క్షణం కూడా కలిసుండరు... ఏం చేయాలి? | Sakshi
Sakshi News home page

క్షణం కూడా కలిసుండరు... ఏం చేయాలి?

Published Sun, Dec 27 2015 1:24 AM

క్షణం కూడా కలిసుండరు... ఏం చేయాలి? - Sakshi

మాకు ఇద్దరు పిల్లలు... బాబు, పాప. ఐదు, ఏడు తరగతులు చదువుతున్నారు. ఇద్దరూ మహా చురుకు. కానీ అదేంటో... ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు. ఎప్పుడు చూసినా పోట్లాడుకుంటూనే ఉంటారు. ప్రతి చిన్నదానికీ వాదనకు దిగుతారు. నేనో, వాళ్ల నాన్నో చూసి అదిలిస్తే ఆగుతారు. లేదంటే కొట్టుకునేవరకూ వెళ్లిపోతారు. అలా కొట్టుకోకూడదని, ఇద్దరూ సఖ్యంగా ఉండాలని చెప్పినా వినడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే వాళ్ల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది? ఒకరికొకరు తోడుగా ఎలా ఉంటారు భవిష్యత్తులో? వాళ్ల మధ్య సఖ్యత ఎలా కుదర్చాలో చెప్పండి ప్లీజ్.
 - సుస్మిత, బెంగళూరు

 
పిల్లలు ఒకళ్లతో ఒకళ్లు పోట్లాడు కోవడం అసహజమేమీ కాదు. దానికి కంగారు పడకండి. వాళ్లు మరీ ఎక్కువగా పోట్లాడుకున్నప్పుడు మాత్రం కూర్చోబెట్టి మాట్లాడండి. సఖ్యతగా ఎలా ఉండాలో చెప్పడమే కాకుండా, గొడవ వస్తే ఎలా సర్దుబాటు చేసుకోవాలో కూడా వాళ్లకు విడమర్చి చెప్పండి. దీనివల్ల వాళ్ల మధ్య సఖ్యత పెరగడమే కాకుండా, పెద్దయిన తర్వాత గొడవలు పడకుండా ఎలా ఉండాలో, సమస్యలు ఎలా పరిష్కరించు కోవాలో కూడా తెలుస్తుంది.

అలాగే గొడవ పడినంత మాత్రాన వాళ్లు మాట్లాడు కోకుండా ఉండకూడదనే విషయాన్ని కూడా చెప్పండి. గొడవపడినా కలిసిపోవాలని, ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని చెప్పండి. పాప చిన్నది కాబట్టి తన బాధ్యతను బాబుకి అప్పగించండి. తనని బాగా చూసుకోవాలని చెప్పండి. అలాగే నువ్వు అన్నయ్యకు సహకరించాలని పాపకు చెప్పండి. అయినా చిన్నప్పుడు కొట్టుకున్నంత మాత్రాన పెద్దయ్యాక కూడా అలానే ఉండాలనేం లేదు. కాబట్టి అనవసరంగా టెన్షన్ పడకండి.
 
మా బాబు వయసు ఎనిమిదేళ్లు. వాడికో విచిత్రమైన అలవాటు ఉంది. సుద్దముక్కలు, సున్నం, మట్టి తినేస్తున్నాడు. మేం చూస్తే ఆపుతున్నాం. లేదంటే వాడు రహస్యంగా తినేస్తున్నాడు. గోళ్లు కూడా బాగా కొరుకుతున్నాడు. మాన్పించడం మావల్ల కావడం లేదు. ఇది శారీరక సమస్యా మానసిక సమస్యా అన్నది తెలియడం లేదు. ఏం చేయమంటారు?
 - సావిత్రి, ఆముదాలవలస

 
ఈ అలవాటును ‘Pica'(పైకా) అంటారు. కొంతమంది పిల్లలకు ఐరన్ తక్కువగా ఉంటే కూడా ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది. ఓసారి బాబును పీడియాట్రీషన్‌కు చూపించండి. ఏదైనా సమస్య ఉందేమో పరీక్షించి నిర్ధారిస్తారు. దాన్ని బట్టి చికిత్స కూడా చేస్తారు. ఒకవేళ అలాంటిదేమీ లేకపోతే... ఓ మంచి సైకాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లండి. బిహేవియర్ థెరపీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
నేనో సింగిల్ మదర్‌ని. పైగా వర్కింగ్ ఉమన్‌ని. ఉదయం పిల్లలిద్దరూ బడికి వెళ్లాక ఆఫీసుకు వెళ్లిపోతాను. అయితే సాయంత్రం మాత్రం ఆలస్యమవుతూ ఉంటుంది. పిల్లలు నాకంటే ముందే వస్తారు. ఇంతకు ముందు నేను వచ్చేసరికి చక్కగా హోమ్‌వర్క్ చేసుకుంటూ ఉండేవారు. కానీ ఈ మధ్య అలా చేయడం లేదు. పక్కింటి పిల్లలతో ఆటలాడుతున్నారు. కాసేపు ఆడుకోవడంలో తప్పు లేదు. కానీ హోమ్ వర్క్ చేయడం లేదు. నేను వచ్చాక తిడితే అప్పుడు పుస్తకాలు పట్టుకుంటున్నారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోతోంది. ఇలా అయితే నా ఆరోగ్యంతో పాటు, వాళ్ల చదువు కూడా పాడైపోతుందని భయమేస్తోంది. అలా అని చెప్పినా వాళ్ల తీరు వాళ్లదే. వాళ్లనెలా డీల్ చేయాలో చెప్పండి. ఎందుకంటే కష్టమైనా, నష్టమైనా భరించాల్సింది నేనొక్కదాన్నే కదా!
 - యు.రేవతి, రాజమండ్రి

 
ముందు పిల్లల బిహేవియర్‌లో ఈ మార్పు రావడానికి కారణం ఏంటో తెలుసుకోడానికి ప్రయత్నించండి. చుట్టుపక్కల పిల్లలు ఎక్కువగా రావడం లాంటివి ఉంటే అది తగ్గించడానికి ప్రయత్నించండి. లేకపోతే పిల్లలకు క్లియర్‌గా చెప్పేయండి... సాయంత్రం మీరు వచ్చేసరికి హోమ్‌వర్క్ అయిపోవాలని. లేకపోతే టీవీ చూసే వీలు లేకుండా చేయండి. మరుసటి రోజు పిల్లలు ఆటలాడే సమయంలో ఫోన్ చేయండి.

హోమ్‌వర్క్ సంగతి గుర్తు చేయండి. లేదంటే మళ్లీ టీవీ చూడనని, ఇక అస్సలు ఆడుకోనివ్వనని చెప్పండి. చేస్తే ఏమిస్తారు, చేయకపోతే ఎలా శిక్షిస్తారో స్పష్టంగా వివరించండి. అన్నిటికంటే ముఖ్యంగా... ఏ మాత్రం వీలున్నా, వాళ్లతో ఒకటి రెండు గంటలు వాళ్ల దగ్గర కూర్చోగలిగేవాళ్లెవరైనా ఉంటే పిల్లల బాధ్యతను వాళ్లకు అప్పగించండి.
- డా॥పద్మ పాల్వాయ్
 చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో హాస్పిటల్, హైదరాబాద్

Advertisement
Advertisement