లడకీకా పూల్..ఏ కిదర్ హై | Sakshi
Sakshi News home page

లడకీకా పూల్..ఏ కిదర్ హై

Published Mon, Nov 3 2014 10:44 PM

లడకీకా పూల్..ఏ కిదర్ హై

ఉద్యమం.. ఎప్పుడూ వినిపించేదే. కానీ.. జనం కోసం గళమెత్తినప్పుడే అందులోని గొప్పదనం.. త్యాగధనం అర్థమవుతాయి. లక్ష్యాలు అందరూ నిర్దేశించుకుంటారు.. కానీ ప్రజా మార్గాన్ని ఎంచుకొనే వారు కొందరే ఉంటారు. విద్యార్థి, యువజన నేతగా.. కార్మిక, కర్షకవర్గ ప్రతినిధిగా... భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా..ఈ మహానగరంతో స్ఫూర్తిదాయక అనుబంధం కె.నారాయణది.

ప్రాంతాలు.. కులమతాలు..రాగద్వేషాలకు అతీతంగా అందర్నీ అక్కున చేర్చుకున్న ‘భాగ్య’నగరంతో మధురస్మృతులు ఎన్నెన్నో. ప్రస్తుతం సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడైన నారాయణకు నగరంతో మూడున్నర దశాబ్దాలకు పైగా అనుబంధం. ఆ ‘జ్ఞాపకాలు’ సిటీప్లస్‌కు ప్రత్యేకం...

 
1969-70... గుంటూరులో ఆయుర్వేదం కోర్సు చేస్తున్నప్పుడు ట్రైనింగ్ కోసం చార్మినార్ జనరల్ హాస్పిటల్‌కు వచ్చా. హైదరాబాద్‌కు రావడం అదే తొలిసారి. పాతబస్తీని చూస్తే మన దేశంలో ఉన్నామా..! గల్ఫ్‌లో ఉన్నామా! అన్న సందేహం. ఎవర్ని కదిలించినా ఉర్దూలో మాట్లాడేవారు. నాకేమో ఆ భాష అస్సలు రాదు. కేఫ్‌ల్లో ఇరానీ చాయ్.. వాహ్.. అదో కొత్త టేస్ట్‌లా అనిపించేది.
 
బస్సులో గడబిడ..
ఏఐఎస్‌ఎఫ్ కరపత్రాల ప్రింటింగ్‌కు లక్డీకాపూల్ వెళ్లాలి. హిమాయత్‌నగర్‌లో బస్సు ఎక్కి.. ‘లడకీ’కాపూల్‌కు టికెట్ ఇమ్మని అడిగా. పక్కనే ఉన్న యూనివర్సిటీ అమ్మాయిలు ఘొల్లున నవ్వేశారు. కండక్టరేమో.. ‘ఏ కిదర్ హై’ అంటూ దానికి మరింత వెటకారం జోడించాడు. అప్పుడు చూడాలి నా పరిస్థితి.. సిగ్గుతో మధ్యలోనే బస్సు దిగేశా. ఇక ఉర్దూ నేర్చుకోవాల్సిందేనని డిసైడ్ అయ్యా. యూసఫ్.. మా ఆఫీస్ సెక్రటరీ.. రెస్పెక్టబుల్ కామ్రేడ్. పలకరిద్దామని.. ‘క్యా రే... కైసా రే’ అన్నా. అతనికి కోపం బుస్సున పొంగింది. అంతా నవ్వుకున్నారు. పక్కనే సురవరం సుధాకర్‌రెడ్డి భార్య విజయలక్ష్మి కూడా ఫక్కున నవ్వి... ‘నువ్వు మాట్లాడింది తప్పు’ అని చెప్పారు. విషయం అర్థమై... ఉర్దూపై ఆసక్తి పోయింది.

పోలీసుల దబిడి దిబిడి..
అంతటితోనే భాషా కష్టాలు అయిపోలేదు. ఫెడరేషన్ తరఫున తీవ్రస్థాయిలో నిరసన ప్రదర్శన చేస్తున్నాం. ‘సర్కార్ ఝూటా... పోలీస్ ఝూటా.. దోనోం మిల్‌కే దేశ్‌కో లూటా’.. ఇది మా నినాదం. దాన్ని నేను ‘దోనోం సాలే హమ్‌కో లూటా’ అంటూ అరిచా. తిక్కరేగిన పోలీసులు మీదపడి కుమ్మేశారు. నన్ను, నాతోపాటు ఉన్న మరో 50 మందిని సెల్లో వేశారు. ఆంధ్రా నుంచి వచ్చిన నాకు ఉర్దూ రాదని ఎవరో చెబితే గానీ వదల్లేదు. భాష తెలియక ఇలాంటివెన్నో తిప్పలు, తికమకలు. ఏదేమైనా... హైదరాబాద్‌లో పనిచేయడం, పర్యటనలకు వెళ్లడం వల్ల 23 జిల్లాలపై అవగాహన పెరిగింది.
 
సమావేశంపై దాడి..
తరువాత ఏఐఎస్‌ఎఫ్‌తో పరిచయం ఏర్పడింది. అప్పుడు విశాలాంధ్ర నినాదం వినిపించేందుకు హైదరాబాద్ వచ్చాం. అప్పుడిక్కడ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడుస్తోంది. మా మీటింగ్ జరుగుతుండగా, కొందరు దాడి చేశారు. 1973లో ఏఐఎస్‌ఎఫ్ రాష్ర్ట కార్యదర్శిగా ఎంపికయ్యాక మకాం నగరానికి మారింది.

అంతా కొత్తగా..
నాకేమో త్వరగా నిద్ర లేచి త్వరగా పడుకోవడం అలవాటు. గుంటూరులో ఉదయం 8కే ఉద్యమాలు చేసేవాళ్లం. ఇక్కడ లేటుగా నిద్ర లేచి లేటుగా పడుకునేవారు. 11 గంటలకు గానీ.. ఎవరూ ఆఫీసుకు వచ్చేవారు కాదు. హిమాయత్‌నగర్‌లో మా కార్యాలయానికి ఎనిమిదింటికల్లా వెళ్లి ఒక్కడినే అలా కూర్చుని ఇబ్బందులు పడేవాడిని.
 
మనస్ఫూర్తిగా... ఆప్యాయత
ఇక్కడ ఎవరింటికి వెళ్లినా కొత్తగా ఉండేది. అక్కళ్లా కాదు... లిమిటెడ్‌గా మాట్లాడేవా రు. చూడ్డానికి కాస్త గంభీరంగా ఉన్నా... మనస్ఫూర్తిగా ఆప్యాయత ఉంటుంది. మా ప్రాంతంతో పోలిస్తే ఇక్కడ ఆహారపు అలవాట్లు, పండుగలు విభిన్నం. హైదరాబాద్ వచ్చాకే నాకు రాఖీ పండుగ తెలిసింది. అలాగే హోలీ. అన్నీ ఓ సరికొత్త అనుభవాలు.
 
కూల్ క్లైమేట్..
నేను నగరానికి వచ్చిన కొత్తల్లో వాతావరణం చాలా కూల్‌గా, ఆహ్లాదంగా ఉండేది. విపరీతమైన చలి. ప్రస్తుతం బిల్డింగ్‌లు, కాలుష్యం, జనాభా విపరీతంగా పెరిగిపోయి ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నాడు ఎక్కడ చూసినా సైకిళ్లే కనిపించేవి. నేను కూడా సైకిల్‌పైనే తిరిగేవాడిని. నాటితో పోలిస్తే కనీసం 25 శాతం ఆహ్లాదకర వాతావరణం కూడా నేడు సిటీలో లేదు. 1969తో పోలిస్తే ప్రస్తుతం నగరంలో ఎన్నో మార్పులు. అన్ని ప్రాంతాల వారూ ఇక్కడి వారితో మమేకమయ్యారు.
 
..:: హనుమా
 
ఎక్కడికి పోయినా బిర్యానీనే..
నగరంలో నన్ను బాగా ఆకర్షించింది గోల్కొండ కోట. తరువాత సాలార్‌జంగ్ మ్యూజియం, ట్యాంక్‌బండ్. ఇక ఇరానీ చాయ్, నవాబ్ బిస్కట్లు, సమోసా బాగా ఇష్టం. ఎక్కడికి పోయినా బిర్యానీనే. భోజనం దొరికేది కాదు. ‘చాయ్ పౌనా’ (మీగడతో) స్పెషల్. హైదరాబాద్ బిర్యానీ, డబుల్ కా మీఠా, తెలంగాణ చారు, ఓల్డ్ సిటీలో ఖీర్.. దేనికదే ప్రత్యేకమైన రుచి. ఇప్పుడు అభివృద్ధి క్రమంలో ఇరానీ హోటళ్లు
తగ్గుతున్నాయి. ఆనాటి రుచులూ మాయమవుతున్నాయి.

Advertisement
Advertisement