షేక్హ్యాండ్ కలిపింది ఇద్దరినీ.. | Sakshi
Sakshi News home page

షేక్హ్యాండ్ కలిపింది ఇద్దరినీ..

Published Sat, Aug 2 2014 9:06 PM

షేక్హ్యాండ్ కలిపింది ఇద్దరినీ.. - Sakshi

నిన్నటి వరకు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. విద్యుత్ పీపీఏలతో మొదలైన గొడవ.. ఫీజు రీయింబర్స్మెంట్ వరకు అనేకాంశాల్లో కొనసా..గుతూనే ఉంది. తెలుగు మాట్లాడేవాళ్లకు ఉన్న సమైక్య రాష్ట్రం కాస్తా రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ కలుసుకుంటే ఒట్టు. గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు చంద్రబాబు హాజరైనా.. కేసీఆర్ మాత్రం డుమ్మా కొట్టారు.

చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరూ వాస్తవానికి పాతమిత్రులే. ఎన్టీఆర్ హయాం నుంచి వారిద్దరూ తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసినవాళ్లే. తర్వాత కేసీఆర్ బయటకు రావడం, టీఆర్ఎస్ స్థాపించడం, రాష్ట్ర సాధన ఉద్యమం.. ఇలా ప్రతి దశలోనూ ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.

అయితే.. శనివారం మాత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన వీరిద్దరినీ చాలాకాలం తర్వాత కలిపింది. నల్సార్ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా వచ్చారు. వీరిద్దరినీ ఒకేచోట చూసిన గవర్నర్.. ఊరుకోకుండా ఇద్దరి చేతులు కలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసిన సందర్భంగా గవర్నర్ నరసింహన్తోపాటు ముగ్గురూ ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు. చంద్రబాబు నాయుడు కేసిఆర్ భుజం తట్టి నవ్వుతూ మాట్లాడారు.

చంద్రబాబు నాయుడు, కేసిఆర్లను కలపడంలో గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇద్దరి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం చేకూర్చడానికి  వెంకయ్య నాయుడు హైదరాబాద్ వచ్చారు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఆయన విడివిడిగా కలిశారు. ఆ తర్వాత వీరిద్దరూ ఇలా కలవడం శుభసూచకంగా భావిస్తున్నారు.

Advertisement
Advertisement