సేద్యం ఎలా చేయాలంటే... | Sakshi
Sakshi News home page

సేద్యం ఎలా చేయాలంటే...

Published Sun, Jan 12 2014 1:44 AM

సేద్యం ఎలా చేయాలంటే... - Sakshi

 ప్రపంచ వ్యవసాయ సదస్సుకి చంద్రబాబుని ముఖ్య అతిథిగా పిలిచారు. ‘‘వ్యవసాయం వల్ల ప్రపంచంలోని రైతులంతా పాపర్ పడుతుంటే, రెండెకరాల నుంచి వేలకోట్లకు బాబు ఎదిగాడు. సేద్యంలో ఎన్నో మెలకువలు తెలిసుంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఆ టెక్నిక్‌లు వివరిస్తే రైతులంతా బాగుపడతారు’’ అని నిర్వాహకులు చెప్పారు.
 
 బాబు మైక్ తీసుకుని, ‘‘సేద్యానికి వైద్యం అవసరం, నైవేద్యం దైవానికి ముఖ్యం. గుడిని లింగాన్ని మింగినా బయట బసవన్న మిగిలిపోతాడు. అవార్డుల్లో నంది మిగిలింది. పొలాల్లో మాయమైంది. భూమిని ఒక్కోచోట ఒక్కోరకంగా పిలుస్తారు. కుంటలు ఎకరాలవుతాయి. గజాలు అపార్ట్‌మెంట్లవుతాయి. సెంట్లు పర్‌సెంటేజీగా మారుతాయి. రైతు ఎండినపుడు ఇజ్రాయిల్‌నుంచి పనిముట్లు తెప్పించాను. పొలం పండినపుడు దివాళా తీయించాను. మట్టిని నమ్మితే పుట్టి మునుగుతుంది. ల్యాండ్‌ని అమ్మితే బ్యాండ్ మోగుతుంది...’’ అని చెపుతుండగా నిర్వాహకులు అడ్డుతగిలి, ‘‘సార్, మేమడిగింది రెండెకరాల వల్ల మీరెలా బాగుపడ్డారని...’’ అని అడిగారు.
 
 ‘‘చెడిపోయేవాడిని ఎవరూ బాగు చేయలేరు. బాగుపడేవాడిని ఎవరూ చెడగొట్టలేరు. మనది కర్మభూమి. ప్రజలకు ఖర్మ మిగిలి మనకు భూమి మిగులుతుంది. రాజకీయాలను వ్యవసాయంతో అనుసంధానం చేసి, వచ్చిన మిగులును భూమితో బంధించి, ఆ తరువాత పాలిటిక్స్‌ని దున్ని, ఎన్నికల్లో విత్తులు చల్లి, ఓట్లను కోసుకుని వచ్చిన పంటను దాచి, కరువొచ్చినపుడు వ్యాపారం చేసి... రైతన్న రాజ్యంలో...’’  అని బాబు అంటుంటే... నిర్వాహకులు బుర్రగోక్కొని, ‘‘సార్, ట్రాక్ తప్పుతున్నారు...’’ అన్నారు.
 
 ‘‘ట్రాక్ వుంటే కదా తప్పడానికి! రైలుకి ట్రాక్, బస్సుకి రోడ్డు, నౌకకి నీళ్లు, విమానానికి ఆకాశం.. మరి రైతుకి? భూమిలోకి దిగితే బురద, ఒడ్డుకొస్తే అప్పులు, అందుకే సేద్యం దండగ. క్రాక్ ఉంటేనే ట్రాక్ తప్పుతాం.’’
 
 నిర్వాహకులు జడుసుకొని వేదికపై నుంచి దూకడానికి ప్రయత్నించారు. బాబు వారిని ఒడిసి పట్టుకుని ‘‘అంతా మీ ఇష్టమేనా? అడిగినవారిని కడిగేస్తా, అవినీతిలేని సమాజం, పేదరికంలేని ప్రజలను చూడడమే ఆశయం. దీనికోసం రుణాలిస్తా, ఇచ్చినవాటిని మాఫీ చేస్తా. నన్నెవరేం చేయలేరు’’ అని అరిచాడు.
     ‘‘వ్యవసాయంపైన ఎలా సంపాదించానంటే ఎవరో పంట వేస్తే మనం కోసుకోవాలి. అదో పథకం. ఇక ఉదయం విత్తితే సాయంత్రం పంట పండేలా చూసుకోవాలి. దీన్ని గవర్నమెంట్ క్రాప్ అంటారు. ఎంతకోస్తే అంత పండుతుంది. మనకు కంకులు, జనానికి గడ్డి. ఇలా రాజకీయాల్లో ముప్ఫై ఏళ్లకు పైగా సేద్యం చేసి పంట పండించాను. నాకంటే ఉత్తమరైతు ఉంటాడా?’’ అని సవాల్ చేశాడు.
 ఇంతలో బాబు పీఏ వచ్చి, ‘‘ఆయన ఏదీ స్పష్టంగా మాట్లాడడు. మనకు ఎంత అర్థమైతే అంత, ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకోవాలి. సముద్రం చూడ్డానికే తప్ప తాగడానికి పనికిరాదు’’ అని విడమరిచి చెప్పేసరికి నిర్వాహకులు, రైతులు కలిసికట్టుగా పారిపోయారు.
 
 -  జి.ఆర్.మహర్షి
 
 మహర్షిజం
 
 రాజకీయ పేకాటలో ఈసారి కాంగ్రెస్ ఎందుకు ఓడిపోతుంది?
 జోకర్లు ఎక్కువై!
 
 రేషన్ కార్డులు అడిగిన వారికి మెమొరీ కార్డులు, మెమొరీ కార్డులు అడిగిన వారికి రేషన్ కార్డులివ్వడమే రాజకీయం.
 
 స్పోర్ట్స్ సామెత:
 అన్ని బాల్స్‌ను ఒకే బ్యాట్‌తో కొట్టలేం!
 
 బాబుకి కిరణ్‌కి తేడా?
 బాబుని చూస్తే ప్రజలు భయపడతారు. ప్రజలను చూసి కిరణ్ భయపడతాడు.
 
 కేజ్రీవాల్ పరిస్థితి
 కుర్చీ కింద కాంగ్రెస్ టైంబాంబు పెట్టుకున్నాడు.
 
 ఢిల్లీ ఎన్నికలపై ఒక పెద్దాయన కామెంట్:
 ప్రజలు చీపుళ్లతో వూడ్చిన ప్రతిసారి అంతకు రెండింతలు చెత్తను వేస్తారు మన నాయకులు.
 
 టీకొట్టు వ్యాఖ్య:
 పులి వేషానికి, భరతనాట్యానికి తేడా తెలియకుండా ఎగురుతున్నారు మన నాయకులు.
 
 

Advertisement
Advertisement