మహర్షుల తపస్సుతో తరించిన దివ్యధామం | Sakshi
Sakshi News home page

మహర్షుల తపస్సుతో తరించిన దివ్యధామం నైమిశారణ్యం

Published Sun, May 7 2017 12:32 PM

మహర్షుల తపస్సుతో తరించిన దివ్యధామం నైమిశారణ్యం

మనం పురాణ కథలలో సూతుడు నైమిశారణ్యం గురించి వింటూనే ఉంటాం. అలాగే ‘సూతుడు, శౌనకాది మునులతో ఈ విధంగా చెప్పాడు’ అనే ఉపోద్ఘాతం కూడా తెలిసిందే. ఇంతకీ ఈ నైమిశారణ్యం ఎక్కడ ఉంది, దానికి ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏమిటి అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానాలే ఈ వారం టూర్‌ దర్శన్‌.

సుందర ప్రకృతి రమణీయ దృశ్యాలు, సహజమైన వనసంపదతో ప్రశాంతంగా ఆధ్యాత్మకానుభూతులను ప్రోది చేసే ఈ దివ్యధామం ఉత్తరప్రదేశ్‌ లోని లక్నోకు సుమారు 150 కి.మీ దూరంలో సీతాపూర్‌ జిల్లాలో ఉంది. మన దేశంలోని పరమ పుణ్యమైన పుణ్యతీర్థాలలో నైమిశారణ్య దివ్య క్షేత్రాన్ని మొదటిగా చెప్పుకోవచ్చు. పవిత్ర గోమతీ నదీతీరంలో సూత, శౌనకాది మునులు నివసించిన ఈ దివ్య ధామం మహా ఋషుల యజ్ఞాల వల్ల యజ్ఞ భూమిగా ప్రశస్తి పొందింది. సమస్త పురాణాలకు పుట్టినిల్లుగా భాసిల్లిన ఈ దివ్య ధామం ఆ మునుల తపశక్తితో మరింత పవిత్రతను ఆపాదించుకుంది. అందుకే నైమిశారణ్య క్షేత్రాన్ని క్షేత్రాలలోకెల్లా ఉత్తమ క్షేత్రమంటారు. స్థానికులు ఈ దివ్య క్షేత్రాన్ని స్థానికులు నీమ్‌ సార్‌ గా, నీమ్‌ చార్‌గా వ్యవహరిస్తుంటారు.

స్థల పురాణం: ఒకసారి మునులంతా బ్రహ్మ వద్దకు వెళ్లి కలిప్రభావం సోకని పుణ్య ప్రదేశం ఎక్కడైనా ఉంటే ఆ ప్రాంతంలో తాము తపోయజ్ఞ కార్యనిర్వహణ చేసుకుంటామని ప్రార్థించారు. బ్రహ్మ కలియుగంలో సత్పురుషులను దృష్టిలో వుంచుకుని ఒక చక్రాన్ని సృష్టించి ఆ చక్రం ఎక్కడ ఆగుతుందో అక్కడ మునులను నివసించమని చెప్పాడు. ఆ చక్రం అన్ని లోకాలు తిరిగి చివరకు నైమిశారణ్య ప్రాంతంలో ఆగింది. చక్రం నేమి (అంచు) తాకిన భూప్రదేశం నైమిశంగా పిలవబడింది. చక్రం స్పృశించిన ప్రాంతం అరణ్యం కావడం వల్ల నైమిశారణ్యం అనే పేరు వచ్చింది. చక్రం భూమిని చీల్చుకుని దిగడం వల్ల అక్కడో నీటిగుండం ఏర్పడింది. ఫలితంగా భూమి నుంచి పవిత్ర జలధారలు పెల్లుబికాయి.

అందుకే ఈ పవిత్ర తీర్థానికి చక్ర తీర్థమని పేరు. చక్రాకారంలో వున్న ఈ తీర్థంలో రోజూ వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అమావాస్య సోమవారం రెండూ కలిసిన సోమవతీ అమావాస్య పర్వదినాన లక్షలాది మంది భక్తులు చక్రతీర్థంలో పుణ్యస్నానాలు చేసి తరిస్తారు. అనేక మంది దేవీదేవతల కొలువుతో పవిత్ర తీర్థరాజంగా విరాజిల్లే ఈ క్షేత్రం అనుక్షణం భగవంతుని నామస్మరణతో మారుమోగుతూ, ఓ ఆధ్యాత్మిక లోకాన్ని స్ఫురణకు తెస్తుంది. దధీచి మహర్షి లోక కళ్యాణార్థం తన దేహాన్ని త్యాగం చేసిన స్థలంగా నైమిశారణ్యానికి మరో పురాణ వృత్తాంతం ప్రచారంలో వుంది.

ఇక్కడ ఏమేమి చూడవచ్చునంటే..?
నైమిశారణ్యంలో చక్రతీర్థం సమీపంలో భూతేశ్వరనాథ్‌ ఆలయం వుంది. ఇక్కడ భూతేశ్వరనాథ్‌ స్వామికి ముఖం వుండటం విశేషంగా చెబుతారు. ఫణి ఫణాచత్రంతో, త్రిశూల చిహ్నంతో అభిముఖంగా వున్న నందీశ్వరునితో భూతనాథుడు భక్త కల్పవృక్షమై విరాజిల్లుతున్నాడు. ఈ స్వామికి చేసే అభిషేకం ద్వాదశ జ్యోతిర్లింగాలకు చేసిన అభిషేక ఫలంతో సమానమని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. ఈ ఆలయంలో వున్న వినాయకుడ్ని గణేశ్‌ జీ అని పిలుస్తారు. విక్రమాదిత్యుడు ప్రతిష్టించినట్టుగా చెప్పబడుతున్న ఈ వినాయకుడికి ముందు ప్రణామాలు చేసిన అనంతరమే భక్తులు నైమిశారణ్య దర్శనం చేసుకుంటారు.

నైమిశారణ్య దివ్యక్షేత్రంలో ప్రతీ అడుగు మహిమాన్విత దేవీదేవతల ఆలయాలతో విరాజిల్లుతోంది. భూతేశ్వర్‌ నాథ్‌ మందిరానికి సమీపంలో వున్న మందిరాలలో బదరి నారాయణుడి (దేవ రాజన్‌) మందిరం చెప్పుకోదగినది. ఈ భూలోకంలో ఉన్న 108 వైష్ణవక్షేత్రాలలో బదరీనారాయణుడి ధామం కూడా ఒకటిగా ప్రసిద్ధి పొందింది. దీనితోపాటూ రాధాకృష్ణ, గోపాల్, కాలభైరవుడు మొదలైన మందిరాలు ఈ ప్రాంగణంలో భక్తులకు దర్శనమిస్తాయి.

నైమిశారణ్యంలో ఉన్న మరో పవిత్రమైన దివ్యధామం లలితామాత ఆలయం. రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్యాలయం అతి పురాతనమైంది. అలాగే వ్యాసుడు తపమాచరించిన తపస్థలి వ్యాసగద్ది, సూతుడు తపమాచరించిన తపస్థలి సూతగద్దిలు కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణంలో అలరారుతూ ఆధ్యాత్మికానురక్తిని పెంచేవిగా వున్నాయి. అలాగే వాలి, సుగ్రీవులు విశ్రాంతి తీసుకున్న హనుమత్‌ టిలామహేశ్వరాలయం తదితర ఆలయాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో పాండవులు సైతం సంచరించారని పురాణాలు చెబుతున్నాయి.


ఈ క్షేత్రంలో విజయవాడ వైఖానస సమాజం వారు నిర్మించిన బాలాజీ మందిరం కూడా ఓ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయంలో తిరుపతిలో మాదిరి అర్చనా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం వల్ల ఉత్తరాదిలోసైతం శ్రీ వేంకటేశ్వర స్వామిని స్వయంగా దర్శించుకునే మహద్భాగ్యం భక్తులకు కలిగింది. భక్తులు ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఒకసారైనా దర్శించాల్సిన మహిమాన్విత పుణ్య స్థలం ఇది.
 
ఎలా వెళ్లాలంటే?
దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి నైమిశారణ్యానికి రైళ్లు, విమానాలు ఉన్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్‌ నుంచి నైమిశారణ్యానికి 1482 కిలోమీటర్ల దూరం ఉంది. హైదరాబాద్‌ నుంచి లక్నోకి రైళ్లు, విమానాలు ఉన్నాయి. లక్నో చేరితే అక్కడినుంచి రైలు లేదా బస్సులు, ట్యాక్సీలలో నైమిశారణ్యానికి చేరుకోవచ్చు.

భోజన, వసతి సదుపాయాలు: నైమిశారణ్యంలో శృంగేరీ శారదాపీఠం వారి ధర్మసత్రాలలో భోజన, వసతి సదుపాయాలు లభిస్తాయి. ఇదిగాక అనేక ధర్మసత్రాలున్నాయి. స్తోమతను బట్టి సామాన్యమైన హోటళ్ల నుంచి స్టార్‌ హోటళ్ల వరకు అందుబాటులో ఉన్నాయి.

Advertisement
Advertisement