ఇతడు – అతడు | Sakshi
Sakshi News home page

ఇతడు – అతడు

Published Sun, Apr 2 2017 1:59 AM

ఇతడు – అతడు

రెండు దశాబ్దాల క్రితం జరిగింది ఇది. అయినా నిన్నటి జ్ఞాపకంలానే భయపెడుతోంది. డిగ్రీ చేసిన తరువాత జాబ్‌ చేయడానికి రెక్కలు కట్టుకొని బాంబేలో వాలిపోయాను. జాబ్‌ కంటే బాంబేలో ఉండాలనే కోరికే నన్ను ఈ పని చేయించింది. ఎలాగో కష్టపడి, చిన్న కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరిపోయాను. ఒక స్లమ్‌ ఏరియాలో చిన్న రూమ్‌ తీసుకొని ఉండేవాడిని. సంవత్సరం గిర్రుమని తిరిగింది.

ఒకరోజు...అర్ధరాత్రి తరువాత తలుపు చప్పుడు కావడంతో  ‘ఎవరు?’ అంటూనే తలుపు తీశాను. ఎదురుగా అపరిచితుడు. కానీ... ఎక్కడో చూశాను. ‘‘గుర్తు పట్టలేదా... మీ అన్నయ్య ఫ్రెండ్‌ కిషన్‌ని’’ అన్నాడు. వెంటనే ‘సారీ బ్రదర్‌’ అంటూ రూమ్‌లోకి తీసుకువచ్చాను. బాంబేలో ఏదో పని ఉండి వచ్చానని, రెండు రోజులు ఉండిపోతానని చెప్పాడు. నా అడ్రస్‌ అన్నయ్య  ఇచ్చినట్లున్నాడు. కొద్దిసేపటి తరువాత నిద్రపోయాం.

 ఒక గంట తరువాత నాకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. పక్కన చూస్తే కిషన్‌ లేడు! గొళ్లెం వేసే ఉంది. మరో టైంలో అయితే... దీని గురించి లోతుగా ఆలోచించేవాడినేమో... కళ్లు మండుతుండడంతో మళ్లీ గుర్రు పెట్టి నిద్రపోయాను. తెల్లారి లేచి చూస్తే నా పక్కనే ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు కిషన్‌. ‘‘అన్నా...రాత్రి ఎటైనా వెళ్లావా?’’ అని అడిగాను. ‘‘నేనెటు వెళతాను తమ్ముడూ...నువ్వు కలగని ఉంటావు’’ అని చిన్నగా నవ్వాడు. అవును. కలగని ఉంటాను!

ఎన్నడూ లేనిది కాలనీలో ఆరోజు అలజడి మొదలైంది. రాత్రి ఏవో వింత శబ్దాలు వినిపించాయని, ఇంటిపై కప్పు మీద ఎవరో ఎగిరి దూకుతున్న శబ్దాలు వినిపించాయని...ఇలా ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఇవి విని నేను, కిషన్‌ చిన్నగా నవ్వుకున్నాం. ఈలోపు మా రూమ్‌ ఓనర్‌ తుపానులా దూసుకొచ్చాడు... ‘‘నీకెన్నిసార్లు చెప్పాను, ఫ్రెండ్స్‌ను రానివ్వొద్దని. మొన్ననే ఒకడు వచ్చి వారం రోజులు ఉండిపోయాడు. అసలే నీళ్లు దొరక్క చస్తుంటే...’’ అతనలా తిడుతూనే ఉన్నాడు. ‘‘సారీ తమ్ముడూ నిన్ను ఇబ్బంది పెట్టినందుకు’’ అంటూ అప్పటికప్పుడు రూమ్‌ నుంచి వెళ్లిపోయాడు కిషన్‌. ఇది జరిగిన వారానికి మా బంధువు ఒకరు చనిపోతే సొంతూరికి వెళ్లాను.

నేను ఊరెళ్లక సంవత్సరం దాటింది. అంత్యక్రియలు పూర్తయిన తరువాత ఒక చెట్టుకింద కూర్చొని మాట్లాడుకుంటు న్నాం. ఏదో విషయం మాట్లాడుతూ మా అన్నయ్య  ‘‘చచ్చి ఎక్కడున్నాడోగానీ ఆ కిషన్‌గాడు ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవాడు’’ అన్నాడు. ‘‘పాపం కిషన్‌ చనిపోయాడా? ఎలా? వారం రోజుల క్రితమే నా రూమ్‌కు వచ్చాడు’’ అన్నాను. ‘‘వాడు చనిపోయి సంవత్సరం కావొస్తుంది. వారం రోజుల క్రితం నీ రూమ్‌కు ఎలా వస్తాడు?’’  ఆశ్చర్యంగా అడిగాడు అన్నయ్య.

 గట్టిగా వాదిస్తే నాకు పిచ్చిపట్టింది అనుకుంటారని ‘‘ఇతను కాదు...రమేశ్‌ అనుకుంటా నీ ఫ్రెండ్‌ ఒకరు వచ్చారు’’ అని మాట మార్చాను. బాంబేలో కొంత కాలం  ఉన్న కిషన్, డిప్రెషన్‌తో బాధ పడుతూ రైలుకింద తలపెట్టి చనిపోయాడట. ఆ రైల్వేట్రాక్‌ మా రూమ్‌కు కూతవేటు దూరంలో ఉంటుంది.ఆరోజు రూమ్‌ ఓనర్‌ వచ్చి తిట్టకపోయి ఉంటే కిషన్‌ వెళ్లి ఉండేవాడు కాదు. ఆ తరువాత ఏం జరిగి ఉండేది? నా కాళ్లు సన్నగా వణకడం మొదలైంది!
– అలోక్‌ కుమార్, నారాయణ్‌పూర్, బిహార్‌

Advertisement
Advertisement