మినీ లండన్ | Sakshi
Sakshi News home page

మినీ లండన్

Published Thu, Dec 25 2014 1:00 AM

మినీ లండన్

షహర్ కీ షాన్
 
మినీ లండన్.. ఎక్కడుందో తెలుసా? అని అడిగితే చాలామంది యూరప్ దేశాల పేర్లు చదువుతూ వెళ్లిపోతారు. కానీ అది జంటనగరాల్లో ఒకటైన సికింద్రాబాద్ ముద్దుపేరని చాలామందికి తెలియదు. నిజాం జమానాలో సికింద్రాబాద్ దక్కించుకున్న ఘనత ఇది. రెండు శతాబ్దాల కిందట పురుడు పోసుకున్న లష్కర్ నగర నిర్మాణంలో కీలక భూమిక పోషించిన విదేశీ క్రైస్తవులు నగరంలోనే ఉండిపోయేలా పాలకులు వారికి సకల సౌకర్యాలు కల్పించారు.
- గౌరీభట్ల నరసింహమూర్తి

ఆంగ్లేయుల జమానాలో వారి ప్రభావం హైదరాబాద్‌పై అంతంత మాత్రమే. నిజాం తన రాజకీయ అవ సరాల కోసం మొదట పోర్చుగీస్ కుటుంబాలను ఆహ్వానించాడు. తర్వాత నిజాంతో ఆంగేలయులు పలు ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఆపై బ్రిటిష్ సైనిక పటాలం కుటుంబాలతో సహా వచ్చి సికింద్రాబాద్‌లో స్థిరపడటం జరిగిపోయాయి.

పాశ్చాత్యులకు ఆవాసంగా మారిన సికింద్రాబాద్ తర్వాతి కాలంలో అభివృద్ధిపథంలో దూసుకుపోయింది. లండన్‌లో కనిపించే కట్టడాలను తలపించే రీతిలో ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. ఎత్తయిన చర్చిలు, బ్రిటిష్ నిర్మాణ శైలి ప్రతిబింబించే ఇళ్లు.. వాటి ముందు గార్డెన్లు, ఫౌంటేన్లు, వీధుల్లో ఫ్యాషన్ హొయలు, హ్యాట్‌లు ధరించిన తలలు.. ఇలా సికింద్రాబాద్ వీధుల్లో సంచరిస్తుంటే లండన్‌లో ఉన్నామా? అనే ఫీలింగ్ కలిగేదట. అందుకే ఆనాటి నుంచి సికింద్రాబాద్ మినీ లండన్‌గా మారింది.
 
మొదట నాలుగు కుటుంబాలు..

హిందూ, ముస్లిం సంప్రదాయాలకు క్రైస్తవం జతకలవడంతో  హైదరాబాద్ మినీ ఇండియాగా మారింది. జంటనగరాల్లో కలర్‌ఫుల్‌గా సాగే క్రిస్మస్ పండుగకు కుతుబ్ షాహీల జమానాలోనే బీజం పడింది. తన పాలన అన్ని విధాలుగా భేషుగ్గా ఉండాలని భావించిన కులీ కుతుబ్‌షా.. వైద్యుల, ఇంజినీర్ల అవసరాన్ని గుర్తించి గోవాలో స్థిరపడిన పోర్చుగీసు వారిని నగరానికి రప్పించారు. దీంతో ఆ రోజుల్లో నాలుగు క్రైస్తవ కుటుంబాలు నగరానికి వచ్చి స్థిరపడ్డాయి. వీరి పనితీరుకు మెచ్చిన గోల్కొండ రాజు మరిన్ని రంగాల్లోనూ వారి సేవలను వినియోగించుకోవాలని భావించాడు. విదేశీయులను అన్ని రకాలుగా సంతృప్తి పరిచేలా ఏర్పాట్లు కూడా చేశాడు. ప్రత్యేకంగా వంట విభాగం, వారిని ఎంటర్‌టైన్ చేసేందుకు సంగీత విభాగాలూ ఏర్పాటు చేశాడు.

ఇక్కడి మర్యాదలు నచ్చడంతో అనతి కాలంలోనే లెక్కకు మించి ఫ్రెంచ్ కుటుంబాలు నగరానికి వలస వచ్చాయి. మెరుగైన పద్ధతులతో ఒంటెలు, గుర్రాలు, ఏనుగుల సంరక్షణ కోసం సైన్య విభాగంలో వారి హవా మొదలైంది. ఇతర యూరప్ దేశాలకు చెందిన వారూ హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఇలా వచ్చిన వారికి మాతృభూమిపై మనసు మళ్లకుండా సకల సౌకర్యాలు కల్పించడంతో నగరంలో క్రైస్తవులు ప్రత్యేక అతిథులుగా మారిపోయారు. నిజాం జమానాలో బ్రిటిష్ సైన్యం వచ్చి చేరడంతో క్రైస్తవుల సంఖ్య పెరిగింది.
 
ప్రవేశం కొందరికే..

నిజాం సంస్థానంలో ఉన్న విదేశీ క్రైస్తవుల ఇళ్లల్లో పని చేసేందుకు స్థానిక క్రైస్తవులను నియమించుకునేవారు. అంతా క్రైస్తవులే అయినా స్థానికులను చిన్న చూపు చూసేవారు. అప్పట్లో నిర్మితమైన సెయింట్ మేరీస్ చర్చి, సెయింట్ జాన్స్ చర్చి, ట్రినిటి చర్చి, హోలీ ఫ్యామిలీ చర్చి.. వంటి ప్రధానమైన చర్చీల్లో తెల్లవారు మాత్రమే వెళ్లేవారు. స్థానిక క్రైస్తవులకు ప్రవేశం ఉండేది కాదు. ఈ చర్చిల్లో విదేశాల నుంచి వచ్చిన వారే మత గురువులుగా ఉండేవారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి పరిస్థితిలో మార్పు వచ్చింది. క్రమంగా స్థానికులూ ప్రధాన చర్చిల్లోకి వెళ్లడం మొదలైంది.
 
వేడుకల్లో నిజాం...

తానీషా ప్రభువు భద్రాద్రి రాముడి కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపేవారని విన్నాం. అలాంటి ఔదార్యాన్నే చివరి నిజాం కూడా ప్రదర్శించాడు. క్రిస్మస్ రోజున గన్‌ఫౌండ్రిలోని సెయింట్ జోసెఫ్, సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలకు కుటుంబంతో సహా వెళ్లేవాడట. ఈ సందర్భంగా ఓ జ్ఞాపికను కూడా చర్చీకి సమర్పించేవారట. ఆయన బహూకరించిన షాండిలియర్స్, గోడ గడియారాలు, బల్లలు.. ఇప్పటికీ ఆయా చర్చిల్లో దర్శనమిస్తుంటాయి.
 

Advertisement
Advertisement