ఉదయాన్ని స్వప్నిస్తూ నిదురలోకి.. | Sakshi
Sakshi News home page

ఉదయాన్ని స్వప్నిస్తూ నిదురలోకి..

Published Tue, Feb 3 2015 1:00 AM

విప్లవకారుడు, మహామనిషి 'ఎక్ చమేలీకి మండ్వే తలే (ఒక మల్లె పొద నీడలో)..' నిదురించాల్సిన కవి మగ్దూం మొహియుద్దీన్ ఇక్కడ విశ్రమించారు. - Sakshi

అమరుడైన తమ మనిషి (లెజెండ్)ని ప్రజలు కీర్తిస్తారు. ఒక వ్యక్తి జీవించి ఉండగా లెజెండ్ కావడం అరుదు. మగ్దూం అటువంటి అరుదైన వ్యక్తి ! నా జీవితకాలంలో నేను (నరేంద్ర లూథర్) చూసిన లివింగ్ లెజెండ్ మగ్దూం. ఆయన గుణగానంలో సదా పరవశిస్తాను.
 
మగ్దూం జీవితంలో సాహిత్యం-సామాజిక ఉద్యమాలు పడుగుపేకల్లా కలిసిపోయాయి. మగ్దూం కుమార్తెకు  సంధ్యారాగం ‘అసావేరి’ అని పేరు పెట్టారు. అజ్ఞాతవాసంలో ఉండగా పుట్టిన కుమారుడి పేరు ‘సెకండ్ ఫ్రంట్’ ! తర్వాత కాలంలో ‘నుస్రత్’ (విజయం) అయ్యాడు ! ఉర్దూ దినపత్రిక సియాసత్ వ్యవస్థాపకుడు అబిద్ అలీఖాన్ ఇంట్లో ఓ మరుపురాని సాయంత్రం గడిపాం. జమీలా అనే అందమైన యువతి మగ్దూం సమక్షంలో ఆయన కవితలను గానం చేస్తోంది. అప్పుడు మగ్దూం వయసు సమారు 50 ఏళ్లు. నేను 30లోకి రాబోతున్నా.. మగ్దూంలోని యవ్వన కాంతి నన్ను ఆశ్చర్యపరచింది. ఏమిటీ రహస్యం అన్నాను. ‘నీ గురించి చింతించకు. వ్యక్తిగతం కానీ మంచి విషయాల గురించి ఆలోచించు’ అని హితవు పలికారు ! మగ్దూం సలహాను శిరోధార్యంగా భావించాను. వీలైనంత వరకూ అనుసరిస్తున్నాను.
 
సంజీవయ్య ఎదుట కన్నుగీటారు..

‘మల్లె పందిరి కింద’ కవితాగానం జరిగిన కొద్ది రోజుల తర్వాత మగ్దూంను అరెస్ట్ చేయాల్సిందిగా నేను ఆదేశించాల్సి వచ్చింది. ‘చట్టం అనుమతి లేకుండా వ్యక్తులు సమావేశం కారాదు’ అనే నిబంధనను ఉల్లంఘించిన నెపంతో ! ఆదేశాలు అమలులో ఉండగానే మగ్దూం ముఖ్యమంత్రి సంజీవయ్యను కలిశారు. అక్కడే చీఫ్ సెక్రటరీ ఉన్నారు. ‘సమాజానికి పెనుముప్పు, పొంచి ఉంటే ప్రజలు కలసి మాట్లాడుకోవడం మానవత్వానికి సంబంధించిన విషయం. ఈ కనీస జ్ఞానం లేనివాడు మీ చీఫ్ సెక్రటరీ’ అని మగ్దూం చెడామడా తిట్టారు. ప్రజాసంఘాలు, నాయకుల పట్ల అవగాహన ఉన్న సంజీవయ్య, మగ్దూంను విడుదల చెయ్యండి అన్నారు. తలదించుకున్న చీఫ్ సెక్రటరీతో కరచాలనం చేస్తూ, మగ్దూం నా వైపు కన్నుగీటారు !
 
ఒక ‘బ్రహ్మానందం’!

బ్రహ్మానందరెడ్డి హయంలో ఒకసారి మగ్దూం నిరాహారదీక్షకు కూర్చున్నారు. పెరిగిన బియ్యం ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ! మగ్దూం అప్పటికే అనారోగ్యంతో ఉన్నారు. దీక్షలో పరిస్థితి విషమిస్తోంది. విరమింపజేయాల ంటే ప్రభుత్వం నుంచి హామీని రాబట్టాలి. మగ్దూం సహా రాజ్‌బహదూర్ గౌర్ మరికొందరు చర్చలకు ముఖ్యమంత్రి చాంబర్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి కమ్యూనిస్ట్‌ల పట్ల విముఖతతో ఉన్నారు. ఏవో ఫైళ్లను చూస్తున్నట్టు నటిస్తూ తల ఎత్తలేదు. మూతి బిగించిన వారితో సంభాషణ సాధ్యమా ? అప్పుడు మగ్దూం తన వాళ్లతో ‘‘బ్రహ్మానందంగా’ ఉండే వ్యక్తి కోసం కదా మనం వచ్చాం. ఇక్కడ అలాంటి వ్యక్తెవరూ లేనట్లుంది. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే ఉన్నట్లున్నారు. పోదాం పద’ అన్నారట ! ఆ మాటలకు ముఖ్యమంత్రి ‘బ్రహ్మానంద’భరితుడయ్యారు. ఉద్యమకారుల డిమాండ్లకు అంగీకరించారు. ‘రాజ్’ కూడా బ్రహ్మానందం చెందారు. పేదల కోసం విజయవంతంగా దీక్ష చేసిన మగ్దూం ఓ ముద్ద తిన్నారు మరి.
 
నెరవేర్చని వాగ్దానం

‘మగ్దూం చాచా’ అని పిలిచే రాజ్ బహదూర్ గౌర్ కుమార్తె తమారా అంటే ఆయనకు ప్రత్యేక వాత్సల్యం. ఆమెకు ఇచ్చిన ఒక వాగ్దానాన్ని మగ్దూం నెరవేర్చలేకపోయారు. 1969లో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. వి.వి.గిరి గెలిస్తే కోన్ ఐస్‌క్రీం ఇప్పిస్తానన్నారు మగ్దూం. శాసనమండలిలో సీపీఐ సభాపక్షనేతగా రాణించిన మగ్దూం పార్టీ పనులపై ఢిల్లీ వెళ్లారు. ఆగస్ట్ 25 ఉదయం రాజ్ బహదూర్‌కు ఫోన్ చేసి, నిద్రలేపారు. ఒంట్లో బాగోలేదన్నారు. మిత్రుడిని వెంటనే పంత్ హాస్పిటల్‌లో చేర్చారు గౌర్. మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆ ఒక్క సందర్భమే చాచా అన్న మాట నిలుపుకోలేకపోయారు అంటారు తమారా !
 
ఢిల్లీ నుంచి వచ్చిన మగ్దూం భౌతికకాయాన్ని సందర్శించేందుకు నగరం జనసంద్రం అయింది. అన్ని అశ్రునయనాలను నగరం ఎన్నడూ చూడలేదు. హజ్రత్ షా ఖామోష్‌లో ఖననం చేసేందుకు ఏర్పాట్లు  జరుగుతున్నాయి. ఒక అవిశ్వాసిని ఇక్కడ ఖననం చేసేందుకు ససేమిరా అంగీకరించం అన్నారు ఛాందసులు. అభ్యంతరాలను మగ్దూం అభిమానులు తోసిపుచ్చారు. ‘జిందాబాద్’ నినాదాలతో మగ్దూం భౌతికకాయాన్ని సగౌరవంగా విశ్రమింపజేశారు.  సమాధిపై ఆయన కవితా పంక్తులు శిలాక్షరాలై ఉన్నాయి..

 ‘బజ్న్ మే దూర్ వో గాతా రహా తన్హా తన్హా
 సో గయా సజ్ పర్ సర్ రఖ్ కే సహర్ సే పహెలె’

 (సమూహాలకు దూరంగా పాడుతున్నాడతడు త నువుతో తనువుతో  తంత్రిణిపై తలను చేర్చి నిదురలోకి జారాడు ఉదయానికి పూర్వమే)  హైదరాబాద్ ఎన్నో ఉదయాస్తమాలను చూసింది. నవాబులు, జ మీందార్లు, పాలకులు.. ఎందరెందరి ఉదయాస్తమాలనో చూసింది ! ఒక అనాథ బాలుడిని ఈ నగరం మగ్దూం అనే మహనీయునిగా మలచింది ! ఆ హీరోకు పలికిన వీడ్కోలుతో సరిసమానమైనది అంతకు ముందు ఆ తర్వాత నగరం ఎన్నడూ చూడలేదు. మగ్దూంలాంటి మరొకరు కనిపిస్తారా..? మగ్దూం కనిపించిన ఉదయం ఆగమిస్తుందా..?
 
 ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి

Advertisement

తప్పక చదవండి

Advertisement