విజయం: పట్టా లేని శాస్త్రవేత్త! | Sakshi
Sakshi News home page

విజయం: పట్టా లేని శాస్త్రవేత్త!

Published Sun, Aug 18 2013 2:30 AM

విజయం: పట్టా లేని శాస్త్రవేత్త!

ఓ కొత్త కారు తయారు చేయాలంటే  ఏం చేయాలి? ఓ పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలి. ఇంజినీర్లను పెట్టుకోవాలి. వాళ్లు నిరంతరం పరిశోధనలు చేసి ఓ కొత్త ఫార్ములా కనుక్కోవాలి. దానికి మెరుగులు దిద్దాలి! ఆ తర్వాత పేటెంట్ సంపాదించాలి. దాన్ని లాంచ్ చెయ్యాలి! కానీ ఇంటర్మీడియట్ కూడా చదవని వ్యక్తి.. ఎవరి సాయం తీసుకోకుండా ఒక్కడే ఓ కొత్త తరహా కారు తయారు చేస్తే.. అద్భుతం కదా! ఆ అద్భుతమైన వ్యక్తి అస్సాంకు చెందిన కనక్ గొగోయ్. అతను డిగ్రీలు లేని విజేత!
 
 మధ్యతరగతి కుటుంబానికి చెందిన కనక్ గొగోయ్ పదో తరగతి పూర్తయ్యాక కళాశాలలో చేరాడు కానీ.. కుటుంబ పరిస్థితులు, అనాసక్తి వల్ల కొన్ని రోజుల్లోనే చదువు మానేశాడు. వెంటనే పాల వ్యాపారం మొదలెట్టి చేతులు కాల్చుకున్నాడు. తాను ఇష్టపడే మెకానిక్ పనిలో చేరాడు. అందరు మెకానికుల్లా బైకులు రిపేర్ చేసుకుంటూ కాలం గడిపేయకుండా ప్రయోగాలు  మొదలుపెట్టాడు. పాత బైకులకు సంబంధించిన సామగ్రిని కలిపి కొత్త బైకులు తయారు చేశాడు. అతి తక్కువ పెట్టుబడితో, నిర్వహణ ఖర్చుతో వాహనాలు రూపొందించడంపైకి అతని దృష్టిమళ్లింది. ఐతే దీనికి ఎక్కువ ఖర్చవుతుందని భావించి గౌహతిలో సొంతంగా గ్యారేజీ పెట్టాడు. అది ఫలితాన్నిచ్చి కనక్‌కు చేతికి కాస్త డబ్బులొచ్చాయి. అవే అతని ప్రయోగాలకు పెట్టుబడి అయ్యాయి.
 
 ఎవరి ప్రోత్సాహం లేకున్నా, ఎవరూ సాయం చేయకున్నా... ఒంటరిగానే రాత్రింబవళ్లు కష్టపడి వినూత్నమైన వాహనాలు తయారు చేశాడు కనక్. అతని మొదటి ఉత్పత్తి.. గురుత్వాకర్షణతో పనిచేసే సైకిల్. దీన్ని తొక్కనక్కర్లేదు. స్ప్రింగు అమర్చిన సీటుపై కూర్చుని, పైకి కిందికి ఊగితే అది ముందుకెళ్తుంది. తర్వాతి తయారీ ట్రైగో-ఎక్స్ అనే చిన్న బైక్. తన కూతురు కోసం తయారు చేశాడు. సైకిల్ తరహాలో ఉండే ఈ బైక్ 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది.
 
 తర్వాత సోలార్-గ్యాస్ హైబ్రిడ్ కారు తయారు చేశాడు. ఒకసారి సోలార్ చార్జింగ్ చేస్తే 70 కిలోమీటర్లు నడుస్తుందీ కారు. పెట్రోలుతో కూడా నడిపించొచ్చు. ఇక కనక్ తయారుచేసిన వాటిలో అతనికి అత్యంత ఇష్టమైన వాహనం.. కంప్రెస్డ్ కార్. మోటార్‌సైకిళ్లలోని కొన్ని పరికరాలు, మారుతి కార్ ఇంజిన్ కలిపి తయారు చేశాడు. ఇది 120 కి.మీ. వేగంతో వెళ్తుంది. దీనికి ఏసీ అమర్చలేదు. కారు వేగం పెరిగే కొద్దీ కారు నుంచే చల్లని గాలి వచ్చే ఏర్పాటు చేశాడు. ఇవే కాక ఏరో బోట్, ఏరో ప్రాపెల్లర్, నీళ్లలో నడిచే సైకిల్, ట్రెడ్‌మిల్ బైక్ వంటి వాహనాలు రూపొందించాడు కనక్. అతను తయారు చేసిన స్పీడ్ బ్రేకర్ అన్నింటికంటే విశిష్టమైనది. ఈ రెడీమేడ్ స్పీడ్ బ్రేకర్‌పై వాహనాలు వెళ్తే విద్యుదుత్పత్తి అవుతుంది!
 
 కనక్ గొగోయ్ సృష్టించిన బ్యాటరీతో నడిచే కారు. గత పదేళ్లుగా కనక్ ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఆదాయాన్నంతా ప్రయోగాలకే ఖర్చు చేశాడు. ఆ ఖర్చు కోటి రూపాయలు దాటింది. తనకు పేటెంట్ హక్కుల గురించి కూడా పెద్దగా తెలియదని, ఇప్పటిదాకా తాను తయారు చేసిన వాహనాలకు సంబంధించి ఎలాంటి హక్కులూ సంపాదించలేదని చెబుతున్నాడు కనక్. తానింత చేస్తున్నా ప్రభుత్వం నుంచి కానీ, కార్పొరేట్ సంస్థల నుంచి కానీ పెద్దగా ప్రోత్సాహం లభించట్లేదంటాడు కనక్. టాటా మోటార్స్‌కు తన ప్రయోగాల గురించి వివరిస్తూ ఓ లేఖ రాశాడతను. ఆర్థిక సాయం అందిస్తే ప్రజల కోసం చౌక ధరల్లో వాహనాలు తయారు చేయవచ్చని చెప్పాడు.
 
 కానీ వారి నుంచి స్పందన రాలేదు. అవార్డులైతే వచ్చాయి కానీ.. ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ప్రోత్సాహం దక్కలేదు. ఐతే విదేశాల్లోని కొన్ని సంస్థలు, యూనివర్శిటీలు అతణ్ని తమతో తీసుకెళ్లాయి. అక్కడ సెమినార్లు, వర్క్‌షాపుల్లో ప్రసంగించే అవకాశం కల్పించాయి. స్వదేశంలో తనకు సరైన ప్రోత్సాహం లభిస్తే మరిన్ని అద్భుతాలు చేస్తానంటున్నాడు కనక్. ‘‘విదేశాల నుంచి తమ కంపెనీల్లో పనిచేయాలని నాకు రెండు మూడు ఆహ్వానాలు అందాయి. నా ఆలోచనలన్నీ వారితో పంచుకుంటే జీతం వస్తుంది కానీ.. ఏ ఉత్పత్తిపైనా నాకు హక్కులు రావు. మన దేశంలోనే ఉండి, సామాన్యులకు ఉపయోగ పడేలా చౌక ధరల్లో వాహనాలు తయారు చేయాలన్నది నా లక్ష్యం’’ అంటాడు గొగోయ్.
 - ప్రకాష్ చిమ్మల

Advertisement
Advertisement