మౌన గోపురాల మహా సందేశం | Sakshi
Sakshi News home page

మౌన గోపురాల మహా సందేశం

Published Sun, Jan 17 2016 3:46 PM

మౌన గోపురాల మహా సందేశం

 విహంగం
 మయన్మార్ పేరు వినగానే సైనిక నియంతల ఘోరాలు, ప్రజాస్వామిక ఉద్య మాలు గుర్తుకు వస్తాయేగానీ, పర్యాటక ప్రదేశాలు గుర్తుకు రావడం కాస్త కష్టమే. అయితే ‘ఇన్ డెయిన్’ అనే చిన్న ఊరు గురించి తెలుసుకుంటే మయన్మార్ రాజకీయ చర్చలకే కాదు... పర్యాటక ఆకర్షణలోనూ ప్రాధాన్యత సంతరించు కుందనే విషయం అర్థమవుతుంది. ఇన్ డెయిన్‌లో కనిపించే దృశ్యాలు  జానపదకథల్లోని దృశ్యాలను గుర్తు తెస్తాయి. చరిత్ర ప్రేమికులు, ప్రకృతి ఆరాధకులు, అర్కిటెక్చర్‌ను అభిమానించే వాళ్లు మాత్రమే కాదు...‘ఇన్‌డెయిన్‌కు వెళితే మనలో అజ్ఞాతంగా దాగి ఉన్న శక్తులు వెలికి వస్తాయి అని నమ్మేవాళ్లు కూడా పర్యాటకుల జాబితాలో ఉంటారు.


 సెంట్రల్ బర్మాలోని ఉన్న ‘ఇన్ లె’ సరస్సులో 18 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే ఇన్‌డెయిన్  గ్రామం వస్తుంది. నిశ్శబ్దం రాజ్యమేలే ఈ గ్రామంలో బౌద్ధస్థూపాలు, శిల్పాలు, చిత్రాల సౌందర్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ‘శిథిల సౌందర్యం’ అనే మాట ఉందో లేదో తెలియదుగానీ ఈ ప్రాంతాన్ని చూస్తే అది గుర్తుకు వస్తుంది. ఇక్కడ కొన్ని స్థూపాలు దెబ్బతినకుండా ఉన్నాయి. కొన్ని స్థూపాలు బాగా  దెబ్బ తిని వాటిలో చెట్లు మొలిచినప్పటికీ వాటి ఆకర్షణకు వచ్చిన లోటేమీ లేదు.

 అశోక చక్రవర్తి ఈ బౌద్ధస్థూపాలను  నిర్మించాడని చెబుతారు.  ఆసియాలో బౌద్ధం నలుమూలలా విస్తరించడానికి  మూడవ శతాబ్దంలో అశోకుడు కొందరు బౌద్ధ సన్యాసులను బర్మాకు పంపాడట. అప్పుడే వీటి నిర్మాణం జరిగిందంటారు. అయితే దీంతో కొందరు విభేదిస్తారు. ఈ బౌద్ధ ఆరామాన్ని నిర్మించింది అశోకుడు కాదని, బర్మాను పాలించిన నరపతిసితు రాజు అనేది కూడా ఒక వాదన. బర్మా సాంస్కృతిక వికాసానికి నరపతిసితు చాలా కృషి చేశాడు. బౌద్ధం వ్యాప్తికి అండగా నిలబడ్డాడు. బౌద్ధంలో మార్పులు ప్రతిపాదించే వారిని ప్రోత్సహించాడు.
 ఇక ఇన్ డెయిన్ విషయానికొస్తే, ఆ ప్రదేశం గురించి ఎన్నో గొప్ప కామెంట్లు వినిపిస్తాయి.

 అక్కడి ఆధ్యాత్మిక ప్రశాంతత మనసును ఆవరిస్తుందంటారు కొందరు.  ఆ మౌనగోపురాలు ఏదో మార్మిక సందేశం ఇస్తున్నట్లుగా ఉంటాయంటారు ఇంకొందరు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోక ఆ నిర్మాణ సంపద పాడయి పోతోంది. అందుకే వాటి ఆలనా పాలనా పట్టించుకుంటే బాగుంటుందనే మాట వినిపిస్తోంది. దాంతో బౌద్ధస్థూపాల పునరుద్ధరణ పని జరుగుతుంది. ఇప్పటికే కొన్ని స్థూపాలను బాగు చేసి, బంగారు రంగులోకి మార్చారు.
 రకరకాల భావజాలంతో వచ్చే పర్యాటకుల సంగతి ఎలా ఉన్నా ఫోటోగ్రాఫర్‌లకైతే ఈ ప్రదేశానికి వస్తే పండగే.

ఇక్కడి నిశ్శబ్ద సౌందర్యాన్ని కెమెరాలో బంధించే ప్రయత్నంలో వారి సృజనాత్మకత తనకు తానుగా మెరుగవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే స్థానికంగా నివసించే పా వొ ప్రజల అంగళ్లు ఒక ఎత్తు. వారం మొత్తం ఈ అంగళ్లు కనిపిస్తాయి. ఆడా మగా తేడా లేకుండా రంగురంగుల తలపాగాలు ధరించి దుకాణదారులు అమ్మకాలు సాగిస్తారు. ఇక్కడ తయారు చేసే రైస్ కేకులకు మాంచి డిమాండ్ ఉంది. బౌద్ధ సన్యాసుల చెక్క బొమ్మలకు కూడా డిమాండ్ ఉంది.

 మయన్మార్ చారిత్రక వారసత్వ సంపదగా భావించే ఇన్‌డెయిన్ గ్రామంలో చాలామంది చార్మ్‌తో పాటు మిస్టరీని కూడా చూస్తున్నారు. ఆ నిర్మాణాల వెనుక హిస్టరీ, మిస్టరీ మాట ఎలా ఉన్నా... మానసిక ప్రశాంతత కోరుకునేవారికి మాత్రం ఈ ప్రదేశం స్వర్గం. అద్భుత నిర్మాణ కౌశలాన్ని చూడాలని ఆశించేవారి మనసులను దోచే అత్యద్భుత ప్రదేశం. స్థూలంగా ఇదొక మౌన సౌందర్య సందేశం!

Advertisement
Advertisement