హంతకులనే హడలెత్తించాడు | Sakshi
Sakshi News home page

హంతకులనే హడలెత్తించాడు

Published Sun, May 4 2014 12:20 PM

హంతకులనే హడలెత్తించాడు

నిజాలు దేవుడికెరుక
 
ఈ లోకంలో ఎందరో మనుషులున్నారు. మనుషుల రూపంలో సంచరిస్తోన్న రాక్షసులు కూడా ఉన్నారు. అలాంటి ఓ రాక్షసుడే... సగావా. జపాన్‌కి చెందిన ఇతగాడు ఫ్రాన్‌‌సలో ఓ ఘోరానికి పాల్పడ్డాడు. దాని గురించి తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. వెన్నులోంచి వణుకు పుడుతుంది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా, ఇలాంటి వాళ్లని మనుషులు అనాలా అని సందేహం కలుగుతుంది!
 
 
 జూన్ 12, 1981... ఫ్రాన్స్‌లోని బోయిస్ డే బోల్గోన్ ప్రాంతం. మధ్యాహ్నం రెండున్నర కావస్తోంది.
 ‘‘ఏంటోరా... ఈ మధ్య ఎంత కష్టపడినా సంపాదన మాత్రం పెరగడం లేదు’’... నిరాశగా అన్నాడు ఆల్డ్‌రిక్.
 ‘‘నిజమేరా... మన బతుకులు ఎప్పుడు బాగుపడతాయో ఏమో’’... ఇంకా దిగులుగా అన్నాడు గిల్బర్ట్.
 ఇద్దరూ మధ్యాహ్న భోజనానికని ఇళ్లకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా దారిలో తారసపడ్డారు. కష్టసుఖాల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు.
 ‘‘నీ పని కాస్త ఫర్వాలేదులేరా. షాపులో పని చేస్తున్నావ్. నీడపట్టున ఉంటావ్. నెలయ్యేసరికి జీతం వస్తుంది. వారానికో రోజు సెలవు. నేనే... గాడిపొయ్యి దగ్గర మాడి మసైపోతున్నాను.’’
 ఫక్కున నవ్వాడు గిల్బర్ట్. మూతి ముడిచాడు ఆల్డ్‌రిక్.
 ‘‘‘‘కోపం తెచ్చుకోకురా... నీకొచ్చింది నువ్వు చేస్తున్నావ్, నాకొచ్చింది నేను చేస్తున్నాను. పనుల్లో తేడా ఉందేమో కానీ బతుకులు ఒకటే కదరా’’ అన్నాడు స్నేహితుడిని శాంతపర్చడానికన్నట్టు. అవునన్నట్టు తలూపాడు ఆల్డ్‌రిక్.
 ‘‘అది సరేకానీ... వాడెవడ్రా, ఇంత మిట్టమధ్యాహ్నం సూట్‌కేసులు పట్టుకుని పార్కులోకి వెళ్తున్నాడు?’’
 ఆల్డ్‌రిక్ అలా అనగానే అటువైపు చూశాడు గిల్బర్ట్. కాస్త దూరంగా ఓ వ్యక్తి పార్కులోకి వెళ్తూ కనిపించాడు. ముప్ఫైకీ ముప్ఫై అయిదుకీ మధ్య ఉంటుంది వయసు. పొట్టిగా ఉన్నాడు. చేతిలో రెండు సూట్ కేసులు ఉన్నాయి. ఆ సమయంలో సూట్ కేసులు పట్టుకుని పార్క్‌లోకి వెళ్లడమేంటో అర్థం కాలేదు వాళ్లకి. అటువైపే చూస్తూ నిలబడ్డారు.
 పది నిమిషాల తర్వాత మళ్లీ రోడ్డుమీదికి వచ్చాడా వ్యక్తి. చేతిలో సూట్‌కేసులు లేవు. గబగబా నడచుకుంటూ పోతున్నాడు. అతడి కంగారు చూసి అనుమానమొచ్చింది గిల్బర్ట్‌కి.
 ‘‘వీడేదో కాస్త తేడాగా ఉన్నాడ్రా...’’ అన్నాడు.
 ‘‘నాకూ అదే అనిపిస్తోంది. ఆ సూట్ కేసులేం చేసినట్టు? వెళ్లి చూద్దామా లోపలెక్కడైనా పెట్టాడేమో’’ అన్నాడు ఆల్డ్‌రిక్.
 ‘‘నోర్మూసుకో. అందులో ఏముందో ఏమో. పోలీసులకు చెబుదాం పద.’’
 పోలీసులనగానే కంగారుపడ్డాడు ఆల్డ్‌రిక్. ‘‘మనకెందుకొచ్చిన గొడవ. వద్దులే’’ అన్నాడు భయంగా.
 ‘‘నీకు భయమైతే రావద్దు. నాకెందుకో ఏదో జరిగిందనిపిస్తోంది. వెళ్లి పోలీసులకు చెబుతా’’ అంటూ బయలుదేరాడు గిల్బర్‌‌ట. మనసులో కాస్త భయంగా ఉన్నా స్నేహితుడిని ఒంటరిగా పంపలేక తను కూడా బయలుదేరాడు ఆల్డ్‌రిక్.
    
 ‘‘ఎక్కడ?’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ చుట్టూ చూస్తూ. గిల్బర్ట్, ఆల్డ్‌రిక్‌లు వచ్చి విషయం చెప్పగానే వాళ్లనీ, తన టీమ్‌నీ తీసుకుని పార్క్ దగ్గరకు వచ్చాడు.
 ‘‘ఇక్కడ్నుంచి లోపలకు వెళ్లాడు సార్’’... చెప్పాడు గిల్బర్ట్.
 ‘‘మీరెక్కడ్నుంచి చూశారు? అతడు మిమ్మల్ని చూడలేదా?’’
 ‘‘లేదు సార్... మేము కాస్త దూరంగా ఉన్నాం. కనిపించివుండం.’’
 తల పంకించి లోనికి నడిచాడు ఇన్‌స్పెక్టర్. మిగతా వారంతా అతడిని అనుసరించారు. లోనికి వెళ్లి అంతా పరిశీలించారు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. చివరికి ఓ బెంచీ వెనుకగా రెండు సూట్‌కేసులు కనిపించాయి. వెంటనే వాటిని తెరచి చూశారు. అంతే... ఆశ్చర్యం, భయం, జుగుప్స... అన్నీ ఒకేసారి కలిగాయి వారికి. ఆల్డ్‌రిక్ అయితే అరిచినంత పనిచేశాడు. గిల్బర్ట్ అటువైపు చూడలేక కళ్లు మూసుకున్నాడు.
 ‘‘మై... గా... డ్..’’... అస్పష్టంగా పలికాయి ఇన్‌స్పెక్టర్ పెదవులు. సబార్డినేట్లు నోటమాట రాక అలా చూస్తూండిపోయారు. వాళ్ల జీవితాల్లో అలాంటి దృశ్యాన్ని ఇంతవరకూ చూడలేదు.
 ఒక సూట్‌కేసులో రక్తంతో తడిసిన దుస్తులు, ఆభరణాలు, చెప్పులు, పెద్ద కత్తి ఉన్నాయి. రెండోదానిలో ఓ అమ్మాయి మొండెం ఉంది. తల, చేతులు లేవు. మెడ నుంచి నడుము వరకూ మాత్రమే ఉంది. ఉన్న ఆ కాస్త శరీరం మీద కూడా అక్కడక్కడా మాంసం ముద్దలు కోసేసి ఉన్నాయి. ఒక వక్షోజం కూడా లేదు.
 చూడ్డానికే భయంకరంగా ఉంది ఆ దృశ్యం. వెంటనే సూట్‌కేసులు మూసేసి పోస్ట్‌మార్టమ్‌కి పంపించేశాడు ఇన్‌స్పెక్టర్.
 ‘‘మీరు అతణ్ని గుర్తుపట్టగలరా?’’ అని అడిగాడు గిల్బర్ట్‌ని.
 ‘‘దూరం నుంచి చూశాం కదా... ముఖం ఎలా ఉంటుందో తెలీదు సార్. కానీ చాలా పొట్టిగా ఉన్నాడు. మహా అయితే ఐదడుగులుంటాడేమో. కానీ బాగా డబ్బున్నవాడిలా ఉన్నాడు. సూటూ బూటూ వేసుకున్నాడు. అంతకంటే మేమేమీ చెప్పలేం సార్.’’
 హంతకుడిని పట్టుకోవడానికి ఆ వివరాలు చాలవు. అతడెవరో ఎలా తెలుసుకోవాలి? ఇంత దారుణంగా చంపినవాడు ఎవరో ఎలా కనిపెట్టాలి?
 అలా ఆలోచిస్తుండగా సూట్‌కేసులు గుర్తొచ్చాయి ఇన్‌స్పెక్టర్. అవి కొత్తవి. కచ్చితంగా ఆ రోజే కొని ఉంటాడు. లేబుల్స్ కూడా పీకలేదు. వాటిమీద షాపు పేరు ఉండి ఉంటుంది. వాటినెవరు కొన్నారో కనిపెడితే హంతకుడెవరో తెలిసిపోతుంది. ఆ ఆలోచన రాగానే హుషారుగా బయలుదేరాడు ఇన్‌స్పెక్టర్. అరగంటలో హంతకుడి పేరు, అడ్రస్ సంపాదించాడు.
 
 
 ‘‘ఈ అపార్ట్‌మెంటే... ఫ్లాట్ నంబర్ 10... పదండి... హర్రియప్’’
 ఇన్‌స్పెక్టర్ ఆదేశాలు వింటూనే బిలబిలమంటూ కదిలారు పోలీసులు. ఫ్లాట్ నంబర్ 10 దగ్గర మోహరించారు. కాలింగ్‌బెల్ కొట్టాడు ఇన్‌స్పెక్టర్. ఐదు నిమిషాల తరువాత తలుపు తెరచుకుంది. తలుపు తీసిన ఐదగుడుల వ్యక్తిని చూసి అడిగాడు ఇన్‌స్పెక్టర్... ‘‘ఇసై సగావా అంటే నువ్వేనా?’’
 అతడు ఏమాత్రం బెదరలేదు. అవునన్నట్టు తలాడించాడు. వెంటనే తుపాకీ తీసి అతడి తలకు గురిపెట్టాడు ఇన్‌స్పెక్టర్. ఇంటిని సోదా చేయడం మొదలు పెట్టారు. అంతలో ఫ్రిజ్ తెరచిన ఓ పోలీసు ‘సార్’ అంటూ కేకపెట్టాడు. కంగారుగా అటు వెళ్లాడు ఇన్‌స్పెక్టర్. అక్కడ... ఫ్రిజ్‌లో... ఓ బేసిన్ నిండా రక్తం ఉంది. ఒక గిన్నెలో మాంసం ముక్కలు ఉన్నాయి. మరో లోతైన గిన్నెలో ఆడపిల్ల తల ఉంది. వాటిని చూసి కడుపులో తిప్పినట్టయ్యింది వారికి. ఆ వికారాన్ని ఎలా అణచుకోవాలో తెలీక సగావా చెంప ఛెళ్లుమనిపించాడు ఇన్‌స్పెక్టర్. ‘‘నువ్వు మనిషివా, రాక్షసుడివా?’’ అన్నాడు ఆవేశంగా. అతడిని తీసుకుని స్టేషన్‌కి బయలుదేరారు.
 
 
 ‘‘ఓ ఆడపిల్లని... అంత దారుణంగా, క్రూరంగా చంపుతావా? అసలామె ఎవరు? ఎందుకు చంపావ్? నిజం చెప్పు. లేదంటనే నేను నిన్ను చంపేస్తాను’’... అరిచాడు ఇన్‌స్పెక్టర్. సగావా చాలా కూల్‌గా అన్నాడు... ‘‘నాకు తనని తినాలనిపించింది సర్... అందుకే చంపాను.’’
 ఉలిక్కిపడ్డాడు ఇన్‌స్పెక్టర్. ‘‘ఏమన్నావ్’’ అన్నాడు ఆశ్చర్యంగా.
 ‘‘తను నాకు చాలా నచ్చింది సర్. ఆరోగ్యంగా, అందంగా ఉంది. అందుకే చంపి తినేశాను.’’
 మతిపోయింది ఇన్‌స్పెక్టర్‌కి. తిన్నాడా? వీడు మనిషా, మృగమా? బుర్ర తిరిగిపోయింది. ఆ తర్వాత సగావా చెప్పి విషయాలు విని పోలీసులే కాదు... యావత్ ప్రపంచం అవాక్కయ్యింది.
 సగావా చంపిన అమ్మాయి పేరు రెనీ హార్ట్‌వెల్ట్. వయసు పాతికేళ్లు. లిటరేచర్ చదువుతోంది. సగావా కూడా సాహిత్యం మీద ఆసక్తితో ఆ కాలేజీలో చేరాడు. రెనీ క్లాసే. దాంతో ఆమెతో పరిచయం ఏర్పడింది. వయసులో కాస్త పెద్దవాడు కావడంతో సగావాని చాలా గౌరవించేది రెనీ. ఏ డౌట్ వచ్చినా అతడినే అడిగేది. దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడు సగావా. జర్మన్ కవిత్వాన్ని అనువదిద్దాం రమ్మంటూ ఆమెను తన ఇంటికి ఆహ్వానించాడు. తుపాకీతో కాల్చి చంపాడు. రక్తం తాగాడు. ఆ పైన ఆమె మాంసాన్ని కొద్దికొద్దిగా కోసుకుని తినడం మొదలుపెట్టాడు.  మరునాటికి మృతదేహంలో కాస్త మార్పు వచ్చింది. పాడవుతుందేమోనని భయపడ్డాడు. వెంటనే కొంత మాంసాన్ని, రక్తాన్ని తీసి ఫ్రిజ్‌లో దాచుకున్నాడు. మిగతా శరీరాన్ని, దుస్తులు, ఆభరణాలు, నగలు, కత్తి అన్నిటినీ సూట్‌కేసుల్లో పెట్టి పార్క్‌లో వదిలేశాడు. తాను అంద వికారంగా ఉంటాడు కాబట్టి, అందమైన రెనీని తింటే తానూ అలా అవుతాననుకుని ఇలా చేశానన్నాడు సగావా. ఈ ఘాతుకం గురించి విని ప్రపంచం నివ్వెరపోయింది. ఆ నరరూప రాక్షసుడికి మరణశిక్ష విధించమంది. కానీ కోటీశ్వరుడైన సగావా తండ్రి పెద్ద పెద్ద లాయర్లను నియమించాడు. వాళ్లంతా సగావా మానసిక రోగి అని నిరూపిం చారు. అతడిని శిక్షించడం కుదరదన్నారు.  దాంతో న్యాయస్థానం అతణ్ని శిక్షించకుండా వదిలేసింది.
 రెనీ కుటుంబం కన్నీటి పర్యంతమయ్యింది. కానీ న్యాయస్థానం కన్నీటికి కరగలేదు. సగావా గురించి మళ్లీ ఆలోచించలేదు. దాంతో అతడు తన స్వదేశమైన జపాన్‌కి వెళ్లిపోయాడు. స్వేచ్ఛగా, సంతోషంగా బతుకుతున్నాడు. కానీ అతడి చేతిలో దారుణంగా మరణించిన రెనీ కుటుంబం ఇప్పటికీ విలపిస్తూనే ఉంది!
 - సమీర నేలపూడి
 
ప్రస్తుతం సగావా టోక్యోలో నివసిస్తున్నాడు. అక్కడికి వెళ్లాక కొన్నాళ్ల పాటు ‘స్పా’ అనే మ్యాగజైన్‌కి ఆర్టికల్స్ రాశాడు. కొన్ని విద్యాసంస్థల్లో గెస్ట్ స్పీకర్‌గా కూడా పని చేశాడు. కానీ అతడిని ఎవరూ ఇష్టపడేవారు కాదు. కొందరు పబ్లిషర్లు అతడి రచనల్ని తిప్పి పంపేసేవారు. విద్యార్థులు అతడిని చూసి బెదిరిపోయేవారు. దాంతో కొన్నాళ్లకు ఏ పనీ దొరక్కుండా పోయింది. తల్లిదండ్రులు ఉన్నంతకాలం సుఖంగా బతికాడు. వాళ్లు పోయాక కొన్నాళ్లు బాగానే గడచినా తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. 2009లో ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి చనిపోవాలనిపిస్తోందంటూ ఆవేదన చెందాడు సగావా. అతడి వల్ల రెనీ కుటుంబం పడిన ఆవేదన కంటే అదేం ఎక్కువ కాదు కదా!
 

Advertisement
Advertisement