గ్రాండ్ సలామ్.. సచిన్ | Sakshi
Sakshi News home page

గ్రాండ్ సలామ్.. సచిన్

Published Sat, Nov 16 2013 12:41 PM

గ్రాండ్ సలామ్.. సచిన్

అంతర్జాతీయ క్రికెట్లో ఓ శకం ముగిసింది. భారత క్రికెట్ అభిమానులతో 24 ఏళ్లుగా పెనవేసుకున్న బంధం నేటితో చరిత్రగా మారింది. తొలి అంతర్జాతీయ మ్యాచ్ను చూసిన.. బాల్ బాయ్గా పనిచేసిన సొంతగడ్డ ముంబై వాంఖడే స్టేడియంలోనే.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఘనమైన వీడ్కోలు పలికాడు. వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ను ధోనీసేన సాధించి మాస్టర్కు చివరి కానుకగా అందించింది.

రెండో టెస్టులో మూడో రోజు శనివారమే టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. తాను పుట్టిపెరిగిన నగరంలో భారీ తరలివచ్చిన అభిమానులు, వివిధ రంగాల ప్రముఖులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సచిన్ వీడ్కోలు పలికాడు. సచిన్ చివరి మ్యాచ్ను చూసేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలు సినీతారలు, బడా పారిశ్రామిక వేత్తలు, అభిమానులు వాంఖడేకు విచ్చేశారు. సచిన్ తల్లి రజని, గరువు అచ్రేకర్ సైతం మ్యాచ్ను వీక్షించారు.  

తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధించిన సచిన్ (74) నాలుగు పదుల వయసులోనూ తనలో పసతగ్గలేదని నిరూపించాడు. ఎన్నో రోజులుగా అమితాసక్తితో ఎదురు చూసిన అభిమానులకు పరుగుల కనువిందు చేసి మధుర జ్ఞాపకాలను మిగిల్చాడు. మూడో రోజే కరీబియన్లు ఓటమి చెందడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడే అవసరం రాలేదు. దీంతో మాస్టర్ బ్యాటింగ్ మరోసారి చూసే అవకాశం అభిమానులకు రాలేదు. చివరి రోజు బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు.
 
సచిన్ కెరీర్కు గుడ్ బై చెప్పినా అభిమానుల మదిలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. మాస్టర్ బ్యాట్ నుంచి జాలువారిన పరుగుల ప్రవాహాన్ని ఎప్పటికీ మరచిపోలేరు. చిరస్మరణీయమైన వంద టెస్టులు గుండెల్లో పదిలంగా ఉంటాయి. ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే నీ వ్యక్తిత్తం యువతరానికి ఆదర్శం. క్రికెట్ చరిత్రలో సచిన్ ఓ పాఠం. గ్రాండ్ సలాం.. సచిన్.

Advertisement

తప్పక చదవండి

Advertisement