కళ్ల జోడు అమ్మాయి వద్దనుకున్నా.. | Sakshi
Sakshi News home page

కళ్ల జోడు అమ్మాయి వద్దనుకున్నా..

Published Sat, Dec 27 2014 3:36 PM

కళ్ల జోడు అమ్మాయి వద్దనుకున్నా..

వివాహం అంటే వేద మంత్రాలు, ఏడడుగులు,
ప్రమాణాలు మాత్రమే కాదు.. మూడు ముళ్లో,
ఉంగరాలు మార్చుకోవడాలో ఒక్కటే కాదు.
రెండు జీవితాలను ఒకటి చేసే వైవాహిక బంధం
రెండు మనసుల్ని ఒకటి చేయాలి. ఒకరి మీద
ఒకరికి ప్రేమానురాగాలను మాత్రమే కాదు..
గౌరవాన్ని, విశ్వాసాన్ని పెంపు చేయాలి. ఒకరి
లక్ష్యాన్ని, అందుకు దీక్షను వేరొకరు గుర్తించగలగాలి.
ఆశయసాధనకు పడే తపనను గౌరవించాలి. అందుకు సహకరించాలి. ప్రోత్సహించాలి. నిరాశపడితే నవ్వించాలి. గమ్యం చేరిన ఆనందాన్ని పంచుకోవాలి. అటువంటి అనుబంధాన్ని అనునిత్యం షేర్ చేసుకుంటున్నారు విశాఖ యాడ్ ఏజెన్సీ అధినేత పారుకొండ లక్ష్మీ కోదండమూర్తి, బెంగళూరులో సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్‌గా చేస్తున్న సుమిదా దేవి .. ఒకరికొకరు తోడునీడగా జీవిత పయనం సాగిస్తున్న వాళ్లిద్దరే ఈ వారం యూ అండ్ ఐ


ఉన్నత లక్ష్యాలు సాధించాలన్న ఆరాటం ఒకరిది. అందుకు అన్ని విధాలా అండగా నిలబడే ఆత్మీయత ఒకరిది. అవాంతరాలను అధిగమించి లక్ష్యం అందుకోవాలన్న దీక్ష ఒకరిది.. అందుకు అన్ని విధాలా సహకరించే సహృదయత ఒకరిది. అందుకే వారి జీవితం ఆనందమయమైంది. అనుకున్నది చేతికందిన ఆనందం ఒకరిది కాక ఇద్దరిదైంది. భార్య సామర్ధ్యంపై విశ్వాసంతో భర్త ఆమెను ప్రోత్సహిస్తే ఆ కుటుంబం విజయానికి ప్రతిరూపమవుతుందని మరోసారి రుజువైంది. భార్యకు చదువంటే ఉన్న ఆసక్తిని, అందుకోసం ఆమె పడే తపనను చూసి సెక్యూర్డ్ జాబ్‌కు రిజైన్ చేయించి సివిల్స్ చదివేందుకు ఆమెను ప్రోత్సహించారు మూర్తి. ఆ నమ్మకానికి తగ్గట్టు లక్ష్యాన్ని సాధించారు సుమిద. తమ వివాహం, తర్వాత జీవితం, లక్ష్యాల సాధనకు చేసిన ప్రయత్నాల గురించి వాళ్లిద్దరూ ఇలా వివరించారు.

మూర్తి : మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. మాది అలమండ దగ్గర మామిడిపల్లి. నేను ఎంజేఎంసీ చేశాక, ఎంఏ చేశాను.  విశాఖలో యాడ్ ఏజెన్సీ పెట్టాను.  అక్కయ్యపాలెంలో ఉంటున్న మా ఇంటి యజమాని ఈ సంబంధం తీసుకువచ్చారు. ముందు కళ్లజోడు ఉన్న అమ్మాయా ..వద్దు అనుకున్నాను. కానీ తనను నేరుగా చూసిన తర్వాత చాలా నచ్చింది.
సుమిద : మా నాన్నగారు ఇంజినీర్. మాది తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి అయినా నాన్నగారి ఉద్యోగరీత్యా నా టెన్త్ క్లాస్ అయ్యేవరకు అసోంలో ఉన్నాం. తర్వాత వైజాగ్‌లో ఇంటర్, డిగ్రీ చేశాను. డిగ్రీ ఫైనలియర్‌లో ఉండగా ఎల్‌ఐసీలో అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడే మా వివాహం నిశ్చయమైంది. 1994 మే 25న వైజాగ్‌లో మా వివాహం జరిగింది.
మూర్తి : పెళ్లయిన తర్వాత కూడా తను ఎల్‌ఐసీలో ఐదేళ్లు చేసింది. తనకు సివిల్స్‌పై ఆసక్తి ఉన్న విషయం ముందే తెలిసినా ఆర్థిక పరిస్థితి కూడా సహకరించాలని కొన్నేళ్లు ఆగాం. ఈలోగా మా యాడ్ ఏజెన్సీకి ఐఎన్‌ఎస్ అక్రిడిటేషన్ వచ్చింది. అలా నిలదొక్కుకున్నాను.
సుమిద : నా చదువు గురించి తెలియకపోయినా, పెళ్లి తర్వాత ఎంబీఏ సెట్‌లో 72వ ర్యాంక్ రావడంతో ఆయనకు నమ్మకం కుదిరింది. దాంతో ఎల్‌ఐసీకి రిజైన్ చేయమన్నారు. సెక్యూర్డ్ జాబ్ వదులుకోవాలంటే తటపటాయించాను. మా వారు మాత్రం చేసేయమన్నారు. ఏయూలో ఎంబీఏ చదువుతూ యూపీఎస్సీ అటెంప్ట్ చేశాను. మొదటిసారి మెయిన్స్‌కు వెళ్లాను.. రెండు మార్కుల తేడాలో క్వాలిఫై కాలేకపోయాను. రెండోసారి అప్లై చేశాను గానీ అటెంప్ట్ చేయలేకపోయాను.  మూడోసారి రాయాలంటే చాలా నిరుత్సాహం వచ్చింది. ఆ సమయంలో ఈయన బాగా ఎంకరేజ్ చేశారు. నిరుత్సాహం వద్దని ధైర్యం చెప్పారు. ఆయన ప్రోత్సాహమే ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యేలా చేసింది.
మూర్తి : అప్పటికే మాకు ఒక పాప ఉంది. తనను చూసుకుంటూనే చదివేది.   యూపీఎస్సీ మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్నప్పుడు తను మళ్లీ ప్రెగ్నెంట్. అయినా పట్టుదలతో చదివింది. చివరికి అనుకున్నది సాధించింది. తను ముస్సోరి ట్రైనింగ్‌కు వెళ్లేసరికి బాబుకు 8 నెలలు.
సుమిద : నేను ట్రైనింగ్‌కు వెళ్లిన సమయంలో పిల్లలిద్దరిని అమ్మ, అత్తగారు చూసుకున్నారు. వాళ్ల సహకారంతోనే నా ట్రైనింగ్ పూర్తయింది.  2006లో హైదరాబాద్‌లో సెంట్రల్ ఎక్సైజ్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పోస్టింగ్ వచ్చింది. పిల్లలను హైదరాబాద్ తీసుకుని వెళ్లాను.  2009 వరకు అక్కడే ఉన్నాను.
మూర్తి : 2009లో తనకు వైజాగ్ ట్రాన్స్‌ఫర్ అయింది. ఆగస్ట్ వరకు ఇక్కడే జాబ్ చేసేది. ఆగస్ట్‌లో ప్రమోషన్‌పై తనను బెంగళూరు ట్రాన్స్‌ఫర్ చేశారు. పాప, బాబుతో తను అక్కడే ఉంటోంది. పాప శ్రీప్రియ ఇప్పుడు బెంగళూరులో ఇంజినీరింగ్ సెకండియర్ చేస్తోంది. బాబు సిద్ధార్థ బెంగళూరులోని సెంట్రల్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు.  
సుమిద : ఈయనకు నేను చేసే కాఫీ చాలా ఇష్టం. ముసోరిలో ఉండగా నీ కాఫీ మిస్ అవుతున్నానని ఫోన్ చేసేవారు. అలాగే నేను చేసే పలావ్ చాలా ఇష్టం. పెళ్లయ్యాకే అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు పిల్లలు కోరిన వెరైటీలన్నీ దాదాపు నేనే స్వయంగా చేస్తాను. వీకెండ్స్‌లో పిల్లలు, నేను షాపింగ్‌కు వెళ్లి మాకు కావలసిన  ప్రొవిజన్స్ తెచ్చుకుంటాం.  
మూర్తి : సుమిదకు పనిపై అంకితభావం ఎక్కువ. హార్డ్ వర్కింగ్...
సుమిద : ఈయన ఏదీ మనసులో పెట్టుకుని బాధపడటం ఉండదు. వాదించుకున్నా వెంటనే మర్చిపోతారు. సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ.
మూర్తి : సుమిద ద్వారా పిల్లలకు రీడింగ్ హేబిట్ వచ్చింది. పిల్లలిద్దరూ పుస్తకాలు బాగా చదువుతారు.
సుమిద : అన్ని విషయాల్లోనూ మా ఇద్దరిదీ ఒకే మాట. ఉద్యోగరీత్యా దూరంగా ఉన్నా మా మనసులొకటే. అదే మా ఆనందంలో రహస్యం.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement