ఒక కాలనీ కహానీ! | Sakshi
Sakshi News home page

ఒక కాలనీ కహానీ!

Published Sun, Apr 8 2018 12:25 AM

funday Laughing fun - Sakshi

‘‘హలో అప్పారావు... నేను సుబ్బారావుని మాట్లాడుతున్నాను. ఇప్పుడే సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రైలు దిగాను. నీ అడ్రసు చెప్పు’’ రైల్వేస్టేషన్‌ నుంచి బయటికి వస్తూ ఫోన్‌లో అడిగాడు సుబ్బారావు.‘‘నేరుగా ఆటోలో నా బొంద కాలనీకి వచ్చేయ్‌’’ అన్నాడు అప్పారావు.‘‘నా బొంద కాలనా?! ఇదేం పేరురా బాబు... జోక్‌ చేస్తున్నావా!’’ ఆశ్చర్యపోయాడు సుబ్బారావు.‘‘అదేం లేదు...నువ్వు వచ్చేయ్‌’’ అన్నాడు అప్పారావు.ఒక గంట తరువాత కాలనీకి చేరుకున్నాడు సుబ్బారావు. ‘నా బొంద కాలనీ’ అనే పెద్దబోర్డ్‌ ఒకటి అక్కడ కనిపిస్తుంది. ‘‘ఇదేం పేరురా బాబు!’’ అంటూ రెండోసారి జడుసుకున్న సుబ్బారావుకు ఆ కాలనీ  ఫ్లాష్‌బ్యాక్‌ను ఇలా చెప్పాడు అప్పారావు...

మల్లయ్యగారి పుల్లయ్యకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు ఇంజనీర్‌. రెండో కొడుకు డాక్టర్‌. మూడో కొడుకు లాయర్‌.‘‘ఇలా అయితే ఎలా? ఏదైనా చిన్న ఉద్యోగమైనా చేసి చావండి’’ అని  రోజూ  చాటుగానో మాటుగానో కొడుకులను తిడుతుండేవాడు పుల్లయ్య.‘అదేమిటి? ఒక కొడుకు ఇంజనీర్, ఒక కొడుకు డాక్టర్, ఇంకో కొడుకు లాయర్‌ కదా... బోలెడు సంపాదన. మరి ఉద్యోగం చేయాల్సిన ఖర్మ వాళ్లకు ఏమిటి?’ అనే కదా మీ డౌటు.నిజానికి పెద్ద కొడుకు ఇంజనీర్‌ కాదు. అతడి పేరు ఇంజనీర్‌. రెండో కొడుకు డాక్టర్‌ కాదు. అతని పేరు డాక్టర్‌... మూడో వాడి పరిస్థితి కూడా సేమ్‌ టు సేమ్‌!!భవిష్యత్‌లో ఇంజనీర్, డాక్టర్, లాయర్‌గా చూసుకోవాలనే ఆశతో తన కొడుకులకు... ఆ పేర్లు పెట్టుకొని మురిసిపోయాడు పుల్లయ్య. కానీ ఏం లాభం... ఏ కొడుకూ తన పేరును నిజం చేసుకోలేదు.మిగిలిన కొడుకుల విషయం ఎలా ఉన్నా... తండ్రి తిట్లను తట్టుకోలేక పెద్దకొడుకు ఇంజనీర్‌ ఎలాగైనా సరే ఉద్యోగం సంపాదించాలను కున్నాడు. అయితే పోటీ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాఇంజనీర్‌ ఇంటర్వ్యూలో మాత్రం ఘోరంగా విఫలమయ్యేవాడు. దీనికి కారణం... అతని అజ్ఞానం మాత్రం కాదు... కేవలం ‘ఊతపదం’. ‘నా బొంద’ అనేది అతని ఊతపదం. ప్రతి ఇంటర్వ్యూలోనూ ఈ ఊతపదం అతని కొంపముంచుతూ ఉద్యోగం రాకుండా చేసేది. అదెలాగో చూద్దాం... ఇంజనీర్‌ ఎప్పటిలాగే ఒక ఇంటర్వ్యూకు వెళ్లాడు.మేనేజర్‌: ఏం చదువుకున్నావు?

ఇంజనీర్‌: నా బొందా.... ఆ ఏదో బీఏ చదువుకున్నాను!మేనేజర్‌ లైట్‌గా ఖంగు తిన్నాడు. మళ్లీ మామూలు మనిషై...‘‘నేను కొన్ని దేశాల పేర్లు చెబుతాను. వాటి రాజధానుల పేర్లు చెప్పు చాలు. ఉద్యోగం ఇస్తాను’’ అన్నాడు మేనేజర్‌.‘‘ఓకే’’ అన్నాడు ఇంజనీర్‌.మేనేజర్‌: ఆఫ్గానిస్తాన్‌ రాజధాని ఏమిటి?ఇంజనీర్‌: కాబుల్‌మేనేజర్‌: జర్మనీ రాజధాని?ఇంజనీర్‌: బెర్లిన్‌మేనేజర్‌: ఫ్రాన్స్‌ రాజధాని ఎథెన్స్‌. అవునా కాదా?ఇంజనీర్‌: మీ బొంద. ఫ్రాన్స్‌ రాజధాని ఎథెన్స్‌ ఏమిటి?! ప్యారిస్‌మేనేజర్‌:!!!!!...సరే, ఏవైనా ఆటలు వచ్చా?ఇంజనీర్‌: నా బొంద! నాకేం వస్తాయండి. అప్పుడప్పుడూ క్యారమ్స్‌ ఆడేవాడిని. పౌడర్‌ ఎలర్జీ వల్ల అది కూడా ఆడడం మానేశాను.మేనేజర్‌: అంతా బాగానే ఉంది కానీ.... మధ్యలో ఈ బొంద ఏమిటి? ఇంజనీర్‌: ఏదో అలా అనడం అలవాటైపోయింది.... నా బొంద! ఎన్నోసార్లు మానేద్దామని ప్రయత్నించానుగానీ కుదరలేదు.‘‘సరే వెళ్లు!’’ అన్నాడు మేనేజర్‌.‘‘నా బొంద! మీరు ఏం చెప్పనిదే ఎలా వెళతానండి. ఇంతకీ నాకు ఉద్యోగం ఇస్తున్నట్లా? ఇవ్వనట్లా?’’ డౌటు అడిగాడు ఇంజనీర్‌.‘‘నా బొంద! ఇప్పుడే అడిగితే ఎలా చెబుతాం. వారం తరువాత మేమే కబురు చేస్తాం’’ అన్నాడు మేనేజర్‌.అప్పుడే ఫోన్‌ మోగింది.

మేనేజర్‌ భార్య...‘‘యావండీ... ఇవ్వాళ ఏ కూర వండమంటారు?’’ అని అడిగింది.‘‘ ఏదో ఒక కూర వండిచావు... నా బొందలో కూర’’ అని విసుక్కున్నాడు మేనేజర్‌.ఆ తరువాత సంస్థ యజమాని అప్పల్నాయుడు నుంచి మేనేజర్‌కు ఫోన్‌ వచ్చింది.‘‘ఏమిటయ్యా కంపెనీ లాస్‌లో ఉంది... నువ్వేం చేస్తున్నావు?’’ అని కాస్త కోపంగా  అడిగాడు.‘‘నా బొందలో లాసు... అదీ ఓ లాసేనా! వ్యాపారం అన్నాక ఈమాత్రం లాస్‌ ఉండదా... నా బొంద!’’ అన్నాడు మేనేజర్‌.మేనేజర్‌తో కొద్దిసేపు మాట్లాడిన తరువాత ‘నా బొంద’ అనే ఊతపదం అప్పల్నాయుడు నోట్లోకి దూరిపోయింది.  ఇంజనీర్‌ పుణ్యమా అని... ‘నా బొంద’ అనే ఊతపదం మేనేజర్‌ నుంచి అప్పల్నాయుడుకు, అటు నుంచి ఆయన భార్యకు, ఆ తరువాత ఆమె తమ్ముడికి... అలా చుట్టాలు పక్కాలు మొత్తానికి పాకింది. అంతేనా!‘నా బొంద’ ఊతపదం ఉన్నవాళ్లు ఫేస్‌బుక్‌లో ఒక కమ్యూనిటీగా ఏర్పడ్డారు.అంతేనా! అక్కడితో ఆగలేదు.‘నా బొంద’ అనే ఊతపదం ఉన్నవాళ్లందరూ కలిసి ‘నా బొంద’ పేరుతో ఏకంగా ఒక కాలనీ కట్టుకున్నారు. అది మా కాలనీ కథ!’’ 
– యాకుబ్‌ పాషా 

Advertisement
Advertisement