హార్టిస్ట్.. హృదయశిల్పి | Sakshi
Sakshi News home page

హార్టిస్ట్.. హృదయశిల్పి

Published Fri, Sep 26 2014 2:27 AM

హార్టిస్ట్.. హృదయశిల్పి - Sakshi

‘హృదయశిల్పి’... డాక్టర్ ఎ.ప్రభాకరాచారి కలం పేరు. హార్ట్ స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన ఈ వైద్యుడికి ఆ పేరు నూటికి నూరుశాతం సూటైంది. ఒక పక్క వైద్య వృత్తిలో కొత్త ప్రయోగాలు చేస్తూ... మరోపక్క తనలోని కళాకారుడికి చేతినిండా పనిచెబుతూ...దాచుకోలేనన్ని జ్ఞాపకాలను, చెప్పలేనన్ని అద్భుతాలను తన ఇంటినిండా, మనసునిండా పదిలపరిచారు. అందులోని ఓ అద్భుతమే ఇక్కడ కనిపిస్తున్న ఈ పందిరి మంచం. ఈ ‘హార్టిస్ట్’ పందిరి మంచం వెనుక పెద్ద ఉన్న పెద్ద కథ ‘సిటీ ప్లస్’కు ప్రత్యేకం.
 
 పాతబస్తీ ప్రాంతంలో కూలగొట్టిన పాత కాలంనాటి ఇళ్ల దగ్గరికి వెళ్లి అక్కడ పారేసిన కిటికీలు, దర్వాజాలు, దూలాలను సేకరించి పందిరి మంచంగా మలిచారు ప్రభాకరాచారి. చిత్రమేమంటే... పాత కలపతో చేసిన ఈ మంచానికి విలువైన నవరత్నాలు, వేల రుద్రాక్షలతో అలంకరించారు. ఆత్మరక్షణ కోసం ఓ పది రకాల కత్తులనూ అమర్చారు. కెంపులు, పచ్చలతో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తున్న ఈ మంచం పని ఏడాదిగా నడుస్తూనే ఉంది. ఇంకా బోలెడంత పని ఉందంటున్నారు డాక్టర్.
 
 కాదేదీ వ్యర్థం
 ‘ఈ ప్రపంచంలో ఏదీ వ్యర్థం కాదు. ఉపయోగించుకోవాలే గానీ కంటికి కనిపించిన ప్రతి ఒక్క వస్తువుతోనూ అద్భుతాలు చేయవచ్చు. అందమైన బొమ్మలు గీయడం అందరూ చేసేపనే. ఆ పనీ నేనూ చేశాను. తృప్తి కలగలేదు. అదే చెట్టు బెరడుతో కళాఖండాలను తయారు చేసినపుడు మనసు ఆకాశంలోకి ఎగిరింది. వాటిని చూసిన వారంతా ఆ క్షణం ఏదీ వృథా కాదని ఒప్పుకన్నారు. ఈ మంచం తయారీ కూడా అలాంటిదే. వందల ఏళ్లనాటి కిటికీలు, దర్వాజాలను చూసినపుడు చాలా ఆనందం కలుగుతుంది.

పాత కలపకు ఆయుష్షు కూడా ఎక్కువే. ఆ అందాన్ని, ఆయుష్షుని తీసుకెళ్లి చెత్తలో పడేస్తుంటే ప్రాణం ఊరుకోలేదు. ఫలక్‌నుమా ప్రాంతానికి ఒకసారి వెళ్లినపుడు కూలిన ఇళ్ల దగ్గర పాత కిటీకీలు కనిపించాయి. అంతే వెంటనే ఓ వ్యాను తీసుకెళ్లి అక్కడివారిని అడిగి వాటిని తీసుకొచ్చాను. కంటికి కనిపించిన ఏ పాత చెక్క వస్తువునీ వదల్లేదు. అన్నింటితో ఒక మంచం చేయాలనుకున్నా. తెలిసినవారు అడుగుతున్నారు... ఇది మీకోసమా అని. భవిష్యత్తు తరాలవారికి మన పూర్వీకులు ఎంత గొప్పగా, కళాత్మకంగా బతికేవారో తెలియజెప్పడానికే దీన్ని తయారుచేస్తున్నాను’ అంటారు ప్రభాకరాచారి.
 
 దీంతో పాటు ఈ డాక్టర్‌కు వినాయకుడంటే చాలా ఇష్టం. అలాగని వినాయక భక్తుడంటే ఒప్పుకోరు. ‘శివుడు వినాయకుడికి జంతువు తల అతికించాడు. అది పురాణమైనా... శాస్త్రపరంగా మనమూ అలాంటి ప్రయోగాలు చేయాలి. అందుకే నేను వినాయకుడి బొమ్మలు సేకరిస్తున్నా. అందుబాటులో ఉన్న వస్తువులతో ఆయన రూపాన్ని చిత్రిస్తున్నా’ అంటారు డాక్టర్ చారి.  
 
 తొలి ప్రయత్నంలో భాగంగా తారామతి బారాదరిలో శనివారం నుంచి ‘ఆర్ట్ క్యాంపు’ను నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 6 వరకు జరిగే ఈ క్యాంపులో 90 మంది కళాకారులు రెండు బ్యాచులుగా తమ చిత్రాలు ప్రదర్శిస్తారు. ఇందులో పెయింటింగ్, శిల్పకళ, గ్రాఫిక్ పెయింటింగ్‌లు కొలువుదీరనున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో కళాఖండాలు ప్రదర్శించడం బహుశా ఇదే తొలిసారి. వీరంతా తమ కళాఖండాలను ట్రస్టుకు విరాళంగా ఇస్తారు. వీటినే నగరంలో జరిగే మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రదర్శిస్తారు. ‘తెలంగాణ ప్రజల్లో విభిన్న కళ ఏనాటి నుంచో ఉంది. జీవన గమనం, ఎదుర్కొన్న దుర్భర పరిస్థితుల నుంచి అది పుట్టుకొచ్చింది. దీన్ని ప్రపంచ నలుమూలలకూ చేరవేయడానికి ట్రస్ట్ వారధిగా నిలుస్తుంది’ అన్నారు ఏలె లక్ష్మణ్. ‘టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్‌లు మన దగ్గర ఉన్నారు. కానీ వారింకా వెలుగులోకి రాలేదు. ఇందులో చాలా మందిది గ్రామీణ నేపథ్యమే. వారి ప్రతిభకు సరైన ప్లాట్‌ఫాం కల్పించడమే ట్రస్ట్ ఉద్దేశం’ అని నిరంజన్‌రెడ్డి చెప్పారు.
 - మహి
 
 కళకు వారధి
 తెలంగాణలో కళకు కొదవలేదు. కానీ దాన్ని వెలికితీసి ప్రదర్శించేందుకు ఇప్పటి వరకు సరైన వ్యవస్థ, వేదిక లేవు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కళాకారులకు తగిన గుర్తింపు దొరకడం లేదు. ఇలాంటి వారందరినీ ప్రోత్సహించేందుకు ‘ఆర్ట్: తెలంగాణ’ ట్రస్ట్ ఆవిర్భవించింది. దర్శకుడు నర్సింగరావు, ఆర్టిస్ట్ ఏలె లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు పాపారావు, అడ్వొకేట్ నిరంజన్‌రెడ్డి వంటి ప్రముఖులు కలసి లాభాపేక్ష లేని ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు.
 
 దృష్టిలోనే సృష్టి

 మనం చూసే దృష్టిలోనే సృష్టి ఉంటుందన్న మాటను నమ్మే డాక్టర్ చారి... తన వృత్తిలో కూడా బోలెడన్ని వైవిధ్యాలను చూపించారు. రికార్డు స్థాయిలో హార్ట్ ఆపరేషన్లు చేసిన ఈయన... ‘హృదయ శిల్పి’ పేరుతో చాలా పుస్తకాలు రాశారు. ‘విశ్వ గర్జన, శిథిలశిల్పం’ పుస్తకాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. వెయ్యి ప్రకృతి ఫొటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. ఆయన ఇంట్లోకి అడుగుపెట్టగానే గోడపై కనిపించిన ఫొటో చూస్తే బోలెడన్నీ ప్రత్యేకతలు కనిపిస్తాయి.
 
 ‘తెరపై కనిపించే వారే అందంగా ఉంటారంటే ఒప్పుకోను. ఎవరినైనా చూపించడంలో ఉంది. నా భార్యను, మనవడ్ని అలాగే అద్భుతంగా చూపించాలనుకుని... ఆయిల్, వాటర్ పెయింట్స్, కొలాజ్, ఫొటోగ్రఫీ, ఎంబ్రాయిడరీ... ఇలా నాకొచ్చిన ప్రతి కళను అందులో ప్రదర్శించా’ అంటారాయన. డెబ్భైకి దగ్గరపడుతున్నా... ఇంకా ఏదో చేయాలన్న ఉత్సాహం ఆయనలో ఉరకలు వేస్తూనే ఉంది.
 - భువనేశ్వరి

Advertisement
Advertisement