అదే చిరునవ్వు... అప్పుడూ ఇప్పుడూ! | Sakshi
Sakshi News home page

అదే చిరునవ్వు... అప్పుడూ ఇప్పుడూ!

Published Sun, Apr 5 2015 1:03 AM

అదే చిరునవ్వు... అప్పుడూ ఇప్పుడూ!

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు రోజు నుంచే సిద్ధం కావాలి.
అన్ని రోజులూ ముందస్తు ప్రణాళిక సాధ్యం కాకపోవచ్చు.
అలాంటప్పుడు ఇన్‌స్టంట్ రాగిపిండి ఉంటే...
నీటిలో కలిపి పది నిమిషాలకే దోసె వేయొచ్చు.
పిల్లలు ఆ దోసెలు వద్దంటే...
తేనె రాసిన అవిశె, బాదంపప్పుతో స్మార్ట్ బ్రేక్‌ఫాస్ట్ పెట్టొచ్చు.
‘నవ్య’ ఫుడ్ ప్రొడక్ట్స్‌తో అన్నపూర్ణ చేస్తున్న ప్రయోగాలివి.
 
 అన్నపూర్ణ బీఎస్‌సీ ఎలక్ట్రానిక్స్ చదివి, ఏఎమ్‌ఐఈ, ఆ తర్వాత ఎంబీఏ మార్కెటింగ్ చేశారు. ఇంత చదువుకున్న అమ్మాయి అందరూ అనుకున్నట్లే ఐబీఎమ్‌లో ఉద్యోగంలో చేరారు. పరిశ్రమ స్థాపించాలని చిన్నప్పట్నుంచీ కన్న కల ఓ వైపు గుర్తుకొస్తూ ఉండడంతో ఆ ఉద్యోగంలో కొనసాగలేకపోయారు. పోషకాలతో కూడిన చిరుతిళ్ల తయారీ మీద దృష్టి పెట్టారు. ‘ఏంటీ! ఐబీఎమ్‌లో ఉద్యోగాన్ని వదిలి మురుకులు అమ్ముకుంటున్నావా’ అని వెటకారంగా చూసిన వాళ్లకు ఆమె చిరునవ్వే సమాధానం అప్పట్లో. ఏడాదికి అరవై లక్షల లావాదేవీలు నిర్వహిస్తూ, వచ్చే ఆర్థిక సంవత్సరానికి నా లక్ష్యం కోటి రూపాయల లావాదేవీ అంటూ అదే చిరునవ్వుతో బదులిస్తున్నారు అన్నపూర్ణ. ఇంతకీ ఆమె ఏం చేస్తున్నారంటే...
 
 ‘‘ఇక్రిశాట్‌లోని సైంటిస్టులు రూపొందించిన ఫార్ములాతో అవిసె గింజలు, బాదం పప్పులను తేనెతో కలిపి చిరుతిళ్లను (స్మార్ట్ బ్రేక్‌ఫాస్ట్) తయారు చేశాను. సాధారణంగా త్వరగా తయారయ్యే ఉపాహారం అనగానే కార్న్‌ఫ్లేక్స్ గుర్తొస్తాయి. నేను మొక్కజొన్న స్థానంలో సజ్జలు, రాగులు, జొన్నల వంటి అన్ని రకాల చిరుధాన్యాలతో ఓ ప్రయోగం చేశాను. ప్రాసెసింగ్‌లో పోషకాల నష్టం ఉంటుంది. సోయాపాలను కలపడం ద్వారా ఆ నష్టాన్ని నివారిస్తున్నాను. ఇవి చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ అనువుగా ఉంటాయి. నిదానంగా జీర్ణమవుతూ నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి.
 
 ఆహారపదార్థాల తయారీ పరిశ్రమ పెట్టాలన్నది ఎనిమిదవ తరగతిలో వచ్చిన ఆలోచన. నాకు మా నాన్నే స్ఫూర్తి. ఆయన ఇంజనీరింగ్ పరిశ్రమ నిర్వాహకులు కావడంతో నాన్నలాగే పరిశ్రమ నడపాలనుకున్నాను. అదే మాట నాన్నతో చెప్పినప్పుడు... ‘పరిశ్రమ స్థాపించిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లాలంటే ఎలా? పరిశ్రమ నీతో రాదు. ఆ వచ్చే భర్త నీ కోసం నీ పరిశ్రమ ఉన్న చోటికి రావడమూ అయ్యే పని కాదు’ అని నా ఆలోచనను మొగ్గలోనే తుంచేశారు. నాకు 2005లో పెళ్లయింది. మా వారు కాగ్నిజెంట్‌లో అసోసియేట్ డెరైక్టర్. పెళ్లయిన తర్వాత నా ఆలోచన చెప్పినప్పుడు అత్తింటి వారు సానుకూలంగా స్పందించారు. అలా 2007 నుంచి అనేక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని 2008 నుంచి ఉత్పత్తి ప్రారంభించాను.
 
 నీటి కొరతతో...
 ఫ్రూట్స్, వెజిటబుల్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనుకున్నాను. హైదరాబాద్‌లో నీటి కొరతతో దానిని నిర్వహించడం కష్టమని డ్రై ప్రాసెస్ తీసుకున్నాను. మైసూరులోని ‘సీఎఫ్‌టీఆర్‌ఐ, డీఎఫ్‌ఆర్‌ఎల్’, ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీలో మిల్లెట్ సదస్సులలో శిక్షణ తీసుకున్నాను. ఇక పరిశ్రమకు కావల్సిన యంత్రాల కొనుగోలు పెద్ద సవాల్‌గా మారింది. ఎక్స్‌ట్రూడర్ (పదార్థాలను పాక్షికంగా ఉడికిస్తుంది) ధర యాభై లక్షలు. నాన్న సాయంతో ఆయన పరిశ్రమలోని ఐరన్ స్క్రాప్‌తో ఆరు నెలలు శ్రమించి సొంతంగా ఎక్స్‌ట్రూడర్‌ని తయారు చేసుకున్నాను. మిల్లెట్ ప్రమోషన్ స్కీమ్ కింద అగ్రికల్చర్ కమిషనరేట్ వారు సబ్సిడీతో ఇచ్చిన యంత్రాలను కూడా వాడుతున్నాను. మొదట్లో రోజుకు ఐదు నుంచి పది కేజీలు చేయడమే పెద్ద అచీవ్‌మెంట్‌గా అనిపించింది. ఇప్పుడు నేను రోజుకు ఐదారు వందల కేజీలు ఉత్పత్తి చేస్తున్నాను. మా బాబుని మా అమ్మ పెంచడంతో నేను ఈ రంగంలో మొండిగా నిలబడగలిగాను’’.
 - రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి
 
 లక్ష్యానికి దగ్గరవుతున్నాను!
 మొదట్లో ఎక్కడ ఎగ్జిబిషన్ ఉన్నా ఒక టేబుల్ స్పేస్ అయినా ఇవ్వమని అడిగి నా ఉత్పత్తులను ప్రదర్శించేదాన్ని. ఎర్రగడ్డ రైతు బజార్‌లో కూరగాయల పక్కన నా ఉత్పత్తుల్ని అమ్మిన రోజులూ ఉన్నాయి. ఇప్పుడు యోగా సెంటర్లు, హాస్పిటళ్ల నుంచి ఈ మెయిల్, ఫోన్ కాల్స్ ద్వారా ఆర్డర్‌లు వస్తున్నాయి.
 - కె. పద్మావతి అన్నపూర్ణ,
 నవ్య ఫుడ్ ప్రొడక్ట్స్

Advertisement
Advertisement