బాంబురే | Sakshi
Sakshi News home page

బాంబురే

Published Fri, Apr 3 2015 1:35 AM

బాంబురే

ఫుల్ ఏసీ.. అడుగడుగునా కార్పొరేట్ హంగులు.. కంప్యూటర్లు.. ఇంటర్నేషనల్ రేంజ్ ఇంటీరియర్ డిజైన్లు.. వీటి మధ్యలో ఓ వెదురుతో మలచిన బోటు.. గూగుల్ ఆఫీస్‌లో ఈ సెటప్ ఎవరైనా ఊహిస్తారా! డిఫరెంట్ టైప్ ఆఫ్ బాంబూ సెటప్‌లు ఇన్ఫోసిస్
 హైదరాబాద్.. బెంగళూరు కార్యాలయాల్లోనూ కొలువుదీరాయి. కొండకోనల్లో గిరిజనుల ఆవాసమైన ఈ వెదురిళ్లు సిటీకొచ్చేశాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్తే.. అక్కడి బస్‌స్టాప్‌లూ వెదురుతో దర్శనమిస్తున్నాయి.  కోట్లు వెచ్చించి హంగులద్దుకుంటున్న భవంతులకు వెదురుతో అదిరిపోయే ఫినిషింగ్ టచ్  ఇస్తున్నారు.
- త్రిగుళ్ల నాగరాజు
 
హోమ్ అప్లయెన్సెస్ బిజినెస్ ఆయనది. ఆమె పీహెచ్‌డీ చేస్తున్నారు. అన్నీ ఆపేసి, ఓ డిఫరెంట్ ఐడియాతో అడుగు ముందుకేశారు. బాంబూహౌస్ ఆఫ్ ఇండియా పేరుతో వెదురుకు ఎదురేలేదని చాటుతున్నారు. అరుణ అండ్ ప్రశాంత్ లింగం దంపతులు మూడు పదుల కాలం నిలిచే  వెదురిల్లును పదిలంగా అల్లుతామని ఘంటాపథంగా చెబుతున్నారు. వెదురును కుదురుగా మలిస్తే.. వేణువుగానే కాదు.. అందమైన గృహంగానూ తీర్చిదిద్దొచ్చని రుజువు చేస్తున్నారు.
 
ఆలోచన ఎలా వచ్చిందంటే..
 
2006లో అరుణ, ప్రశాంత్ తమ ఇంటికోసం వెదురుతో చేసిన ట్రెడిషనల్ ఫర్నిచర్ కొనాలని సిటీ అంతా తిరిగారు. చివరకు ఈశాన్య రాష్ట్రం త్రిపుర వెళ్లారు. అక్కడి గిరిజనులు వెదురుతో చేస్తున్న కళాకృతులు చూసి ముచ్చటపడ్డారు. ఎలా అంటే అలా అందంగా ఒదిగిపోతున్న వెదురుతో ఇల్లు కట్టలేమా? అనే ఆలోచన వచ్చింది. వెంటనే ప్రశాంత్ తన బిజినెస్‌కు స్వస్తి చెప్పాడు. అరుణ పీహెచ్‌డీకి ఫుల్‌స్టాప్ పెట్టేసింది. ఇద్దరూ వెదురుపై అన్వేషణ మొదలుపెట్టారు. కేరళ నుంచి మణిపూర్ వరకూ.. అన్ని ప్రాంతాలూ చుట్టొచ్చారు. వెదురు మన్నిక, జీవితకాలం.. అన్నీ స్టడీ చేశారు. ఆ సమాచారంతో రెండేళ్ల తర్వాత 2008లో బాంబూ హౌస్ ఆఫ్ ఇండియాకు అంకురార్పణ చేశారు.

 రూ.2 లక్షల్లో ఇల్లు..

ఆదిలాబాద్ అడవులకు వెళ్లి గిరిజనులకు తమ థీమ్‌ను వివరించి 15 మంది కార్మికులను తీసుకొచ్చారు. వారికి వెదురుతో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం వెదురును సర్కార్ వేలం ద్వారా కొనాలి. అదీ ఏటా జనవరి నుంచి మే వరకు మాత్రమే. కనీసం 36 నెలల వయసున్న ఉన్న వెదురు మాత్రమే గృహ నిర్మాణానికి పనికివస్తుంది. అడవి నుంచి తెచ్చిన వెదురును నాలుగు నెలలు ఎండతగలకుండా ఉంచుతారు. తర్వాత పురుగుపట్టకుండా నెలపాటు కెమికల్స్‌లో ఉంచుతారు. పచ్చిదనం పోయేందుకు మరో నాలుగు నెలలు ఉంచుతారు. తర్వాత వర్క్‌షాప్‌లో అవసరాలకు తగ్గట్టు కట్ చేస్తారు. వీటిని బాంబూహౌస్‌కు పిల్లర్స్‌గా, వాసాలుగా ఉపయోగిస్తారు. పైకప్పు కోసం వెదురు తడకలు, వెదురు, మట్టి, పేడ కలగలిపి గోడలు నిర్మిస్తారు. ఇందుకు చదరపు అడుగుకు రూ.500 చొప్పున ఖర్చవుతుందంటాడు ప్రశాంత్. 400 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి రూ.2 లక్షలు వెచ్చిస్తే సరిపోతుందంటున్నాడు. వాటర్, ఫైర్ రెసిస్టెన్స్ వీటి ప్రత్యేకతలు. ఎకోఫ్రెండ్లీ అదనపు క్వాలిటీ. డాబాపై ఇంకో ఫ్లోర్ వేయాల్సి వస్తే.. వెదురిల్లును భాగాలుగా విడదీసి మళ్లీ పై అంతస్తుపై తిరిగి సెటప్ చేసేయొచ్చు.

 ఎదురు లేని వెదురు..

వెదురుతో ఇల్లు అనగానే సూపర్  అన్నవాళ్లే.. గాలికి ఉంటుందా? జడివానకు తట్టుకుంటుందా? అని యక్షప్రశ్నలేశారు. వీటన్నిటికీ సమాధానంగా వీరిద్దరు.. జ్ట్టిఞ://ఠీఠీఠీ.ఛ్చఝఛౌౌజిౌఠట్ఛజీఛీజ్చీ.ౌటజ/ పేరుతో వెబ్‌సైట్ క్రియేట్ చేసి తమ ప్రాజెక్ట్ డిటెయిల్స్ పొందుపరచారు. వీరి కాన్సెప్ట్‌కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఐఐటీ ఢిల్లీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నార్త్‌ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్స్ అండ్ రీచ్ (ఎస్‌ఈసీటీఈఆర్), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), ఏపీ అటవీశాఖ స్టేక్ హోల్డర్స్‌గా వీరికి కొంతకాలం సపోర్ట్‌గా నిలిచాయి. తర్వాత మళ్లీ ఒంటరిపోరు.. నమూనా గృహాలను నిర్మించి వచ్చినవారికి చూపించారు. బాంబూహౌస్ 30 ఏళ్లు పక్కాగా ఉంటుందని నమ్మకం కల్పించారు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా మీ పెట్టుబడి వెనక్కి ఇచ్చేస్తామని కస్టమర్లకు భరోసా ఇచ్చారు. అయినా.. ముందుకొచ్చిన వారు లేరు. అప్పులు పేరుకుపోయాయి. అయినా మొండిగా ధైర్యం చేశారిద్దరూ.
 
కార్పొరేట్ సెక్టార్‌లోకి..


బాంబూ హౌస్ ఆఫ్ ఇండియా ఇప్పుడిప్పుడే అందరి ఆదరణ పొందుతోంది. ‘కొత్త కాన్సెప్ట్‌లో ఏమాత్రం తేడా వచ్చినా జనానికి మాపై కాదు.. వెదురుపై నమ్మకం పోతుంది. అందుకే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాబోము’ అని చెబుతారు ప్రశాంత్. ఈ తత్వమే.. బాంబూ హౌస్ ఆఫ్ ఇండియాను కార్పొరేట్ సెక్టార్ వరకూ చేర్చింది. గూగుల్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీలు వెదురుతో క్యాంటీన్, రిలాక్సేషన్ స్పాట్స్ ఆర్డరిచ్చి మరీ చేయించుకున్నాయి. హెచ్‌సీయూలో బాంబూ బస్‌స్టాప్‌లు నిర్మిస్తున్నారు వీళ్లు. స్వచ్ఛభారత్ నేపథ్యంలో వెదురుతో టాయ్‌లెట్స్ కూడా రూపొందిస్తున్నారు. అనంతపురం, వికారాబాద్.. ఇంకా వివిధ ప్రాంతాల్లో వీరి వెదురిళ్లు వెలిశాయి. ఇళ్లే కాదు రకరకాల ఫర్నిచర్ కూడా తయారు చేస్తున్నారు. కార్పొరేట్ కల్చర్‌కు అలవాటుపడిన జనానికి గ్రామీణ మూలాలను పరిచయం చేస్తోంది బాంబూ హౌస్ ఆఫ్ ఇండియా. డాబా మీద పెంట్‌హౌస్‌గా, ఫాంహౌస్‌లో కుటీరంగా.. పల్లె వాతావరణాన్ని కళ్లముందుంచుతోంది. ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్‌తో వీరు చేస్తున్న ప్రయత్నానికి ఎన్నో అవార్డులు వరించాయి. ఇటీవల ‘ప్రాజెక్ట్ 100’ అనే గ్లోబల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన వంద ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్‌లో ఈ వెదురిల్లు చోటు దక్కించుకుంది.
 

Advertisement
Advertisement