గార్బేజ్ ఎంజైమ్‌తో ప్రయోజనాలెన్నో... | Sakshi
Sakshi News home page

గార్బేజ్ ఎంజైమ్‌తో ప్రయోజనాలెన్నో...

Published Sun, Nov 6 2016 12:33 AM

గార్బేజ్ ఎంజైమ్‌తో ప్రయోజనాలెన్నో...

ఇంటిల్లిపాదికి ఆరోగ్యాన్నిచ్చే అభయహస్తం ఇంటిపంటల సాగు. అలాంటి ఇంటిపంటలు ఏపుగా పెరిగేందుకు జీవామృతం, ఘన జీవామృతం, కంపోస్టు ఎరువులను వాడటం అందరికి తెలిసిన పద్ధతి. కానీ వీటి తయారీ.. నిల్వ చేసుకోవటం, వాడకం వంటి అంశాల్లో కొన్ని పరిమితులు కొంత ప్రయాస ఉన్నాయి. వీటికి భిన్నంగా తయారీ నుంచి పిచికారీ వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటిపంటలకు పోషకాలను అందించే గనిగా గార్బేజ్ ఎంజైమ్‌ను చెప్పవచ్చు.  వంటింటి వ్యర్థాలతో దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు.
 
 కావాల్సిన పదార్థాలు: కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, ముక్కలు, కుళ్లినవి) 3 పాళ్లు + నల్ల బెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ(బ్రౌన్) పంచదార 1 పాలు + నీరు 10 పాళ్ల చొప్పున కలపాలి. కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి వాడుకోవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపొచ్చు. అయితే, జారుగా ఉండే గ్రేవీ మాంసం, మందంగా ఉండే పనస పండ్ల తొక్కలు కలపకూడదు.
 
 తయారీ ఇలా...
 ఈ మిశ్రమాన్ని మూత బిగుతుగా పెట్టడానికి వీలుండే గాజు లేదా ప్లాస్టిక్/ఫైబర్ డ్రమ్ముల్లో వేసి గాలి చొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగలకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. మొదటి 30 రోజుల పాటు.. రోజుకోసారి మూత తీసి వాయువులు బయటకు వెళ్లాక, మళ్లీ గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడకట్టి, నిల్వ చేసుకొని అక్కడి నుంచి 60 రోజుల వరకు వాడుకోవచ్చు.
 
 వడపోతలో వచ్చే వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు లేదా మళ్లీ ఎంజైమ్ తయారీలో వాడుకోవచ్చు. గార్బేజ్ ఎంజైమ్‌ను 3 దఫాలుగా మొక్కలపై పిచికారీ చేయాలి. కూరగాయ మొక్కల నారును పీకడానికి 2 రోజుల ముందు పిచికారీ(1:100 మోతాదు.. లీటరు గార్బేజ్ ఎంజైమ్‌కు 100 లీటర్ల నీరు కలపాలి) చేయాలి. పూత దశలో రెండో దఫా పిచికారీ(1:50 మోతాదు) చేయడం వల్ల కాపు బాగా నిలుస్తుంది. కూరగాయలు వారంలో కోస్తామనగా మూడో దఫా పిచికారీ(1:500 మోతాదు) చేయాలి. కాయలు దృఢంగా, ఆకర్షణీయంగా రావటంతోపాటు మెత్తబడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి. గార్బేజ్ ఎంజైమ్ మోతాదు ఎక్కువైనా పంటను నష్టపరచదు.
 
 ఇంటిపనుల్లో ... రోజువారీ ఇంటిపనుల్లో గార్బేజ్ ఎంజైమ్ ఉపయోగ పడుతుంది. ఒక లీటరు ద్రావణాన్ని రెండొందల లీటర్ల నీటికి(1:200) కలిపి ఎయిర్ ఫ్రెషనర్‌గా వాడవచ్చు. రెండు చెంచాల ద్రావణాన్ని బక్కెట్ నీళ్లలో కలిపి గచ్చును శుభ్రం చేస్తే హానికరమైన సూక్ష్మజీవులు చనిపోతాయి. కుక్కర్, స్టవ్‌లపై మొండి మరకలను కూడా దీనితో తొలగించవచ్చు. టాయ్‌లెట్‌లు శుభ్రపరచేందుకు నీటిలో కలపకుండా గార్బేజ్ ఎంజైమ్‌ను నేరుగా వాడవచ్చు. ద్రావణం కలిపిన నీటిలో బట్టలు నానబెట్టి ఉతకొచ్చు. మురికి  వదలటంతో పాటు బట్టలు మృదువుగా ఉంటాయి. దీనితో ఒంటికి మర్దన చేసుకుంటే చర్మ వ్యాధులు తగ్గటంతో పాటు కొత్తగా రాకుండా ఉంటాయి. దీన్ని కలిపిన నీటిలో పెంపుడు జంతువులను  శుభ్రంచేస్తే దుర్వాసన పోతుంది. దోమలు, బొద్దింకలు, ఎలుకలు రాకుండా చేసేందుకు ఈ ద్రావణం ఉపయోగపడుతుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement