షాండ్ ఆర్ట్ | Sakshi
Sakshi News home page

షాండ్ ఆర్ట్

Published Mon, Aug 11 2014 2:31 AM

షాండ్ ఆర్ట్

 సైకత చిత్రకళలో అద్భుతాలు సృష్టిస్తున్న యువ కళాకారుడు బి.హరికృష్ణ నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ వర్సిటీ నుంచి 2012లో బీఎఫ్‌ఏ పూర్తి చేశాడు. తన కళా సృజనలో ఎప్పటికప్పుడు సామాజిక పరిణామాలను స్పృశించే హరికృష్ణ, కళ ద్వారా కొంతవరకైనా సామాజిక పరివర్తన జరగాలనేదే తన ఆశయమంటాడు. విభిన్నమైన కళా రూపాన్ని ఎంచుకున్న హరికృష్ణ, వైవిధ్యభరితమైన అంశాలను ఎంపిక చేసుకోవడం విశేషం. తన విలక్షణ ప్రతిభతో హరికృష్ణ భారత విదేశాంగ శాఖ సౌజన్యంతో గూగుల్ ఇండియా నిర్వహించిన ‘యూట్యూబ్ గ్లోబల్ వీడియో చాలెంజ్-2012’ పోటీలో విజేతగా నిలిచాడు. అప్పటి విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు.
 
ఐదు నిమిషాల్లోనే భారత్ ఘనతను చాటే వీడియోను రూపొందించడం ఈ పోటీలోని అంశం. ‘నిర్భయ’ సంఘటనపై సైకత చిత్రాలతో రూపొందించిన వీడియోను ఫేస్‌బుక్‌లో పెడితే తిలకించిన ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, హరికృష్ణను ‘జీ సరిగమప’ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. హరికృష్ణ వీడియోను ప్రదర్శిస్తూ, శంకర్ మహదేవన్ పాట పాడారు. పర్యావరణ పరిరక్షణపై శ్రద్ధగల హరికృష్ణ తమ కాలనీ వందకు పైగా మొక్కలను నాటడం, వినాయక చవితి వేడుకల కోసం ఏడడుగుల మట్టి విగ్రహాన్ని తయారు చేశాడు.  
 -  సిద్ధాంతి

Advertisement
Advertisement