భార్యభర్తల అభిరుచులు ఒకటే అయి.. అవి వారికి ప్రాణమైతే ఆ కాపురం ఆదర్శ ప్రాయం అవుతుంది.
 
 కలహకలాపాలు..
 నాట్యానికి గుర్తింపు లేని ప్రాంతంలో, కుటుంబాల్లో పుట్టిన ఈ ఇద్దర్ని కలిపింది మూడుముళ్ల బంధం. ఒక్కరిగా మారిన ఆ ఇద్దరి ధ్యాస నాట్యం మీదే. కూచిపూడిని ఆరాధిస్తూ సాగిన ఆ జీవితం.. ఆనంద లాస్యమైంది. ఈ కాపురంలో కలహాలు భామాకలాపంతో చల్లబడితే, గిల్లికజ్జాలు తరంగంతో సద్దుమణుగుతాయి. ‘రాధకు జెలసీ ఎక్కువ. నా కన్నా బాగా కనపడాలని, నాట్యంలో నన్ను ఓడించాలని, వేదికపై ఎవరినీ లెక్క చేయదు.  అలా నాట్యంలో లీనమై పోతుంది. విలువైన సలహాలిస్తుంది’ అని తన భార్య గొప్పదనాన్ని ప్రశంసిస్తారు రాజారెడ్డి. ‘ఆయన కంపోజిషన్‌లో నాకు నచ్చనిది ఉంటే చేయను. అలాగే అతని నాట్యంలో కాని, మేకప్‌లో కాని ఫలానాది బాగా లేదు అంటే అంతే వినయంగా దాన్ని సరిదిద్దుకుంటాడు’ అని భర్తలోని వినమ్రతను మెచ్చుకుంటారు రాధారెడ్డి.
 
 నాట్య సంగమం..
 నిజానికి రాధారెడ్డికి నాట్యం నేర్పిందే రాజారెడ్డి. ‘ ఈ రెబల్ స్టూడెంట్‌ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంటాడు నా మాస్టార్’ అంటూ భర్త సహకారాన్ని గుర్తు చేసుకుంటారామె. ‘మా మధ్య తగాదా ఏ వంటగదిలోనో, హాల్లోనో మొదలుకాదు..గ్రీన్‌రూమ్‌లో స్టార్ట్ అవుతుంది. స్టేజ్ మీద పెర్‌ఫార్మెన్స్‌తో ఎండ్ అవుతుంది.  మా పంతం నాట్యంతోనే నెగ్గించుకుంటాం’ అని జీవననృత్యం వెనుక ఉన్న సత్యాన్ని వివరిస్తారు రాజారెడ్డి. ఆయనకు నాట్యం, వైవాహిక బంధం రెండూ ఒకటే. ‘అందుకే మా జంట అంతగా కుదిరింది. ఇన్నేళ్లయినా మా జీవితం తాజాగా కనబడుతోంది’ అంటారు. రాధారెడ్డి మాత్రం ‘నాకు నాట్యం వేరు, మా జీవితం వేరు. ప్రదర్శనప్పుడు ఆయన నాకు పార్ట్‌నర్ మాత్రమే. ఇంట్లో నా భర్త. ఈ తేడాను చూస్తాను కాబట్టే రాజా నాకెప్పటికప్పుడు కొత్తగా క నిపిస్తాడు. మా సక్సెస్ సీక్రెట్ ఆ కొత్తదనమే’ అని చెప్తారు.
 
 
 
 సప్తపది.. ఇష్టపది..
 ‘డ్యాన్స్ అని భార్యని పట్టుకుని ఊరు కాని ఊరు పోతున్నవ్? ఎట్ల బతుకుతర్రా? ఆ డ్యాన్సేమన్నా కూటికొచ్చేదా?’ అని రాజారెడ్డి పెద్దలు ఆయనను హెచ్చరించారు. ‘గజ్జె కట్టుకొని ఇంటింటికి పొయ్యి ఆడతాడట.. ఇసంటోడు మనకొద్దు..’ అని రాధారెడ్డికి వాళ్ల పెద్దలూ నచ్చచెప్పారు. ఆ పెద్దల మాట చెల్లలేదు. ఏడడుగులతో ఒక్కటైన ఈ జంట ఏడేడు జన్మల బంధానికి దారి ఏర్పరచుకుంది. కూచిపూడిలో తామేంటో నిరూపించు కుంది.  అలీనోద్యమ సమావేశాలప్పుడు వివిధ దేశాల ప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూచిపూడిని చివరన ఏర్పాటు చేస్తే.. మనసారా ఆస్వాదించొచ్చు అని అభ్యర్థించారు. వన్స్‌మోర్ వన్స్‌మోర్ అంటూ పదిసార్లు ఈ జంటకాళ్లకు గజ్జె కట్టించారు. ‘మీరసలు ఢిల్లీ వదిలి ఎక్కడికీ వెళ్లకూడదు’ అని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆప్యాయతతో వాళ్లను ఆజ్ఞాపించింది. ‘రాధా.. నువ్ కాస్త పొట్టిగా ఉంటావ్, పెద్దంచు చీర కట్టకు’ అని ప్రేమతో సలహాలిచ్చే సన్నిహితురాలిని చేసింది వీళ్ల ప్రతిభే.
 
 ప్రతి ప్రదర్శన హనీమూనే..
 ‘ఏ జంటకైనా హనీమూన్ ఒక్కసారే. కానీ మాకు ప్రతిప్రదర్శన హనీమూనే’ అంటారు రాజారెడ్డి. ‘డ్యాన్స్ లేకపోతే నేనెంత లేనో.. రాజా లేకపోతే కూడా అంతే శూన్యం’ అని చెప్తారు రాధారెడ్డి.
 - సరస్వతి రమ

Advertisement
Advertisement