గర్భనిరోధక సాధనం... ఆలివ్‌! | Sakshi
Sakshi News home page

గర్భనిరోధక సాధనం... ఆలివ్‌!

Published Sun, May 28 2017 12:45 AM

గర్భనిరోధక సాధనం... ఆలివ్‌!

ఇప్పటివరకూ గర్భనిరోధక సాధనాలు (కాంట్రాసెప్టివ్స్‌) మహిళలకు వేరుగా పురుషులకు వేరుగా ఉంటున్నాయి. కానీ స్త్రీ–పురుషులిద్దరికీ కాంట్రాసెప్టివ్‌గా పనికి వచ్చే ఒకే ఒక పిల్‌ను రూపొందించే పనిలో పడ్డారు పరిశోధకులు. ఇందుకోసం ఆలివ్‌ గింజలు బాగా పనికి వస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాటిల్లోని ‘ల్యూపియాల్‌’ అనే ఒక రసాయనం పురుషుల్లో శుక్రకణాలను నిలువరిస్తుందని పరిశోధకులు  తెలుసుకున్నారు. ఈ ల్యూపియాల్‌ శుక్రకణాన్ని ముందుకు నెట్టే తోక భాగపు కదలికలను తగ్గించడం ద్వారా దాని కదలికలను బాగా మందగించేలా చేస్తుంది.

అలాగే థండర్‌గాడ్‌ వైన్‌ అనే చైనీస్‌ మందులోని పదార్థాలూ ఇలాగే పనిచేస్తాయట. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ బర్కిలీకి చెందిన పరిశోధకల్లో ఒకరైన డాక్టర్‌ పాలినా లిష్కో మాట్లాడుతూ... ‘‘ఈ రసాయనం శుక్రకణాలను విషపూరితం చేయదు. కాబట్టి వాటిపై ప్రతికూల ప్రభావాలేమీ ఉండవు. కేవలం శుక్రకణపు  కదలికలను ఆలస్యం చేయడం ద్వారా గర్భం రాకుండా చూస్తుంది. అలా ఇది పురుషులు వాడదగ్గ పిల్‌ రూపంలో త్వరలో లభించే అవకాశం ఉంది’’ అన్నారు.

ఇక ఆండ్రాలజీ విభాగానికి చెందిన మరో నిపుణులు అలాన్‌ పేసీ మాట్లాడుతూ ‘‘పురుషులు వాడ దగ్గ సంతాన నిరోధక మాత్రను రూపొందించే ప్రయత్నంలో ఇదొక అద్భుతమైన ముందడుగు’’ అన్నారు. అలాగే ఇది మహిళల్లో అండం రూపొందే ప్రక్రియను (ఓవులేషన్‌) నిరోధిస్తుంది. తద్వారా మహిళలకూ మంచి గర్భనిరోధక సాధనంగా పనిచేస్తుంది. ఇలా ఒకే గర్భనిరోధక సాధనం స్త్రీ–పురుషులిద్దరికీ ఉపకరిస్తుందనీ, త్వరలోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు పరిశోధకులు.

Advertisement
Advertisement