టింగురంగా బంగారమ్మా | Sakshi
Sakshi News home page

టింగురంగా బంగారమ్మా

Published Tue, Mar 31 2015 11:58 PM

టింగురంగా బంగారమ్మా

తమన్నా... వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సొగసరి! ఎప్పుడూ ప్రొడ్యూసర్స్‌తో మాత్రమేప్రెస్‌మీట్‌లో కనిపించే ఈ మిల్క్‌బ్యూటీ.. ఈసారి పేరెంట్స్‌తో కలిసి మీడియా ముందుకొచ్చింది. మంగళవారం తన సొంత జువెలరీ బ్రాండ్ ‘వైట్ అండ్ గోల్డ్’ లోగోతోపాటు... వెబ్‌సైట్‌నూ లాంచ్ చేసింది. స్టార్ హీరోయిన్‌గా ఉండగానే... ఓన్ జువెలరీకి క్రియేటివ్ హెడ్‌గా మారిపోయిన ఈ బంగారు బొమ్మతో సిటీప్లస్ చిట్‌చాట్...
 ..:: శిరీష చల్లపల్లి
 
మా నాన్న సంతోష్ భాటియా జువెలరీ బిజినెస్‌లో ఉండడంతో. చిన్నప్పటి నుంచే రకరకాల డిజైన్స్ చూసి నేనే సొంతగా ఓ డిజైన్ క్రియేట్ చేసుకునేదాన్ని. ఆ నగలను నా బొమ్మలకు అలంకరించి మురిసిపోవడం ఆనందాన్నిచ్చేది. సినిమాల్లోకి వచ్చాక.. జువెలరీలో నా ఓన్ బ్రాండ్ ఉండాలని కోరుకున్నా. చాలావరకు నా జువెలరీ నేనే డిజైన్ చేసుకుని వేసుకునేదాన్ని. చూసిన వాళ్లందరూ బాగున్నాయని మెచ్చుకునేవారు. దీంతో అవి అందరికీ అందుబాటులో ఉండాలని... నా ప్యాషన్‌ను నాన్నగారి బిజినెస్‌తో కలిపి ఇలా ‘వైట్ అండ్ గోల్డ్’కు రూపకల్పన చేశాం.
 
అక్షయ తృతీయరోజు...
ఈ ఏప్రిల్ 20 అంటే... అక్షయ తృతీయ నుంచి మా వెబ్‌సైట్ ‘వైట్‌ఎన్‌గోల్డ్.కామ్’ అతివలకు అందుబాటులో రానుంది. మా వెబ్‌సైట్‌లో ప్రముఖ డిజైనర్స్ జువెలరీతోపాటు... తమన్నాస్ కలెక్షన్ అని ప్రత్యేకంగా ఉంటుంది. అందులో నా ఫేవరెట్ జువెలరీ, సినిమాల్లో నేను ధరించిన ఆభరణాలతోపాటు నేను డిజైన్ చేసిన కలెక్షన్ ఉంటుంది.

ప్రస్తుతం నేను చేస్తున్న ఒక తమిళ్ మూవీ ‘వసువుమ్ సరవననుమ్ ఒన్న పడిచవంగ’లో నేను డిజైన్ చేసిన నగలనే ధరిస్తున్నాను. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్స్ వేసుకునే జువెలరీ ధరించాలనే ఇష్టం చాలామందికి ఉంటుంది. అటువంటి వారి కోసమే నా కలెక్షన్‌ను వెబ్‌సైట్‌లో ఉంచుతున్నాను. ఆ కలెక్షన్‌ని ఇష్టపడ్డవారెవరైనా మా వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేయొచ్చు. ఎలాంటి జాప్యం లేకుండా ఆర్డర్ చేసిన రోజే డెలివరీ చేసేస్తాం.
 
సెలబ్రిటీస్‌కి...
సాధారణంగా అందరూ పాషన్ టు ప్రొఫెషన్ వెళ్తారు. పాషన్ టు పాషన్ అదృష్టం నాకు దక్కింది. నా ఫ్రెండ్ కాజల్‌కి, తన సిస్టర్ నిషా అగర్వాల్‌కి అప్పుడప్పుడూ జువెలరీ నేనే డిజైన్ చేస్తాను. నిషా పెళ్లికి అన్ని రకాల ఆభరణాలను స్వయంగా నేనే చేసిచ్చాను. అది నాకెంతో సంతోషాన్నిచ్చింది. వైట్‌అండ్‌గోల్డ్‌లో జువెలరీ అంతా నేటి మహిళలను ప్రతిబింబించేలా ఉంటుంది. స్టైలిష్ అండ్ కాంటెంపరరీ కూడా. సంప్రదాయ వేడుకలు, పార్టీలు అన్న తేడా లేకుండా అన్ని అకేషన్స్‌కి అనుగుణంగా ఉండేలా డిజైన్ చేస్తున్నాం. ధరలు కూడా అందుబాటులో ఉండటం మా ప్రత్యేకత!
 

Advertisement
Advertisement