ఆల్ లైన్స్ ఆర్ బిజీ.. | Sakshi
Sakshi News home page

ఆల్ లైన్స్ ఆర్ బిజీ..

Published Thu, Feb 19 2015 11:19 PM

ఆల్ లైన్స్ ఆర్ బిజీ..

పదండి ముందుకు పదండి తోసుకు.. పోదాం పోదాం పైపైకి.. మహాకవి పదాలను తు.చ తప్పకుండా పాటించే ఘనత మన నగరానిదే. ‘నేనెక్కడుంటే అక్కడి నుంచే లైను మొదలవుతుంది’ అని బిగ్ బీతో పూరి పలికించిన డైలాగ్‌లకు హైదరాబాదీలే ఇన్‌స్పిరేషన్ అని నా నమ్మకం.
 

క్యూ అన్న పదం మా డిక్షనరీలో లేదు. సినిమా హాల్లోనో, రైల్వే స్టేషన్‌లోనో టికెట్ల కోసం క్యూలో బలవంతాన నిల్చోవాల్సి వస్తే తప్ప మరెక్కడా క్యూలు కట్టం, అవసరమతే క్యూని బద్దలు కొడతాం. ఈ మధ్య ఆన్‌లైన్ బుకింగ్‌లు మొదలయ్యాక క్యూల గొడవ నుంచి కొంత ఊరట లభించింది. అది కూడా ఒక్క టికెట్లు కొనేదగ్గర కొంత శాతం మంది ప్రజలకే. మిగతా సందర్భాల్లో అసలు క్యూలు అవసరమే లేనట్టు భావిస్తాం. బస్‌స్టాప్‌లో క్యూ అనే పదానికి వాల్యూ లేదు. బలవంతులకే మొదటిస్థానం. గంటల తరబడి ఎదురుచూసినా కండబలం, పిక్కబలం లేకుంటే బస్సు ఎక్కేటప్పుడు వెనక్కి నెట్టేస్తారు. ఈ మధ్య బస్‌స్టాప్‌లో షేరింగ్ ఆటోలనైనా  క్యూ పద్ధతిలో నిలబెడుతున్నారు కానీ, బస్సు ఎక్కే ప్రయాణీకులకు మాత్రం క్యూలుండవు.
 
క్యోంకీ క్యూ..
మనకంటే ముందు వచ్చిన వారిది మొదటి అవకాశం అనే చిన్ని మర్యాదను మరచిపోతున్నాం. నేను ఎప్పుడొస్తే అప్పుడు నాకు అన్నీ జరగాలనే ఆటిట్యూడ్ పెరిగిపోయింది. ఇది నిరూపించడానికి పెద్ద సర్వేలేమీ చేయక్కర్లేదు. మీ చుట్టుపక్కల ఉన్న ఏదైనా లిఫ్ట్ దగ్గర ఒక పది నిమిషాలు నిల్చుంటే చాలు. క్యూల్లేవ్, క్యూలో నిల్చోవడాలు అసలే  లేవ్.. అని అర్థమవుతుంది. లిఫ్ట్ కోసం మీరు ముందొచ్చి ఎంతసేపు నిలబడ్డా సరే, వెనుకొచ్చిన కొమ్ములు వాడిగా దూసుకెళ్లిపోతాయి. మీ వంతు కోసం ఎదురుచూస్తూ నిలబడితే లిఫ్ట్ వెళ్లిపోతుంది అందుకని మీరు పదం కలిపి తోసుకెళ్లేందుకు అలవాటు పడిపోతారు.

పదండి ముందుకు.. పదండి తోసుకు.. ఎవరూ నేర్పించకుండానే అబ్బిన విద్యలు. అంతేనా లిఫ్ట్ నుంచి లోపలి వారు బయటకు వచ్చేంత వరకైనా వేచి చూసే ఓపిక లేనితనం ప్రతి మాల్‌లోనూ కనిపిస్తుంది. భుజాలు రాసుకుంటూ, కాళ్లు తొక్కేసుకుంటూ దూసుకెళ్తుంటారు. లిఫ్ట్ ఎక్కడం ఒక కళ అయితే, దిగడం కూడా అంతే. కావాల్సిన ఫ్లోర్‌లో దిగడానికి బోలెడంత మందిని దాటి, బయట నుంచి వస్తున్న వరదని తోసుకుంటూ బయటపడాలి. కదం తొక్కుతూ హృదంతరాళం గర్జిస్తూ.. నా ఈ లిఫ్టావేశంతో ఎంతో మందికి క్యూపదేశం చేశాను. బాసూ నేను ముందొచ్చానని భుజం తట్టి మరీ చెప్పాను. ఒక తిక్క చూపు, వెర్రి నవ్వు తప్ప పెద్ద ఆర్గ్యుమెంట్ జరగలేదు.
 
ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్..
మరో సందర్భంలో నా కూతురు ఐస్‌క్రీమ్ కొనుక్కనే క్రమంలో సక్రమంగా నిల్చుంది. ఎంతసేపైనా బిల్లు కౌంటర్ వరకూ తను చేరదే ! దూరం నుంచి చూసీ చూసీ ఇక లాభం లేదని నేనే స్వయంగా వెళ్లి డబ్బులు ఇవ్వబోయాను. వెంటనే పక్కనుంచి కలకలం. నేను లైన్ బ్రేక్ చేశానని ! హలో సారూ మీ పక్కన ఈ చిన్నది మీకంటే ముందు నుంచీ ఉందని గుర్తు చేశాను. ఆ సారు నాలుక్కరుచుకుని సారీ చెప్పి తప్పుకున్నాడు. పిల్లల పైనే కాదు వయసు మళ్లిన పెద్దలపై  కూడా మర్యాద పాటించని తనం చూస్తే ఒక్కోసారి సిగ్గేస్తుంది. ఒకసారి సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తున్నాం. నా వెనకే వస్తున్న ఓ పెద్ద జంట కోసం.. తలుపు తెరిచి పట్టుకున్నాను.  ఇంతలో నలుగురు టీనేజర్లు గలగలా తోసుకుంటూ వెళ్లిపోయారు. మనకంటే ముందున్నవారు ఇబ్బందిపడతారన్న భావన ఆ పిల్లల్లో కలిగించలేక పోయినందుకు మన సమాజం సిగ్గుపడాలి.
 
ఆల్ లైన్స్ ఆర్ బిజీ..
క్యూలో నిల్చోవాలంటే అసహనం, చిరాకు. ఇక ప్రార్థనా స్థలాల్లో, అప్లికేషన్ కౌంటర్లలో తోపులాటలు సహజమే అనే స్థాయిలో అలవాటుపడ్డాం. స్త్రీలకు ఒక లైన్ ప్రత్యేకంగా కేటాయించి పురుషులను వేరు చేసినా, స్త్రీల లైన్లలోనూ పురుషుల లైన్లలోనూ కొన్ని టచ్ ఇబ్బందులుంటాయి. రష్ ఉన్నా, లేకపోయినా ఎదుటి మనిషిని తాకేంత దగ్గరగా జరగడం నేను గమనించాను. విమానాశ్రయాల్లోనూ ఈ క్యూ తిప్పలు తప్పవు. లైన్ జంపింగ్‌లు, వెనుక నుంచి పుషింగ్‌లతో పాటు, ఫ్లైట్ దిగేటప్పుడు తోపులాటలు సర్వసాధారణం. దిగేటప్పటి తొందర ఎక్కేటప్పుడు ఉండదు సుమీ.

ఫైనల్ కాల్ అనౌన్స్ చేసేంత వరకూ క్యూలోకి రాని మహానుభావులు చాలా మందే ఉంటారు. అందరూ చివర్లో తాపీగా ఎక్కాలనుకుంటే క్యూలు ఉండీ లాభం ఏంటి. దీనికి విరుద్ధంగా అంతార్జాతీయ ఫ్లైట్లలో మనవాళ్లు అత్యుత్సాహం మరీ విడ్డూరంగా ఉంటుంది. వృద్ధులు, పిల్లలు ముందు ఎక్కండి అని అనౌన్స్‌మెంట్ వచ్చినా ఫలానా సీట్ నంబర్లే ముందుకు రండి అని పిలిచినా, అందరూ వచ్చి గేటు చుట్టూ దడి కట్టి నిలబడిపోతారు. అవతలి దేశస్తులకు తెలియదు కదా మనకు క్యూ అనే పదానికి అర్థం తెలీదని.

వెనుకబడిపోవడం నీ అసమర్థత, దమ్ముంటే దూసుకెళ్లిపో అనే ఈ ఆటిట్యూడ్ ఆరోగ్యకరమైన సమాజానికి దారితీయదు. ఇక్కడ ఒక్క చోట సమానంగా ఉండలేని మనం ట్రాఫిక్ లాంటి మిగతా విషయాల్లోనూ సహనాన్ని, మర్యాదనీ కోల్పోతున్నాం. పక్కవారిని గౌరవిద్దాం. ఇది చెబితే వచ్చే పాఠం కాదు. సమాజం నేర్పే విధానం. తర్వాతి తరాన్ని మనం ఎలా ప్రభావితం చేస్తున్నామో పరిశీలించుకోవాలి. మనం నిరీక్షిస్తే అవతలి వారూ నిరీక్షించే రోజు కోసం నిరీక్షిస్తూ..

Advertisement
Advertisement