పోల‘వరమా’? ‘పట్ట్టు’సీమా? | Sakshi
Sakshi News home page

పోల‘వరమా’? ‘పట్ట్టు’సీమా?

Published Fri, Apr 10 2015 1:34 AM

యెర్నేని నాగేంద్రనాధ్

 విశ్లేషణ
 
 పట్టిసీమ నుంచి గోదావరి నీరు కృష్ణాకి చేరేది పోలవరం కుడి కాలువ ద్వారానే. దానిలో 43.5 కిలోమీటర్ల భాగం తవ్వకం జరగాలి. హైకోర్టులోని రైతుల దావాలు తేలి 1,820 ఎకరాల భూసేకరణ జరగాలి. అదిగాక అటవీ, గిరిజన భూముల సేకరణ జరగాలి. కనీసం రూ. 400 కోట్ల నిధుల కొరత పూడాలి. ఇవన్నీ జరిగితేనే కాలువ పని మొదలయ్యేది. అది పూర్తికానిదే పట్టిసీమ నీరు కృష్ణానదికి చేరడం అసాధ్యం. సత్వరమే గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తామనే వారు ఈ విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు?
 
 పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టులపై ప్రస్తుతం వాదోపవా దాలు సాగుతున్నాయి. పోలవరానికి అధిక నిధులను కేటాయించి నాలుగేళ్ల లోనే దాన్ని పూర్తి చేయాలని అన్నిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తు న్నాయి. మరోవంక పట్టిసీమ ఎత్తిపోతలతో ఆరునెల్లలోనే గోదావరి వరద నీటిని కృష్ణానదికి తరలిస్తామని, తద్వారా నాగార్జునసాగర్‌లో ఆదా అయ్యే నీటిని శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు ప్రాజెక్టులను కలిపి పరిశీలించాల్సి ఉంది. మొదటి నదుల అనుసంధాన ప్రాజెక్టయిన పోలవరం ఏపీకి జీవనాడి. దాని అంచనా వ్యయం రూ.16,060 కోట్లు. ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.5,150 కోట్లు. కుడి కాల్వలో 70%, ఎడమ కాల్వలో 65%, హెడ్ వర్క్స్‌లోని స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్ పనులలో 10%, శాడిల్ డామ్‌లు, సొరంగాలలో 80% పనులు పూర్తయ్యాయి. కేంద్రం, దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ప్రాజెక్టు అథారిటీని కూడా ఏర్పాటు చేసింది.  

 ఏటా వర్షాకాలం 120 రోజులలో 85 రోజులు గోదావరి వరద నీరు లక్షలాది క్యూసెక్కులు సముద్రం పాలవుతుంది. ఆ నీటిని నిల్వ చేసి వరద లేని రోజులలో ఆ ప్రాంతాల తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చ డంతోపాటూ, కృష్ణానదికి 80 టీఎంసీల నీటిని తరలించే చిట్టచివరి రిజర్వా యరే పోలవరం. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానమే ఈ ప్రాజెక్టులోని ప్రధానాంశం. తద్వారా 80 టీఎంసీల నీరు కృష్ణాకు చేరుతుంది. కాబట్టి నాగా ర్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదల ఆగిపోతుంది. ఇలా ఆదా అయిన నీటిలో 35 టీఎంసీలను ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలూ, 45 టీఎంసీలు తెలంగాణ, రాయలసీమలూ వినియోగించుకునేట్టు 1978లో త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. దీనిని 1980నాటి బచావత్ అవార్డు తుది తీర్పులో పొందుపరచారు. ఇప్పుడు పట్టిసీమ ఎత్తిపోతలతోనే 80 టీఎంసీల నీటి తరలింపు లక్ష్యం నెరవేరుతుండగా ఇంకా పోలవరం ప్రాజెక్టు అవశ్యకత ఏమిటని దాన్ని వ్యతిరేకిస్తున్న వారి ప్రశ్న. పోలవరం కుడి కాల్వలోకి పట్టి సీమ పథకం ద్వారా నీటిని తరలిస్తున్నట్టే, మరో ఎత్తిపోతల ఏర్పాటుతో విశాఖ అవసరాలు తీర్చుకోవచ్చని సూచిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం పోలవరం పూర్తయ్యేలోగానే తక్షణమే పట్టిసీమతో గోదావరి వరదజలాలను వినియోగంలోకి తెస్తామంటున్నది. కానీ దానివల్ల ఇప్పటికే అంతరాష్ట్ర, పర్యావరణ వివాదాలలో ఉన్న పోలవరం ఆగిపోయే పరిస్థితి వస్తుందనేది ఎందుకు పట్టడం లేదు?

 కాల్వ లేకుండానే పట్టిసీమ జలాల పరుగులా?
 పోలవరం దిగువన పట్టిసం వద్ద గోదావరి జలాలను 24 పంపులతో తోడి 3.2 మీటర్ల వ్యాసం గల పైపుల ద్వారా 4.5 కిలోమీటర్ల దూరంలోని పోల వరం కుడికాల్వలోకి చేరుస్తారు. ఇందుకు 150 మెగావాట్ల విద్యుత్తు అవస రం. ఆ భూసేకరణను రైతులు వ్యతిరేకిస్తున్నారు. పట్టిసీమ నుంచి గోదావరి నీరు కృష్ణాలోకి చేరేది పోలవరం కుడికాల్వ ద్వారానే. 174 కిలోమీటర్ల పొడ వైన ఈ కాల్వలో ఇంకా 43.5 కిలోమీటర్ల భాగం తవ్వకం జరగాలి. అందుకు 1,820 ఎకరాల భూసేకరణ జరగాలి. అది జరగాలంటే హైకోర్టులో ఉన్న రైతుల దావాలు తేలాలి. అటవీ, గిరిజన భూముల సేకరణ కూడా జరగాలి. ఇవన్నీ జరిగితేనే పని మొదలయ్యేది. ఈ కాలువ పూర్తికానిదే పట్టిసీమ నీరు కృష్ణానదికి చేరడం అసాధ్యం. 6 నుంచి 9 నెలల్లోనే గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తామనే వారు ఈ విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? కుడికాల్వ వ్యయం రూ. 2,441 కోట్లని ప్రాథమిక అంచనా. ఇప్పటివరకు వ్యయం రూ. 1,345 కోట్లు. ఇంకా రూ. 1,800 కోట్లు కావాలి. పట్టిసీమకు రాష్ట్ర బడ్జెట్ ఇచ్చిన రూ. 257 కోట్లకు తోడు కేంద్ర ప్రభుత్వ ఏఐబీపీ నిధులు రూ. 850 కోట్ల నుంచి రూ. 775 కోట్లను కేటాయించారు. మొత్తం రూ.1,032 కోట్లు. ప్రాజెక్టు వ్యయం 22% పెరిగి రూ. 1,450 కోట్లకు పెరిగింది. మిగతా రూ. 400 కోట్లూ లేకుండానే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా? కుడి కాల్వ పూర్తి కాకుం డానే పట్టిసీమ నీరు కృష్ణాకు, తర్వాత రాయలసీమకు చేరుతుందా?

 ప్రాజెక్టు లక్ష్య సాధన సంగతెలా ఉన్నా పంట పొట్ట మీదున్న కీలక దశలో నీటి కొరత ఏర్పడుతుందని గోదావరి డెల్టా వారూ, ఇటు పట్టిసీమ నీరు పారక, అటు సాగర్ నుంచి నీరు విడుదలకాక కృష్ణా డెల్టావారు తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా అవుతుందని ఆందోళన చెందడం సమంజసం కాదా? గోదావరి నీటి మళ్లింపు జరిగినా, జరగకపోయినా పట్టిసీమలో పం పింగ్ ప్రారంభం కాగానే బచావత్ అవార్డు ప్రకారం ఎగువ రాష్ట్రాలు 65 టీఎంసీలను అదనంగా వినియోగిస్తే నష్టపోయేది సీమవాసులే. అందుకే పోలవరం కల సాకారమౌతుందని ఆశలు పెట్టుకున్నవారంతా పట్టిసీమ, పోలవరానికి అడ్డంకి అవుతుందని భయాందోళనలకు గురవుతున్నారు.
 పట్టిసీమ లేకుండానే సీమకు నీరు సాధ్యం

     1.    కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కుడి కాల్వ ఆయకట్టులో కేటాయింపుల కన్నా అధిక నీటి వినియోగాన్ని తగ్గించి నీరు ఆదా చేయవచ్చు. అలాగే పులిచింతలలో 40 టీఎంసీల పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయొచ్చు. జాతీయ జలరవాణా మార్గం 4లో భాగం, గోదావరి-కృష్ణా అనుసంధా నమైన ఏలూరు కాల్వల ద్వారా 20 టీఎంసీల గోదావరి నీటి తరలింపు నకు ప్రాధాన్యత ఇస్తే సీమకు నీరందించొచ్చు.
     2.    రాయలసీమకు నీటిని తరలించే పోతిరెడ్డిపాడు ప్రధాన కాల్వతోపాటు, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా కాల్వలు, నిప్పులవాగులలో ప్రవాహాలకున్న అడ్డంకులను తొలగించి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఇప్పటికంటే రెట్టింపు నీటిని సీమకు తరలించవచ్చు.
     3.     }Oశెలం రిజర్వాయర్లో నీటిమట్టం 854 అడుగులకు పైగా ఉంటేనే పోతి రెడ్డిపాడు ద్వారా సీమకు కృష్ణా జలాలు అందుతాయి. గత ఏడేళ్లలో (2008- 2015) సగటున ఏడాదిలో 198 రోజులు నీటిమట్టం 854పైనే ఉంది. పోతిరెడ్డిపాడు పాత, కొత్త రెగ్యులేటర్ల నీటి విడుదల సామర్థ్యం 55.5 టీఎంసీలు. కానీ అత్యధికంగా జరిగిన నీటి విడుదల 14 వేల క్యూసెక్కులు! దీనికి ప్రధాన కారణం పోతిరెడ్డిపాడు- బనకచర్ల ప్రధాన కాల్వను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకపోవటమే.

     4.     అలాగే తెలుగుగంగ కాల్వల ద్వారా బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్‌కు నీరు చేరటం లేదు. శ్రీశైలం కుడికాల్వ, గాలేరు-నగరి కాల్వల పరిస్థితీ అంతే. గోరకల్లు, అవుకు, గండికోట రిజర్వాయర్లు పూర్తికాలేదు. హం ద్రీ-నీవా కాల్వకు సిమెంటు లైనింగ్ చేయలేదు. కృష్ణా నుంచి పెన్నాకు, అక్కడి నుంచి సోమశిల, కండలేరుకు నీరు చేర్చే నిప్పులవాగు ప్రవాహ వాగు సామర్థ్యం పెంచలేదు. దీనిపై నిర్మించిన నాలుగు విద్యుత్ కేంద్రాల డ్యామ్‌లు నీటి ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా మారాయి. నీరున్నా  తీసుకోలేని దుస్థితి. పోలవరం పూర్తయ్యేలోగానే సీమకు నీరు అందించాలన్న చిత్త శుద్దే ఉంటే ప్రభుత్వం ఈ అడ్డంకులను తొలగిం చడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేగానీ అసాధ్యమైన తక్షణ లక్ష్యాలతో భారీ ప్రాజెక్టు పట్టిసీమ కోసం పట్టు ఎందుకు? కోరికోరి పోలవరానికి అడ్డంకులు సృష్టించడమెందుకు?

 పాలకుల పంతాలు... ప్రజలకు సంకటాలు
 రాష్ట్ర విభజన తర్వాత నీటి కష్టాలు పెరిగాయి. ఈ ఏడాది కూడా కృష్ణానదికి వరదలొచ్చాయి, జలాశయాలు నిండాయి. 73 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులకుపైగా ఉంటేనే సీమకు నీరు అందుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ఏలికల మధ్య పంతాలు, పట్టింపులతో జల వివాదాలు ముదిరాయి. తెలంగాణ తమకు చెందిన శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి వేలాది క్యూసెక్కుల నీటిని సాగర్‌లోకి విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను, రివర్ బోర్డు ఆదేశాలను కూడా ఖాతరు చేయక శ్రీశైలం నీటి మట్టాన్ని తాజాగా 800 అడుగులకు తగ్గించింది. మరోవంక నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 3 లక్షల ఎకరాలు, కుడికాల్వ కింద గుంటూరు జిల్లాలో 50 వేల ఎకరాలు, డెల్టాలో 75 వేల ఎకరాలు అనుమతులు లేని దాళ్వా వరి సాగు జరిగింది. ఈ అనుమతులు లేని సాగుకు నీరు అందించ డంలో ఇద్దరు ముఖ్యమంత్రులకూ అంగీకారం కుదిరింది. ఇలా సాగర్ నుంచి నిత్యం 20 నుంచి 25 వేల క్యూసెక్కుల నీటి వినియోగం వలన కనీస నీటి మట్టం (ఎండీడీయల్) 510 అడుగుల కన్నా దిగువనున్న నీటిని వాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

 బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో రాబోయే ఏడాదికి ముందస్తుగా వాడు కోవడానికి అవసరమైన 150 టీఎంసీల నీటిని క్యారీ ఓవర్‌గా శ్రీశైలం, నాగా ర్జునసాగర్‌లలో నిల్వ ఉంచుకోవాలని సూచించారు. క్యారీ ఓవర్‌గా ఉం చాల్సిన 150 టీఎంసీలను గురించి ఏ మాత్రం ఆలోచించకుండా మొత్తం జలాశయాలన్నీ ఖాళీ చేయడం దురదృష్టకరం. పులిచింతల కృష్ణా డెల్టా మొదటి పంటకు ముందుగా నీరందించే ప్రాజెక్టు. కానీ ఆ నీరూ వాడేశారు. రాబోయే నెలల్లో తాగునీటికి, నారుమళ్లకు నీరు ఎలా ఇస్తారు? ఇప్పటికే శ్రీశైలం, సాగర్‌లో పూడిక వలన 189 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాం. ఈసారి కూడా ఆలస్యమైతే కృష్ణా డెల్టాలోని 12 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకమే కదా?  నీటి దుర్వినియోగాన్ని అరికట్టి, చట్టబద్ధంగా నీటి కేటాయింపులున్న వారికి, దుర్భిక్ష ప్రాంతాల తాగునీటి అవసరాలకు ప్రాధా న్యాన్నిచ్చే విధంగా రెండు ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరిస్తే రెండు రాష్ట్రాల రైతులకు, ప్రజలకు కొంత మేరకైనా ప్రయోజనం. కేటాయింపులకు మించి అధిక నీటి వినియోగం జరుగుతున్న కృష్ణా, గోదావరి డెల్టాల నుంచి, సాగర్ ఆయకట్టు తదితరాల నుంచి 80 నుంచి 100 టీఎంసీల నీరు ఆదా చేసి తీరాలి. ఆ నీటిని దుర్భిక్ష ప్రాంతాల తాగునీటికి, చెరువులు, జలాశయాలు నింపుట ద్వారా భూగర్భ జలాల పెంపుదలకు వినియోగించాలి. కాబట్టి ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా పట్టిసీమపై పట్టుదలను వీడి, పోలవరం కుడి, ఎడమ కాల్వలను, ప్రాజెక్టును పూర్తి చేయుటకు ప్రాధాన్యం ఇవ్వాలి. పట్టిసీమపై పట్టుదలకు పోతే రాష్ట్ర ప్రయోజనాలకు తీరని నష్టం తప్పదు. దీనికి ఖర్చు చేసే రూ. 1,600 కోట్లు సీమ ప్రాజెక్టులలో అత్యవసర పనులకు వెచ్చించి, రాయలసీమ ప్రయోజనాలను కాపాడాలని రైతాంగ సమాఖ్య డిమాండ్ చేస్తోంది.

 పట్టిసీమపై పట్టువీడి, పోలవరం పూర్తి చేద్దాం!
 రాష్ట్ర ప్రయోజనాలను కాపాడదాం!
  (వ్యాసకర్త  ‘రైతాంగ సమాఖ్య’ అధ్యక్షులు ఫోన్ నం: 98495 59955)

Advertisement
Advertisement