స్మార్ట్ఫోనే హోటల్ రూం తాళంచెవి!! | Sakshi
Sakshi News home page

స్మార్ట్ఫోనే హోటల్ రూం తాళంచెవి!!

Published Wed, Jul 30 2014 10:42 AM

స్మార్ట్ఫోనే హోటల్ రూం తాళంచెవి!!

సెల్ఫోన్ అంటే ఎందుకు ఉపయోగిస్తారు.. సాధారణంగా అయితే మాట్లాడటానికి, ఇంకా చెప్పాలంటే పాటలు వినడానికి, సినిమాలు చూడటానికి, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా చూసేందుకు, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి. అంతే కదూ.. కానీ ఇప్పుడు ఫోన్కు సరికొత్త అర్థాలు వచ్చేశాయి. ఇక మీదట మీరు ఎప్పుడైనా హిల్టన్ గ్రూపులోని హోటల్కు వెళ్తే, అక్కడ మీ స్మార్ట్ ఫోనే ఆ హోటల్ గది తాళం చెవి అవుతుంది. హోటల్ మొత్తానికి డిజిటల్ ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ఇది సాధ్యం అవుతుంది. ఇక మీదట రూం తాళాలు పోయాయనో, కీ కార్డును మర్చిపోయామనో బాధ పడాల్సిన అవసరం లేదు ప్రపంచవ్యాప్తంగా అన్ని హిల్టన్ హోటళ్లలోను ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు. కేవలం తలుపులు తెరవడానికి, మూయడానికి మాత్రమే కాకుండా.. హోటల్లో లైన్లో నిలబడి చెకిన్ చేయక్కర్లేకుండా నేరుగా తమ గదులకు వెళ్లిపోవచ్చని హిల్టన్ గ్రూపు తెలిపింది.

గడిచిన కొన్నేళ్లుగా చాలా రకాల ప్రయత్నాలు చేశామని, ఇప్పటికి ఇది అన్నింటకంటే ఉత్తమంగా తేలిందని హిల్టన్ వరల్డ్వైడ్ ప్రెసిడెంట్, సీఈవో క్రిస్టోఫర్ జె. నసెటా తెలిపారు. ఇది అతిథులకు చాలా సులువుగా, అనువుగా ఉండటమే కాక.. ఖర్చును కూడా గణనీయంగా తగ్గిస్తుందని ఆయన అన్నారు. అయితే.. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే మాత్రం ముందుగా స్మార్ట్ఫోన్లలో 'హెచ్ఆనర్స్' అనే యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటికీ ఉంది. అమెరికాలో 2015 సంవత్సరాంతానికి, ప్రపంచవ్యాప్తంగా మరో ఏడాది తర్వాత ఈ టెక్నాలజీని పూర్తిగా అమలుచేస్తామని హిల్టన్ గ్రూపు తెలిపింది.

Advertisement
Advertisement