పాలవెల్లి లాంటి మనుషులు... పండు వెన్నెల లాంటి మనసులు...

27 Jul, 2013 03:15 IST|Sakshi
పాలవెల్లి లాంటి మనుషులు... పండు వెన్నెల లాంటి మనసులు...
 కృష్ణవేణీ పరివాహక ప్రాంతంలో పుష్కలమైన జలవనరులతో, పచ్చదనం పరవళ్లు తొక్కే పల్లెసీమల్లో ఒకటైన రావి అనంతవరం మా అమ్మమ్మగారి ఊరు. సెలవులకు నేను ఎక్కువగా మా అమ్మమ్మగారి ఊరు వెళ్లేవాడిని. ఆ పల్లె వాతావరణం నన్ను పదేపదే ఆ ఊరు వెళ్లేలా చేసింది.
 
 భారతదేశానికి భౌగోళిక అస్థిత్వం హిమాలయాల వల్ల ఏర్పడితే, సామాజిక, సాంస్కృతిక ఔన్నత్యం పల్లెసీమల వల్లే అలవడింది. పల్లె... ఆకలి తీర్చే తల్లిలాంటిది. పల్లె... అవసరాలు తీర్చి అండగా నిలిచే తండ్రి లాంటిది.
 
 శరవేగంగా విస్తరిస్తున్న ప్రపంచీకరణ వల్ల, కమ్ముకొస్తున్న కాలుష్య భూతాల వల్ల కనుమరుగయ్యేలా, మాసిపోతున్న పల్లె ముఖచిత్రం ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండేదనడానికి సాహిత్యమే సాక్షిగా నిలబడుతుంది. చలనచిత్రసీమలో ఇటువంటి సాహిత్యం జీవం పోసుకుంది. సినీకవి కాకముందే పద్యకవిగా ప్రసిద్ధులైన మల్లెమాల రచించిన గీతమిది. 1976లో ‘ముత్యాలపల్లకి’ చిత్రంలో ‘తెల్లవారకముందే పల్లె లేచింది’ అన్న మల్లెమాల గీతం సూర్యోదయవేళలో గ్రామసీమల్లో కనువిందు చేసే వర్ణచిత్ర దృశ్యమాలికలను మనోహరంగా ఆవిష్కరిస్తుంది. సూర్యుని రాకతోనే తెల్లవారటం జరుగుతుంది. కానీ శ్రామిక జీవన సంస్కృతికి ఊపిరిపోేన  పల్లెసీమ మాత్రం తాను అంతకుముందే నిద్ర లేచి తనవారందరినీ తట్టి లేపింది అనడంతో అక్కడ, అందరూ తనవారే అంటూ కలిసిపోయే ఆ అన్యోన్యత ముచ్చటగొలుపుతుంది. కోడికూత పల్లెను నిద్ర లేపుతుంది. కానీ మల్లెమాల గారి పల్లె ముందుగానే లేవటం వల్ల ఆదమరచి నిద్రపోతున్న తొలికోడి/అదిరిపడి మేల్కొంది అదేపనిగా కూసింది. ఇలా కోడి మేల్కొలుపుతో పల్లవి పల్లవించింది. ఇది ఉదయానికి ముందు జరిగే దృశ్యం. 
 
 ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు. వెలుగు దుస్తులేసుకొని సూరీడు/తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు. పల్లెల్లో పేదరికం ఏనాటి నుండో సుఖంగా స్థిరనివాసం ఏర్పరచుకుంది. అక్కడ బంగళాలు, అపార్టుమెంట్లు ఉండవు. ఉండేవి గర్భగుడి పరిమాణంలో కనిపించే గుడిసెలు, తాటాకులతో కప్పుకున్న పూరిళ్ళే. అక్కడ తడికలే తలుపులు. వాటిని తోసుకుని లోపలికి రావాలి. అందుకే ఆ పల్లెలో తూర్పు తలుపు కూడా తడికెకు ప్రతీక కనుకనే సూరీడు కూడా తోసుకొని వచ్చాడు. కండువాలే దుస్తులుగా కట్టుకుని లేదా తలకు చుట్టుకొని, పల్లెవాసులు పొలాలబాట పడుతుంటే, సూరీడు వెలుగు దుస్తులు వేసుకుని ఎదురొస్తున్నాడు. ఇక ఆ తరువాత కనిపించే దృశ్యం. పాడు చీకటికెంత భయమేసిందో/పక్కదులుపుకొని ఒకే పరుగు తీసింది అంటున్నారు. పల్లె మొత్తం చైతన్యానికి స్వాగతం పలకడంతో భయపడిన చీకటి పక్కదులుపుకొని పారిపోయిందనడంలో రూపకాలంకారమైన సహజత్వం పులకింతలు రేపుతుంది. పల్లవిలో ఉన్నది శబ్ద చిత్రమే. ఎందుకంటే అప్పటికింకా చీకటి దుప్పటిలోనే పల్లె ముడుచుకుంది. వెలుతురు చొరబడింది చరణాల్లోనే. కనుక ముంగిటిలో అల్లుకునే లతలు ఇప్పుడే కనిపించాయి. ఇక ఆడవారి దైనందిన కృత్యాలు మొదలవుతాయి. 
 
 పొద్దుపొడవగానే ఇంటిముందు కళ్ళాపి చల్లి ముగ్గులు వేయడం, ఆ ముగ్గుల నిండా రంగురంగుల పూలు నింపడం లాంటి అందాలు పల్లెల్లో చిందులు తొక్కుతాయి. పల్లెసీమ విశ్వరూపాన్ని ఆయన రెండో చరణంలో నిక్షిప్తం చేశారు. అందుకే ఇక్కడ ప్రతి పదంలో గీతామకరందం గుబాళిస్తుంది. పాలవెల్లిలాంటి మనుషులు/ పండు వెన్నెల వంటి మనసులు/ మల్లెపూల రాశి వంటి మమతలు/ పల్లెసీమలో కోకొల్లలు... మనసులు, మమతలకు శాశ్వత చిరునామా పల్లెసీమ... అనే మల్లెమాల విశ్వాసం కాదనలేని విశ్వసత్యమే. ఇక్కడ మరో శ్లేష, స్వభావోక్తి అంతర్లీనంగా ఉన్నాయి. పాలవెల్లిలో ‘పాలు’, పండువెన్నెల్లో ‘పండు’ ఉన్నాయి. వీటికితోడు మల్లెపూల రాశులు సరే సరి. ఇవన్నీ ఉత్పత్తి చేసేది మళ్ళీ ఆ పల్లెసీమలే. 
 
 అడ్డుగోడలు అంతగా కానరాని పల్లెల్లోనే అనురాగం అభిమానం కవల పిల్లలు/ ఆ పిల్లలకు పల్లెటూళ్ళు కన్నతల్లులు అంటున్నారు. మనుషుల మధ్య పెనవేసుకునే అనురాగం ; నేల తల్లిమీద, పశుపక్ష్యాదుల మీద, చెట్లమీద, పుట్లమీద, పొలం గట్ల మీద, వ్యవసాయ పనిముట్ల మీద చూపించే అభిమానం, ఈ రెండూ కవలపిల్లలుగా భావించడం కవిత్వంలో ఋషిత్వం నిండినపుడే సాధ్యమవుతుంది. ఇంత అందంగా పాట రాసి పల్లెసీమ గొప్పతనాన్ని తన కలంతో పొగిడిన మల్లెమాల మన తెలుగువారు కావటం మన అదృష్టం. నిలువెత్తు తెలుగుదనమును పలుకులలో పరిమళించు పంచామృతమున్  తలవంచని రాజసమును కలగలిసి ‘మల్లెమాల’ కవితాంజలిదే !
 
 - సంభాషణ: నాగేష్
 

 

మరిన్ని వార్తలు