సత్వం: పండిత్ | Sakshi
Sakshi News home page

సత్వం: పండిత్

Published Sun, Jun 29 2014 2:28 AM

సత్వం: పండిత్ - Sakshi

జూలై 1న వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా జన్మదినం
వేణుగానం చేయడమంటే శ్వాసను నియంత్రించడం. ఇంకోమాటలో యోగా చేయడం. ఒక పవిత్రమైన బాధ్యతతో, ఆధ్యాత్మిక మానసిక స్థితితో ఒక ధ్యానంలాగా యోగంలాగా నేను పాడతాను.
 
 హరిప్రసాద్ చౌరాసియా వేణుగానం చూస్తే- ఆ నాదం వాద్యంలోంచి మాత్రమే వచ్చినట్టు ఉండదు; మడిచిన పెదాలలోంచీ, ఆడే చేతివేళ్లలోంచీ మాత్రమే కాదు, వెన్నులోంచీ,  జుట్టులోంచీ, మొత్తంగా ఆయన ఒంట్లోంచీ సంగీతం వెలువడినట్టుంటుంది. ‘కృష్ణభగవానుడితో నేరుగా అనుసంధానం కలిగిన వాద్యమిది. ఏ ఆడంబరం లేదు, ఏ తొడుగులు లేవు, ఏ తంత్రులు అక్కర్లేదు. వెదురు ముక్క చాలు. గాలిని నియంత్రించడానికి రంధ్రాలు! దేవుడు మాత్రమే ఇంత సరళమైన వాద్యాన్ని కనిపెట్టగలడు!’ అంటారు చౌరాసియా. ‘పైగా తీసుకెళ్లడం ఎంత సులభం’!
 
 ఒక వస్తాదు కొడుకుగా చౌరాసియా సంగీతంతో రహస్యంగా కుస్తీ పట్టాల్సివచ్చింది. కారణం, వాళ్ల నాన్నకు సంగీతమంటే వేశ్యలకు సంబంధించింది! తనలాగే కొడుకూ వస్తాదు కావాలని ఆయన కోరిక. నాలుగున్నరేళ్లప్పుడే అమ్మపోయింది కాబట్టి, నాన్నను ఒప్పించే మార్గం లేకపోయింది. గుడికి వెళ్తున్నానని చెప్పి స్నేహితుడింటికి వెళ్లేవారు. అక్కడ పాడటం సాధన చేసేవారు. పండిత్ రాజారామ్ ఆయనలో ప్రతిభ ఉందని గుర్తించి, బోధించడం మొదలుపెట్టారు.
 
 ‘పదిహేనేళ్ల వయసులో అలహాబాద్ రేడియోలో తొలిసారి వేణుగానం విన్నాను. స్వర్గానికి రవాణా అయినట్టుగా అనుభూతి చెందాను. అది నా జీవితంలో కీలకమలుపు,’ అంటారు చౌరాసియా. అంతే! అంత గొప్పగాలేని తన గాత్రానికి స్వస్తిచెప్పారు. ఆ వేణువూదిన పండిత్ భోలానాథ్‌ను వెతుక్కుంటూ వెళ్లి, గుమ్మంలో వాలిపోయారు. కూరగాయలు కోయడం, మసాలాలు నూరడానికైనా ఈ పిల్లాడు పనికొస్తాడని ఒప్పుకున్నారాయన. కానీ అదే భోలానాథ్ అచ్చెరువొందేలా, వేణువుకు సరికొత్త ఊపిరిలూదారు.
 
 వేణువు అర్హతగా ఒరిస్సా రేడియోలో ఉద్యోగం వచ్చినరోజున చౌరాసియా నాన్న ఆశ్చర్యపోయారు, దాచివుంచిన సంగతి గురించి! కానీ ఒప్పుకోక తప్పలేదు. అదే ఒరిస్సా రేడియో ఆయన్ని ‘బొంబాయి’ చేర్చింది. మదన్‌మోహన్, రోషన్ లాంటి సంగీతదర్శకులు ఆయన వేణుగానానికి సమ్మోహితులై సినిమాల్లోకి ఆహ్వానించారు. ఎస్ డి బర్మన్, ఆర్ డి బర్మన్‌తోనూ పనిచేశారు (తర్వాతి కాలంలో ‘సిరివెన్నెల’కు తన వేణువుతో  ప్రాణం పోశారు). ‘బాలీవుడ్ అవకాశాలు నన్ను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశాయి. భవంతి సమకూరింది, కారు ముంగిట ఆగింది, భౌతిక అవసరాలు తీరాయి; కానీ ఒక అసంతృప్తి మొదలైంది. నేను కళాకారుడిగా ఎదగడం లేదు. నాకు ఇంకేదో కావాలి, నా ఆత్మ సుఖించడం లేదు,’ అని అప్పటి మథనం గురించి చెబుతారాయన.
 దాంతో ‘సుర్‌బహార్’ విద్వాంసురాలు అన్నపూర్ణాదేవిని కలిశారు. అప్పటికే పండిత్ రవిశంకర్‌నుంచి విడిగా ఉంటున్నారామె. బహిరంగ ప్రదర్శనలు మానేశారు. ఆమె చౌరాసియాను ముందు శిష్యుడిగా అంగీకరించలేదు. బయటికి తోసినంత పనిచేశారు. కానీ మూడేళ్లుగా చూపిస్తున్న ఆయన తపనకు తలొగ్గక తప్పలేదు. ‘నేను పట్టుదలతో ఉన్నానని తెలియజేయడానికి నా చేతుల్ని మార్చుకున్నాను. అంతకుముందు కుడిచేత్తో వాయించేవాడిని. ఎడమచేతికి మారిపోయాను. వెనక్కి చూడకుండా వెనక్కి తిరిగి నడవడం లాంటిదది. హింస! కానీ సంతోషం! ఆమె నాకు గురువు మాత్రమే కాదు, దేవతకన్నా ఎక్కువ. నా ఆకలి, ఆరోగ్యం పట్టించుకున్నారు. నా సంగీతానికి పరమార్థం కల్పించారు,’ అని తబ్బిబ్బవుతారు చౌరాసియా.
 
 ‘ఒక్కో క్షణం అద్భుతంగా ఉంటుంది. ఆ క్షణంలో సంగీతం ప్రవహిస్తుంది. ఒక నీటిచుక్క నువ్వు దాహంగా ఉన్నప్పుడు ఆర్తి తీర్చుతుంది. అదే బిందువు నీటియంత్రంలోంచి పైకి ఎగిరినప్పుడు దాని అందంతో మురిపిస్తుంది. మళ్లీ అదే చుక్క మురికినీరులో కలిసి అసహ్యం పుట్టిస్తుంది. అదే నీటిబిందువు నదిలో కలిసి ఈదే ఉత్సాహం కలిగిస్తుంది. అదే చుక్క సముద్రంలో కలిసినప్పుడు తన శక్తితో ఆశ్చర్యగొలుపుతుంది. ఇదంతా కూడా సంగీతంతో పలికించొచ్చు’.
 
 ‘వేణుగానం చేయడమంటే శ్వాసను నియంత్రించడం. ఇంకోమాటలో యోగా చేయడం. ఒక పవిత్రమైన బాధ్యతతో, ఆధ్యాత్మిక మానసిక స్థితితో ఒక ధ్యానంలాగా యోగంలాగా నేను పాడతాను. అసలు నేను శ్రోతలకోసమే పాడతాను. కానీ అందులో ఎన్నో రకాలవాళ్లుంటారు. వారందరినీ తృప్తి పరచడం సాధ్యం కాదు. వాళ్ల మధ్యలో ఒక గొప్ప శక్తి ఏదో కనబడుతుంది. అది మాధవుడే కావొచ్చు. ఆ శక్తికోసం నేను వేణువు పలుకుతాను. నాలోనేను దైవాన్ని అనుభవిస్తాను,’ అంటారు తన వేణుగానం గురించి. ‘సంగీతమే నా ప్రార్థన. సంగీతమే నా మతం’ అనే చౌరాసియాకు ఎక్కడా రికార్డుగా లేని కృష్ణుడి గానం వినలేదన్న చింత ఉందట! కానీ మనకా బాధ లేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement