కన్నాకు ఢిల్లీలో ఏంపని? | Sakshi
Sakshi News home page

కన్నాకు ఢిల్లీలో ఏంపని?

Published Thu, Dec 19 2013 11:59 AM

కన్నాకు ఢిల్లీలో ఏంపని? - Sakshi

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఓవైపు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా జరుగుతుంటే మరోవైపు  వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హస్తినలో మకాం వేశారు. అధిష్టానానికి వీర విధేయుడిగా ముద్రపడిన కన్నా లక్ష్మీనారాయణ నిన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో  భేటీ అయ్యారు.  రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్న తరుణంలో కన్నా.... రాష్ట్రపతి ప్రణబ్‌, సోనియాలను  కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకీ 'కన్నా'కి ఢిల్లీలో ఏం పని అనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కన్నా అధిష్టానంతో మంతనాలు జరపటం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో కాక పుట్టిస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ఇటీవలి రాష్ట్ర పర్యటన ముగించుకుని.... తాజా పరిణామాలను అధినేత్రికి నివేదిక అందించినట్లు సమాచారం. ఓవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన ప్రక్రియపై జెట్స్పీడ్తో ముందుకు పోతున్న కాంగ్రెస్ మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ వ్యవహార శైలిపై కూడా దృష్టి సారించినట్టు సమాచారం. ఇక కిరణ్ తీరుపై కూడా దిగ్విజయ్ సవివరంగా మేడమ్కు నివేదించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం కంట్లో నలుసుగా మారిన కిరణ్ ను మార్చే విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందనే అభిప్రాయానికి వచ్చిన పార్టీ అధిష్ఠానం, హుటాహుటిన కన్నాని ఢిల్లీకి పిలిపించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

గతంలోనూ  కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీ వెళ్లివచ్చినప్పుడు ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఏకంగా ఆయన నియోజకవర్గంలో 'కాబోయే సీఎం కన్నాలక్ష్మీనారాయణ' అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే తాను సీఎం రేసులో లేనని కన్నా వివరణ కూడా ఇచ్చుకున్నారు.  తాజాగా రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై వాడి వేడిగా చర్చ జరుగుతున్న క్రమంలో ఆయన ఢిల్లీ యాత్రకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.

ఇక నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో చేయి కాల్చుకున్న కాంగ్రెస్ రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఫలితాలపై డీలా పడవద్దని, గెలుపోటములు సహజమని వేదాంతం గుమ్మరించిన కాంగ్రెస్ ... వచ్చే సాధారణ ఎన్నికలను ప్రభావితం చేసేలా నిర్ణయం ఉండాలని వ్యూహం రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో  రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం పావులు కదుపుతోంది.  వీర విధేయులకే పట్టం కట్టే కాంగ్రెస్...ఈసారి సీఎం కుర్చీని ఎవరికి కట్టబెడుతుందో!! కన్నాను సీఎం పదవి వరిస్తుందా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.

Advertisement
Advertisement