అన్నీ కోల్పోయినా... ఆపన్నులకు ఆసరాగా... | Sakshi
Sakshi News home page

అన్నీ కోల్పోయినా... ఆపన్నులకు ఆసరాగా...

Published Sat, Aug 13 2016 11:02 PM

అన్నీ కోల్పోయినా...   ఆపన్నులకు ఆసరాగా...

మూడేళ్ల కిందట ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. కొండ చరియలు విరిగి పడ్డాయి. నదుల్లో చెత్తా చెదారం పేరుకపోవడంతో వరదలు మరింత ఉధృతంగా మారి ఊరూ వాడా ముంచెత్తాయి. వరదల తాకిడికి చాలాచోట్ల ఇళ్లకు ఇళ్లే కొట్టుకుపోయాయి. పలు భారీ కట్టడాలు సైతం నేలమట్టమయ్యాయి. దేశంలో 2004 సునామీ తర్వాత 2013 జూన్‌లో ఉత్తరాదిలో సంభవించిన వరదల కారణంగా అంతటి బీభత్సం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా అప్పుడు హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు, పశ్చిమ నేపాల్, పశ్చిమ టిబెట్ రాష్ట్రాల్లోనూ వరదలు పోటెత్తినా, ఉత్తరాఖండ్‌లోనే అత్యధికంగా 95 శాతం ప్రాణనష్టం సంభవించింది. దాదాపు ఆరువేల మంది ప్రాణాలు కోల్పోగా, 4,200 గ్రామాల్లో భారీ ఆస్తినష్టం వాటిల్లింది. ఇళ్లు కొట్టుకుపోవడంతో చాలామంది నిలువనీడ కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. ఇతర ప్రాంతాల నుంచి చార్‌ధామ్ యాత్రకు వచ్చిన యాత్రికులు ఎటూ కదల్లేని పరిస్థితుల్లో వరదల్లో చిక్కుకుపోయారు. సైనిక బలగాలు రంగంలోకి దిగినా, రహదారులు కొట్టుకుపోవడంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం అగ్నిపరీక్షగా మారింది.

ఆ వరదల్లో ఉత్తరకాశీకి చెందిన పర్వతారోహకురాలు మమతా రావత్ (24) ఇల్లు కూడా కొట్టుకుపోయింది. ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయింది. అయినా ఆమె తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఉత్తరకాశీ పరిసరాల్లో చిక్కుకుపోయిన యాత్రికులను సురక్షిత ప్రదేశాలకు తరలించడంపైనే దృష్టి పెట్టింది. ఉత్తరకాశీ చేరువలోని ద్యారా శిఖరంపై తన వద్ద శిక్షణ పొందుతున్న స్కూలు పిల్లలను తొలుత సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఉత్తరకాశీ-డెహ్రాడూన్ రహదారిని తెరిచిన వెంటనే వాళ్లందరినీ వారి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. తర్వాత తాను శిక్షణ పొందిన నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ బృందంతో కలసి బాధితుల రక్షణ కోసం బయలుదేరింది. వరదల్లో చిక్కుకుపోయిన వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులను వీపు మీద మోసుకుని సురక్షిత ప్రదేశాలకు చేర్చింది. ఇంత ఘనకార్యాన్ని నిర్వహించిన మమతా రావత్ మాత్రం తాను చేసిందంత ఘనకార్యమేమీ కాదంటుంది. ‘నాకు కొండలెక్కడం తెలుసు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి చిక్కుకున్న వారు కొండలతో నిండిన ప్రదేశాల్లో వరదల్లో ముందుకు సాగడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో నాలాంటి వాళ్లు ముందుకు రాకుంటే ఇంకెవరొస్తారు?’ అని నిరాడంబరంగా ప్రశ్నిస్తుందామె. ఈ మాటలు చెబుతుంటే కర్తవ్యాన్ని నెరవేర్చానన్న తృప్తి ఆమె కళ్లలో కనిపిస్తుంది.


‘పెంటియమ్’ పితామహుడు
గడచిన పాతికేళ్లలో మన దేశంలో కంప్యూటర్ల వినియోగం బాగా పెరిగింది. సమాచార విప్లవంలో కంప్యూటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ కంప్యూటర్లు ఏ సైజులో కనిపించినా, వాటి పనితీరు కేవలం ఒక చిన్న ప్రాసెసర్ చిప్‌పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లలో వాడే ‘పెంటియమ్’ ప్రాసెసర్ల రూపశిల్పి వినోద్ ధామ్. పుణేలో పుట్టి అమెరికాలో స్థిరపడ్డ వినోద్ ధామ్‌ను శాస్త్ర సాంకేతిక ప్రముఖులు ‘పెంటియమ్ పితామహుడు’గా పిలుచుకుంటారు. పెంటియమ్ ప్రాసెసర్లు వచ్చాక కంప్యూటర్ల పనితీరులో ఊహించని వేగం పెరిగింది.

 

వీరులను సంధిస్తున్న వీరనారి
ఆమె వీరనారి మాత్రమే కాదు, భారత సైన్యంలోని వీరులను యుద్ధవిద్యల్లో సుశిక్షితులుగా తీర్చిదిద్దుతున్న శిక్షకురాలు. భారత సైన్యంలో ఏకైక మహిళా కమాండో ట్రైనర్‌గా సీమారావు ఎన్నదగిన కృషి చేస్తున్నారు. సైన్యంలోనే పనిచేస్తున్న భర్త మేజర్ దీపక్‌రావు ప్రోత్సాహంతో యుద్ధవిద్యల్లో సాధన చేసిన సీమారావు అనతికాలంలోనే సైనికులకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగారు. సీమారావు తండ్రి ప్రొఫెసర్ రమాకాంత్ సినారి స్వాతంత్య్ర సమరయోధుడు. ఎంబీఏ చదువుకున్నా, దేశానికి ఏదైనా చేయాలనే సంకల్పంతో సీమారావు యుద్ధవిద్యల్లో శిక్షణ పొందారు. ఇప్పటి వరకు ఆమె దాదాపు 15 వేల మంది సైనికులను సుశిక్షితులుగా తీర్చిదిద్దారు.

 

చదువు కోసం...
ఎవరో వస్తారను కోలేదు. ఏదో చేస్తారు అని కూడా  ఆశ పడలేదు. ‘సమస్య మనది. పరిష్కారం కూడా మన నుంచే రావాలి’ అనుకున్నారు రాజస్థాన్‌లోని హమీర్‌పూర్ గ్రామస్థులు. ఈ ఊరి పిల్లలు సర్కారు  బడిలో చదువుకోవడానికి  ఏడెనిమిది  కిలోమీటర్ల దూరం నడవాలి. దీని ప్రభావం వారి చదువుపై పడింది. హాజరు శాతం తగ్గింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామస్థులంతా సమావేశమయ్యారు. పరిష్కారం కనుగొన్నారు. అందరూ  కలిసి ఒక బస్ కొనుగోలు చేశారు. డ్రైవర్ జీతం, పెట్రోల్ ఖర్చులు కూడా గ్రామస్థులే చెల్లిస్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజూ స్కూలుకు వెళుతున్నారు.      

 

డౌరీ ఫ్రీ-ఏరియా!
అన్ని ఊళ్లలాగే అదో ఊరు. అయితే ఆ ఊళ్లో ఇంటింటికో కథ. ఆ కథలన్నీ కట్నం చుట్టే ముడిపడి ఉన్నాయి. కట్న భూతం దెబ్బకు కేరళలోని నీలంబూర్ కన్నీటితో తడిసి పోయింది. కట్నం ఇవ్వలేక... పుట్టింటికే  పరిమితమైన అమ్మాయిలు. అనేక కష్టాలు పడి కట్నకానుకలు ఇచ్చినా... అత్తింటివారి గొంతెమ్మ కోరికలతో పెళ్లయిన కొద్దిరోజులకే పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, కట్నం కోసం శారీరక, మానసిక  హింసలు మామూలై పోయాయి. ఈ నేపథ్యంలో ఊళ్లోని పెద్దలు తమ గ్రామాన్ని  కట్నరహిత గ్రామంగా మార్చాలనుకున్నారు. కట్ననిషేధంపై అవగాహన కోసం తల్లిదండ్రులు, యువతీయువకులతో  వర్క్‌షాప్ నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ప్రచారం చేశారు. వారి శ్రమ వృథా పోలేదు. ఇప్పుడు నీలంబూర్ ఒక గ్రామం కాదు... సరికొత్త భారతానికి బలమైన ముందడుగు.


అ‘గణిత’ ప్రతిభాశాలి
గణాంక శాస్త్రానికి విశేష ప్రాచుర్యంతో పాటు పలు శాస్త్రాల్లో, పలు రంగాల్లో గణాంకాలకు విస్తృత వినియోగం కల్పించడంలో కీలక పాత్ర పోషించిన అ‘గణిత’ ప్రతిభాశాలి ప్రొఫెసర్ సి.ఆర్.రావు. కర్ణాటకలోని బళ్లారి వద్ద హడగళి గ్రామంలో పుట్టిన తెలుగువాడైన సి.ఆర్.రావును మనదేశంలో పుట్టిన టాప్-10 శాస్త్రవేత్తల్లో ఒకరిగా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రకటించిందంటే ఆయన శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోవచ్చు. సి.ఆర్.రావు సలహాల మేరకే టోక్యోలో ఆసియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటైంది. ఆర్థిక, గణాంక శాస్త్రాలను కొత్త పుంతలు తొక్కించిన పరిశోధనల ద్వారా సి.ఆర్.రావు ఆర్థిక రంగంలో దేశ పురోగతికి ఎంతగానో దోహదపడ్డారు.

 

అగ్నిమాపక దళంలో తొలి అతివ
మన దేశంలో పదేళ్ల కిందటి వరకు అగ్నిమాపక దళంలో అందరూ పురుషులే ఉండేవారు. మంటల్లోకి దూకే తెగువ మగాళ్లకే కాదు, మగువలకూ ఉంటుందని నిరూపించిన తొలి మహిళ హర్షిణి కన్హేకర్. డిగ్రీ పూర్తయ్యాక నాగపూర్‌లోనే నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో చేరి, అగ్నిమాపక పద్ధతుల్లో శిక్షణ పొందారు. అప్పటి వరకు అందరూ పురుషులే ఉన్న ఆ కాలేజీలో చేరిన తొలి మహిళగా హర్షిణి అరుదైన రికార్డు సృష్టించారు. శిక్షణ తొలినాళ్లలో వివక్ష ఎదుర్కొన్నా, శిక్షణ పూర్తయిన తర్వాత తన ఆశయం మేరకు అగ్నిమాపక దళంలో చేరారు. ఆ తర్వాత చాలామంది మహిళలు ఈ రంగంలోకి వచ్చేందుకు స్ఫూర్తిగా నిలిచారు.

 

మద్యంపై పోరాటం
‘‘మన ఊళ్లో మద్యనిషేధానికి ప్రయత్నిద్దామనుకుంటున్నాను’’ అని తన ఆలోచనను నాగభూషణ ఫ్రెండ్స్‌కు చెప్పినప్పుడు వాళ్లు పెద్దగా నవ్వారు. తమిళనాడులోని నూరుందుమలై నాగభూషణ సొంత ఊరు. ఈ ఊళ్లో పేదరికం ఎక్కువ. దీనికి తోడు విపరీతమైన మద్యపానం. సోషల్ వర్క్‌లో పీజి పూర్తి చేసుకున్న నాగభూషణ... మద్యంపై యుద్ధభేరి  మోగించాడు. మొదట ఒక్కడుగా బయలుదేరినా... సామూిహకశక్తిగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. ఇప్పుడు నూరుందుమలై ఆల్కహల్, టోబాకోఫ్రీ జోన్‌గా ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది.


పక్షులంటే ప్రాణం పెడతాడు...
పక్షుల తీయటి కూతలను వినే తీరికే మనకు లేదు. వాటి తీయటి కళ్లలోకి తొంగిచూసే ఓపిక మనకు లేదు. అసలు వాటి ఉనికిని గుర్తించే పరిస్థితే  లేదు మనకు. కానీ అందరూ అలా ఉండరు. పక్షులకు కూడా మనిషికి ఇచ్చినంత విలువే ఇచ్చి తమ మంచిమనసును చాటుకుంటారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు 15 కి.మీ దూరంలో ఉన్న గడ్‌మెడ్‌షింగి గ్రామానికి చెందిన అశోక్  సోన్‌లే కూలీ పని చేస్తాడు. ఈ అశోక్ ప్రత్యేకత ఏమిటంటే... తనకున్న పావు ఎకరం పొలంలో జొన్న పంట వేసి పక్షుల ఆకలిని తీర్చడమే కాదు చిన్న చిన్న పాత్రల్లో నీళ్లు పెట్టి వాటి దాహాన్ని కూడా తీర్చుతున్నాడు. జీవవైవిధ్యం, దాని విలువ తెలుసుకోవడానికి శాస్త్ర గ్రంథాలు చదవనక్కర్లేదని... మనసు ఉంటే చాలు అని నిరూపిస్తున్నాడు అశోక్.

 

‘ఫార్మా’ పితామహుడు
ఫార్మాస్యూటికల్ రంగంలో ప్రఫుల్లచంద్ర రాయ్ చేసిన కృషి చిరస్మరణీయమైనది. బెంగాల్‌లో రారులి-కాటిపురా గ్రామంలో (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉందీ గ్రామం) పుట్టిన రాయ్, కలకత్తాలోని అల్బర్ట్ స్కూల్‌లోను, విద్యాసాగర్ కాలేజీలోను విద్యాభ్యాసం చేశారు. రసాయన శాస్త్రంపై మక్కువతో విస్తృతంగా పరిశోధనలు సాగిస్తూనే, ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ బోధించారు. నైట్రేట్స్, హైపోనైట్రేట్స్‌పై ఆయన జరిపిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.

 

ఆధునిక యోగ పితామహుడు
భారతీయ యోగ శాస్త్రానికి ఆధునిక గురువుగా పేరుగాంచిన వారు తిరుమలై కృష్ణమాచార్య.  భారతీయ వైదిక దర్శనాలుగా పిలిచే వైశేషిక, న్యాయ, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంతాలైన... ఈ ఆరింటినీ ఔపోసన పట్టారు. భారతీయ తత్వశాస్త్రంలో ఉత్తీర్ణత సాధించారు. భారతదేశమంతా పర్యటించి ఆధునిక యోగశాస్త్రాన్ని ప్రచారం చేశారాయన. యోగ మకరంద, యోగ రహస్య, యోగావళి వంటి పుస్తకాలూ, అనేక వ్యాసాలూ రాశారు. ‘ద ఫాదర్ ఆఫ్ మోడ్రన్ యోగా’గా ప్రసిద్ధి చెందిన ఆయన నూరేళ్ల పూర్ణ జీవితం గడిపి ఫిబ్రవరి 28, 1989లో కన్నుమూశారు.

 

హెల్పింగ్ హ్యాండ్
ఒక వీల్ చైర్ ధర వేల నుంచి మొదలై కొన్ని సార్లు లక్షల్లోనూ ఉంటుంది.  వికలాంగులందరూ వీల్ చైర్‌ను ఆ ధర చెల్లించి కొనలేకపోవచ్చు. అలాంటి వారికోసమే ఫల్గుణీ దోషి మదిలో ఒక ఆలోచన వచ్చింది. దాని నుంచి ఆవిర్భవించిందే ‘హెల్పింగ్ హ్యాండ్’ అనే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కింద ఆమె వికలాంగులకు వీల్‌చైర్‌లు అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇందుకు గాను రోజుకు ఒక రూపాయిని అద్దెగా వసూలు చేస్తారు. కానీ ఆ వీల్ చైర్‌ను తిరిగి ఇచ్చేస్తే... మళ్లీ ఆ రుసుమును చెల్లిస్తారు ఫల్గుణీ. ఉచితంగానే ఇస్తే ఆ సేవల దురుపయోగం జరగవచ్చనే ఈ నిబంధన.

 

కుటుంబ నియంత్రణపై...
కుటుంబ నియంత్రణను విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చిన బానూ జహంగీర్ కొయాజీ పూణేలోని కింగ్ ఎడ్వర్డ్ హాస్పిటల్‌లో గైనకాలజిస్ట్‌గా కెరియర్ ప్రారంభించారు. మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొదలుకొని ప్రచంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), వరల్డ్ బ్యాంక్, యునెటైడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ (యూఎన్‌ఎఫ్‌పీఏ... ఇప్పుడు దీన్నే యునెటైడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అంటున్నారు) వంటి అంతర్జాతీయ సంస్థలకు కన్సల్టెంట్‌గా, సలహాదారుగా సేవలు అందించారు. కుటుంబ నియంత్రణ, పట్టణ-గ్రామీణ ఆరోగ్యం, చిన్నపిల్లల ఆరోగ్యం వంటి అనేక సామాజిక సేవారంగాలలో విశేష కృషి చేశారు.

 

గాంధీమార్గంలో పచ్చటి ఉద్యమం
గాంధీమార్గంలో పనిచేసే పర్యావరణవేత్తగా చండీ ప్రసాద్ భట్‌కు ప్రఖ్యాతి ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాకు చెందిన ఆయన 1964లో దషోలీ గ్రామ్ స్వరాజ్య సంఘ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. గాంధేయ మార్గంలో చెట్లను కాపాడుకోవాలనే ఉద్యమానికి చండీ ప్రసాద్ భట్ ఆద్యుడు. ఆయన ప్రారంభించిన ఉద్యమం 1973లో ప్రాంతాల్లో ‘చిప్కో’గా రూపుదాల్చింది. గాంధేయ పద్ధతుల ద్వారానే పలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు అటవీ ఉత్పాదనల మీద ఆధారపడే పరిశ్రమలూ వచ్చేలా చేశారు.

 

అతడు అడవిని సృష్టించాడు
కేరళరాష్ట్రంలోని పులయమ్‌కులమ్ ప్రాంతానికి వెళితే మనిషి సృష్టించిన అడవిని చూడవచ్చు. కేరళలోని కాసరగడ్ వాస్తవ్యుడైన అబ్దుల్ కరీం తన గ్రామానికి పాతిక కిలోమీటర్ల దూరంలో 32 ఎకరాలలో అడవిని నిర్మించాడు. ఇంకా నిర్మిస్తూనే ఉన్నాడు. పాతికేళ్ల క్రితం ఈ ప్రాంతమంతా రాతినేల. ప్రభుత్వ బంజరు భూమి. చెట్టు అన్నది లేకపోవడంతో ఇక్కడి భూగర్భజలాలు అన్నీ అడుగంటి పోయాయి. ప్రజలు నీటి కోసం మైళ్ల దూరం వెళ్లేవారు. చెట్టు అన్నదే కానిరాని ఈ నేలలో కరీం ఇక్కడ మొక్కల పెంపకం చేపట్టాడు. ముందు 5 ఎకరాలలో ప్రారంభించి ఏటికి పై యేడు మొక్కల సంఖ్య పెంచుతూ పోయాడు. మొక్కలు చెట్లు అయ్యాయి. అడుగంటిన భూగర్భజలాలు నిండుకుండలయ్యాయి. సైంటిస్టులు, ప్రకృతి ప్రేమికులు ఈ రాతినేలలో ఇంత పచ్చటి అడవి ఎలా సాధ్యమైందని పరిశోధనకు ఇక్కడకు రావడం ప్రారంభించారు. పదోతరగతి వరకే చదువుకున్న కరీం అటవీ శాస్త్రాన్ని ఔపోసన పట్టాడు.

 

తండాలో పుట్టిపెరిగి ఐఏఎస్ స్థాయికి...
బానోత్ చంద్రకళ పుట్టింది, పెరిగింది కరీంనగర్ జిల్లా, ఎల్లారెడ్డి మండలం, గర్జన పల్లి గ్రామం. ఉన్నత చదువులు చదువుకోవడానికి పెద్దగా సౌకర్యాల్లేని లంబాడా తండాలో పుట్టారామె. చదువుకోవాలనే పట్టుదల ఒక్కటే ఆమెను  యూపీఎస్సీ పరీక్షలో 409వ ర్యాంకు సాధించేలా చేసింది. డిగ్రీ రెండవ సంవత్సరంలో పెళ్లయింది. భర్త రాములు ఇంజనీర్. దూరవిద్య ద్వారా ఎం.ఎ ఎకనమిక్స్ చేశారు. ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఎఎస్ ఆఫీసర్‌గా 2008లో ఎంపికైన చంద్రకళ మధుర జిల్లా డిఎమ్‌గా చేశారు. ప్రస్తుతం బులంద్ శహర్ డిస్ట్రిక్ట్ మేజిస్టేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

 

ఐరన్ లేడీ ఆఫ్ లడక్
ప్రభుత్వం చేయలేని పనిని ఆమె చేసి చూపించారు సామాన్య ఉపాధ్యాయురాలైన సుజాతా సాహు. కశ్మీర్‌లోని లడక్ జిల్లాలో విద్యావకాశాలు అంతంత మాత్రంగా ఉన్న 370 పాఠశాలలను దత్తత తీసుకున్నారు. మరో వంద పాఠశాలల్లోని 675 మంది టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. కొండలు, లోయల నడుమ బస్సులు కూడా ప్రయాణించలేని కుగ్రామాలకు గుర్రాల మీద పుస్తకాలను తీసుకుపోయి మరీ పిల్లలకు పంపిణీ చేశారు. లడక్ జిల్లాలోని మొత్తం 963 పాఠశాలలకూ తన సేవలను విస్తరించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. చెక్కుచెదరని దృఢ సంకల్పమే ఆమెకు ‘ఐరన్ లేడీ ఆఫ్ లడక్’గా గుర్తింపు తెచ్చింది.

 

గ్రామం కోసం...
జైపూర్‌కు 60 కి.మీ. దూరంలో ఉన్న సోదా అన్న గ్రామానికి సర్పంచ్‌గా సేవలందిస్తూ ఉన్నారు ఛవి రజావత్.  పూణేలో ఎంబీయే చదివాక టైమ్స్ ఆఫ్ ఇండియా, కార్ల్‌సన్ గ్రూప్ హోటల్స్, ఎయిర్‌టెల్ వంటి సంస్థల్లో పనిచేశారు. గ్రామీణ ప్రాంతాల వారికి సేవలందించడానికి  కార్పొరేట్ సంస్థలను వదిలేశారు. ఎంబీఏ పూర్తయ్యాక సర్పంచ్‌గా పనిచేసిన తొలి మహిళా సర్పంచ్ ఆమె. తనదైన శైలి చూపించాలనే ఉద్దేశంతో ఛవి తన గ్రామానికి తాగునీటి వసతి, రోడ్లు వంటి సేవలు కల్పించారు. 2012 నాటి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాలుపంచుకున్నారామె.

 

ప్రాణాలను కాపాడే యువహీరో
చెన్నైకి చెందిన పంతొమ్మిదేళ్ల వెంకటేష్ నిత్యం సముద్ర అలలతో పోరాడుతున్నాడు. అదీ సాటి మనిషిని కాపాడటం కోసం. చెన్నైలోని మెరీనా బీచ్‌లో కనిపించే ఈ యువ హీరో ఇప్పటి వరకు వంద మందికి పైగా ప్రాణాలను కాపాడి ఒడ్డుకు చేర్చాడు. ఇదేమీ అతని వృత్తి కాదు. చింతాడ్రిపేట్‌వాసి అయిన వెంకటేశ్ కుటుంబ ఆర్థిక లేమి కారణంతో 9వ తరగతితోనే చదువు ఆపేశాడు. ఒకరోజు స్నేహితులతో కలిసి చేపల వేట చేస్తున్న వెంకటేష్‌కు ‘హెల్ప్ హెల్ప్’ అనే అరుపులు వినిపించాయి. అల్లంత దూరంలో నీటిలో మునిగిపోతున్న ఓ కాలేజీ విద్యార్థిని చూశాడు. అతన్ని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చాడు. ప్రాణం విలువ ఎంతటిదో ఆ క్షణంలో కళ్లకు కట్టింది అంటాడు ఈ యంగ్‌స్టర్. ఇంత రిస్క్ చేసి కాపాడినందుకు కృతజ్ఞత చెబుతూ ఎవరైనా డబ్బులు ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరిస్తాడు. డబ్బు కోసం ఈ పనిచేయడం లేదని చెబుతాడు. బీచ్ పెట్రోల్ అధికారులకూ వెంకటేష్ ఓ యువ హీరో!

 

అరుదైన రికార్డ్...
ఎథేన్స్‌లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్‌లో రెండు తామ్ర పతకాలు సాధించింది సీతా సాహూ. మెంటల్లీ ఛాలెంజెడ్ విభాగంలో జరిగిన పోటీల్లో ఆమె 200 మీటర్లు, 1600 మీటర్ల పరుగులో ఈ ఘనత సాధించింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన సీతా కేవలం 15 ఏళ్ల వయసులో ఆ అరుదైన రికార్డును నమోదు చేసింది. దేశానికి కీర్తి తెచ్చిన ఆమె ప్రస్తుతం తమ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రస్తుతం సీతాసాహూ గోల్‌గప్పా (గప్‌చుప్) తయారీలో తన తల్లికి తోడ్పడుతోంది.

 

దేశం అమ్ముల పొదిలో ఆగ్నేయాస్త్రం
మన దేశం అమ్ముల పొదిలో ఆగ్నేయాస్త్రం టెస్సీ థామస్. సాదాసీదా గృహిణిలా కనిపించే టెస్సీ కేరళలోని అలప్పురలో పుట్టిపెరిగారు. త్రిసూర్ కాలేజీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తయ్యాక, పుణేలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని డీఆర్‌డీవోలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె అగ్ని-3 క్షిపణి తయారీ ప్రాజెక్టు డెరైక్టర్‌గా పనిచేశారు. ఆమె ఆధ్వర్యంలోనే అగ్ని-4, అగ్ని-5 ప్రాజెక్టులు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పటి వరకు పురుషులు మాత్రమే సేవలందిస్తూ వచ్చిన క్షిపణి తయారీ రంగంలోకి ప్రవేశించిన తొలి మహిళగా టెస్సీ థామస్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

 

గిరిబిడ్డల దేవుళ్లు
గడ్చిరోలి జిల్లా మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతం. దవాఖానాను ఆ గిరిపుత్రుల దర్వాజాల ముందు తెరిచిన డాక్టర్ దేవుళ్లు అభయ్ బంగ్, రాణి బంగ్ దంపతులు. పేదరికం, శిశుమరణాలతో శోకసముద్రంలా ఉండేది ఈ ప్రాంతం. తమ వైద్యంతో శిశుమరణాల రేటు గణనీయంగా తగ్గించారు. ఆరోగ్యవంతమైన గిరి బిడ్డలకు పురుడు పోస్తున్నారు.‘సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్, యాక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్ కమ్యునిటీ హెల్త్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి దాని ద్వారా గిరిజన ప్రాంతాల్లో చదువు, ఆరోగ్యం కోసం పాటుపడుతున్నారు డాక్టర్ అభయ్ బంగ్, డాక్టర్ రాణిబంగ్.

 

సాగుకు వైద్యం
మహారాష్ట్రలోని అత్యంత వెనుకబడిన ప్రాంతం, రైతు ఆత్మహత్యల కేంద్రం  మెల్‌ఘాట్. ఆ రుగ్మతకు వైద్యం కనిపెట్టారు డా. రవీంద్ర కొల్హె, డా.స్మిత కొల్హె. రైతులుగా మారి కరువును జయించే సాగుచేస్తున్నారు. పశువైద్యమూ నేర్చుకున్నారు. రోడ్లు వేయించి మెల్‌ఘాట్‌ను ప్రపంచంతో కలిపారు. కరెంటుతో వెలుగులు నింపారు.  ఈ బాధ్యతను తమ వరకే పరిమితం చేసుకోకుండా తమ పిల్లలకూ పంచారు. ఆ దంపతుల సంతానం  రోహిత్, రామ్‌లు తల్లిదండ్రుల బాటలోనే పయనిస్తున్నారు.

 

సంచారుల స్వప్నం
అహ్మదాబాద్ వాస్తవ్యురాలు మిత్తల్ పటేల్. జర్నలిజం గ్రాడ్యుయేట్. ఏడేళ్లుగా సంచార జాతుల సంక్షేమం గురించి పాటుపడుతున్నారు. ప్రభుత్వ గుర్తింపు నోచుకోని దాదాపు వెయ్యి రకాల సంచార, గిరిజన జాతుల గురించి పోరాడి వాళ్లకు చట్టపరమైన గుర్తింపు తెచ్చారు. షెడ్యూల్డ్ కులాలకు, తెగలకు ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ల కేటగిరీలోకి ఇప్పుడు వాళ్లూ చేరారు. ఈ ప్రయాణంలో ఆమె చాలా ఆటుపోటులు ఎదుర్కొన్నారు. సంచార జాతుల వాళ్ల చేతుల్లో దాడికీ గురయ్యారు. అయినా అడుగు వెనక్కి వేయలేదు. కూడు, గుడ్డ, గూడుతోపాటు రాజకీయాల్లో కూడా వాళ్లకు అవకాశం కల్పించారు మిత్తల్‌పటేల్.

 

అనాథల అమ్మ
మహారాష్ట్రలోని వార్ధా జిల్లా, పింప్రి మేఘే అనే ఊళ్లో పుట్టారు సింధుతాయి. 20వ యేటనే ఊళ్లో పెద్దమనుషులు చేస్తున్న గోబర్‌గ్యాస్ అక్రమ వ్యాపారాన్ని ఎండగట్టారు. భర్త  ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు. అప్పుడు ఆమె 9 నెలల గర్భిణి. ఓ గొర్రెల పాకలో ఆడపిల్లకు జన్మిచ్చారు. చంటిబిడ్డతో రైల్వేప్లాట్‌ఫార్మ్ మీద జీవితాన్ని మళ్లీ ప్రారంభించారు. అక్కడ అనాథలైన ఎంతో మంది చిన్నారులను చూసి చలించారు. తల్లిలా వాళ్లందరినీ చేరదీశారు. ఇలా ఇప్పటికి 1050 మంది అనాథలకు ఆమె అమ్మయ్యారు. సమ్మతి బాల్ నికేతన్‌ను స్థాపించారు.

 

దీన జనబంధు
నిజాయితీ, నిబద్ధతలకు నిదర్శనం ఎస్.ఆర్. శంకరన్. జన్మభూమి తమిళనాడులోని తంజావూర్. కర్మభూమి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఐఏఎస్ ఆఫీసర్, సామాజిక కార్యకర్త హోదాలో దళిత, గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడ్డారు. బొగ్గు గనులను జాతీయం చేయడంలో ఆయన సహకారం మరువలేనిది. సఫాయి కర్మచారి ఆందోళన్‌కు మెంటర్. ఆంధ్రప్రదేశ్‌లో కట్టు బానిసత్వ నిరోధక చట్టం సరిగ్గా అమలయ్యేలా ఒత్తిడి తెచ్చారు. చుండూరు మారణకాండ బాధితులకు పునరావాసం కల్పించడంలో ఆయన కృషి మరువలేనిది. కన్‌సర్న్‌డ్ సిజిటన్స్ కమిటీ అనే సంస్థను పెట్టి బూటకపు ఎన్‌కౌంటర్లను, మిలిటెంట్ల దాష్టీకాలను నిరోధించే ప్రయత్నం చేశారు.

 

కరెక్ట్ ట్రాక్
దేశంలోనే కాదు మొత్తం ఆసియా ఖండంలోనే తొలి మహిళా ట్రైన్ డ్రైవర్ సురేఖా యాదవ్. ఆమె స్ఫూర్తిని మరో యాభై మంది మహిళలూ పంచుకున్నారు.  ప్రయాణాల్లో మహిళల రక్షణ విషయంలోనూ తొలి అడుగు సురేఖా యాదవ్‌దే. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్స్‌లో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న ఈవ్ టీజంగ్, వేధింపులను  చూసి, బాధపడి లేడీస్ స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేసేందుకు కృషిచేశారు. ఆ కృషి ఫలితంగా ఏడాది నుంచి దేశంలోని నాలుగు నగరాల్లో లేడీస్ స్పెషల్ ట్రైన్స్ పరుగులు తీస్తున్నాయి. ముంబైలోని విక్టోరియా టెర్మినస్‌లో మొదలైన తొలి లేడీస్ స్పెషల్‌ట్రైన్‌ని ఆమే నడిపారు.

 

అనాథ ఆడపిల్లలకు అమ్మ
వీధులపాలైన నవజాత ఆడ శిశువులకు గూడు కల్పించి తల్లి స్థానంలో నిలిచారు ప్రకాశ్ కౌర్. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో యునిక్ పేరుతో హోమ్ ఏర్పాటు చేసి నిలువనీడలేని అమ్మాయిలకు ఆశ్రయం కల్పించారు. అరవై ఏళ్ల క్రితం తాను ఆడపిల్ల అనే వివక్షతో వీధిపాలయ్యానని, నేటికీ ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదంటారు కౌర్. 1993లో ఏర్పాటు చేసిన యునిక్ హోమ్‌లో ఇప్పుడు 64 మంది ఆడపిల్లలకు తల్లిలా వారి మంచి చెడ్డలను చూస్తున్నారు. వీరందరికీ చదువు, సామాజికనైపుణ్యాలు, వృత్తివిద్యలు నేర్పుతూ భవిష్యత్తుకు కొత్తదారులు వేస్తున్నారు. ఈ హోమ్‌లో 4రోజుల పసిగుడ్డు నుంచి 19 ఏళ్ల యువతుల వరకు ఆశ్రయం పొందుతున్నారు.

 

అవినీతిపై పోరులో అమరుడైన యోధుడు
అవినీతిపై పోరులో అశువులు బాశారు షణ్ముగం మంజునాథ్. కర్ణాటకలోని కోలార్‌కు చెందిన ఆయన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉన్నతోద్యోగి. పెట్రోల్ కల్తీ మాఫియాకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం సాగించారాయన. ఒక పెట్రోల్ బంకులో కల్తీ జరుగుతున్నట్లు తెలిసి 2005 నవంబర్‌లో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన మంజునాథ్‌ను పెట్రోల్ మాఫియా దుండగులు దారుణంగా హత్య చేశారు. మంజునాథ్ కుటుంబానికి కోర్టు నష్టపరిహారం ఇప్పించింది. పరిహారం మొత్తంతో మంజునాథ్ కుటుంబం ఆయన పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి, ఏటా నిజాయతీపరులైన అధికారులకు అవార్డు అందజేస్తోంది.

 

పార్లమెంటుపై దాడిని అడ్డుకుని...
దేశంలో అశోకచక్ర అవార్డు పొందిన ఏకైక మహిళ కమలేష్ కుమారి. స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని సికిందర్‌పూర్. ఐదేళ్ల క్రితం ఉగ్రవాదులు పార్లమెంట్ భవనంపై దాడి చేసినప్పుడు ఆమె చూపిన సాహసం అసాధారణమైంది. పార్లమెంట్ గేటు వద్ద డ్యూటీలో ఉన్న ఆమె మరో గేటు నుంచి ఉగ్రవాదులు రావడం గుర్తించింది. అప్పుడు ఆమె చేతిలో వైర్‌లెస్ తప్ప మరే ఆయుధాలు లేవు. తన రక్షణ గురించి ఆలోచించకుండా గట్టిగా అరుస్తూ...  ఉగ్రవాదులు ఉన్నవైపుగా పరుగులు తీసింది. ఆమె అరుపులు విన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఆ మిలిటెంట్లు కమలేష్ మీద బుల్లెట్ల వర్షం కురిపించారు. అలెర్ట్ అయిన భద్రతాసిబ్బంది మిలిటెంట్ల మీద తిరుగుదాడి చేశారు.

 

మహిళా చేతన!
మహారాష్ట్రలోని మహస్వాద్ ప్రాంతంలో మహిళలు పొలాల్లో కూలీలుగానో, సొంత పొలంలో భర్తతోపాటు సాగుపనులు చేస్తూనో ఉన్నారు. దాచుకున్న డబ్బంతా భర్తల తాగుళ్లకో, ఇంకేదో అవసరంలేని విషయానికో ఖర్చయిపోయి ఆర్థిక సమస్యలు వచ్చేటప్పటికీ ఒట్టిచేతులతో మిగలసాగారు. చేతనాసిన్హాకూ ఇది ఎదురైంది. మా ఊళ్లో మహిళా బ్యాంకు పెట్టమని ఆర్.బి.ఐ.ని కోరింది. అక్కడంతా చదువురాని మహిళలే ఉన్నారు కాబట్టి బ్యాంకు పెట్టడం అసాధ్యం అన్నారు అధికారులు.  మూడు నెలల్లో చదువు నేర్చుకొని, బ్యాంకింగ్‌లో శిక్షణ తీసుకొని తమ ప్రాంతంలో మహిళా గ్రామీణ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

 

రోడ్ డాక్టర్
రోడ్ల మీద అడుగడుగునా గుంతలు, గతుకులు.. ఈ దేశం తీరింతే అని అసహనం చూపేవారే అంతా!  కానీ, 66 ఏళ్ల గంగాధర్ తిలక్ కట్నం మాత్రం ఎవరినీ నిందించకుండా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తూ ‘రోడ్ డాక్టర్’ అయ్యారు. సికింద్రాబాద్ దక్షిణమధ్య రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజినియర్‌గా పనిచేసి రిటైర్ అయిన గంగాధర్ నగర రోడ్ల మీద ఇప్పటి వరకు 1,124 గుంతలను పూడ్చాడు. శ్రమదానం పేరుతో వచ్చే పెన్షన్‌ను ఇందుకోసం వెచ్చిస్తున్నాడు. 8 ఏళ్ల క్రితం ఒక గుంత వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి బాధపడిన తిలక్ వీటిని పూడ్చాలనే కంకణం కట్టుకున్నాడు. ఈ రోడ్‌డాక్టర్‌తో జీహెచ్‌ఎమ్‌సీ చేతులు కలిపింది.

 

మన సైన్యంలో తొలి మహిళ
లా గ్రాడ్యుయేట్, పోలీస్ ఆఫీసర్ అయిన ప్రియా ఝింగాన్‌కు ఆర్మీలో చేరడం కల. ఆర్మీలో మహిళలకు ప్రవేశం ఎందుకు కల్పించడం లేదు, మహిళలకూ అవకాశం ఇవ్వండి అంటూ 1992లో ఆర్మీచీఫ్‌కి ఒక ఉత్తరం రాశారు ఆమె. ఏడాది తర్వాత ఆమె వినతికి కార్యరూపం ఇచ్చారు ఆ ఆర్మీచీఫ్. ఆమె ఉత్తరం వల్ల ఝింగాన్‌తోపాటు మరో 24 మంది మహిళలకు ఆర్మీలో చేరే అవకాశం కలిగింది. దేశ రక్షణ పురుషులే కాదు మహిళలు కూడా ఏమాత్రం తీసిపోకుండా ముందుంటారు అని నిరూపించారు, దేశభక్తికి స్త్రీ, పురుష బేధం లేదు అన్న సత్యాన్ని సమాజం గ్రహించేలా చేశారు ప్రియా ఝింగాన్.

 

అర్ధరూపాయి ఆదాయం నుంచి...
వ్యసనాల బారిన పడ్డ భర్త కారణంగా ఆమె వైవాహిక జీవితం దుర్భరంగా మారింది. అప్పటికే ఇద్దరు పిల్లలు. వాళ్ల పోషణ కోసం తోపుడుబండి మీద తినుబండారాలను అమ్ముకోసాగారు పాట్రీషియా నారాయణ్. చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద ముప్పయ్యేళ్ల కిందట తోపుడుబండిపై వ్యాపారం చేసుకునే రోజుల్లో ఆమె రోజువారీ ఆదాయం అర్ధరూపాయి మాత్రమే. క్రమంగా ఇద్దరు సిబ్బందితో చిన్న హోటల్ ప్రారంభించిన ఆమె ఇప్పుడు రెస్టారెంట్ల చైన్‌కు యజమానిగా ఎదిగారు. ఇప్పుడామె రెస్టారెంట్ల రోజువారీ ఆదాయం రూ.2 లక్షల పైచిలుకే ఉంటుంది. అట్టడుగు స్థాయి నుంచి అపూర్వ విజయం సాధించిన పాట్రీషియా ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.

 

పేదింట పుట్టిన పసి మేధావి
లక్నోలోని ఒక నిరుపేద కుటుంబంలో పుట్టింది సుష్మా వర్మ. ఆమె తండ్రి రోజు కూలీ. ఒకే గది ఇల్లు, కురిసే పైకప్పు. ఆ కుటుంబానికి వేరే ఆధారమే లేదు. అలాంటి పరిస్థితుల్లో అసాధారణమైన తన ధారణ శక్తిని నిరూపించుకుని మరీ ఐదేళ్ల వయసులో నేరుగా తొమ్మిదో తరగతిలో అడ్మిషన్ పొందగలిగింది. ఆడుతూ పాడుతూనే 7 ఏళ్ల వయసులో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. అప్పటి నుంచి ఆమె చదువుకు ఇతరుల సాయం అందడంతో పరిస్థితి మెరుగుపడింది. తర్వాత 13 ఏళ్ల వయసులో బోటనీలో డిగ్రీ, 15 ఏళ్ల వయసులో మైక్రోబయాలజీలో పీజీ పూర్తిచేసింది. ఇప్పుడు పీహెచ్‌డీ చేస్తోంది.

 

గ్రామీణాభివృద్ధి నాయకుడు
అరవై మూడేళ్ల మణిభాయ్ దేశాయ్ సామాజిక కార్యకర్త. గొప్ప గాంధేయవాది. పర్యావరణ వేత్త. అటవీ సంపద పెంపునకు కృషి చేసిన వ్యక్తి. 1946లో గాంధీజీ ప్రసంగాలకు ప్రభావితుడైన మణిభాయ్ పుణేలోని ఉర్లిలో మొట్టమొదటిసారి నేచర్ క్యూర్ ఆశ్రమాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాడు. పాఠశాలలను ఏర్పాటు చేశాడు. భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి ఇండో-యురోపియన్ హైబ్రీడ్ రకాలను పెంపొందించాడు. వ్యసాయరంగాన్ని, పాడిపరిశ్రమను వృద్ధిలోకి తెచ్చి దాదాపు 5 లక్షలకు పైగా కుటుంబాల ఆర్థికలేమిని తీర్చాడు. 5 రాష్ట్రాలలో 8 లక్షలకు పైగా పశు సంపదను పెంచాడు. ఈయన సేవలను గుర్తించిన భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

 

తప్పిపోయిన వారికి ఆపద్బాంధవుడు
జాతరలోనో, తిరనాళలోనో చిన్నారులు తప్పిపోవడం సహజమే. కుంభమేళా వంటి భారీ జాతరలోనైతే పెద్దలు సైతం ఒకరి నుంచి ఒకరు తప్పిపోతుంటారు. అయిన వారి నుంచి తప్పిపోయిన వారిని తిరిగి వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంలో రాజారామ్ తివారీకి మరెవరూ సాటిరాలేరు. పోలీసు యంత్రాంగం చేయలేని పనిని ఈ పెద్దాయన తన ‘ఖోయా పాయా’ శిబిరం ద్వారా ఒంటిచేత్తో చేస్తూ తప్పిపోయిన వారికి ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు కుంభమేళాలో తప్పిపోయిన 20 వేల మంది చిన్నారులను, పది లక్షల మందికి పైగా పెద్దలను వారి వారి కుటుంబాలకు అప్పగించిన అరుదైన ఘనత ఆయన సొంతం.

 

నిర్విరామ జలరక్షకుడు
దాహార్తిని తీర్చే నీరు వృథాగా పోతుంటే ముంబైకి చెందిన ఆబిద్ సూర్తి ఏమాత్రం తట్టుకోలేరు. వృత్తిరీత్యా కార్టూనిస్టు, రచయిత అయిన సూర్తి నలభయ్యేళ్లుగా కామిక్ పుస్తకాల ద్వారా పిల్లలను అలరిస్తున్న సూర్తి, ముంబైలో జరిగే నీటి వృథాను అరికట్టడానికి తనవంతు కృషిని నిర్విరామంగా  కొనసాగిస్తున్నారు. చిన్నప్పుడు తన తల్లి వీధి కుళాయి నుంచి నీరు పట్టేందుకు పడే అవస్థలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయంటారు ఆయన. అందుకే ఎక్కడ కారుతున్న కొళాయిలు కనిపించినా వెంటనే సొంత ఖర్చులతో మరమ్మతులు చేసేస్తారు. పైపుల మరమ్మతుల కోసం ఆయన ‘డ్రాప్ డెడ్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.

 

ముసుగును తగలేసిన మగువ
లింగవివక్షకు మారుపేరైన హర్యానా గ్రామాల్లో మహిళలపై ఆంక్షలు తక్కువేమీ కాదు. ముసుగు తొలగిస్తే నేరంగా పరిగణించే పరిస్థితుల్లో తెగువ చూపిన నీలమ్ ముసుగుకు వ్యతిరేకంగా దాదాపు యుద్ధమే చేసింది. ఛప్పర్ గ్రామంలోని తన అత్తవారింట్లో ఎంత వ్యతిరేకత ఎదురైనా వెనక్కు తగ్గలేదామె. ఆమె స్ఫూర్తితో గ్రామంలోని మిగిలిన మహిళలు కూడా ముసుగు ధరించడం మానేశారు. వారి అండతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన నీలమ్ సర్పంచిగా ఎన్నికైంది. స్వయం ఉపాధి పథకాల ద్వారా గ్రామంలోని మహిళలకు స్వావలంబన కల్పించడంతో పాటు లింగ వివక్షకు తావులేని రీతిలో గ్రామాన్ని తీర్చిదిద్ది ఎందరికో స్ఫూర్తినిస్తోంది నీలమ్.

 

పేద బతుకులకు వెలుగుప్రదాత
విద్యుత్ వెలుగులకు నోచుకోని ఎందరో పేదల బతుకుల్లో వెలుగులు నింపిన వెలుగుప్రదాత హరీష్ హండే. కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన ఆయన, ఒడిశాలోని రౌర్కెలాలో పెరిగారు. ఖరగ్‌పూర్ ఐఐటీలో చదువయ్యాక అమెరికాలోని మసాచుసెట్స్ వర్సిటీ నుంచి ఎనర్జీ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. విద్యుత్తుకు నోచుకోని మారుమూల గ్రామాల్లోని పేదలకు సౌరశక్తి ద్వారా వెలుగు అందించాలనే సంకల్పంతో ‘సెల్కో’ సంస్థను స్థాపించారు. సౌరశక్తితో పనిచేసే గృహోపకరణాలను, యంత్రపరికరాలను చౌక ధరల్లో రూపొందించి పేదలకు అందుబాటులోకి తెచ్చారు.

 

పారిశ్రామిక కాలుష్యంపై నిర్విరామ పోరాటం
పారిశ్రామిక కాలుష్యం ఫలితంగా పర్యావరణానికి, మనుషులతో పాటు జీవజాలానికి వాటిల్లుతున్న నష్టం అంతా ఇంతా కాదు. పర్యావరణ ప్రేమికుడైన న్యాయవాది మహేశ్‌చంద్ర మెహతా ఈ పరిస్థితిని అరికట్టాలనే సంకల్పంతో అలుపెరుగని న్యాయపోరాటం సాగిస్తున్నారు. ఇష్టానుసారం కాలుష్యాలను వెదజల్లుతున్న పలు కర్మాగారాలను మూసివేయించడంలో ఇప్పటికే పలు విజయాలు సాధించారు. జమ్ము కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఒక కుగ్రామంలో సామాన్య కుటుంబంలో పుట్టిన మెహతా న్యాయవాదిగా అవినీతికి, లంచగొండితనానికి వ్యతిరేకంగా కూడా పోరాటం సాగిస్తున్నారు.

 

కెమెరాతో యుద్ధరంగంలోకి....
స్వాతంత్య్రానికి మునుపటి రోజుల్లో ఫొటోగ్రఫీ సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు. పైగా ఫొటోగ్రాఫర్లు అందరూ పురుషులే. అలాంటి రోజుల్లోనే ఫొటోగ్రఫీపై మక్కువతో ఫొటో జర్నలిజంలోకి అడుగుపెట్టారు హోమాయి వ్యారావాలా. మన దేశంలో తొలి ఫొటో జర్నలిస్టుగా ఆమె ఎందరో మహిళలకు స్ఫూర్తినిచ్చారు. ఫొటో జర్నలిస్టుగా సభలు సమావేశాల వరకే పరిమితం కాలేదామె. యుద్ధరంగానికి వెళ్లి మరీ ఫొటోలు తీసిన సాహసం ఆమెది. రెండో ప్రపంచయుద్ధం జరగుతున్నప్పుడు ఆమె తీసిన ఎన్నో విలువైన ఫొటోలను అప్పట్లో ‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’ ప్రముఖంగా ప్రచురించింది.

 

మహిళలకు ‘సూక్ష్మ’స్వావలంబన
మహారాష్ట్రలోని దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన నీలిమా మిశ్రాకు ఆర్థిక ఇబ్బందులు అనుభవపూర్వకంగానే తెలుసు. పేద కుటుంబాల్లోని మహిళల స్థితిగతులూ తెలుసు. సైకాలజీలో పీజీ చేసిన నీలిమా, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఉద్దేశంతో భగినీ నివేదిత గ్రామీణ విద్యానికేతన్ నెలకొల్పి, సూక్ష్మరుణాల ద్వారా మహిళలకు ఆసరాగా నిలుస్తున్నారు. నీలిమా మిశ్రా కృషి ఫలితంగా వందలాది మంది గ్రామీణ మహిళలు పేదరికం నుంచి బయటపడి, స్వావలంబన సాధించారు. నీలిమా కృషికి గుర్తింపుగా ఆమెకు ‘పద్మశ్రీ’, రామన్ మెగసెసె అవార్డులు దక్కాయి.

 

 

వీల్‌చైర్ నుంచి విజయపథంలో...
‘విల్‌పవర్’ ఉండాలేగానీ వీల్‌ఛైర్‌లో కూర్చొని కూడా అద్భుతాలు సాధించవచ్చునని నిరూపిస్తున్నారు భువనేశ్వర్‌కు చెందిన శ్రుతి మహాపాత్ర. చదువుల్లో, ఆటల్లో చురుకైన శ్రుతి ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడి వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. అయినా...నిరాశనిస్పృహలను దరికి చేరనివ్వలేదు. ‘షేర్‌డ్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ రిక్రియేషన్’ నినాదంతో   ‘షేర్’ అనే సంస్థను మిత్రులతో కలిసి మొదలుపెట్టారు. ‘వుమెన్స్ సెల్ ఆఫ్ డిజేబుల్డ్ పీపుల్స్ ఇంటర్నేషనల్’కు కన్వీనర్‌గా కూడా వికలాంగుల  క్షేమం కోసం పాటుపడుతున్నారు. జువాలజీలో పిహెచ్‌డీ చేసిన శ్రుతి ‘నేషనల్ యంగ్ సైంటిస్ట్’ అవార్డ్ అందుకున్నారు. వికలాంగులకు సంబంధించి ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. కథలు, కవితలు రాశారు... వీటి మధ్య చైతన్యానికి తప్ప ‘నిరాశ’కు చోటెక్కడుంటుంది!

 

ప్రజా కళాకారుడు
‘కళ కళ కోసమే’ అని నమ్మేవాళ్లు కొందరు. ‘కాదు ప్రజల కోసం’ అనేవాళ్లు కొందరు. భారతీయ నాటకరంగానికి కొత్త వెలుగైన  శంభు మిత్రా కళ ప్రజల కోసమే అని నమ్మినా... ప్రయోగాలకు మాత్రం దూరంగా ఉండలేదు. 1939లో కల్‌కత్తాలోని  ‘రంగమహల్ థియేటర్’ ద్వారా తన కెరీర్ ప్రారంభించారు. 1943లో వామపక్ష భావజాలంతో ప్రభావితమై ప్రసిద్ధ ‘ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా)లో చేరారు. నాటకరంగంలో మూసపద్ధతులకు దూరంగా కొత్తదనాన్ని ప్రవేశపెట్టారు. ఆ తరువాత ‘బహురూపి’ పేరుతో సొంత నాటక సమాజాన్ని స్థాపించి భారతీయ నాటకరంగ మార్గదర్శుల్లో ఒకరుగా నిలిచారు. నాటకాలే కాదు హిందీ, బెంగాలీ సినిమాల ద్వారా సినీరంగంపైనా తనదైన ముద్రవేశారు.

 

బాల్యం వీడక ముందే ఎవరెస్టు శిఖరానికి
ఎవరెస్టు శిఖరంపై జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన అతి పిన్న వయస్కురాలు మలావత్ పూర్ణ. కేవలం 13 ఏళ్ల 11 నెలల వయసులోనే ఆమె సాధించిన ఈ ఘనత ప్రపంచ రికార్డులకెక్కింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామంలో పుట్టిపెరిగిన పూర్ణ తల్లిదండ్రులు సామాన్య వ్యవసాయ కూలీలు. చదివించడానికి ఆమెను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్కూల్‌లో చేర్చారు. సొసైటీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ పూర్ణ పట్టుదలను గుర్తించి, ఎవరెస్టు శిఖరారోహణ దిశగా ఆమెకు అన్ని విధాలా ఆసరాగా నిలిచారు. డార్జిలింగ్, లడక్‌లలో శిక్షణ తీసుకున్న పూర్ణ 2014 మే 25న లక్ష్యం సాధించింది.

 

ప్రయాణికులను కాపాడటానికి ప్రాణత్యాగం
ప్రయాణికులను కాపాడటానికి ప్రాణత్యాగానికి సిద్ధపడింది నీరజా భానోత్. పంజాబ్‌లో పుట్టి పెరిగిన ఆమె పాన్ అమెరికన్ విమానంలో ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేసేది. ఆమె విధుల్లో ఉన్న విమానాన్ని 1986 సెప్టెంబర్ 5న ఉగ్రవాదులు హైజాక్ చేశారు. విమానంలో 316 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు. విమానం నుంచి ముందుగా తాను తప్పించుకునేందుకు వీలున్నా, ఆమె అలా చేయకుండా ముందుగా ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపింది. అయితే, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆమె బలైపోయింది. భారత ప్రభుత్వం ఆమెకు మరణానంతరం ‘అశోక్‌చక్ర’ ప్రకటించింది.

 

చీకటి నేపథ్యం... వెలుగు ప్రస్థానం
చీకటి మూలల్లో  నుంచి తాను వెలుగులోకి రావడమే కాదు... ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేస్తోంది నసీమా ఖటూన్. సెక్స్ వర్కర్ల పిల్లల కోసం ‘పర్చమ్’ అనే స్వచ్ఛంధ సంస్థను నిర్వహిస్తోంది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని సెక్స్‌వర్కర్ల కుటుంబంలో పుట్టిన నసీమా ఆ వృత్తికి దూరంగా ఉంది. ఆ ప్రాంతానికి కొత్తగా నియామకం అయిన  ఐఏయస్ అధికారి రాజ్‌బల వర్మ సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు రూపొందిచారు. ఆ ప్రభావంతో సెక్స్‌వర్కర్లు తమ పిల్లలకు చదువులు చెప్పించారు. పిల్లలను వ్యభిచార కూపానికి దూరంగా ఉంచారు. అలా చదువుకున్న వారిలో నసీమా కూడా ఒకరు. సెక్స్‌వర్కర్ల సంక్షేమం, హక్కులు, పిల్లల చదువుల కోసం ‘పర్చమ్’ అనే స్వచ్ఛంధ సంస్థ కృషి చేస్తుంది నసీమా. పర్చమ్ అంటే జెండా అని అర్థం.

 

జీవితంలో రెండో అవకాశం...
పదిహేడేళ్ల వయసులో ధన్‌బాద్(జార్ఖండ్)లో సోనాలి ముఖర్జీపై యాసిడ్ దాడి జరిగింది. ఇక తనకు జీవితమే లేదు అనుకుంది ఆమె. ముఖానికి అయిన 22 సర్జరీల బాధ కంటే గుండెల్లో గూడు కట్టుకున్న మానసిక బాధ సోనాలిని ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. నిందితులకు కఠిన శిక్షలు విధించడం కోసం మడమ తిప్పకుండా పోరాటం చేసింది. ఈ  తొమ్మిదేళ్ల పోరాటంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు తనలాంటి బాధితులు ఎదుర్కోకుండా ఉండాలనే సంకల్పంతో వారి తరపున పోరాడాలని నిర్ణయించుకుంది. కెబీసిలో ఒక ఎపిసోడ్ అయిన ‘దూస్రా మోకా’(సెకండ్ ఛాన్స్)లో పాల్గొనే అవకాశం  సోనాలికి వచ్చింది. ఆ సమయంలో ఆమె మాటల్లో పోరాటస్ఫూర్తి కనిపించింది. జీవితంలో సెకండ్ ఛాన్స్‌కు ఇంతకుమించిన ఇంధనం ఏముంటుంది!

 

డ్రగ్ అడిక్ట్స్‌కు జిమ్ కోచింగ్...
చిన్న సమస్యకూ, పెద్ద సమస్యకూ ‘డ్రగ్స్’ మాత్రమే పరిష్కారం అనుకొని మృత్యుముఖంలోకి అడుగు పెట్టిన యువకులకు ఇంఫాల్(మణిపూర్)లోని తన ‘యానిమల్ జిమ్’ ద్వారా సరికొత్త శక్తిని  ఇస్తున్నాడు ఆర్.కె.విశ్వజిత్. ఒకప్పటి ‘మిస్టర్ ఇండియా’ మైపాక్ శర్మ శిష్యుడైన విశ్వజిత్ ఇంటర్ కాలేజీ బాడీ బిల్టింగ్ పోటీలలో నెగ్గిన తరువాత సొంతంగా జిమ్‌ను ప్రారంభించాడు. ఆ ప్రాంతంలో డ్రగ్స్‌కు బానిసలైన కుర్రాళ్లను తన జిమ్ ద్వారా సరియైన దారిలో పెడుతున్నాడు విశ్వజిత్. ‘యానిమల్ జిమ్’ పుణ్యమా అని ఎంతో మంది డ్రగ్స్ బానిసలు ఆరోగ్యం విలువ తెలుసుకున్నారు. కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.

 

పేద విద్యార్థులకు ఆశాదీపం
వేలకు వేలు పెట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని పేద విద్యార్థుల కోసం ఆనంద్ కుమార్ ప్రారంభించిన ‘సూపర్ 30’ ప్రోగ్రామ్ ఎందరో విద్యార్థులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఐఐటీ-జేఈఈ ప్రవేశ పరీక్ష కోసం పట్నా(బిహార్)లో ‘సూపర్ 30’  ప్రోగ్రాం ప్రారంభించారు ఆనంద్. ఈ ప్రోగాంలో భాగంగా ప్రతి సంవత్సరం ఆర్థికంగా వెనకబడిన ప్రతిభావంతులైన 30 మంది విద్యార్థులను   ఎంపిక చేసుకొని ఐఐటి-జెయియి ఎంట్రెన్స్ కోసం శిక్షణ ఇస్తున్నారు. 2002లో ఆనంద్ ప్రారంభించిన ‘రామానుజ్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్’ ఇప్పుడు ‘బెస్ట్ ఇన్‌స్టిట్యూట్’గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

 

చదువుల మావయ్య
సత్యనారాయణ ముండయూర్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు గాని, అంకుల్ మూసా అంటే మాత్రం ఈశాన్య రాష్ట్రాల్లో అందరూ గుర్తుపడతారు. ఈశాన్య రాష్ట్రాల్లో  నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు ఆయన. ఈశాన్య రాష్ట్రాల్లో విద్యావ్యాప్తికి ముప్పయ్యేళ్లుగా తన జీవితాన్ని అంకితం చేసిన ముండయూర్‌ను ‘ఈశాన్య’ ప్రజలు అంకుల్ మూసా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. విద్యార్థుల్లో చదువులపై ఆసక్తి కలిగించేందుకు ఆయన తొలుత సొంత ఖర్చుతో ఒక లైబ్రరీని ఏర్పాటు చేశారు. దాతలు ముందుకు రావడంతో వారి సాయంతో మరో 13 లైబ్రరీలను నెలకొల్పారు.

 

హిమగిరులను శుభ్రపరచిన చైతన్యం
హిమాలయ శిఖరాలను అధిరోహించడమే ఘనకార్యంగా ప్రచారం పొందే పర్వతారోహకులే తప్ప, మంచుకొండలపై పేరుకుపోతున్న చెత్తను తొలగించేవారెవరు? ఆ చెత్తను అలాగే వదిలేస్తే హిమాలయాలు చెత్తదిబ్బలుగా తయారవుతాయని ఆలోచించిన ఐఎఫ్‌ఎస్ అధికారి జ్యోత్స్నా సిత్లింగ్, ఆ చెత్తను తొలగించే బృహత్తర కార్యక్రమానికి నడుం బిగించారు. హిమాలయాల పరిసరాల్లోని 82 గ్రామాల ప్రజలను చైతన్యపరచారు. వారి సహకారంతో ఒక్కో ట్రక్కులో 50 టన్నుల చొప్పున 15 ట్రక్కుల చెత్తను తొలగించి, హిమగిరి సొగసులను మళ్లీ మనసులను మురిపించేలా తీర్చిదిద్దారు.

 

సృజన వేదిక
మహిళల హక్కుల గురించి చైతన్యం,  ప్రచారం కోసం 1984లోనే ‘జుబాన్’ పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేశారు ఊర్వశి బుటాలియా. ఈ ప్రచురణ సంస్థ కేవలం దేశంలోని మహిళా రచయితలకే కాదు ఆసియాలోని మహిళా రచయితలకు సైతం వేదికగా నిలుస్తోంది. తన ప్రచురణ సంస్థ ద్వారా లైంగిక వేధింపులు, వరకట్నం వంటి సమస్యల మీద మహిళలకు అవగాహన, చైతన్యం కలిగిస్తూ యావత్ స్త్రీలోకానికే ప్రేరణ, స్ఫూర్తినిస్తున్నారు ఊర్వశి బుటాలియా.

 

 ఔను! అతడు కొండను తొలిచాడు
బీహార్‌లోని పుణ్యక్షేత్రం గయ సమీపంలో గెహ్లోర్ గ్రామం అది. ఎవరికి ఏ జబ్బు చేసినా ఆస్పత్రికి వెళ్లాలంటే కొండ చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వచ్చేది. తన గ్రామస్థుల దుస్థితికి చరమగీతం పాడాలనుకున్నాడు దశరథ్ మాంఝీ. అలాగని అతడేమీ సంపన్నుడు కాదు. నిరుపేద కార్మికుడు. అయితేనేం అతడి సంకల్పం గొప్పది. అనుకున్నదే తడవుగా పలుగు సుత్తి తీసుకుని కొండను తొలచడం మొదలుపెట్టాడు. ఒంటిచేత్తో కొండను పూర్తిగా తొలిచాడు. గ్రామస్థులు ఆస్పత్రికి వెళ్లడానికి వీలుగా దగ్గరి దారిని నిర్మించాడు. బృహత్తరమైన ఈ పని పూర్తి చేయడానికి మాంఝీకి ఇరవెరైండేళ్లు పట్టింది. ఈ పని పూర్తి చేసినప్పటి నుంచి అతడు ‘మౌంటెన్ మ్యాన్’గా పేరుపొందాడు.

 

అట్టడుగు నేపథ్యం... అసామాన్య విజయం
మహారాష్ట్రలోని రోపెర్‌ఖేడా గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి పెరిగిన కల్పనా సరోజ్‌కు తల్లిదండ్రులు పన్నెండేళ్ల వయసులోనే పెళ్లిచేశారు. అత్తింట్లో వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చేసింది. చుట్టుపక్కల జనాల సూటిపోటి మాటలు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది. స్వగ్రామంలో ఉండలేక బాబాయితో ముంబై వెళ్లింది. ప్రభుత్వ రుణసాయంతో చిన్న టైలరింగ్ వ్యాపారం మొదలుపెట్టి, తోటి మహిళలకు ఉపాధి కల్పించింది. తర్వాత ఒక ఫర్నిచర్ దుకాణం ప్రారంభించి, అంచెలంచెలుగా విస్తరించింది. ఆమె వ్యాపార సామ్రాజ్యం విలువ ఇప్పుడు రూ.747 కోట్లకు పైచిలుకు ఉంటుంది.

 

అక్షరాలా వృక్ష కోటీశ్వరుడు
ఆయన అక్షరాలా వృక్ష కోటీశ్వరుడు. ‘వృక్షో రక్షతి రక్షితః’ అనేదే ఆయన నమ్మిన సిద్ధాంతం, ఆయన ప్రచారం చేసే నినాదం. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన దారిపల్లి రామయ్యను ఆయన గురించి తెలిసిన వారంతా ‘చెట్ల రామయ్య’ అని పిలుస్తారు. సామాన్య రైతు అయిన రామయ్యకు నీడనిచ్చే చెట్ల మీద తగని మక్కువ. ైఎక్కడ ఖాళీస్థలం కనిపించినా, అక్కడ మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకున్నారాయన. ఇప్పటి వరకు ఏకంగా కోటికి పైగానే మొక్కలు నాటారు. అందుకే ఆయన అక్షరాలా వృక్ష కోటీశ్వరుడు. తన కొడుకు పెళ్లికి వచ్చిన అతిథుల్లో ఒకరు కానుకగా రూ.5 వేలు చదివిస్తే, ఆ మొత్తాన్ని కూడా మొక్కలు నాటడానికే వినియోగించిన నిబద్ధత ఆయనది.

 

మనతరం మహాదాత
శిబి చక్రవర్తి, రంతిదేవుడు వంటి మహాదాతలు పురాణాల్లోనే కాదు, అత్యంత అరుదుగానైనా మన కాలంలోనూ ఉంటారనడానికి నిలువెత్తు నిదర్శనం కళ్యాణ సుందరం. చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న ఆయన తల్లి ఇచ్చిన స్ఫూర్తితో నిరుపేదల పట్ల సేవానిరతిని పెంచుకున్నారు. తమిళనాడులో లైబ్రేరియన్‌గా పనిచేసి రిటైరైన కళ్యాణ సుందరం రిటైర్మెంట్ తర్వాత తనకు వచ్చిన డబ్బు మొత్తాన్ని అనాథ బాలల కోసం విరాళంగా ఇచ్చేశారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా పేదల కోసం ఉదారంగా ఖర్చు చేసేవారు. చివరకు అవార్డుగా లభించిన రూ.30 కోట్ల మొత్తాన్నీ విరాళంగా ఇచ్చేసి, చిన్నా చితకా ఉద్యోగాలతో కాలం వెళ్లదీస్తున్నారు.

 

 ‘స్వచ్ఛ’భారతీయుడు
పట్టణాల్లోని మురికివాడల్లో, మారుమూల పల్లెల్లో నివసించే చాలామంది బహిర్భూమికి వెళ్లాలంటే ఆరుబయలునే ఆశ్రయిస్తున్నారు. మహిళలకు మరీ ఇబ్బందికరంగా ఉంటున్న ఈ పరిస్థితిని మార్చాలనుకున్నాడు స్వప్నిల్ చతుర్వేది. ‘మా బడిలో టాయిలెట్ చాలా కంపు కొడుతోంది’ అని తన కూతురు చెప్పిన మాటలు అతడిని ఆలోచనలో పడేశాయి. దేశంలోని ఆడపడుచుల ఆత్మగౌరవానికి ఎలాంటి ఇబ్బందిలేని రీతిలో కొత్త తరహా టాయిలెట్లకు రూపకల్పన చేశాడు. వీటి నుంచి విద్యుదుత్పాదనతో పాటు ఎరువు తయారయ్యేలా తయారు చేశాడు. ‘సమగ్ర’ సంస్థను నెలకొల్పి మారుమూల ప్రాంతాలకు ఈ టాయిలెట్లు చేరేలా కృషి చేస్తున్నాడు.

 

ఉగ్రవాదుల భరతం పట్టిన వీరనారి
సైనికురాలు కాదు, కనీసం పోలీసు కూడా కాదు. సాదాసీదా కశ్మీరీ అమ్మాయి రుక్సానా కౌసర్. ఇంటిపై దాడిచేసిన లష్కరే తోయిబా ఉగ్రవాదులపై గండ్రగొడ్డలి తీసుకుని అపరకాళిలా విరుచుకుపడింది. అప్పటికి ఆమె వయస్సు పట్టుమని పదిహేనేళ్లు. రాజౌరీ జిల్లా థానామండీలోని రుక్సానా ఇంటిపై 2009 సెప్టెంబర్ 27న లష్కరే ఉగ్రవాదులు దాడి చేశారు. రుక్సానాను తమకు అప్పగించమని డిమాండ్ చేశారు. నిరాకరించడంతో ఆమె కుటుంబ సభ్యులను చితకబాదడం మొదలుపెట్టారు. తట్టుకోలేక పోయిందామె. చేతికి దొరికిన గండ్రగొడ్డలి తీసుకుని లష్కరే కమాండర్ నెత్తిన ఒక్కటిచ్చుకుంది. అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

 

పేదరోగుల పాలిటి ఔషధదాత
ఢిల్లీలో ఎనిమిదేళ్ల కిందట ఒక వంతెన కూలిపోయినప్పుడు పలువురు నిరుపేద కార్మికులు గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగిన చికిత్స లభించక, మందులు కొనుక్కొనే స్థోమత లేక వాళ్లంతా నానా ఇక్కట్లు పడ్డారు. వారి పరిస్థితికి చలించిపోయారు ఓంకార్‌నాథ్ శర్మ. అప్పుడు తలెత్తిన ఆలోచనతోనే బ్లడ్‌బ్యాంక్ టెక్నీషియన్‌గా రిటైరైన శర్మ పేద రోగుల కోసం ఇంటింటికీ వెళుతూ మందుల సేకరణ ప్రారంభించారు. ధనికుల ఇళ్లలో వాడగా మిగిలిపోయిన మందులు సేకరించి, వాటిని అవసరమైన రోగులకు ఉచితంగా అందజేయడం ప్రారంభించారు. ఈ సేవానిరతితోనే ఢిల్లీలో ఆయన ‘మెడిసిన్ బాబా’గా ప్రసిద్ధుడయ్యారు.

 

ప్రభుత్వాన్నే దారికి తెచ్చిన వీర వనితలు
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో జరిగిన తొలి పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా చిప్కో ఉద్యమం చరిత్ర పుటల్లోకి ఎక్కింది. అడ్డగోలుగా అడవుల నరికివేతకు సిద్ధపడ్డ ప్రభుత్వాధికారులకు సామాన్య మహిళల నుంచి అనుకోని ప్రతిఘటన ఎదురైంది. హిమాలయాలకు దిగువన ఉన్న కుగ్రామంలో గౌరాదేవి అనే సామాన్య మహిళ నాయకత్వంలో 1974 మార్చి 26న స్థానిక మహిళలు నరికివేతకు ఎంపిక చేసిన చెట్లను వాటేసుకుని నిరసన ప్రకటించిన ఉదంతం అప్పట్లో పతాక శీర్షికలకెక్కింది. తమ కంఠంలో ప్రాణం ఉండగా చెట్లను నరకనివ్వబోమని మహిళలంతా ముక్తకంఠంతో నినదించడంతో అప్పటి యూపీ ప్రభుత్వం దిగివచ్చింది.

 

‘ఉగ్ర’దాడిలో  నేలకూలిన వీరులు
ముంబైలోని కీలక ప్రదేశాల్లోకి చొరబడిన ఉగ్రవాదుల చెర నుంచి అమాయకులను కాపాడే క్రమంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే అశువులు బాశారు. 2008 నవంబర్ 11న జరిగిన ఆ ‘ఉగ్ర’దాడిలో గాయపడిన సహచరుడిని తప్పించి మరీ ఉగ్రవాదులను ఎదుర్కొన్న సాహసి సందీప్ ఉన్నికృష్ణన్. అదే సమయంలో ఉగ్రవాదుల చెరలో చిక్కిన అమాయకులను కాపాడేందుకు తుదిశ్వాస వరకు కర్కరే వీరోచిత పోరాటం చేశారు. వీరిద్దరితో పాటు ఆ సంఘటనలో ఏఎస్సై తుకారాం ఓంబ్లే, ఏసీపీ అశోక్ కామ్తే, ఇన్‌స్పెక్టర్ విజయ్ సాలస్కర్‌లు కూడా ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. వీరిలో తుకారాం ఓంబ్లే తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను పట్టించడంలో కీలక పాత్ర పోషించారు.

 

ఆమె జీవితం ‘సేవ’కు అంకితం
పేదరికాన్ని మించిన హింస లేదని చెప్పే ఇళా భట్ మహిళల స్వావలంబన కోసం దశాబ్దాలుగా అవిరళ కృషి సాగిస్తున్నారు. నిరుపేద మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనే సంకల్పంతో ‘సెల్ఫ్ ఎంప్లాయ్‌డ్ విమెన్స్ అసోసియేషన్’ (సేవ) స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. అధ్యాపకురాలిగా కెరీర్ ప్రారంభించిన ఇళా భట్ కొద్దికాలమే బోధనారంగంలో కొనసాగారు. న్యాయశాస్త్రం చదువుకున్న ఆమె కార్మికుల హక్కుల కోసం పోరాడారు. నిరుపేదలకు చేతనైన మేలు చేయాలనే ఉద్దేశంతో  సేవారంగం వైపు మళ్లి, తన జీవితాన్ని నిరుపేదల సేవకే అంకితం చేశారు.

 

ప్రాణాలను కాపాడిన పసివాడు
ముక్కుపచ్చలారని పద్నాలుగేళ్ల పసిబాలుడు సాగర్ కాశ్యప్. తన ప్రాణాలకు తెగించి మరీ మూడు నిండు ప్రాణాలను కాపాడాడు. మత్స్యకారుడైన తన తండ్రి భోలానాథ్‌కు భోజనం అందించి ఇంటికి తిరిగి వెళుతుండగా, నలుగురు పిల్లలు ఆగ్నేయ ఢిల్లీ వద్ద యమునా నది కాలువలో మునిగిపోతూ కనిపించారు. మరో ఆలోచన చేయకుండా కాలువలోకి దూకేసిన సాగర్ కాశ్యప్ ముగ్గురు పిల్లలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. మరో పన్నెండేళ్ల బాలుడిని మాత్రం కాపాడలేకపోయాడు. సాగర్ సాహసానికి గుర్తింపుగా అతడికి జాతీయ సాహస బాలుర అవార్డు దక్కింది.

 

కీచకాలపై కడదాకా పోరాడిన ధీరుడు
అబలలపై సాగుతున్న కీచకాలను కడదాకా ఎదిరించిన ధీరుడు బరుణ్ బిశ్వాస్. పదహారేళ్ల కిందట పశ్చిమబెంగాల్‌లోని సుతియా పట్టణంలో ఒక గూండా ఆధ్వర్యంలో కీచకపర్వం రాజ్యమేలేది. స్కూల్ టీచర్ అయిన బరుణ్ బిశ్వాస్ ఈ ఘాతుకాలను సహించలేకపోయాడు. అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితపరచాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేలా అత్యాచార బాధితులను చైతన్యపరచాడు. ప్రధాన నిందితుడితో పాటు మరికొందరు అరెస్టుకు దోహదపడ్డాడు. బరుణ్‌పై కక్ష పెంచుకున్న దుండగులు 2012 జూలై 5న అతడిపై వెనుక నుంచి కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు.

 

సమాచార విప్లవానికి మూలపురుషుడు
ఇప్పుడంటే సమాచార రంగంలో ‘2జీ’ పాతబడిపోయి 3జీ, 4జీల కాలం నడుస్తోంది. ఇంతకీ వీటికి మూలాధారమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరు అందించారో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో చాలామందికి తెలీదు. ఫైబర్ ఆప్టిక్స్ పరిజ్ఞానం లేకుంటే ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చేవే కాదు. సామాన్యుల చేతుల్లోని స్మార్ట్‌ఫోన్లు  కపానీ చలవే. ఆగ్రా వర్సిటీలో చదువుకుని, అమెరికాలో సొంత కంపెనీని స్థాపించి స్థిరపడ్డ నరీందర్‌సింగ్ కపానీ ఫైబర్ ఆప్టిక్స్ పరిజ్ఞానానికి ఆద్యుడు. భారత్‌లో చేపట్టే పలు సేవా కార్యక్రమాలకు కపానీ ఉదారంగా విరాళాలు ఇస్తూ, దేశం పట్ల తన నిబద్ధతను ఇప్పటికీ చాటుకుంటున్నారు.

 

శత్రువుకు తలవంచని వీరసేనాని
దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌తో 1947-48లో జరిగిన తొలి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరసేనాని బ్రిగేడియర్ మహమ్మద్ ఉస్మాన్. నౌషేరా పోరులో పాక్ సేనలను ముప్పుతిప్పలను పెట్టిన బ్రిగేడియర్ ఉస్మాన్‌ను ‘నౌషేరా కా షేర్’ అని ప్రజలు తలచుకుంటారు. పాక్ ప్రభుత్వం ఆయన తలపై రూ.50 వేలు ప్రకటించింది. తమకు సానుకూలంగా మారితే ఆర్మీచీఫ్ పదవి ఇస్తామని కూడా ప్రలోభపెట్టినా తలవంచకుండా, దేశ రక్షణ కోసం తుదిశ్వాస వరకు పోరాటం సాగించారు.

 

విజయం సాధించి వీరస్వర్గానికి...
పాకిస్థాన్‌తో 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి వీరస్వర్గానికేగిన వీరజవాను మేజర్ పద్మపాణి ఆచార్య. ఆచార్య ఒడిశాలో పుట్టినా, ఆయన కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. పద్మపాణి తండ్రి జగన్నాథ ఆచార్య భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పనిచేశారు. పాకిస్థాన్‌తో జరిగిన రెండు యుద్ధాల్లో పాల్గొన్న అనుభవం ఆయనది. తండ్రి బాటలోనే సైన్యంలో చేరిన పద్మపాణి ఆచార్య కార్గిల్ వద్ద పాక్ బలగాలు ఆక్రమించుకున్న టోలోలింగ్ స్థావరాన్ని కైవసం చేసుకునే బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించారు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ తన బలగాలను విజయపథంలో నడిపించారు.

Advertisement
Advertisement