చిన్న రైతుకు చేదోడు | Sakshi
Sakshi News home page

చిన్న రైతుకు చేదోడు

Published Mon, Mar 31 2014 2:12 AM

చిన్న  రైతుకు  చేదోడు - Sakshi

దుక్కితోపాటే విత్తనం/ఎరువు వేసే పరికరానికి
 రూపకల్పన చేసిన ఇంజనీరింగ్ కాలేజీ  


 ఇసుక, తువ్వ, తేలిక నేలల్లో కాలికి గట్టి మట్టి పెళ్ల తగలదు. కానీ, ఎంత ఇసుక భూములైనా పంటలు సాగు చేయాలంటే దుక్కి చేయకతప్పదు కదా. ఈ భూములను విస్తారంగా సాగుచేసే పెద్ద రైతులైతే ట్రాక్టర్‌తో దుక్కి చేసుకొని విత్తనం వేసుకుంటారు. కానీ, పావెకరం, అరెకరం, ఎకరం సాగు చేసుకునే బక్క రైతుకు ట్రాక్టర్ అద్దె చెల్లించడం భారమే. కాడెద్దుల కోసం అక్కడా ఇక్కడా వెతుక్కోవాల్సిన పరిస్థితి. అరక కూడా అవసరమైన రోజు దొరుకుతుందన్న నమ్మకమూ లేకుండా పోయింది.

ఈ ఇబ్బందుల్లేకుండా ఇసుక, తువ్వ నేలల్లో పంటలు సాగు చేసే రైతు తనంతట తాను దుక్కి చేసుకోవడంతోపాటు విత్తనం వేసుకునేందుకు ఉపయోగపడే పరికరం అందుబాటులో ఉంటే.. ఎంత బాగుంటుంది? ఇంధనం అవసరం లేకుండా.. మరో మనిషి అవసరం కూడా లేకుండా కావాలనుకున్నప్పుడు, ఒక్కరే సులభంగా వ్యవసాయ పనులు నిశ్చింతగా చేసుకోగలిగితే.. ఎంత బాగుంటుంది? ఈ ప్రశ్నల్లోంచే చిన్న రైతుకు చేదోడుగా నిలిచే పరికరం రూపొందింది. ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. లక్ష్మణరావు మార్గదర్శకత్వంలో బీటెక్ విద్యార్థులు పి.రవిచంద్ర, వై. శివకిరణ్ ఈ పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని తొలుత రెండు సైకిళ్లను వినియోగించి తయారు చేశారు. ఇద్దరు మనుషులు నడపాల్సి ఉండడం, ఇతరత్రా సమస్యల వల్ల అది విజయవంతం కాలేదు. ఆ తర్వాత రెండు సైకిల్ చక్రాలతో కూడిన పరికరానికి విజయవంతంగా రూపుకల్పన చేశారు.

రైతులు సంతృప్తిని వ్యక్తం చేయడంతో పేటెంట్‌కు దరఖాస్తు చేయడానికి డా. లక్ష్మణరావు సిద్ధమవుతున్నారు. దీనిపైన పెట్టుకొని 50 కిలోల బరువును కూడా పొలానికి తీసుకెళ్లడానికి వీలుందని ఆయన అన్నారు.  కేవలం రూ. మూడు నుంచి ఐదు వేల ఖర్చుతో దీన్ని తయారు చేయవచ్చు. దుక్కి దున్నొచ్చు. అంతర సేద్యం ద్వారా కలుపును నిర్మూలించవచ్చు. విత్తనాలు, ఎరువులు వేసుకోవచ్చు. పొగాకు, పత్తి, మిరప, శనగ, కూరగాయల సాగులో ఈ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు. పెరటి తోటలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. సైకిల్ చక్రాలను బిగించడం వల్ల సులభంగా దొర్లుతుంది కాబట్టి మహిళలు కూడా సులువుగా దీనితో వ్యవసాయ పనులు చేయవచ్చు.  ఇంటిపట్టున పెరటి తోటల సాగుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

 నాలుగు ఎకరాల్లో సేద్యం చేస్తున్నా..

 సింగరాయకొండ మండలం కరేడుకు చెందిన రైతు కే వెంకటేశ్వర్లు ఈ పరికరంతో 4 ఎకరాల ఇసుక నేలలో పంటలు పండిస్తున్నారు. వేరుశనగ, జామాయిల్ తదితర నార్ల సాగులో దుక్కి, విత్తనాలు, ఎరువులు వేయడానికి, కలుపు నిర్మూలనకు ఇది ఉపయోగకరంగా ఉందని ఆయన అన్నారు. అరకలు, కూలీల ఖర్చు తగ్గిందన్నారు. మోటారు బిగిస్తే నేలలో పదును ఉన్నప్పుడు నల్లరేగడి, ఎర్రనేలల్లోనూ పైపాటుకు ఈ పరికరాన్ని వాడుకోవడానికి అవకాశం ఉందన్నారు.
 - సీ బీ మోహన్‌రావు, సాక్షి, ఒంగోలు.
  ఫొటోలు: ప్రసాద్
 
 మోటారునూ బిగిస్తున్నాం..!

 ఈ పరికరం చిన్న రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. మరింత తక్కువ శ్రమతో వ్యవ సాయం చేసుకునేలా మోటారు సైకిల్  ఇంజిన్‌ను కూడా దీనికి అమర్చుతున్నాం. ఖరీదు మరో రూ. 5 వేలు పెరు గుతుంది. పారిశ్రామికవేత్తలు ఎవరైనా ముందుకొస్తే ఈ పరికరాలను తయారు చేయించి రైతులకు అందు బాటు లోకి తేవాలనుకుంటున్నాం.
 - డా. ఎం. లక్ష్మణరావు (98491 40465), ప్రిన్సిపల్, ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజి, కందుకూరు, ప్రకాశం జిల్లా
 
 
 

Advertisement
Advertisement