తాత మనవరాళ్లు | Sakshi
Sakshi News home page

తాత మనవరాళ్లు

Published Fri, Nov 14 2014 12:48 AM

దాసరితో అర్చన, వైజయంతి, రుచిత, మయూర

చిన్నారులకు మధుర జ్ఞాపకాన్ని అందించింది సిటీప్లస్. వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన ఆ పల్లె వెలుగులను పట్నం తీసుకొచ్చింది. దర్శకరత్న దాసరి నారాయణరావును వారికి తాతయ్యను చేసింది. సినీ నటి కేథరిన్‌తో సరదాగా కాసేపు ఆడించింది. చిల్డ్రన్స్ డే సందర్భంగా  ఎల్లల్లేని ఆనందాన్ని అందించి బోలెడన్ని స్వీట్ మెమరీస్‌తో తిరిగి ఇళ్లకు చేర్చింది.
 
 మెదక్ జిల్లా మాసాయిపేట ట్రైన్ యాక్సిడెంట్ విషాదాన్ని ఇంకా ఎవరూ మరచిపోలేదు. ఆ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి ఐదేళ్ల పిల్లలిద్దరినీ కాపాడి తనూ బయటపడింది! ఆ సాహసం పేరే రుచిత.. ఊరు.. వెంకటాయపాలెం!  సామాన్యుడి కోసం ఓ వేయింగ్ మెషీన్‌ను తయారు చేసి జాతీయస్థాయి సైన్స్‌ఫేర్‌లో దుబ్బాక జెండా రెపరెపలాడించింది.. అబ్దుల్‌కలాం చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆ తెలుగు వెలుగు.. పదమూడేళ్ల అర్చన!  పచ్చని పంటపొలాలు నేర్పిన జీవన పాఠాల్ని షార్ట్ సినిమాలుగా చూపింది! ఈ ప్రతిభకు ఇండోనేషియా పురస్కారం అందింది! ఆ బాల దర్శకురాలు జహీరాబాద్ వాసి మయూర!
 
 ఖోఖోలో నల్లగొండ సత్తా జాతీయస్థాయిలో చాటింది వైజయంతి! ఈ నాలుగు వజ్రాలు చిల్డ్రన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లో జిగేల్‌మన్నాయి.. సిటీప్లస్‌కే కాదు సీనియర్ మోస్ట్ సినిమా పర్సనాలిటీ.. నేడు విడుదలైన ఎర్రబస్ డెరైక్టర్ డాక్టర్ దాసరి నారాయణరావుకీ ఆత్మీయ అతిథులయ్యారు. ఆయన ఇంటికి వెళ్లారు. తాతయ్యా అంటూ మురిపించారు.. ఆయన బిజీ షెడ్యూల్‌ని కాసేపు మరిపించారు!. జూబ్లీహిల్స్.. మధ్యాహ్నం 12.30 ఎర్రబస్ సినిమా ప్రమోషన్ కోసం ప్రెస్‌మీట్ హడావుడిలో ఉన్నారు డాక్టర్ దాసరి నారాయణరావు. రుచిత, అర్చన, మయూర, వైజయంతి తనను కలవడానికి వచ్చారని తెలియగానే అంతటి బిజీని కాసేపు పక్కన పెట్టి పిల్లల్ని లోనికి ఆహ్వానించారు. వారి ప్రత్యేకతలను విని అబ్బురపడ్డారు. రుచిత చూపిన తెగువను తెలుసుకొని మనసారా ఆశీర్వదించారు. ఆ అమ్మాయి ‘మిమ్మల్ని తాతయ్యా అని పిలవచ్చా’ అంటే, ‘తాతయ్యా అనే పిలువమ్మా’ అంటూ ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. ఎనిమిదేళ్లప్పుడే ‘నా చేను.. నా చదువు’ అనే షార్ట్ సినిమా తీశానని మయూర చెప్పగానే ‘ఆ వయసులో నేనూ నా తొలి నాటకాన్ని రాశాను. పదమూడేళ్లప్పుడు నా తోటివాళ్లకు నాటకాల్లో యాక్ట్ చేయడానికి ట్రైన్ చేసేవాడిని’ అని తన బాల్యాన్ని నెమరువేసుకున్నారు దాసరి. ‘సైన్స్‌ఫేర్‌లో అబ్దుల్‌కలాం చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను’ అని చెప్పిన అర్చనను ‘గ్రేట్ మ్యాన్ చేతులమీదుగా అవార్డ్ అందుకున్న గ్రేట్ గర్ల్..’ అంటూ అభినందించారు. ఖోఖోలో జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతున్న వైజయంతిని ‘అంతర్జాతీయస్థాయిలో పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదించారు.
 
 డైనమిక్‌గా ఉండాలి..
 ఎర్రబస్ సినిమాలో మీ క్యారెక్టర్  ఏంటి తాతయ్యా అని అడిగిన పిల్లల ప్రశ్నలకు ‘పిల్లలంటే బాగా ఇష్టపడే తాతయ్య క్యారెక్టరే’ అని చెప్పారు. ‘మీరు తీసిన ఒసేయ్ రాములమ్మా.. సమ్మక్క సారక్క’ సినిమాలంటే మాకు చాలా ఇష్టమ’ని పిల్లలు ఆయన సినిమాలను గుర్తుచేశారు. పల్లెటూళ్లంటే ఇష్టమా సిటీ అంటే ఇష్టమా అని పిల్లలడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ‘నా చిన్నప్పుడు పల్లెటూర్లో చాలా ఎంజాయ్ చేశాను. ఈతలు, కొబ్బరిబొండాలు, కోతికొమ్మచ్చిలు, తాటికాయలు.. ఇలా అన్నీ ఇష్టమే’అని చెప్పారు. హైదరాబాద్‌తో తనకున్న జ్ఞాపకాలను పిల్లలతో పంచుకున్నారు దాసరి.
 
 ‘ఈతరం ఆడపిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారు తాతయ్యా’ అని వైజయంతి అడిగితే ‘మీలాగే ధైర్యంగా.. డైనమిక్‌గా.. డాషింగ్‌గా ఉండాలి’ అంటూ వాళ్ల భుజం తట్టారు. ‘బాగా కష్టపడి ప్రయోజకులు కావాలమ్మా’ అంటూ ఆశీర్వదిస్తూ, వాళ్ల  ప్రతిభాపాటవాలకు ముచ్చటపడి ‘ఈ తాతయ్య చిన్న గిఫ్ట్ ఇస్తున్నాడు తీసుకోండర్రా’ అంటూ తలా పదివేలు క్యాష్‌ప్రైజ్ ఇచ్చారు డాక్టర్ దాసరి నారాయణరావు. ‘ఈ బాలల దినోత్సం నాకిచ్చిన కానుక వీళ్లే. చిల్డ్రన్స్‌డే సందర్భంగా ఈ బాల మేధావులను కలుసుకోవడం సంతోషంగా ఉంది’ అన్నారు దాసరి.
 
 కేథరిన్‌తో షికారు..
ఎర్రబస్సు ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లోనే ఆ సినిమా హీరోయిన్ కేథరిన్ కూడా ఈ పిల్లలతో కలిసి శిల్పారామంలో కాసేపు కేరింతలు కొట్టింది. తన సినిమా విశేషాలను పిల్లలకు చెప్పి పిల్లల వివరాలను తను తెలుసుకుంది. బ్యాటరీ కార్‌లో శిల్పారామం ఆవరణలో కాసేపు షికారు చేసింది. పిల్లల భవిష్యత్ లక్ష్యాలకు ఆల్ ది బెస్ట్ చెప్పి సైనాఫ్ అయింది.
 
దాసరికి చిన్నారులు చెప్పిన ‘లక్ష్యాలు’..
 మాసాయిపేట మానసపుత్రి రుచిత జడ్జి అవుతానంది. ఎందుకంటే..
 ‘పేదవాళ్లకు న్యాయం చేయడానికి. అన్యాయం చేసిన వాళ్లను శిక్షించడానికి’  నల్లగొండ ఖేల్త్న్ర వైజయంతి ఏం చెప్పిందంటే..
 ‘పోలీస్ ఆఫీసర్‌నై ఆడవాళ్లపై జరుగుతున్న దాడులకు చెక్ పెడతా’
 మయూర అగ్రికల్చర్ జర్నలిస్ట్ అవుతానంది. ఎందుకంటే..
 ‘దేశానికి వెన్నుముక రైతన్న. ఆయన ఏలే వ్యవసాయరంగాన్ని కలంతో
 ప్రపంచానికి పరిచయం చేయాలని’ అర్చన సైంటిస్ట్‌గా ఎదిగి.. ‘శాస్త్రీయ పరిశోధనలకు కొత్తమార్గం చూపిస్తా’  ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచనలున్న ఈ పిల్లలు నిజంగా మణిమాణిక్యాలే. వాళ్ల ఊళ్లకు వెళ్లడానికి వెహికల్ ఎక్కిన బాలల్ని ఈ హైదరాబాద్ ట్రిప్ ఎలా అనిపించింది అని అడిగితే ‘సూపర్! దాసరి నారాయణరావు తాతయ్యను కలవడం.. ఆయనతో మాట్లాడటం ఇంకా హ్యాపీ.
 ప్రజెంటేషన్: సరస్వతి రమ/ ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్

Advertisement

తప్పక చదవండి

Advertisement