క్రికెట్ కు మాస్టర్ వీడ్కోలు | Sakshi
Sakshi News home page

క్రికెట్ కు మాస్టర్ వీడ్కోలు

Published Thu, Oct 10 2013 4:36 PM

క్రికెట్ కు మాస్టర్ వీడ్కోలు

ముంబై: సచిన్ టెండూల్కర్.. అలుపు సలుపు లేకుండా సుదీర్ఘ కాలం పాటు భారత్ కు సేవలందించిన క్రికెటర్. 24 సంవత్సరాల పాటు క్రికెట్ ను ఆస్వాదిస్తూ బ్రతికిన క్రికెటర్. భారత్ క్రికెట్ కు మరింత వైభవం తీసుకొచ్చిన క్రికెటర్.  అతని క్రీడా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూస్తూ ఎదిగి ఒదిగిన క్రికెటర్. 1989 లో క్రికెట్ కెరీర్ ను ఆరంభించిన సచిన్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ప్రపంచ వ్యాప్తంగా విశేష అభిమానులను సంపాదించుకున్న ఈ లెజెండ్ క్రికెటర్ త్వరలో పూర్తి స్థాయిలో క్రికెట్ నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.  వెస్టిండీస్ తో నవంబర్ లో జరిగే 200వ టెస్టు అనంతరం తాను క్రికెట్ నుంచి విరామం తీసుకోనున్నట్లు సచిన్ తెలిపాడు.

 

సచిన్ అంటే క్రికెట్. క్రికెట్ అంటే సచిన్. భారత్ ఏ దేశంతోనైనా మ్యాచ్ ఆడుతుందంటే సచిన్ ఉన్నాడా?అనేది ప్రేక్షకుల మదిలో తొలి ప్రశ్న. ఆ ప్రశ్నకు లెజెండ్ సచిన్ ముగింపునిచ్చాడు.తాను క్రికెట్ నుంచి విరామం తీసుకునే సమయం ఆసన్నమైందని భావించిన సచిన్ బాధాతప్త హృదయంతో పూర్తి విరమణ తీసుకుంటున్నట్లు తెలిపాడు. కొన్ని దశాబ్దాలను తన పేరు మీద లిఖించుకున్న క్రికెటర్ రిటైర్ కాబోతున్నాడంటే సగటు క్రికెట్ అభిమానికి జీర్ణించుకోలేని అంశమే. కాగా, విరమణ ఎప్పటికైనా జరగాలి కాబట్టి ఇదే సరైన సమయం అని భావించిన సచిన్ అభిమానులకు నిరాశను మిగిల్చాడు.

 

అటు టెస్టుల్లోనూ, ఇటు వన్డేల్లోనూ తనకంటూ ఓ ముద్ర వేసుకున్న సచిన్ 198 టెస్టుల్లో 51 సెంచరీల సాయంతో 15,837 పరుగులు, 463 వన్డేల్లో 49 సెంచరీలతో 18,426 పరుగులు సాధించి అరుదైన రికార్డు ను నెలకొల్పాడు.  ఈ క్రమంలోనే అత్యధిక వన్డేల రికార్డును కూడా అతను సొంతం చేసుకున్నాడు. అతనికి రికార్డులు మచ్చుకు కొన్ని చెప్పుకున్నా అతని  బ్యాటింగ్ విన్యాసాల్ని అక్షరాల్లో లిఖించడం కష్టమే. భారత్ 2011 ప్రపంచ కప్ ను గెలిచిన అనంతరం సచిన్ రిటైర్ అవుతున్నట్లు ఊహాగానాలు వచ్చినా, కాసింత బ్రేక్ తర్వాత కెరీర్ ముగింపునిస్తున్నట్లు తెలిపాడు. గతంలోనే వన్డే, టీ-20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన సచిన్‌ ఇప్పుడు పూర్తిగా క్రికెట్ కు దూరంగా కానున్నాడు.  సచిన్ క్రికెట్ నుంచి విరామం తీసుకుంటున్నప్పటికీ అతని సలహాలు భారత్ క్రికెట్ కు ఉపయోగపడతాయని ఆశిద్దాం.

Advertisement

తప్పక చదవండి

Advertisement