ఆకుపచ్చ సూర్యోదయం | Sakshi
Sakshi News home page

ఆకుపచ్చ సూర్యోదయం

Published Sat, May 13 2017 11:55 PM

ఆకుపచ్చ సూర్యోదయం

అందరిలోనూ ఆవేశం పొంగింది. పనులు వదిలేసి గబగబా గుర్రం చుట్టూ మూగారు. ‘‘దొరా! ఏంటిది?! సంపేత్తారా మనుసుల్ని....!?’’ గట్టిగా అరిచిందా యువతి మొదట.ఆమెను కిష్టయ్య ఏదో అనబోయాడు. అప్పుడే గిరిజనులంతా ఒక్కసారి గొంతెత్తారు. ‘‘దొరా! ఏంటీ అన్నాయం? ఇడిచిపెట్టు... సచ్చిపోతాడు....!’’ తలొక మాటగా అన్నారు. అవేం పట్టించుకోకుండా ఉరుముతున్నట్టు అన్నాడు బాస్టియన్, ‘‘ఎవత్తిరిదే!’’కిష్టయ్య చెప్పాడు, ‘‘ఆడిపెళ్లాం దొర!’’గుర్రం డొక్కలో తన్నాడు విసురుగా, బాస్టియన్‌. ఒక్క గెంతు గెంతి పరుగు లంఘించుకుంది గుర్రం.ఆ ఊపుకి నేల మీద పడబోయాడు ఎర్రేసు.  మెడ నరాలన్నీ కలుక్కుమన్నాయి. గుర్రం జీనులో చేతికందిన పట్టీని పట్టుకుని నిలదొక్కుకున్నాడు.

తట్టలూ, పారలూ, గునపాలూ పెట్టుకునే ఆ మామిడి చెట్టు అక్కడి దాదాపు వంద మీటర్ల దూరంలో ఉంది. చిరతపులి లేగదూడను లాక్కుపోతున్నట్టు పరమ కర్కశంగా లాక్కుపోతున్నాడు ఎర్రేసుని బాస్టియన్‌.కెవ్వున అరిచి గుర్రం వెనక పరుగు తీసింది ఎర్రేసు పెళ్లాం. ðlనకే పరుగుతీశారు కూలీలందరూ. ‘‘దొరా..... ఆపు దొరా.......’’ ఎర్రేసు పెళ్లాం ఆక్రందన. ‘‘తప్పు కాయి దొరా! అన్నాయం దొరా......!’’ ఓ నడివయసు స్త్రీ విన్నపం.‘‘అయ్యో... అయ్యో... అదిగో, మాయ గుర్రం తొక్కేస్తంది కాళ్లు....!’’ ఓ యువతి అంది ఆ దృశ్యాన్ని చూడలేనట్టు.

‘‘సచ్చిపోయాడు దేవుడోయ్‌! దొరా దణ్ణం పెడతాను ఒదులు దొరా....!’’ అరుస్తోంది ఎర్రేసు భార్య. ‘‘ఇదన్నాయం.. ఇదన్నాయం. ఆడు సచ్చిపోతే మేం ఊరుకోం... ఇదే చెప్పడం....’’ పెద్ద గొంతుతో అన్నాడు ఓ యువకుడు. గుర్రం మామిడిచెట్టు దగ్గరకొచ్చి ఆగింది.తటాల్న వదిలాడు తుండుగుడ్డని బాస్టియన్‌. ఒక్కసారిగా కిందపడి దొర్లాడు ఎర్రేసు. రెండు పాదాలు కొట్టుకుపోయి రక్తం ఉబికి, ఎర్ర కంకర దుమ్ముతో కలుస్తోంది.
‘‘తీసుకెళ్లు... ఇక్కడున్నట్టుగా రావాలి, సాయంత్రానికి!’’ అరిచాడు బాస్టియన్, క్రౌబార్లని చూపుడు వేలితో చూపిస్తూ.

అప్పటికే నాలుగైదు అడుగుల దూరంలో వచ్చి నిలబడి ఉన్నారు అడవిబిడ్డలు. అందరిలోనూ ఆవేశం. అందరికంటే ముందే కనిపిస్తోంది ఎర్రేసు భార్య.
చటుక్కున గుర్రం దిగి, వడివడిగా నడిచి వెళ్లి ఆమె చెంప మీద బలంగా కొట్టాడు బాస్టియన్‌.అలాగే నేల మీద పడిపోయిందామె.‘‘ఏంట్రా.... దండెత్తుకొచ్చారు?  ఫితూరీయా? రండి, తిరగబడండి! అన్నాయమా? ఊరుకోరా?!  ఏం చేస్తార్రా! ఏం చేస్తార్రా...... ’’ అంటూ చర్నాకోల తీసుకుని గొడ్లను బాదినట్టు బాదడం మొదలుపెట్టాడు బాస్టియన్, బండబూతులు తిడుతూ. ఓ కట్టె తీసుకుని బాస్టియన్‌కు తోడయ్యాడు కిష్టయ్య. దూరంగా నిలబడి తమాషా చూస్తున్నాడు విలియం.

రాత్రి నుంచీ మండుతున్న నెగళ్లు శాంతిస్తున్నాయి. అడవి జంతువుల నుంచి రక్షణకు వేస్తారవి. రోడ్డు పనికొచ్చిన వాళ్లంతా అక్కడే గూళ్లు కట్టుకుని ఉన్నారు. ఎప్పుడో పోడు కోసం చదును చేసిన స్థలం. నెగళ్లు చల్లారక  ఆ గూళ్ల పక్కనే చిన్న చిన్న రాళ్లతో పేర్చిన పొయ్యిలు రాజుకోవడం మొదలవుతోంది, చిరు జ్వాలలతో. కోడిజాము వేళ కనిపించే దృశ్యం అదే అక్కడ. నెగడు నుంచి ఒక కొరకంచె తీసుకుని చితుకులు వేసి ఉన్న ఆ పొయ్యిలో పెట్టి ఊదడం మొదలు పెట్టింది సన్యాసమ్మ. పొయ్యి రాజుకున్నాక, లేచి వెళ్లి తన గూడులో ఉన్న కుండని తీసుకువచ్చి పొయ్యి మీద పెట్టి, నీళ్లు పోసింది. దాని మీద చట్టి పెట్టింది.బుగ్గిమంచుతో చల్లగా ఉంది వాతావరణం.ఆమె నడుస్తుంటే ఒక రాజసం ఉంటుంది.

అందుకు ఆమె పొడవు కూడా ఒక కారణం. మహారాణి నడుస్తున్నట్టే ఉంటుంది.  మగవాడితో సమంగా పని చేయగలదని పేరుంది. కొద్దిసేపట్లోనే ప్రతి గూడుకు పక్కన పొయ్యిలు మండటం మొదలైంది. మగవాళ్లలో కొందరు లేచి కూర్చున్నారు. ఇంకొందరు ఇంకా పడుకునే ఉన్నారు, గొంగళ్ల కింద. నీళ్లు మరుగుతున్న శబ్దం వస్తే, గూడు లోపలి నుంచి బియ్యం పోసి ఉంచిన చాట తెచ్చి అందులో ఒంపింది. కొంచెం దూరంగా నిలబడి వేప్పుల్ల నములుతున్నాడు ఆమె భర్త లచ్చన్న దొర.‘‘చూస్తా ఉండు!’’ అని చెప్పి గూడు లోపల కూర్చుని ఆముదం తలకు రాసుకుని కొప్పు చుట్టుకుంది. అన్నం వార్చి, తరువాత మూకుడు పెట్టి, సొరకాయ బుర్రలో ఉంచుకున్న నూనె పోసి  పనస గింజలు వేయించింది. మధ్యాహ్నం పిల్లలు తినడానికి ఇంకొన్ని గింజలు కూడా వేయించింది. వెలుగు వస్తుండగా అంతా బయలుదేరారు పనికి.

ఐదురోజులు గడిచాయి.  అప్పటికే లంబసింగి ఊరి శివార్లకి వచ్చేసింది రోడ్డు. ఆరోరోజు పని మొదలు పెడుతున్నారు.చెట్లు కొట్టేసిన ఆ నేల మీద గొలుసులతో కొలతలు వేస్తున్నారు.మైదాన ప్రాంతాలలో కరణాలు ఉపయోగించే కొలత గొలుసే అది. ఒక కొస కిష్టయ్య, రెండో కొస పిళ్లై పట్టుకుని. నేల మీద గుర్తులు పెడుతున్నారు. పది గొలుసుల దూరం అంటే ఒక ఫర్లాంగు. ‘‘ఇదిదా కట్‌ళై. అంటే... అదేమబ్బా? ఆ... ఆ .. కొలత. పత్తు గొలుసుల దూరం. సమయం నాన్గు దినములు.’’ గట్టిగా అరిచి చెప్పాడు పిళ్లై.

రోలర్‌ నడుపుతున్నాడన్న మాటే గానీ, విలియం దృష్టంతా సన్యాసమ్మ మీదే ఉంది.అది గమనించాడు బాస్టియన్‌.పక్కనే నిలబడి ఉన్న కిష్టయ్యతో అన్నాడు బాస్టియన్‌.‘‘ఏంట్రా కిష్టయ్య! ఆ డ్రైవర్‌గాడు ఇందాకటి నుంచి అలా చొంగ కార్చేసుకుంటన్నాడేంటి దాన్ని చూసి?’’‘‘సన్యాసమ్మంటే ఆడికి మహా మోజు. కళ్లు తిప్పుకోలేకపోతున్నాడు.’’ అన్నాడు కిష్టయ్య.కొంచెం దూరంగా కనిపిస్తోంది సన్యాసమ్మ.‘‘ఏంట్రా! బంతిపువ్వులా మెరిసిపోతంది?’’ చాలా ఆత్రంగా అన్నాడు బాస్టియన్‌.‘‘రాత్రే ఎన్నెల్లో నిలబడి..... సుబ్రంగా... తానం అదీ చేసింది దొరా!’’ అన్నాడు కొంటెగా. ‘‘అమ్మ ఎదవా! చూసావేంట్రా? ఏరా ఇది పడుకోదంటావా?’’ అన్నాడు బాస్టియన్‌ ఆబగా.‘‘కష్టం దొరా!’’ అన్నాడు కిష్టయ్య.

ఇంకా అడుగులు పడుతుండగానే ఒక్క ఉరుకుతో గుర్రం దిగి, గప్పీ దొర బంగ్లా మెట్ల వైపు పరుగులాంటి నడకతో వెళ్లాడు బాస్టియన్‌. పది మెట్లు ఎక్కితే ముందు ప్యూన్ల క్వార్టర్సు కనిపిస్తాయి. కుడి పక్కదాంట్లోనే ద్వారం కిష్టయ్య ఉంటున్నాడు. ఎడం పక్క క్వార్టర్సులో ఓవర్సీర్‌ సంతానం పిళ్లై ఉన్నాడు. కిష్టయ్య ఉన్న క్వార్టర్సులోకి దూరాడు బాస్టియన్‌. సాయంత్రం ఐదు గంటలవుతోంది. చల్లగా ఉంది వాతావరణం. తీరా లోపల ఎవరూ లేరు. కొద్దిగా చీకటిగా ఉంది. హతాశుడైపోయాడు.‘ఈ కిష్టిగాడు అది వచ్చేసిందని చెప్పాడు! ఏమైంది?’ అనుకున్నాడు బాస్టియన్, తనలో.గదిలో ఒక నులక మంచం, ఒక మూలగా ఒక నీళ్ల కుండ. ఆ మంచం మీదే కూర్చున్నాడు బాస్టియన్‌.

అసలు పెద్ద కుట్ర పన్ని, ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప దానితో పొందు సాధ్యం కాలేదు.  పేరు తలచుకోగానే ఒళ్లంతా తిమ్మిరెక్కిపోతుంది బాస్టియన్‌కి. అదో నల్లకలువల గుట్ట. కొండసంత గ్రామంలోనే ఆమెను చూశాడు బాస్టియన్‌.  పేరు డోలా లక్ష్మమ్మ. ఆ ఊరుదే. మొగుణ్ణి వదిలేసి ఒంటరిగా ఉంటోందన్న విషయం బాస్టియన్‌ను మరీ తొందర చేసింది. మొదట ఒక ఘాట్‌ రోడ్డు పనికి ఆమె వచ్చేటట్టు చేశాడు బాస్టియన్‌. అక్కడ మేస్త్రి రామమూర్తికి, సంగతి చెప్పి ఉచ్చులోకి దించే బాధ్యత అప్పగించాడు.

 ఇవేమీ తెలియని లక్ష్మమ్మ ఓ రోజున వచ్చి, ‘మేస్త్రి రెండు రూపాయలు కావాలి. ఇంకోసారి రోడ్డు పనికి వచ్చి తీర్చుకుంటాను’ అని మొరపెట్టుకుంది. బాస్టియన్‌ అనుమతి తీసుకోమని చెప్పి పంపాడు. పది పైసలు కూడా వదలని బాస్టియన్‌ రెండు రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడు. అదే ఆమె పాలిట శాపమైంది. ఆ రెండు రూపాయలు అడ్డంపెట్టుకుని ఆమెను లొంగదీసుకున్నాడు. కొంతకాలంగా ఆమె బాస్టియన్‌ ఇలాకాగా ప్రసిద్ధి. గుమ్మంలో వెండి కడియాల చప్పుడైంది. లోపలికి వచ్చి తలుపులు వేస్తోంది లక్ష్మమ్మ.అమాంతం వెళ్లి కౌగిలించుకోబోయాడు బాస్టియన్‌.

‘‘ఏంటి! ఎలుగ్గొడ్లా పడిపోతన్నారు? ఓ పాలాగండి!’’ అంది చనువుగా చిరాకు పడుతూ. ‘‘ఆగలేనే. నన్నాపకే... నీ కాళ్లు పట్టుకుంటాను!’’ అన్నాడు వంగుతూ.‘‘ ఒక్కసారి ఆగండి!’’ ‘‘ఎందుకు?’’ అన్నాడు బాస్టియన్‌.‘‘కిష్టయ్య వస్తాడు. ఆడూ చూస్తాడని!’’ అంది నవ్వుతూ.‘‘ఇప్పుడు ఆడెందుకు?’’ అన్నాడు చురచుర చూస్తూ.‘‘కౌజు పిట్ట కూర, చేపల పులుసు అట్టుకుని రమ్మన్నాను కిష్టయ్యని.’’ అంది, మంచం మీద దభీమని కూర్చుంటూ. ఆ ఏర్పాటుకు కరిగిపోయిన బాస్టియన్, ‘‘ఒక్క ముద్దు!’’ అంటూ మోటుగా దగ్గరగా తీసుకుని చుంబించాడామెని.అప్పుడే బంగ్లా బయట వినిపించింది కిష్టయ్య గొంతు. ఎవరి మీదో అరుస్తున్నాడు. ఓ నాలుగైదు నిమిషాల తరువాత తలుపు తోసుకుని వచ్చాడు కిష్టయ్య. అన్నం క్యారియర్, ఆకులతో మూతులు కట్టిన కూర, పులుసు గిన్నెలు అక్కడ పెట్టి వేగంగా వెళ్లిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు కిష్టయ్య.

 కానీ ఓ మాట గుర్తుకొచ్చి ఆగాడు.‘‘ఇదిగో లచ్చి! ఆ మూల ఉంది చూడు, గొంగడి. అది మంచం మీదేసుకుని వొణ్ణం తినండి. కింద ఎలగ్గొద్దుల కంపు. మంచం మీదే అలాగే కంచాలు పెట్టీకు. ఎలకలు కొట్టీగలవు.’’ అనేసి వెళ్లిపోయాడు. ఆ గొంగడి అలా ఉపయోగపడుతున్న సంగతి ఇప్పుడే కిష్టయ్యతో తిట్లు తిని వెళ్లిపోయిన మనిషికి తెలియదు. అతడు మూగయ్య. ఇంకా మంచు పడుతూనే ఉంది. చలి తగ్గలేదు. చిన్నాపెద్దా అంతా ఏదో ఒకటి శరీరం మీద కప్పుకుని ఉన్నారు. మూగయ్య ఒంటి మీద మాత్రం చిన్న చీర పేలిక.ఇంకో రెండు రోజులే పని. కానీ ఈ చలి సంగతేమిటి? ఈ రెండు రోజులే కాదు, శీతాకాలం ఇంకో ఇరవై రోజులైనా ఉంటుంది. వచ్చే సంవత్సరం మళ్లీ చలికాలం వస్తుంది. గొంగడి లేకుండా ఎలా?

ముక్కు కారిపోతోంది. తలంతా భారం. గెడ్డం పెరిగిపోయి, కొద్దిగా జ్వరంతో ఉన్నాడు మూగయ్య. అప్పుడే వచ్చాడు పనిలోకి. ఓ చెట్టు కింద రోడ్డు రోలర్‌ ఫైర్‌మ్యాన్‌తో మాట్లాడుతున్నాడు కిష్టయ్య. ‘‘కిష్టయ్య!’’ భయం భయంగా పిలిచాడు మూగయ్య, దగ్గరగా వెళ్లి.‘‘ఏంట్రా?’’ గట్టిగా అరిచాడు కిష్టయ్య.రెండు చేతులూ జోడించి, దాదాపు కళ్లల్లో నీళ్లతో సైగ చేశాడు మూగయ్య, తన గొంగడి ఇమ్మంటూ. ‘‘గొంగడి.....! ఛీ... మాపటేల రా. పట్టుకుపో! శనొదిలిపోతది. నీ....’’ పెద్ద బూతు మాటతో అన్నాడు కిష్టయ్య. ఇంకొక్క రోజు. మళ్లీ నెల రోజుల పాటు ఈ బండపాటు ఉండదు. ఉంటే తిందాం, లేకపోతే పస్తులుందాం అన్నట్టు వడివడిగా పని చేస్తున్నారు. మధ్యాహ్నమయింది. ఇంత వరకు బాస్టియన్‌ ఒక్కమాట అనలేదు. ఇది మరీ విచిత్రంగా అనిపిస్తోంది వాళ్లకి.  చిట్రాళ్లగొప్పు నుంచి కొత్తరోడ్డు దాదాపు గప్పీ దొర బంగ్లా దగ్గరికి వచ్చేసింది.గíప్పీదొర బంగ్లాకు అవతల ఇంతకు ముందు వేసిన రోడ్డుతో కలిపితే డౌనూరు దాకా రోడ్డు నిర్మాణం పూర్తయినట్టే.

గప్పీదొర బంగ్లాకి కొంచెం ఇవతలే ఉంటుందా రాయి. చాలా వరకు బద్దలు కొట్టినా కొంత అడ్డం వస్తుందనిపించింది పిళ్లైకి. అందుకే దానిని ఇంకొంచెం బద్దలు కొట్టమన్నాడు. పైగా ఇద్దరు మగ మనుషులకి సమానం, నువ్వే చేసెయ్‌ అని సన్యాసమ్మకి పురమాయించాడు. దానితోనే రెండు గంటల నుంచి పోరాడుతోందామె. పిళ్లై చూపించిన గుర్తు దగ్గరకు రావడానికి ఇంకో అరగంట పడుతుంది. ఒకసారి వచ్చి బాస్టియన్‌ చూసి వెళ్లాడు. ఆమె సుత్తితో బలంగా మోదుతున్నప్పుడు కదిలే ఆ గుండెల్ని చూస్తూ కాలక్షేపం చేశాడు. ఏదో రకంగా ఆమెను తాకాలి. అదే అతడి దుర్బుద్ధి.ఏమైందో తెలియదు, ఆ దెబ్బ చాలా గట్టిగా వేసింది సన్యాసమ్మ.అరచేయంత రాతి పెచ్చు ఊడి పడింది. దానితో పాటు శానం కొస కూడా అంగుళం మేర విరిగింది.

‘‘ఒళ్లు తెలియడం లేదే లంజా!’’
ఒక్క అరుపు అరిచాడు బాస్టియన్‌. ఆమె ఇటు తిరిగే లోపునే వీపు మీద బలంగా తన్నాడామెని, ఒళ్లు తెలియని కోపంతో. ముఖం వెళ్లి ఆ పెద్ద రాయికి తగిలింది బలంగా. తరువాత అప్పటిదాకా కొట్టిన రాళ్ల మీద బొక్క బోర్లా పడిపోయి కెవ్వు మంది సన్యాసమ్మ. ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు ‘‘ఆ క్రౌబార్లని బాగు చేయించాం. మళ్లీ ఇదా? బుద్ధిలేదా?’’ అప్పటికి ఆమె గెడ్డం, రెండు పెదవులు పగిలి, పళ్లు కూడా కదిలి నోటి నుంచి ధారగా స్రవిస్తోంది రక్తం. పాకుతున్న బిడ్డలాగా మోకాళ్ల మీద, అరచేతుల మీద ఆనుకుని నేల మీద ఉందామె. నోట్లో నిండుతున్న ఉప్పటి, వెచ్చటి రక్తాన్ని కాండ్రించి, కాండ్రించి ఉమ్మేస్తోంది– ఏడుస్తూ, దగ్గుతూ, పొలమారుతున్న గొంతుతో.

పక్కనే నీళ్లు చల్లుతున్న కొండమ్మ చటుక్కున వచ్చి, ‘‘ఏంటి బాబూ ఇది! సచ్చిపోతాది. ఏంటిది? చాల్లెండి!’’ అంది గట్టిగా. తన శరీరం పెడుతున్న బాధతోనా? లేకపోతే, తన శరీరాన్ని ఇంతగా గాయపరిచిన అవతల మనిషి మీద కసితోనా– అర్థం కాలేదు బాస్టియన్‌కి. సన్యాసమ్మ కుడి చేతి వేళ్లు సుత్తి పిడి చుట్టూ బిగుసుకుంటూ ఉంటే అతడు రెండడుగులు వెనక్కి వేశాడు. సన్యాసమ్మ అక్కడే గొంతుక్కూర్చుని నోట్లో రక్తాన్ని కాండ్రించి ఉమ్ముతూనే ఉంది. దూరంగా ఆమె భర్త లచ్చన్న.... నిస్సహాయంగా చూస్తూ.రేపు ఉదయం బియ్యం, కూలీ డబ్బులు తీసుకుని సొంతూళ్లకి వెళ్లిపోతామన్న సంగతి చాలా ఆనందాన్ని కలిగిస్తోంది వాళ్లకి.ఓ నెగడు ముందు కూర్చుని ఉన్నాడు మూగయ్య. అతడిలో మాత్రం ఏ భావమూ లేదు.అక్కడికే వచ్చాడు శనోరం ఊరు యువకుడు కంటందొర.‘‘గొంగడి తెచ్చుకున్నావా? ఈ రోజైనా ముసుగెట్టి హాయిగా పడుకో!’’ అన్నాడు, కంటందొర.ఏమీ మాట్లాడకుండా చలి కాచుకుంటున్నాడు మూగయ్య.‘‘ఏంటి మాట్లాడవు? కిష్టయ్య ఇచ్చాడా లేదా గొంగడి!’’ ‘‘ఇచ్చాడ్రా!’’ అన్నాడు మూగయ్య, బాగా జలుబు చేసిన గొంతుతో.

వెంటనే లేచి వెళ్లి తన గూడులో పెట్టుకున్న గొంగడి తెచ్చి అతడి చేతికి ఇచ్చాడు మూగయ్య.  మూటలా చుట్టేసి ఉంది.‘‘మరి కప్పుకో. ఉండు నేను కప్పుతాను.’’ అంటూ విప్పాడు గొంగడిని. తాటికాయలు... ఇంకా చెప్పాలంటే  పనసకాయలు మూట కట్టినా ఉండవు. ఎలుకలు కొట్టేశాయి .ఎవరి చేతిలో పడతాయి డబ్బులు? ఎవరి సంచిలో ఎంత బియ్యం పడుతుంది? వాళ్లందరి ముఖంలోను ఉత్కంఠ. గప్పీ దొర బంగ్లాకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కూలీలంతా కూర్చుని ఉన్నారు.

అరుగు మీద వేసిన కుర్చీలో కూర్చుని ఉన్నాడు బాస్టియన్‌. ఆ బంగ్లా మెట్లలో ఓ మెట్టు మీద కూర్చుని మస్తర్లు పరిశీలిస్తున్నాడు పిళ్లై. ఇంకో రెండు మెట్ల కింద కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు కిష్టయ్య. ‘‘గారంగి లింగాలు ’’ నెమ్మదిగా చదివాడు పిళ్లై. లింగాలు అన్ని రోజులూ రాళ్లు మోశాడు. ‘‘లింగాలు! నీకు పని అబ్బలేదురా!  నీకు మొత్తం కూలీ ఎనిమిది రూపాయలు. పది కుంచాల బియ్యం కొలిచాం. ఇంక  నాలుగు రూపాయలు కూలీ. అది మాత్రం నీకు ఇవ్వొద్దన్నారు దొరవారు.’’ అన్నాడు పిళ్లై.

‘‘ఒక్క రూపాయి....’’దీనంగా అడిగాడు లింగాలు. ‘‘నోర్మూసుకుని పో’’ మెడ పట్టి గెంటినంత పని చేశాడు కిష్టయ్య.అప్పటికే ఇంకో పేరు పిలుస్తున్నాడు పిళ్లై ‘‘కారంగి నాగులు, మర్రిపాలెం’’ లేచి వెళ్లాడు నాగులు.‘‘బియ్యం ఎంత కొలిచాం;’’ అడిగాడు పిళ్లై.‘‘నాకేటి తెలుసు దొరా!’’‘‘కొలిచాం కదా! నువ్వు పట్టుకెళ్లావ్‌ కదా!’’ అన్నాడు కలం గాల్లో ఊపుతూ, పిళ్లై. ‘‘ఔను దొరా, కొలిసారు.’’ అంగీకరించాడు నాగులు. ‘‘నీకు వారం రోజుల కూలీ ఇవ్వాలి. ఇక్కడ రాసుకున్నాం. వచ్చేసారి చేసినప్పుడు సర్దుతారు దొరవారు. బియ్యం తీసుకుని వెళ్లిపో!’’ అన్నాడు పిళ్లై.కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి నాగులికి. తరువాత పిలిచాడు పిళ్లై , ‘‘కొండమ్మ!’’ ‘‘పిట్టల చిన్నిగాడి పెల్లాం, కొండమ్మ’’ గట్టిగా అరిచాడు కిష్టయ్య. ‘‘దండాలు. మొన్న పనిలో తొమ్మిదణాలు రావాలి బాబూ!’’ అంది వినయంగా.‘‘ఏమే, మాకు తెలీదా! నాల్రోజులు కూలీ చేసేటప్పటికే లెక్క తెలిసిపోయిందీళ్లకి!’’ వ్యంగ్యంగా అన్నాడు కిష్టయ్య.

 ఆ తొమ్మిదణాలు, ఇప్పుడు ఇవ్వవలసిన ఇంకో తొమ్మిది అణాలు– అబ్బో చాలా పెద్ద మొత్తం. ఎలా ఎగ్గొట్టాలా అని చూస్తున్నాడు పిళ్లై. ఆమె అలా అడగడం కలసి వచ్చింది.‘‘ఏమే, నువ్వు చింతపల్లి పనిలో పారొకటి తిరిగి ఇవ్వలేదని కిష్టయ్య చెప్పాడు. పోయిన సర్కారు వారి పారకి డబ్బులు నువ్వే ఇవ్వాలి! నీ కూలీ దానికి చెల్లు’’ అన్నాడు పిళ్లై.కొండమ్మ  దాదాపు ఏడుస్తూ అంది, ‘‘సత్తె పెమానం. నాకేటీ తెల్దు దొర! ’’ అంది.‘‘లంబసింగి పనికి వస్తావ్‌ కదా! అప్పుడు చూద్దాం. పో.’’ అన్నాడు పిళ్లై. అడుగు పడలేదామెకి.

 ‘‘పొమ్మంటే పోవేమే!’’ గట్టిగా అరిచాడు బాస్టియన్‌.
ఇంతకాలం కష్టాలు కలసి తిన్నా, కలసి దెబ్బలు తిన్నా, కలసి కన్నీళ్లు కార్చినా  ఆ క్షణంలో నాలుగు రూపాయలు తీసుకున్నవాడు మూడు రూపాయలు తీసుకున్నవాడికి పరమ శత్రువులా కనిపించాడు. ఈ ఇద్దరూ రెండు రూపాయలు తీసుకున్నవాడికి ఆగర్భ శత్రువుల్లా కనిపిస్తున్నారు. ఎవరి దగ్గర ఎవరూ వీడ్కోలు తీసుకోవడం లేదు. నిరాశగా, నిస్పృహతో, జీవచ్ఛవాల్లా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచిపోతున్నారంతా.

Advertisement
Advertisement