అకృత్యాలకు అంతం లేదా? | Sakshi
Sakshi News home page

అకృత్యాలకు అంతం లేదా?

Published Mon, Dec 23 2013 8:26 AM

అకృత్యాలకు అంతం లేదా?

నిన్న అరుణ.. నేడు రేవతి.. రేపు ఇంకెవరో! దేశంలో అమ్మాయిల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. రెండేళ్ల పాటు ప్రేమించి, కాలక్షేం చేసి.. చివరకు పెళ్లి చేసుకొమ్మని అడిగినందుకు కిరోసిన్ పోసి తగలబెట్టేశాడో దుర్మార్గుడు. ఈ దారుణం నల్లగొండ జిల్లాలో జరిగింది. ఆ సంఘటనలో తీవ్రంగా గాయపడిన బీటెక్ విద్యార్థిని అరుణ.. హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అసువులు బాసింది. ఇక మూడు నాలుగు రోజుల్లో పెళ్లి ఉందనగా, ఇంకా కాళ్ల పారాణి పెట్టుకోక ముందే, పట్టుబట్టలు కట్టుకోకముందే కాటికి పంపేశాడో నీచుడు. ప్రేమిస్తున్నానని వేధించాడు. కాదు, నేను చదువుకుంటున్నానని ఆమె తిరస్కరించింది. పెద్దలు కూడా మందలించారు. ఈలోపు ఆమెకు పెళ్లి కుదిరింది. అంతే, అతడిలోని రాక్షసుడు నిద్రలేచాడు. ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని, ఇంటికి వెళ్లి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈమె కూడా బీటెక్ విద్యార్థినే.

ఈ ఇద్దరు అమ్మాయిల ఉదంతాలు ఒకే సమయంలో.. ఒకేలా చోటుచేసుకున్నాయి. రోడ్డుమీదకు అమ్మాయి వెళ్లిందంటే ఎలా తిరిగొస్తుందోనని తల్లిదండ్రులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని భయపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారి మానప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. కంటికి కాస్త నదురుగా కనపడితే చాలు.. ప్రేమిస్తున్నామంటూ వెంటపడుతున్నారు. కొంతమంది దాన్ని నిరాకరిస్తుంటే, మరికొందరు అమాయకంగా ఆ వలలో పడిపోతున్నారు. ఏం చేసినా చివరకు మాత్రం వారి కథలు విషాదాంతాలే అవుతున్నాయి. పాపం అరుణ, రేవతి ఆస్పత్రులలో నాలుగైదు రోజుల పాటు నరకయాతన అనుభవించారు. దాదాపు 60-70 శాతం వరకు శరీరంపై కాలిన గాయాలు అయినప్పుడు ఎంత నరకం అనుభవిస్తారో!! కాకినాడ ఆస్పత్రిలో రేవతి పెట్టిన కేకలు ఇప్పటికీ ఆ తల్లిదండ్రుల గుండెల్లోనే కాదు.. చూసిన ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.

ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా అంతా అయిపోయిన తర్వాత నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామంటూ చెబుతున్నారు తప్ప.. వీటిని నిరోధించడానికి చర్యలు తీసుకున్న పాపాన పోవట్లేదు. పెప్పర్ స్ప్రేలు, లేజర్ గన్నుల్లాంటివి వచ్చాయని చెబుతున్నా.. అవి ఎంతమందికి అందుబాటులో ఉంటున్నాయో ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ తల్లిదండ్రుల కడుపుకోతను ఎవరు తీరుస్తారు? చిన్నపిల్లలని కూడా చూడకుండా కామాంధులు కాటేస్తుంటే.. ఈ యంత్రాంగం మాత్రం కుంభకర్ణుడి వారసత్వం తీసుకుంటోంది. దేవుడా రక్షించు ఈ దేశాన్ని.. కామాంధుల నుంచి.. ప్రేమ ముసుగులోని కాళ రాక్షసుల నుంచి!!

Advertisement

తప్పక చదవండి

Advertisement