కాపీ కొట్టినా కమల్‌దే పై చేయి! | Sakshi
Sakshi News home page

కాపీ కొట్టినా కమల్‌దే పై చేయి!

Published Sun, Oct 25 2015 6:00 PM

కాపీ కొట్టినా కమల్‌దే పై చేయి!

ఆ సీన్ - ఈ సీన్
కమల్‌హాసన్‌ని విశ్వనాయకుడు అంటారు. కేవలం తన స్టార్‌డమ్‌తోనే కాదు, యూనివర్‌‌సలోని ఎక్కడెక్కడి సినిమాలనో కాపీ చేయడం ద్వారా కూడా ఆయన తన బిరుదును జస్టిఫై చేస్తుంటా డేమో అనిపిస్తుంది ఒక్కోసారి! కమల్ సినిమాల్లో కాపీలు చాలానే ఉన్నాయి. వాటిలో ‘బ్రహ్మచారి’ ఒకటి. కమల్ సన్నిహితుడైన రచయిత క్రేజీమోహన్ ఈ బ్రహ్మచారి సృష్టికర్త. అయితే ఈ క్రియేషన్‌లో అమెరికన్ బ్రహ్మచారిని ఫాలో అయ్యాడాయన.
 
ఒక మిలియనీర్‌కి వారసుడు జిమ్మీ షానన్. తన ఫ్రెండ్‌‌సతో కలిసి రెస్టారెంట్ బిజినెస్ నడుపుతూ... ఇంటికి దూరంగా బతుకుతూ ఉంటాడు. ఇతగాడు మొదట ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే తన స్నేహితులందరి వైవాహిక జీవితాలూ విఫలమవడం చూసి పెళ్లిపై అయిష్టతను పెంచుకుంటాడు. ప్రేయసికి దూరమవు తాడు. జిమ్మీకి వివాహం చేయాలని తపిస్తూ ఉంటారు ఇంట్లోవాళ్లు. ఒక సంబంధం చూస్తే దాన్ని కూడా జిమ్మీ తిరస్కరిస్తాడు. అంతలో జిమ్మీ తాతయ్య.. పెళ్లి చేసుకుంటేనే జిమ్మీకి ఆస్తి దక్కు తుందని, లేకపోతే ప్రభుత్వానికి స్వాధీనం అవుతుందనే క్లాజ్‌తో చిత్రమైన వీలునామా రాసి మరణిస్తాడు.

పెళ్లికి అతి తక్కువ సమయాన్ని గడువుగా పెడతాడు. దాంతో ఆస్తిని దక్కించుకోవడం కోసమైనా వివాహం చేసుకోవాలని తన మాజీ ప్రేయసి దగ్గరకు వెళ్తాడు జిమ్. కానీ మిస్ కమ్యూనికేషన్ వల్ల ఒకరినొకరు అపార్థం చేసుకుని దూరమవుతారు. అక్కడి నుంచి హీరో కష్టాలు మరింత తీవ్రం అవుతాయి. గడువులోగా పెళ్లి చేసుకోవడానికి, అందులోనూ తనకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అతడు పడే పాట్లే ‘ద బ్యాచిలర్’ సినిమా మిగతా కథ.  
 1999లో వచ్చిన ఈ చిత్రానికి, 2002లో వచ్చిన ‘బ్రహ్మచారి’ సినిమాను కార్బన్ కాపీ అనలేం. అలా అని కాపీ కాదనీ అనలేం.

అవకాశం ఉన్న చోట మార్పులు చేసుకుంటూ సినిమాకు కొత్తదనాన్ని అద్దారు. రెండు సినిమాల మధ్య ప్రధాన పోలికలన్నీ మలుపుల వద్ద కనిపిస్తాయి. ఆంగ్ల సినిమా నుంచి థీమ్ పాయింట్‌ను తీసుకున్న కమల్ హాసన్ అండ్ కో... తమ సినిమాకు కొత్త తరహా ట్రీట్‌మెంట్‌ను ఇచ్చారు. పెంటపాడు కల్యాణ సంబంధం (పీకేఎస్) కు పెళ్లంటే విరక్తి. ఇతడి గ్యాంగ్‌లో మెంబర్ అయిన అబ్బాస్‌కు పెళ్లి చేశాక అతడి వైవాహిక జీవితంలో కలతలు రేగడంతో వివాహం అంటే మరింత ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఇలాంటి నేపథ్యంలో ఇంట్లోవాళ్లు బంధువులమ్మా యిని పెళ్లి చేసుకొమ్మని కోరతారు.

సంబంధం దాన్ని తిరస్కరిస్తాడు. ఇలాంటి నేపథ్యంలో ఒక గడువును పెట్టి, ఆ లోపు వివాహం చేసుకోకపోతే సంబంధం అధీనంలో ఉండే లాడ్జి కులసంఘానికి చెందేటట్టు వీలునామా రాస్తాడు వాళ్ల తాతయ్య. ఆ విషయం తెలిసిన సంబంధం అప్పటికే తనకు పరిచయమైన జానకిని  (సిమ్రాన్) పెళ్లాడాలనుకుంటాడు. అది కుదరదని అర్థమై, బంధువుల అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతాడు. తీరా పెళ్లికి అంతా రెడీ అనుకున్నాక హీరోయిన్ మళ్లీ ఎంట్రీ ఇస్తుంది. హీరోని పెళ్లాడతానని అంటుంది. ఆ తర్వాత కామెడీ ట్విస్టులతో సంబంధం వాళ్ల తాతయ్య పెట్టిన షరతుకు లోబడి లాడ్జిని సొంతం చేసుకుంటాడు.
 
కథ, కథనాల్లో ఎలాంటి మార్పులూ ఉండవు, మిగతా విషయాల్లో ఎక్కడా పోలికలు ఉండవు అన్నట్టుగా ఉంటుంది ఈ రెండు సినిమాల పరిస్థితి. హీరోని అంజనేయస్వామి భక్తుడిగా చూపించి అందుకే అతడు పెళ్లిని ఇష్టపడటం లేదని చెప్పి సినిమాను లోకలైజ్ చేశారు. ప్రీ లవ్‌స్టోరీ అవసరం లేకుండా చేసుకున్నారు ఈ ఎత్తుగడ ద్వారా. అక్కడి నుంచి క్యారెక్టర్ల మధ్య కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేసి నవ్వుల్లో ముంచెత్తతూ ‘బ్రహ్మచారి’ పరుగులు పెడతాడు. మన పొట్టలు పగిలేలా చేస్తాడు. ఇక హీరో, హీరోయిన్ల మధ్య పరిచయ సన్నివేశాలు... అబ్బాస్, స్నేహ క్యారెక్టర్ల మధ్య సీన్లను కొత్తగా క్రియేట్ చేసి తమ మార్కును చూపించారు రచయితలు.
 
కానీ దర్శకుడు మౌళి ఈ సినిమాను ఎంతగా పక్కకు లాగినా ఓవరాల్‌గా ‘ద బ్యాచిలర్’ రూట్‌లోనే నడుస్తుంది. అయితే కామెడీ మాత్రం పీక్స్‌లో ఉంటుంది. కమల్ నటన పతాకస్థాయిలో ఉంటుంది. ఓపక్క నవ్విస్తూనే... హీరోయిన్ తన ప్రేమకు నో చెప్పినప్పుడు, తాతయ్య చనిపోయి నప్పుడు కన్నీళ్లు పొంగిస్తాడు కమల్. గుండెల్ని పిండేస్తాడు. కాపీ సినిమాని సైతం తన తరహాలో రక్తి కట్టించాడు. దాన్ని బట్టి కాపీ కొట్టినా కమల్‌దే పై చేయి అనుకోవాలి!
- బి.జీవన్‌రెడ్డి

Advertisement
Advertisement