రామరాజ్యం | Sakshi
Sakshi News home page

రామరాజ్యం

Published Tue, Apr 8 2014 1:54 AM

రామరాజ్యం

రాముడు మంచి బాలుడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అందరినీ చిరునవ్వుతో పలుకరిస్తాడు. ‘రామం’ అంటేనే ఆనందమని అర్థం కదా! అలాగే ఉంటాడు. ఆయనలో ఈర్ష్య, అసూయ, గర్వం వంటివి మచ్చుకైనా లేవు. ఎవరైనా ఉపకారం చేస్తే సంతోషిస్తాడు. అపకారం చేస్తే, పోన్లే, వాడి పాపాన వాడే పోతాడనుకుంటాడు. చప్పున ఆయనకు కోపం రాదు. వచ్చిందా అది కాలాగ్నే. ధర్మమూర్తి. తాను ధర్మం తప్పడు. ఇతరులను తప్పనివ్వడు. అలాంటి రాముడికి దశరథుడు పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ప్రజాభిప్రాయం కూడా తెలుసుకోవాలని పెద్దసభ ఏర్పాటు చేశాడు.

అందరూ వచ్చారు. దశరథ మహారాజు ఏమి చెబుతాడోనని ఎదురు చూస్తున్నారు. రాజుగారు సభ ముందుకు వచ్చి ‘నేను పెద్దవాడినయ్యాను. రాజ్యం చేయలేకుండా ఉన్నాను. మీరంతా అంగీకరిస్తే నా పెద్దకుమారుడు రాముడిని పట్టాభిషిక్తుడిని చేయాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం కూడా చెప్పండి’ అన్నారు. అలా అనడమే తడవు. అయోధ్యవాసులంతా ఆనందంతో చప్పట్లు చరిచారు. ‘రాముడే మా దేవుడు. ఎప్పుడెప్పుడాయన సింహాసనం ఎక్కుతాడా అని మేమంతా ఎదురుచూస్తున్నాం. దయగల తండ్రి. మమ్మల్ని ఆయనే పాలించాలి’ అన్నారు. ఆ మాటలకు దశరథుడు సంతోషించాడు. ‘కానీ, మీరంతా రాముడే ప్రభువు కావాలని ఎందుకు కోరుకుంటున్నారో చెప్పండి. నా పాలన మీకు నచ్చడం లేదా?’ అని అడిగాడు
 
‘ఎప్పుడు ఎదురుపడ్డా చిరునవ్వుతో పలకరిస్తాడు. మా యోగక్షేమాలు విచారిస్తాడు. మాకు కష్టం వస్తే ఆదుకుంటాడు. సంతోషం కలిగితే ఆనందిస్తాడు. ప్రజలను ఎలా పాలించాలో ఆయనకు బాగా తెలుసు. తప్పు చేస్తే శిక్షిస్తాడు. ఒప్పు చేస్తే మెచ్చుకుంటాడు. ఆయన ఏలుబడిలో మాకు సుఖసంతోషాలు, రక్షణ లభిస్తాయన్న నమ్మకం మాకుంది. అతడే మాకు రాజు’ అన్నారు.
 దశరథుడు ఆనందపడ్డాడు. కొడుకును దగ్గరకు పిలిచి ‘రామా! అయోధ్యవాసులందరికీ నువ్వంటే ఎంత ప్రేమో చూశావుగా, నీ సుగుణాలకు మెచ్చి, నిన్ను రాజుగా కోరుకుంటున్నారు. ఇంకా వినయం నేర్చుకో, కోపతాపాలను పూర్తిగా విడిచిపెట్టు. కోశాగారాన్నీ ఆయుధాగారాన్నీ ఎప్పుడూ సమృద్ధిగా ఉంచుకో. పెద్దల్నీ పిల్లల్నీ మిత్రుల్నీ సంతోషపెడుతూ ఉండు. యజ్ఞయాగాలు చేస్తూ ఉండు. ప్రజలను చక్కగా పాలించడం కన్నా ఏదీ ముఖ్యం కాదు. గుర్తుంచుకో’ అని కొడుకును గుండెలకు హత్తుకున్నాడు.
 తండ్రిని సత్యసంధుడిని చేసేందుకు రాముడు రాజ్యాన్ని త్యజించాడు.

అరణ్యాలకు వెళ్లాడు. అప్పుడు అయోధ్య కన్నీరుమున్నీరైంది. రాముడు అయోధ్య వదిలి వెళ్లాక ఎవరి ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. ఆకలి లేదు, అన్నం లేదు, వ్యవసాయం లేదు, వ్యాపారం లేదు, పండగ లేదు, పబ్బం లేదు. రాముడిని వెనక్కి తీసుకురాలేకపోయినందుకు భర్తల్ని భార్యలు అసహ్యించుకున్నారు. ‘ఛీ!  పాడు బతుకు. మా రాముడే లేకపోయాక ఈ ఇళ్లెం దుకు, వాకిళ్లెందుకు, భోగమెందుకు, భాగ్యమెందుకు?’ అని గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. అయోధ్యలో ప్రజలంతా ఇలా ఉంటే పశువులదీ ఇదే పరిస్థితి. పాలివ్వడం మానేశాయి. అయో ధ్య అంతా దీనంగా తయారయింది. బీడు పడ్డట్టుగా ఉంది. ఇదీ పాలకులకూ ప్రజలకూ మధ్య ఉండాల్సిన ప్రేమ బంధం.
 -ప్రయాగ రామకృష్ణ
 
 

Advertisement
Advertisement