యూపీఏ, ఆర్‌బీఐకి ద్రవ్యోల్బణం అతిపెద్ద సవాల్! | Sakshi
Sakshi News home page

యూపీఏ, ఆర్‌బీఐకి ద్రవ్యోల్బణం అతిపెద్ద సవాల్!

Published Fri, Dec 27 2013 4:04 PM

యూపీఏ, ఆర్‌బీఐకి ద్రవ్యోల్బణం అతిపెద్ద సవాల్! - Sakshi

2013 సంవత్సరం సామాన్య ప్రజలపై ధరల ప్రభావం భారీగానే పడింది. ఆహార పదార్ధాల, నిత్యావసర వస్తువుల, పెట్రోల్ ధరలు ఎన్నడూ లేనంతగా ఆకాశాన్నంటాయి. దాంతో ద్రవ్యోల్బణం అదుపులోకి తీసుకురావడానికి యూపీఏ, రిజర్వు బ్యాంక్‌కు తలకు మించిన భారమవుతోంది. అధిక ధరల ప్రభావంతో అల్లాడిన ప్రజలు ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వానికి గట్టి షాకే ఇచ్చారు. వచ్చే నాలుగు నెలలు యూపీఏ ప్రభుత్వానికి కఠిన పరీక్షగా మారింది. అధిక ధరలను అదుపులోకి తీసుకరావడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైతే.. ఇక సాధారణ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూడాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 
 
 2013లో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో  కిలోఉల్లిధర 100 రూపాయలకు చేరుకోగా, టామాటా ధర 80 రూపాయలకు పైగానే పలికింది. నవంబర్‌లో ఉల్లి ధర 190 శాతం పెరుగగా, కూరగాయల ధరలు 95.25 శాతం పెరిగింది. ఉల్లి, టామోటాతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు అధిక స్థాయిలో ఉండటంతో ద్రవ్యోల్బణం రెండెకెలను చేరుకుంది. ద్రవ్యోల్బణ పెరుగుదలకు అడ్డుకట్టవేసేందుకు రిజర్వు బ్యాంక్ చేసిన ప్రయత్నాలు నిరాశనే మిగిల్చాయి. కన్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా మదింపు జరిపే రిటైల్ ద్రవ్యోల్బణం గత నవంబర్‌లో 11.24 శాతాన్ని నమోదు చేసుకున్నాయి. ధరల పెరుగుదలను అరికట్టేందుకు రిజర్వుబ్యాంక్ కీలక వడ్డీ రేట్లను పెంచూతు నిర్ణయం తీసుకున్నా.. ద్రవ్యోల్బణ నియంత్రణపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటికిప్పుడు  ద్రవ్యోల్బణ పెరుగుదలను అరికట్టడానికి రిజర్వు బ్యాంక్ వద్ద ఎలాంటి సులభ మార్గం ఏది ఉన్నట్టు కనిపించడం లేదు. 
 
 ద్రవ్యోల్బణం అదుపులోకి తీసుకురాలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ధరలను అరికట్టలేకపోవడంతో ఇప్పటికే రాజకీయంగా మూల్యం చెల్లించుకున్నాం. ఏది ఏమైనా వాస్తవాలను అంగీకరించాల్సిందే. అని చిదంబరం ఇటీవల వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో టోకు ధరల ఆధారంగా లెక్కించే ద్రవ్యోల్బణం 7.52 శాతానికి చేరుకుంది.  రిజర్వు బ్యాంకు అంచనా వేసిన 5.5 శాతాని కంటే అధికంగా ఉండటం ఆందోళన రేకెత్తించింది. అధిక ధరల కారణంగాసామాన్య ప్రజలపై చూపిన పతికూల ప్రభావం ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల  ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. ఫలితాల అనంతరం అధిక ధరల కారణంగా ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. 2014 ఎన్నికల్లో మూడవ సారి అధికారం చేజిక్కించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న యూపీఏకు, అధిక ధరలను నియంత్రించడంలో రిజర్వు బ్యాంకుకు రానున్న కాలం అతిపెద్ద సవాల్‌గా కనిపిస్తోంది. 

Advertisement
Advertisement