Sakshi News home page

ఆరేళ్లకే ఆరితేరాడు

Published Wed, Oct 25 2017 12:07 PM

This Lucky 6-Year-Old Was 'Pilot' For A Day - Sakshi

దుబాయ్‌: ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌లో ఒక రోజు పైలట్‌గా పనిచేసిన ఆరేళ్ల ఆడమ్‌ అనుభవం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విమాన ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌పై చిన్నారి ఆడమ్‌ ఇచ్చిన ప్రజెంటేషన్‌, పద్ధతులకు సంబంధించిన వివరాలు చూసి నెటిజన్లు ముగ్ధులవుతున్నారు. విమానం నడిపే సమయంలో ఎమర్జన్సీ ఎదురైతే ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపైనా ఆడమ్‌కున్న పట్టు ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ అధికారులనూ విస్తుగొలిపింది. ఆడమ్‌ ఇవన్నీ కేవలం యూట్యూట్‌ వీడియోలను చూసి నేర్చుకున్నవే కావడం మరింత ఆశ్యర్యం కలిగిస్తోంది.

ఆడమ్‌ పనితీరు మెచ్చిన విమాన కెప్టెన్‌ యక్లీఫ్‌ ఆడమ్‌ కాక్‌పిట్‌లో కూర్చున్న దృశ్యాలను, ప్రొసీజర్‌పై ఇచ్చిన వివరణలతో కూడిన వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేయగా దీనికి నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. రెండు వారాల కింద ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ అయిన ఈ వీడియోను 2.1 కోట్ల మంది వీక్షించగా, మూడు లక్షల సార్లు షేర్‌ అయింది.

ఈ వీడియోను చూసిన ఓ నెటిజన్‌ ఈ బాలుడు ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ కెప్టెన్‌ కావడానికి అన్ని విధాలా అర్హుడని, అతడికి ఓ అవకాశం ఇవ్వండంటూ ఫేస్‌బుక్‌లో కోరారు. ఇక  విమానయానంపై ఆడమ్‌కున్న అభిరుచిని తెలుసుకున్న ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ అతడిని తమ శిక్షణా కేంద్రానికి ఆహ్వానించి పైలట్‌ ట్రైనింగ్‌ ఇచ్చి ప్రత్యేక యూనిఫామ్‌ను ఇచ్చింది. ఎయిర్‌బస్‌ ఏ380పైనా తరగతులు నిర్వహించింది. ఏ380 ఎయిర్‌బస్‌ కెప్టెన్‌ కావాలన్నదే తన కలని చిన్నారి ఆడమ్‌ అంటున్నాడు. త్వరలోనే అతడి కల సాకారం కావాలని నెటిజన్లు కోరుతున్నారు.

నెటిజన్లు ఆకట్టుకున్న ఆరేళ్ల చిన్నారి వీడియో 

Advertisement
Advertisement