'ఉరి' తప్పింది | Sakshi
Sakshi News home page

'ఉరి' తప్పింది

Published Tue, Oct 8 2013 3:15 PM

'ఉరి' తప్పింది

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తందూరీ హత్యకేసులో నిందితుడు, ఢిల్లీ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశీల్ శర్మకు 'ఉరి' తప్పింది. అతనికి విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది.  1995 జులై 2న తందూరీ రెస్టారెంట్‌లో తన భార్య నైనా సాహ్నిని తోసివేసి నిప్పు అంటించి హతమార్చిన విషయం తెలిసిందే.  

అయితే నైనా సాహ్నిపై ఏర్పడ్డ అనుమానం వల్లే  ఈ హత్య జరిగిందని భావించిన సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ... సుశీల్ శర్మ మరణ శిక్షను జీవితఖైదుగా మార్పు చేస్తూ తీర్పునిచ్చింది. ఢిల్లీ పోలీసుల ఛార్జీషీటు ప్రకారం.. కాంగ్రెస్ కార్యకర్తగా కొనసాగుతున్న తన భార్య  నైనా సాహ్ని మరో కాంగ్రెస్ నేత మత్లూబ్ కరీంతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానం పెంచుకున్నాడు.

అంతేకాకుండా మత్లూబ్ కరీం.. నైనా ఇద్దరూ కలిసి చదువుకున్న నేపథ్యంలో ....వారు రహస్యంగా వివాహం చేసుకుంటారని భావించిన శర్మ నైనాపై ద్వేషం పెంచుకున్నాడు. జులై 2న ఇంటికి వచ్చిన శర్మ తన భార్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుండగా చూశాడు. ఆ తర్వాత ఫోన్ రీడయల్ చేసిన శర్మకు ఆ నెంబరు మత్లూబ్ కరీందిగా తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన శర్మ తన భార్య నైనా సాహ్నిపై తన దగ్గర ఉన్న సైలెంట్ రివాల్వర్‌తో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో నైనా అక్కడికక్కడే మృతి చెందింది.

నైనా మృతదేహాన్ని శర్మ, తన స్నేహితుడు, భాగియా రెస్టారెంట్ మేనేజర్ కేశవ్‌తో కలిసి తందూరి పొయ్యిలో పెట్టి కాల్చివేశారు. అనంతరం హత్యను ప్రమాదవశాత్తూ జరిగినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేయగా పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. హత్య చేసిన అనంతరం పరారీలో ఉన్న సుశీల్ శర్మ జులై 11, 1995లో పోలీసులకు లొంగిపోయాడు. 2003లో భార్య హత్య కేసులో మరణశిక్ష విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానంతో పాటు హైకోర్టు కూడా మరణశిక్షను ధ్రువీకరించి క్షమాభిక్షను నిరాకరించింది. దాంతో సుశీల్ శర్మ తన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని అతను సుప్రీంను ఆశ్రయంచిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement