షో.. బ్యూటిఫుల్ | Sakshi
Sakshi News home page

షో.. బ్యూటిఫుల్

Published Tue, Oct 7 2014 12:55 AM

షో.. బ్యూటిఫుల్ - Sakshi

ఫ్యాషన్ రాజధాని ముంబైని మరిపిస్తోంది మన సిటీ. రోజుకో ట్రెండ్.. వెరైటీ స్టైల్స్ ఇక్కడ పరిచయమవుతున్నాయి. వాటికి లవర్స్... ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. అందుకు తగ్గట్టుగానే ట్రెండీ డిజైన్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ డిజైనర్లు తమ ప్రత్యేకతను చాటుతున్నారు. దేశంలోనే కాదు... విదేశాల్లో జరిగే ప్రముఖ ఫ్యాషన్ షోలలో కూడా లేటెస్ట్ వెరైటీలతో మెరిపిస్తున్నారు. తాజాగా నగరానికి చెందిన డిజైనర్ శ్రవణ్‌కుమార్ రామస్వామి కెనడా వాంకోవర్ ఫ్యాషన్ వీక్‌లో అందరినీ ఆకర్షించారు. రెండు దశాబ్దాలుగా ఎకో ఫ్రెండ్లీ డిజైన్లతో ఆకట్టుకుంటున్న ఆయన... ఈ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న ఏకైక భారతీయ డిజైనర్. ఆదివారం నగరానికి తిరిగి వచ్చిన శ్రవణ్‌కుమార్‌తో ‘సిటీ ప్లస్’ ముచ్చటించింది.
 
 ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 మంది డిజైనర్ల సృజనకు వేదిక వాంకోవర్ ఫ్యాషన్ వీక్. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద షో ఇది. ఈ మెగా ఈవెంట్‌లో డిజైన్లు ప్రదర్శించే అవకాశం అంటే..! ఎవరికైనా అదో పెద్ద అచీవ్‌మెంటే. ‘ఈ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనడం రెండోసారి. మార్చిలో ఒకసారి వెళ్లా. గత నెల 18న సమర్పించిన నా షోలో అజ్రక్ ప్రింట్స్, నారాయణపేట చేనేతలతో రూపొందిన దుస్తుల కలెక్షన్‌ను ప్రదర్శించా.
 
  బాలీవుడ్ నటి సిమ్రాన్ కౌర్ ముండి షో స్టాపర్. మంచి ప్రశంసలు వచ్చాయి. అంతా వెజిటబుల్ డైస్‌తో నేను రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ దుస్తులు వారికి చాలా బాగా నచ్చాయి. భారతీయ చేనేతల గ్రాండ్ లుక్‌కు విదేశీయులు కూడా మెస్మరైజ్ అయ్యారు. మొత్తం 40 గార్మెంట్స్ నేను ప్రదర్శించినా ఇందులో 32 మహిళలవి, మిగిలినవి పురుషులవి... సేల్స్, ఆర్డర్స్ అన్నీ అనెక్స్‌పెక్టెడ్ రేంజ్‌లో ఉన్నాయి’ అన్నారు శ్రవణ్. కెనడాలో భారతీయుల సంఖ్య ఎక్కువని, ముఖ్యంగా వాంకోవర్ సిటీలో పంజాబీలు అధికమని చెప్పారు. వారందరికీ ఈ హైదరాబాదీ స్టైల్స్ నచ్చాయన్నారు. సిటీ డిజైనర్లలో తనకంటూ ప్రత్యేక శైలితో రాణిస్తున్న శ్రవణ్... భారతీయ చేనేతలకు ‘ఆలయం’ సంస్థ ద్వారా చేయూతను అందిస్తున్నారు. విదేశాల్లో సిసలైన దేశీ డిజైన్లకు క్రేజ్ తీసుకురావడమే మన దేశ చేనేత రంగానికి మనం చేయదగిన సేవ అంటారు శ్రవణ్.
  ఎస్. సత్యబాబు

Advertisement

తప్పక చదవండి

Advertisement