లోహియా పరిచిన వసంతం చిగురించేనా?

22 Mar, 2015 03:17 IST|Sakshi
రామ్ మనోహర్ లోహియా

 ఏ దేశమైనా ఒక తాత్వికుడిని కోల్పోతే ఒక కన్ను కోల్పోయినంత లోటు. కానీ తాత్వికుడైన రాజకీయ నాయకుడిని కోల్పోతే మరింత లోటు. కానీ అతను తాత్విక రాజకీయ నాయకుడయ్యీ, కళా, కవి హృదయుడయ్యీ కర్మయోగి కూడా అయితే ఇక ఆ దేశానికి అలాం టి మనిషిని తిరిగి పొందడానికి సాపేక్షంగానైనా ఎంతకాలం పడుతుందో? అలా ఆ దేశం కోల్పోయిన మహనీయుల్లో రామ్ మనో హర్ లోహియా ఒకరు. ఈ దేశంలో సిద్ధాంతాలు సృష్టించేవారూ, పుస్తకాల సమాచారం మెదడులో నింపుకుని ఘర్షణలు సృష్టించే వారూ వేలల్లో ఉన్నారు. అయితే విశ్వమంత హృదయంతో చెప్పిం దే ఆచరించేవారు, తప్పులను సరిదిద్దుకుంటూ అందరినీ కలుపు కునిపోయి నూతన శక్తిని సమకూర్చుకుని విశ్వశాంతికి పరికరంగా మారేవారు అతి తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో లోహి యా అగ్రగణ్యులు. సామాజిక అన్యాయాలు తరాలుగా పాదుకుని ఉన్న దేశంలో తాను చేయాల్సినదంతా చేసి వెళ్లిపోయారు. మిగతా తరాలకు దారి చూపించి వెళ్లిపోయారు. పుట్టింది అగ్రవర్ణ వైశ్యకుల మైనా, కలవరించి తపించింది మాత్రం వేల సంవత్సరాలుగా సామాజిక అన్యాయానికి గురైన జాతుల గురించి మాత్రమే.

 భారతీయ జీవితంలో అన్నింటికన్నా వినాశనకరమైంది కులం. తరతరాలుగా సామాజిక అన్యాయం పొందిన జాతుల వృద్ధి గురించి మొక్కకు ఎరువులాగా ఉపయోగపడండీ అని అగ్ర వర్ణాలకూ పిలుపు నిచ్చాడు. అధికారాన్ని అందుకునే క్రమంలో శూద్రులకు, హరిజనులకు, మహిళలకు, ముస్లిములకు వారి వారి యోగ్యతలను మించిన ప్రాతినిధ్యం ఇవ్వాలి అన్నాడు. లోహియా కూడా అట్లాగే జీవించాడు. 1960ల్లో లోక్‌సభలో సోషలిస్ట్ పార్టీ లీడర్‌గా అన్ని అర్హతులున్నా తానో, మధులిమాయేనో కాకుండా బీసీ తరగతికి చెందిన రబీరేనూ, అట్లాగే రాజ్యసభలో రాజ్ నారా యణన్‌ని కాకుండా పెరిక కులానికి చెందిన మురహరి అనే తెలుగు వ్యక్తిని నియమించాడు. అట్లాగే కింది వర్గాలు అధికారంలోకి వచ్చిన తరువాత అగ్రవర్ణా లను ద్వేషించకుండా కలుపుకుపోవాలి. ఎం దుకంటే వారిలోనూ అన్నీ పోగొట్టుకున్న నిరు పేదలు ఉన్నారన్న విషయాన్ని మరువరాదనీ, కటుత్వం, ద్వేషం వల్ల అధమత్వానికి శాశ్వ తంగా పట్టం కట్టినట్లు అవుతుందని జాగ్ర త్తలు చెప్పాడు. ఆలోచనా స్థాయిలో ద్రౌపది ఏ నాడు కూడా పురుషునితో ఓటమిని అంగీక రించలేదు కాబట్టి భారత స్త్రీలు ఆమెను ఆద ర్శంగా తీసుకొని ధైర్యంగా పోరాడాలని అన్నారు. స్త్రీలను గుడ్డమూటలా తయారు చేయకూడదు. అవసరం వచ్చినప్పుడు పురు షుణ్ణి మూటకట్టుకుని తనవెంట తీసుకొని వెళ్లగల శక్తివంతురాలిగా స్త్రీని రూపొందించాలన్నాడు. ఎంతటి నిరుపేదలైనప్పటికీ ఉన్న దాంట్లో తృప్తిపడుతూ తమ సహజమైన ఆనందాన్ని కొనసాగిస్తున్న ఆదివాసుల నుంచి మిగతా భారతదేశ ప్రజలు ఆ ఆనందం ఎట్లా పొందాలో నేర్చుకోవలసి ఉంటుందని అన్నాడు.

 ఇలా అందరినీ కలుపుకొని, అందరి నుంచి నేర్చుకోవా లనుకున్నాడు. మార్క్స్ నుంచి గాంధీ వరకు నేర్చుకునేది ఎంతో ఉంది. అయితే నేర్చుకోవడం అనేది నీవు ఇంకొకరి ప్రభావ చట్రం లో ఉండకుండా ఉన్నప్పుడే సాధ్యపడుతుంది అన్న లోహియాలో నిర్మల సత్యాన్వేషిని చూడొచ్చు. అందుకనే అతను గాంధీకి దగ్గర య్యాడు, అంబేద్కరుకూ దగ్గరయ్యాడు. నిత్య నదీప్రవాహమై స్వచ్ఛంగా ప్రవహిం చాడు. ప్రవాహమంతా మెరుపులు కురి పించాడు.
 భారతదేశంలో అనేక జాతులుగా ఉన్న కుల సమస్యను పరిష్కరించకుండా సోషలి జాన్ని సాధించలేమన్న నిర్ణయానికి వచ్చాడు. అందుకనే సామాజిక న్యాయం సాధించే క్రమంలో ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రా ల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడటానికి పునాది అయ్యాడు. లోహియా సిద్ధాంతాల ద్వారా ఆయన చెప్పిన ఈ సామాజిక సమ స్యలను రూపు మాపగలిగామా, లోహియా చింతనలో కూడా పరిమితులు ఉన్నాయా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు గాక, కానీ లోహియా స్వచ్ఛమైన మేధస్సును, ఆచర ణను శంకించలేము.

 ‘‘వెనుకబడిన తరగతుల వారు తమ చేతికి అధికారం వచ్చిన వెంటనే ఉన్నత కులాల వారి అలవాట్లను, దుర్గుణాలను అనుక రించాలన్న కోర్కెను అరికట్టుకోవాలి’’అని లోహియా పిలుపు నిచ్చాడు. సామాజిక న్యాయం పొందుతున్న అన్ని కులాల నాయ కులు తాము ఒకసారి అనుభవించిన ఫలాలతో సరిపెట్టుకుని తమలో అనుభవించని మిగతా వారికి అవకాశం ఇస్తేనే లోహియా భావించిన సామాజిక న్యాయం అనే మాటకు న్యాయం జరిగినట్లు అవుతుంది. లేదంటే ఇక్కడ కూడా అధికార కేంద్రీకరణ జరిగి దీంట్లోనూ ఒక రకమైన తక్కువా ఎక్కువా కులాలు ఏర్పడతాయి. సామాజిక న్యాయం పేరుతో అవకాశాలు పొందుతున్న ఓ తండ్రి తరువాత అతని కొడుకులు, వారి బంధువులే ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతారు కానీ అంతకంటే తక్కువస్థాయి కలిగిన మిగతా వారికి అవకాశం ఇవ్వరు. ఇది అంత మంచిది కాదు. ఇది జరగకుండా ఎన్ని సభలు, సమావేశాలు పెట్టినా పెద్దగా ఉప యోగం లేదు.

 నిక్కచ్చిగా చెప్పాలంటే ఈ కాలంలో కమ్యూనిస్టు.. కమ్యూ నిస్టుగా లేడు. గాంధీ పేరు చెప్పుకునే పార్టీ వారు గాంధేయులుగా లేరు. లెఫ్టిస్ట్ అనేవాడు లెఫ్టిస్ట్‌గా లేడు. ఒకరు ఇంకొకరితో ఏకం కారు. కాలం మహిమనా? లేదా సిద్ధాంతాలను పునర్ నిర్వచిం చుకోవాల్సిన అవసరమా? మనిషనే పదార్థమే స్వార్థపూరితంగా ఉందా? నిజాయితీగా కనుక్కోవాలి. వ్యక్తి తన స్వార్థం నుంచి విముక్తి కాకుండా, స్వార్థాన్ని అనుక్షణం కడుక్కోకుండా సమా జాన్ని ఉద్ధరిద్దామనే ప్రయత్నం చేయడమంటే  తనలో ఊడలు దిగి ఉన్న అహం ఆడే నాటకానికి లొంగిపోవడమే అవుతుంది. సమస్య పరిష్కారం కాకుండా అక్కడక్కడే ఒక వలయం నుంచి ఇంకో వలయంలోకి తిరుగుతుంది కానీ పెద్దగా ఒరిగేదేమీ లేదు. నెపాన్ని శత్రువు అనే పేరుతో లేని వాడిని తయారు చేసుకుని వాడి మీద రుద్దాలని చూస్తుంది. అనుక్షణం ఆత్మవిమర్శ లేకపోతే వాస్తవం నుంచి పారిపోవడమే అవుతుంది. అందుకే చెప్పిందే ఆచ రించే మనుష్యుల కోసం లోహియా ఓ వసంతాన్ని పరిచాడు. ఆ వసంతం చిగురిస్తుందా, మోడుబారుతుందా చూడాలి.
 (23న రామ్ మనోహర్ లోహియా జన్మదినం)
 మోతె గంగారెడ్డి
 (లండన్‌లోని బెడ్ ఫోర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి)
 మొబైల్: 9000022443

మరిన్ని వార్తలు