నెలసరికి  స్వీట్స్‌కి  సంబంధమేంటి? | Sakshi
Sakshi News home page

నెలసరికి  స్వీట్స్‌కి  సంబంధమేంటి?

Published Sun, Jan 20 2019 12:59 AM

Fundy health counseling 20 - 01-2019 - Sakshi

నాకు ఆరోగ్యపరంగా  ఎలాంటి సమస్యలు లేవు. అయితే ఈమధ్య నెలసరి రావడం లేదు. నాకు స్వీట్లు ఎక్కవగా తినే అలవాటు ఉంది. దీనివల్లే సమస్య వస్తుందని మా అమ్మ చెబుతోంది. ఇది ఎంత వరకు నిజం? ఏ కారణాల వల్ల నెలసరి సరిగ్గా రాదు? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? – పీఆర్, కరీంనగర్‌
నెలసరి సరిగా రావాలంటే, మెదడు నుంచి, అండాశయాల నుంచి విడుదలయ్యే హార్మోన్స్‌fsh, lh, tsh, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్‌. సక్రమంగా విడుదల అవ్వాలి. అలాగే గర్భాశయం లోపలి పొర సరిగా ఏర్పడాలి. మెదడులో లోపాలు, థైరాయిడ్‌ సమస్య, మానసిక ఒత్తిడి, అండాశయాలలో నీటి బుడగలు, తిత్తులు, సిస్ట్‌లు, గర్భాశయంలో టీబీ, అధికబరువులాంటి అనేక కారణాల వల్ల హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి నెలసరులు సరిగ్గా రాకపోవచ్చు. కేవలం ఎక్కువగా స్వీట్లు తీనడం వల్ల పీరియడ్స్‌ క్రమం తప్పవు. స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల ఎక్కువ బరువు పెరుగుతారు కాబట్టి  అధిక బరువు వల్ల హార్మోన్లలో తేడా ఏర్పడి పీరియడ్స్‌ క్రమం తప్పవచ్చు. నీ బరువు గురించి రాయలేదు. నువ్వు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి పీరియడ్స్‌ ఎందుకు రావట్లేదు అని తెలుసుకోవడానికి, థైరాయిడ్, పెల్విక్‌ అల్ట్రాసౌండ్‌ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకొని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. పీరియడ్స్‌ సక్రమంగా రావాలంటే సరైన వ్యాయామాలు చేయడం, బరువు మితంగా ఉండేట్లు చూసుకోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా లేకుండా ఉండటం, ఆహారాలలో అన్నం (కార్బోహైడ్రేట్స్‌) తక్కువ తిని, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లు ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు ఎక్కువ పెరగకుండా ఉంటారు.

∙కడుపులో బిడ్డ లోపాలను గుర్తించే సాంకేతికజ్ఞానం మనకు అందుబాటులో ఉందా? గర్భస్థ శిశువుల లోపాలను సవరించే వీలుంటుందా? తెలియజేయగలరు. – జి.సుధ, కర్నూలు
తల్లి గర్భంలో అండం, శుక్రకణం అనే రెండు కణాల కలయికతో  పిండం ఏర్పడడం మొదలయ్యి తొమ్మిది నెలలపాటు అనేక రూపాంతరాలు చెందుతూ శిశువు పెరుగుతుంది. ఈ సమయంలో తెలియని అనేక కారణాల వల్ల, శిశువులో జన్యుపరమైన సమస్యలు, అవయవ లోపాలు, అవయవాల పనితీరులో లోపాలు ఏర్పడవచ్చు.గర్భంలో బిడ్డలోని అన్ని లోపాలను నూటికి నూరుశాతం గుర్తించలేము. 90 శాతం మటుకే అల్ట్రా స్కానింగ్‌ వల్ల గుర్తించవచ్చు. వీటిని గుర్తించడానికి నిపుణులైన డాక్టర్లు, మంచి స్కానింగ్‌ మెషిన్‌ అవసరం. ఇప్పుడు మనకు ఉన్న సాంకేతికజ్ఞానంతో 90 శాతం లోపాలను తెలుసుకోవచ్చు.తల్లి అధిక బరువు ఉన్నా, పొట్టలో కొవ్వు ఉన్నా, బిడ్డ పొజీషన్‌ సరిగ్గా లేకపోయినా, ఉమ్మనీరు తక్కువ ఉన్నా, ఇంకా కొన్ని పరిస్థితుల్లో కొన్ని లోపాలు సరిగ్గా కనిపించకపోవచ్చు. గుండెకు సంబంధించిన రంధ్రాలు వంటి కొన్ని అవయవ లోపాలు సరిగ్గా తెలియకపోవచ్చు..మూడోనెలలో  చేసే ఎన్‌టీ స్కాన్, ఐదోనెలలో టీఫా స్కాన్‌లలో 90శాతం అవయవ లోపాలను గుర్తించవచ్చు.సందేహాలు ఉన్నప్పుడు తల్లికి యంఆర్‌ స్కాన్‌ ద్వారా కూడా కొన్నిలోపాలను నిర్ధారణ చేయడం జరుగుతుంది. డౌన్స్‌సిండ్రోమ్‌ వంటి జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలను కనిపెట్టడానికి ఇప్పుడు తల్లికి మూడో నెలలో డబుల్‌ మార్కర్‌ టెస్ట్, అయిదవ నెలలో క్వాడ్రుపుల్‌ టెస్ట్‌ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిస్తే అవి నిర్ధారణ చేసుకోవడానికి కొరియాన్‌ విల్లస్‌ బయాప్సీ, అమ్నియోసెంటిసిస్‌ అని బిడ్డ చుట్టూ ఉన్న ఉమ్మనీరును కొంచెం తీసి కారియోటైపింగ్‌ పరీక్షకు పంపి నిర్ధారణ చేయడం జరుగుతుంది. వీటిలో కూడా అన్నీ జన్యుపరమైన సమస్యలు తెలియవు. మూగ, చెవుడు, మెదడు పనితీరు, అవయవాల పనితీరువంటివి ఎటువంటి పరీక్షలలోను ముందుగా తెలియవు. బిడ్డ పుట్టిన తరువాతే బయటపడతాయి.ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీటల్‌ స్పెషాలిటీతో  కొన్ని అవయవలోపాలకు, బిడ్డ కడుపులో ఉన్నప్పుడే, అవి సరిచేయడానికి కొన్ని రకాల ఆపరేషన్‌లు  కొంతమంది అనుభవం ఉన్న డాక్టర్లు చేయడం జరుగుతుంది.

నేను ప్రెగ్నెంట్‌. ఇటీవల ఒక మ్యాగజిన్‌లో "bump bounce" అనే పదం చదివాను. ఇది తగ్గడానికి ప్రత్యేకమైన వర్కవుట్లు ఉన్నట్లు చదివాను. దీని గురించి సవివరంగా తెలియజేయగలరు.
– బి.వందన, ఆలమూరు

గర్భంతో ఉన్నప్పుడు కడుపు పెరుగుతూ, ఎత్తుగా ముందుకు  ఏర్పడుతుంది. దీనినే ‘ప్రెగ్నెన్సీబంప్‌’ అంటారు. కడుపు పెరిగే కొలది బరువు నడుం మీద, పెల్విక్‌ కండరాలు, ఎముకల మీద పడుతుంది.దీనివల్ల నెలలు నిండే కొద్ది నడవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది.నడుం నొప్పులు, కాళ్లనొప్పులు... అటు ఇటు తిరగడానికి ఇబ్బంది పడుతుంటారు. నడిచేటప్పుడు కడుపు అటు ఇటు ఊగుతుంటుంది. దీనినే ‘బంప్‌ బౌన్స్‌’ అంటారు. దీని నుంచి పూర్తిగా ఉపశమనం దొరకడం కష్టం. కాకపోతే కొన్ని వ్యాయామాలు, కొంత విశ్రాంతి వంటి జాగ్రత్తలు తీసుకుంటూ చాలావరకు ఇబ్బందుల నుండి ఉపశమనం దొరుకుతుంది.పొట్టకు సపోర్ట్‌గా ఉండే బట్టలు వేసుకోవడం, రోజు అరగంట నడక, చిన్న చిన్న వ్యాయామాలు, యోగావంటివి చేయడం వల్ల ఎముకలు, కండరాలు, జాయింట్లు రిలాక్స్‌ అవుతాయి. నొప్పి, ఇబ్బందుల నుంచి ఊరట కలుగుతుంది. మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ అధికబరువు పెరగకుండా చూసుకోవాలి.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హైదర్‌నగర్‌,హైదరాబాద్‌ 

Advertisement
Advertisement