ఇసుకేస్తే రాలిన చిత్రాలు | Sakshi
Sakshi News home page

ఇసుకేస్తే రాలిన చిత్రాలు

Published Wed, Dec 17 2014 11:56 PM

ఇసుకేస్తే రాలిన చిత్రాలు - Sakshi

మీ పేరు విభిన్నంగా ఉందే.. ఆ పేరుకి ఏమిటి అర్థం? అని  అడిగితే  ‘నా పేరు కాంత్.రిసా అనే పదం నచ్చి  పేరుకి  చివర తగిలించుకున్నా’నంటాడు. పెరిగిన గడ్డం, తలపాగాతో ఒక మతానికి చెందిన వ్యక్తిగా కనిపించే ఈ మూడుపదుల వయసున్న మహబూబ్‌నగర్ జిల్లా తెలుగు యువకుడు.. చిన్నప్పటి నుంచీ తలపాగా అలవాటనీ, ఇప్పటి దాకా గడ్డం, మీసం కత్తిరించిందే లేదనీ వివరిస్తాడు. నిన్నటికి విలువివ్వని,రేపనేది  నమ్మనని, నేటిని మాత్రమే నిజమని భావిస్తాననే కాంత్‌రిసా..  వ్యక్తిగా విచిత్రుడు. గుప్పెడు ఇసుక రేణువుల సాక్షిగా.. గుర్తుండిపోయే కథలను గుప్పించే స‘చిత్ర’గుప్తుడు.
 
..:: ఎస్.సత్యబాబు

 
‘ఎక్కడ ఉంటారు అనడిగితే ఏం చెబుతా? ఇప్పుడిక్కడున్నా. రేపెక్కడుంటానో...’ అంటూ అర్థం కానట్టు మాట్లాడే కాంత్‌రిసా.. మాటలకీ చేతలకీ ఏ మాత్రం వ్యత్యాసం ఉండదు. రాష్ట్రంలో శాండ్ ఆర్ట్‌కి ఒక ప్రత్యేకమైన ఇమేజి తీసుకొచ్చిన ఆయన ఎక్కడుంటాడో తెలియకపోయినా.. ఆయన చేతిలో ఇసుక సంచీ నుంచి తమ కోసం ఒక చక్కని కథ నేల రాలుతుందని చాలా మందికి తెలుసు.
 
బ్యూటీ ఆఫ్ బీయింగ్ స్పాంటేనియస్..

‘ప్లానింగ్ అంటే ఇష్టం ఉండదు. ఏ ప్రదర్శనలో పాల్గొన్నా అప్పటికప్పుడు వాళ్లు చెప్పిన ఈవెంట్‌కు అనుగుణంగా స్టోరీ అల్లుకుని అక్కడ చిత్రరూపం ఇచ్చేస్తా. అంతే’ అని చెప్పారు కాంత్. జేఎన్టీయూ ఫైనార్ట్స్ విద్యార్థిగా డ్రాప్ అవుట్ అయిన ఆయన.. అనుకోకుండా ఇసుకతో వి‘చిత్రాల’ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. అలా అలా ఇసుక చిత్రావళిని దేశవ్యాప్తం చేశారు.

తెలుగు రాష్ట్రాలలోనే ఇసుక చిత్రాలతో కథలు చెప్పడం అనే అంశంలో తనదైన ప్రత్యేకతను సాధించారాయన. సిటీలో ఒకసారి హెమిటాలజీ మీద జరిగిన డాక్టర్ల సదస్సులో శాండ్ ఆర్ట్ ద్వారా మదర్ అండ్ చైల్డ్‌ని ప్రదర్శించారు. బిడ్డకు రక్తాన్ని పంచే తల్లి వ్యాధుల్ని పంచాలనుకోదు అంటూ సందేశాన్ని కూడా సంధించి, వినోదం కోసమే ఈ షో అనుకున్న అహూతులను విస్మయానందంలో ముంచారు. అయితే అవేవీ ముందస్తు ప్లాన్‌తో చేసినవి కావనీ, అప్పటికప్పుడు అల్లుకున్నవే అంటున్న కాంత్.. స్పాంటేనియస్‌గా జీవించడంలో ఉన్న ఆనందం మరెందులోనూ తనకు కనపించదంటారు.
 
శాండ్ త్రూ కొరియర్..


కార్పొరేట్ కంపెనీల కార్యక్రమాలు, సిటీ ఈవెంట్లు, కళాశాలలు, యూనివర్సిటీలు.. ఇలా కాంత్‌రిసా కాలు మోపని, ఇసుక రాల్చని వేదికలు లేవనే చెప్పాలి. కొన్నేళ్లుగా దేశ విదేశాల్లో శాండ్ ఆర్ట్‌ని ప్రదర్శిస్తున్న కాంత్... తన ప్రతి ప్రదర్శనకి కనీసం కిలోన్నర ఇసుక అవసరం అని చెప్పారు. రోడ్‌సైడ్ మట్టిని దోసిళ్లతో పోసుకుంటుంటే నవ్వే నోళ్లు, పిచ్చోడిని చూసినట్టు చూసేకళ్లు తననేమీ కదిలించలేవంటారు. ఎయిర్‌పోర్ట్‌లో ఒకసారి ఆయన తీసుకెళ్లే ఇసుక సంచీ మీద ఎడతెగని సందేహంతో 4 గంటల పాటు  శోధించారట.. ఈ అనుభవం తర్వాత  ఇసుకని అవసరాన్ని బట్టి కొరియర్‌లో పంపుతున్నా అని చెప్పారాయన.

 ‘కొన్ని ‘షో’లకు సొంత ఖర్చులు పెట్టుకుని వెళ్లిన రోజులున్నాయి. డబ్బు ముఖ్యం కాదు. నా రోజువారీ అవసరాలు తీరిపోయిన తర్వాత నాకు డబ్బుతో పని ఉండదు. డబ్బు అనేదాన్ని జీవిత ప్రాధామ్యాల్లో నుంచి తీసేసి చూడండి. అప్పుడు ఎవరితోనైనా కలసి పనిచేయగలుగుతాం’ అంటారు కాంత్. ‘నా ఆర్ట్‌ని డస్ట్ ఆర్ట్ అనండి. శాండ్ ఆర్ట్ అనొద్దు. బియ్యపు పిండితో కూడా చిత్రాలు వేయవచ్చు. అవన్నీ మాధ్యమాలే తప్ప వాటి పేరుతో ఆర్ట్‌ని పిలవకూడదు’ అని సూచిస్తున్న ఈ వి‘చిత్ర’కారుడు త్వరలో ఒక సినిమా తీయబోతున్నాని చెబుతున్నాడు.

అయితే అది హిట్టా ఫట్టా అని కాక తనకు నచ్చిన కోవలో తీస్తున్నానని, దాని ఫలితంతో తనకు పనిలేదని చెప్తున్న కాంత్‌రిసా దీనికి సిద్ధపడిన ఓ నిర్మాత కూడా దొరికాడన్నారు. ప్రస్తుతం జీవిస్తున్న క్షణ మే చివరిది అన్నట్టు ఉండడమే తనకు ఇష్టం అని చెప్పే కాంత్.. శాండ్‌తో మాత్రమే కాదు అన్ని రకాల చిత్రాలను గీయడంలో సిద్ధ‘హస్తులే’.
 

Advertisement
Advertisement