విపరీతం: ముందే ఒక మాట అనేసుకుంటున్నారు! | Sakshi
Sakshi News home page

విపరీతం: ముందే ఒక మాట అనేసుకుంటున్నారు!

Published Sun, Apr 27 2014 1:43 AM

విపరీతం: ముందే ఒక మాట అనేసుకుంటున్నారు! - Sakshi

విడాకులు కూడా ఓ శుభపరిణామంగా అనిపించే రోజులు వచ్చేస్తున్నాయి. పెళ్లిలో ప్రమాణ పత్రాలు రాయించని వారు కూడా  ముందే విడాకుల పత్రాలు రాసేసుకుంటున్నారు! కలిసి ఉంటే ఎలా చూసుకుంటారో చెప్పట్లేదు గాని విడిపోతే ఎంత కావాలో/ఇవ్వాలో ఒక మాట అనేసుకుంటున్నారు. ఈ ధోరణి ఇంకా ఇండియాలో మొదలైనట్లు లేదు. పాశ్చాత్య దేశాలలో మాత్రం విడాకుల సెటిల్‌మెంట్ సంప్రదాయం సంపన్నులలో ఎప్పుడో మొదలైంది. ఈ సందర్భంలో ప్రపంచంలోని కొన్ని ఖరీదైన విడాకుల సెటిల్‌మెంట్‌ల గురించి తెలుసుకుందాం.
 
 వ్యాపార ఒప్పందాల కంటే ఈ విడాకుల ఒప్పందాలే భారీగా ఉంటున్నాయి. ‘వదిలించుకోవడానికి’ బిలియన్లకొద్దీ డబ్బును అలా అలా ధార పోసేస్తున్నారు. పోనీ ఇదేమైనా పెళ్లయిన కొత్తలో సరదాగా చేస్తున్నారా అంటే అదీ కాదు. పెళ్లయిన పది, ఇరవై, ముప్పై ఏళ్లకు విడిపోతున్న వారి ఖరీదైన విడాకుల ఒప్పందాలివి.
 
 రూపర్ట్ మర్డోక్ - ఈ మీడియా టైకూన్‌ది విడాకుల విషయంలో ప్రపంచ రికార్డు. అన్నా మర్డోక్‌తో 1999లో ఆయన విడాకులకు వెళ్లాడు. చిత్రమేంటంటే.. వారికి ముగ్గురు పిల్లలు. 32 సంవత్సరాలు కలిసి కాపురం చేశారు. అనంతరం విడిపోవాలని నిశ్చయించుకున్నారు! అన్నా నుంచి విడాకుల కోసం ఆమెకు ఆయన ఇచ్చిన సొమ్ము 170 కోట్ల డాలర్లు. ఇదే అతిపెద్ద డీల్ అనుకుంటే సరిగ్గా అన్నాతో విడిపోయిన 17 రోజులకు మర్డోక్.. వెండి డెంగ్ అనే అమ్మాయిని పెళ్లాడాడు. డెంగ్ వయసు మర్డోక్ వయసులో సగం. విశేషం ఏమిటంటే 82 సంవత్సరాల వయసులో ఆమెతో కూడా ఆయన విడిపోయారు. మళ్లీ సెటిల్‌మెంటు. ఈసారి అది మరో పదికోట్ల డాలర్లు పెరిగింది. రెండు విడాకుల సెటిల్‌మెంట్ల కోసం ఆయన పెట్టిన ఖర్చు 350 కోట్ల డాలర్లు. అంటే సుమారు 21 వేల కోట్ల రూపాయలు. రెండో విడాకుల ఒప్పందం 2013లో జరిగింది.
 
 అలెక్ నాథన్ - ఈయన ఫ్రెంచ్ బిజినెస్ మేగ్నెట్. అనేక వ్యాపారాలున్నాయి. ఒక రేస్‌కోర్సు ఉంది. న్యూయార్క్‌లో పుట్టిపెరిగిన ఈయన ఫ్రాన్స్‌లో ఎదిగాడు. నూయార్క్‌కు చెందిన మొదటి భార్య జోసెలిన్‌తో చేసుకున్న విడాకుల ఒప్పందంలో అలెక్ 380 కోట్ల డాలర్లు సమర్పించుకున్నాడు. అంత డబ్బు జోసెలిన్ ఏం చేసుకుంటుందా అనుకుంటున్నారా? అమె గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే... ముఖానికి అతిఖరీదైన ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్న మహిళగా ఆమె ప్రఖ్యాతి గాంచారు.
 
 ఆమె ఒక నెల ఫోన్‌బిల్ 36 లక్షలు (రూపాయల్లో) దాటిందంటే... ఆమె రిలేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. అయితే ఆమె కుదుర్చుకున్న విడాకుల ఒప్పందాన్ని చాలామంది హర్షించలేదు. డబ్బు కోసమే విడిపోయిందనే ఆరోపణలు కూడా వచ్చాయి ఆమె మీద! అతి ఖరీదైన జీవితం గడిపే సెలబ్రిటీల్లో ఆమె ఒకరు. ఈ విడాకుల సంగతి 1999 నాటిది. విడిపోయిన రోజున 250 కోట్ల డాలర్లు, ఆ తర్వాత 13 ఏళ్ల పాటు ఏడాదికి పది కోట్ల డాలర్లు జోసెలిన్ పొందారు.
 
 బెర్నీ - ఈయన ఫార్ములా వన్ సీఈవో. ఇతను తనకంటే ఒక అడుగు ఎత్తున ఉండే స్లేవికాను పెళ్లాడారు. కొంతకాలం కలిసున్నాక 2009లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ 28 సంవత్సరాల వయసు అంతరం ఉంది. స్లేవికా ఆర్మాని (అంతర్జాతీయ బ్రాండ్) మోడల్. వీరిదో విచిత్రమైన స్టోరీ. క్రొయేషియాకు చెందిన ఆమెకు క్రొయేషియన్, ఇటాలియన్ భాషలు మాత్రమే వచ్చు. బెర్నీకి ఇంగ్లిష్ ఒక్కటే వచ్చు. వయసు, భాష పూర్తిగా విరుద్ధమైనా 23 ఏళ్లు కలిసున్నారు. అనంతరం విడిపోయారు.
 
 వీరి విడాకుల ఒప్పందం విలువ వారు అధికారికంగా బహిర్గతం చేయకపోయినా బయటకు తెలిసినంత వరకు 120 కోట్ల డాలర్లు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక బిలియన్ డాలర్ల నుంచి కిందకు వస్తే ఆ డీల్స్ కూడా తక్కువేం లేవు. సౌదీ బిలియనీర్ అండాన్-సొరయా ఖషోగి విడాకుల ఒప్పందం విలువ 87.4 కోట్ల డాలర్లు. కాసినో రిసార్ట్స్ వైయాన్ అధినేత స్టీవ్-ఎలైన్ వైన్ విడాకుల ఒప్పందం విలువ 74 కోట్ల డాలర్లు. సీటెల్ ఏరియా బిజినెస్ టైకూన్, మొబైల్ సంస్థ అధినేత క్రెయిగ్-వెండీ ఒప్పందం విలువ 46 కోట్ల డాలర్లు.
 
 ఫ్యాషన్ సెలబ్రిటీ, నటుడు మెల్ గిబ్సన్-రాబిన్ ఒప్పందం విలువ 42.5 కోట్ల డాలర్లు.
 అమెరికాకు చెందిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ బిలియనీర్ రాబర్ట్-షీలా జాన్సన్ ఒప్పందం విలువ 40 కోట్ల డాలర్లు. ఇప్పుడు కోట్లలో కనిపిస్తున్న డాలర్లన్నీ మన రూపా యల్లో చూస్తే వందల కోట్లే!
 

Advertisement

తప్పక చదవండి

Advertisement