ఆలస్యంగా మెచ్యూర్ అయితే..? | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా మెచ్యూర్ అయితే..?

Published Sun, May 1 2016 4:25 AM

ఆలస్యంగా మెచ్యూర్ అయితే..? - Sakshi

సందేహం
నా వయసు 22. నాకు మరో మూడు నెలల్లో పెళ్లి జరగబోతోంది. అయితే నన్నొక సందేహం బాగా భయపెడుతోంది. నేను చాలా ఆలస్యంగా మెచ్యూర్ అయ్యాను. అంటే... పందొమ్మిదో యేడు దాటిన తర్వాత అయ్యాను. అంటే అయ్యి ఇప్పటికి రెండున్నరేళ్లు అవుతోంది. మరి నా శరీరం, నా అవయవాలు అన్నీ పెళ్లికి తగినట్టుగా ఎదిగి ఉంటాయా? లేక ఆలస్యంగా మెచ్యూర్ అవ్వడం వల్ల అప్పుడే పెళ్లి చేసుకుంటే ఇబ్బందులేమైనా వస్తాయా? నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా? సలహా ఇవ్వండి.
 - విజయశ్రీ, గుడివాడ

 
సాధారణంగా మెదడులో స్రవించే హార్మోన్స్ ఆడపిల్లల అండాశయాలు, గర్భాశయం పైన ప్రభావం చూపడం వల్ల పీరియడ్స్ మొదలై రజస్వల అవుతారు. ఇది 12-16 సంవత్సరాల వయసు లోపల జరుగుతుంది. మారుతున్న ఆధునిక కాలంలో జీవనశైలిలో మార్పులు, ఆహారంలో జంక్‌ఫుడ్ మోతాదు పెరగడం, వ్యాయామం లేకపోవడం, ఎక్కువగా టీవీలు, ఫోన్లలో కాలక్షేపం వంటివెన్నో మార్పుల వల్ల మెదడు త్వరగా ప్రేరేపణకు గురై 10-11 ఏళ్లకే చాలామంది పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు.

ఇలాంటి కాలంలో మీరు 19 ఏళ్లకి మెచ్యూర్ అయ్యారంటే చాలా ఆలస్యంగా అయినట్లే. మీ బరువు, ఎత్తు రాయలేదు. కొందరు మరీ బలహీనంగా, బక్కచిక్కినట్లు ఉండటం వల్ల... లేదా హార్మోన్లలో తేడా వల్ల... జన్యుపరమైన కారణాల వల్ల ఆలస్యంగా మెచ్యూరై ఉండొచ్చు. ఇప్పుడు మీకు నెల నెలా పీరియడ్స్ క్రమంగా వస్తున్నాయా లేదా రాయలేదు. నెల నెలా సక్రమంగా వస్తుంటే, మీ శరీరంలో పెద్దగా సమస్య లేనట్లే. సాధారణంగా రజస్వల కావడానికి రెండేళ్ల ముందు నుంచే శరీరంలో మార్పులు వస్తాయి.

అంటే చంకల్లోను, జననాంగాల వద్ద వెంట్రుకలు రావడం, రొమ్ములు పెరగడం, కొద్దిగా ఎత్తు పెరగడం, బరువు పెరగడం వంటి మార్పులు మొదలై, తర్వాత రెండేళ్ల లోపల శరీరం పెళ్లికి, పిల్లలకు సన్నద్ధం అవు తుంది. మీరు మెచ్యూర్ అయి నాలుగేళ్లు అయింది కాబట్టి, మీ శరీరంలో పెళ్లికి, పిల్లలకి  తగ్గట్టుగా అన్ని మార్పులూ వచ్చే ఉండొచ్చు. ఒకవేళ పీరియడ్స్ సరిగా రానట్లయితే ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోన్, CBP, ESR వంటి రక్తపరీక్షలు, స్కానింగ్ చేయించుకొని గర్భాశయ పరిమాణం ఎలా ఉంది, అండాశయాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నది చూసుకుని, దాన్నిబట్టి చికిత్స తీసుకోండి.
 
నా వయసు 30. ఎత్తు ఐదున్నర అంగుళాలు. బరువు 75 కిలోలు. నాకు ఓవరీస్‌లో నీటి బుడగలు ఉన్నాయి. ఆ విషయం నేను గమనించుకోలేదు. దాంతో కుడివైపు ఓవరీలోని నీటి బుడగ ఒకటి పగిలిపోయింది. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఆ ఓవరీని తొలగించారు. అయితే రెండో ఓవరీలో కూడా నాకు బుడగలు ఉన్నాయి. కానీ ఇంకా చిన్నగానే ఉన్నాయి, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అన్నారు డాక్టర్. కానీ నాకు చాలా భయంగా ఉంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్లీ అలా అవ్వకుండా ఉంటుందో చెప్పండి ప్లీజ్.
 - వి.సుభాషిణి, కరీంనగర్

 
గర్భాశయానికి ఇరువైపుల ఉండే అండాశయాలలో నెలనెలా అండం తయారవ డానికి వీలుగా, అండాశయంలో చిన్న ఫాలికల్స్ ఉంటాయి. ఇవి కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల చాలా ఎక్కువగా నీటి బుడగల్లాగా అండాశయం మొత్తం ఉంటాయి. వీటిని POLYCYSTIC OVARIES అంటారు. ఈ నీటి బుడగలు పగలడం ఏమీ ఉండదు. కొందరిలో ఈ ఫాలికల్స్ కొద్ది కొద్దిగా పెరుగుతూ వాటిలో నీరు ఎక్కువగా చేరి నీటిగడ్డలాగా (POLYCYSTIC OVARIES) మారుతుంది.

ఇవి అయిదు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా పెరిగినప్పుడు కడుపు లోపల అది పగిలి, దాని నుంచి బ్లీడింగ్ అవ్వడం, విపరీతమైన నొప్పి రావడం జరుగుతుంది. అప్పుడు ఈ CYST ని తీసేస్తారు. అవసరమైతే మొత్తం అండాశయాన్ని తీసేయడం జరుగుతుంది. మీ విషయలో అదే జరిగివుంటుంది. మీకు ఇప్పుడు ఒక్కటే అండాశయం ఉంది. అందులోనూ నీటి బుడగలు ఉన్నాయంటే అది పాలిసిస్టిక్ ఓవరీ అన్నమాట. వీటిలో మళ్లీ ఇ్గఖీ తయారవుతుందా లేదా అన్నది చెప్పడం కష్టం.

మీ ఎత్తుకు మీరు 10 కేజీల బరువు ఎక్కువగా ఉన్నారు. అధిక బరువు వల్ల కూడా నీటి బుడగలు పెరగడం జరుగుతుంది. అందుకే మీరు బరువు తగ్గడానికి వ్యాయామం చేయండి. పరిమితమైన ఆహారం తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో low dose pills కొంతకాలం వాడటం వల్ల సిస్ట్‌లు పెరిగే అవకాశం తగ్గుతుంది. మీకు పెళ్లి అయ్యిందా లేదా, పిల్లలు ఉన్నారా లేదా అన్నది రాయలేదు. ఎందుకంటే పిల్లలు లేకపోతే, దానికి తగ్గ చికిత్స కూడా తీసుకోవలసి ఉంటుంది.
- డా.వేనాటి శోభ

Advertisement

తప్పక చదవండి

Advertisement