అరణ్యం: హైనాలు పెళ్లి చేసుకుంటాయా? | Sakshi
Sakshi News home page

అరణ్యం: హైనాలు పెళ్లి చేసుకుంటాయా?

Published Sun, Dec 1 2013 4:18 AM

అరణ్యం: హైనాలు పెళ్లి చేసుకుంటాయా?

     హైనాలు చూడ్డానికి పెద్ద సైజు కుక్కల్లా ఉంటాయి కానీ... వీటికి పిల్లి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చడీ చప్పుడు లేకుండా నడవడం, దొంగ పనులు చేయడం, అక్కడా ఇక్కడా నక్కడం వంటికి వేస్తుంటాయివి!
     మగ హైనాల కంటే ఆడవి పెద్దగా, బలంగా ఉంటాయి!
     హైనాలు నవ్వుతాయని చాలామంది అంటారు. కానీ నిజానికవి నవ్వవు. దేనికైనా ఎగ్జయిటైనప్పుడు అవి ఒకలాంటి శబ్దాన్ని చేస్తాయి. అది నవ్వులాగా వినిపిస్తుంది. మరో విషయం ఏమిటంటే చుక్కలున్న హైనాలు మాత్రమే ఇలాంటి శబ్దాన్ని చేస్తాయి!
     ఇవి ఎంత స్పీడుగా ఆహారాన్ని తింటాయంటే... పులి లేదా సింహం ఒక కిలో మాంసం తినేలోపు హైనా రెండు మూడు కిలోలు తినేయగలదు!
     వీటి గుంపును ‘క్లేన్’ లేదా ‘ప్యాక్’ అంటారు. ప్రతి గుంపులో ఐదు నుంచి ఎనభై హైనాలు ఉంటాయి!
     హైనాకి పెద్ద జంతువులను చంపడానికి బలం చాలదు.  అందుకే అవి గుంపుగా వేటాడతాయి. ఒంటరిగా వేటాడాల్సి వస్తే... కుందేళ్లు, పక్షులు, చేపలు, చిన్న చిన్న జలచరాలను మాత్రమే వేటాడగలవు!
     వీటి పళ్లు ఎంత బలంగా ఉంటాయంటే... జంతువుల ఎముకలు, పళ్లు కూడా పటపటా కొరికి తినేస్తాయివి!
     హైనాలు కాస్త మౌనంగా, తమ పని తాము చేసుకుపోతుంటాయి. గుంపులోని మిగతా వాటితో కూడా అవి అంతగా కలవవు. ఆహారం దొరకనప్పుడు ఇవి తమలో తమనే చంపుకు తినేస్తాయి. బహుశా అందుకే భయంభయంగా ఉంటాయేమో!
     ఇవి మరో జంతువుతో జతకట్టే విధానాన్ని చూస్తే... మనుషులు పెళ్లాడినట్టే అనిపిస్తుంది. హైనాలు తమ గుంపులోని జంతువుల జోలికి అస్సలు పోవు. వేరే గుంపులోని వాటితో మాత్రమే జతకడతాయి. అది కూడా మిగతా జంతువుల్లా చూడగానే ఆకర్షితం కావు. ఒకటి రెండుసార్లు పరిశీలించాకే జతకడతాయి. వాటితోనే ఉంటాయి!
 
 పుస్తకానికి స్ఫూర్తి...
 సినిమాకి ప్రేరణ... ఎల్సా!
 జార్జ్ ఆడమ్‌సన్  వన్యప్రాణి సంరక్షకుడు. 1956లో ఓసారి అతడు తన భార్య జాయ్‌తో కలిసి కెన్యా అడవులకు వెళ్లాడు. అక్కడ అకస్మాత్తుగా ఓ సింహం జార్జ్ మీద దాడి చేసింది. దాన్నుంచి తనను తాను కాపాడుకోవడానికి తుపాకీతో షూట్ చేశాడు జార్జ్. ఆ సింహం అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది. కొద్ది దూరంలో నిలబడి చూస్తోన్న దాని పిల్లలు భయపడిపోయి, పక్కనే ఉన్న పొదలో నక్కాయి. వాటిని చూసి చాలా జాలేసింది జార్జ్‌కి. వాటిని తనతో తీసుకు వెళ్లాడు. రెండు పిల్లల్ని జూలో అప్పగించి, వారాల పిల్ల అయిన మూడోదాన్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. అదే ‘ఎల్సా’.
 
 జార్జ్, జాయ్‌లు ఎల్సాని తమ సొంత బిడ్డలా పెంచారు. అది వాళ్లతోటే కలిసి తినేది, తిరిగేది. జాయ్‌కి ఇంటి పనుల్లో సాయం కూడా చేసేది. అయితే ఐదేళ్లు తిరిగేసరికి బాబెసియోసిస్ అనే వ్యాధి సోకింది ఎల్సాకి. మనుషుల్లో మలేరియా ఎలాగో, క్యాట్ జాతి జంతువులకి ఈ జబ్బు అలాగ. ఆ జబ్బుతోనే అది 1961లో కన్నుమూసింది. దాని అంత్యక్రియలు ఘనంగా చేశారు జార్జ్ దంపతులు. ఇప్పటికీ ఎల్సా సమాధి కెన్యాలోని మెరూ నేషనల్‌పార్క్ దగ్గర ఉంది. ఎల్సా గురించి, తమ జీవితంలో దాని ప్రాధాన్యత గురించి ‘బోర్న్ ఫ్రీ’ అనే పుస్తకంలో రాసింది జాయ్ ఆడమ్‌సన్. ఆ పుస్తకం ఆధారంగా అదే పేరుతో సినిమా కూడా వచ్చింది. దాంతో ఎల్సా మరీ పాపులర్ అయిపోయింది!
 
 

Advertisement
Advertisement